తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు
posted on Jun 4, 2015 @ 10:50AM
కేంద్రమంత్రి సుజనా చౌదరి మరియు ఆంద్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు నిన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీతో రాష్ట్రంలో నేషనల్ ఇన్సిటిట్యూట్ అఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటు కోసం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మొత్తం 480 సీట్లుతో రాష్ట్రంలో నిట్ ఉన్నత విద్యాసంస్థను ఏర్పాటు చేసేందుకు ఆమె అంగీకరించారు. అందులో 240 సీట్లు, అవి కాకుండా మరో 60 సూపర్ న్యూమరీ సీట్లు కలిపి మొత్తం రాష్ట్ర విద్యార్ధులకు 300సీట్లు కేటాయించేందుకు అంగీకరించారు. అయితే ఇదివరకు అనుకొన్నట్లు ఈ సంస్థ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో కాకుండా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
నిట్ కు శాశ్విత భవనాలు నిర్మించే వరకు ఏలూరులో గల సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఏడాది నుండే శిక్షణా తరగతులు మొదలుపెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటుతో రాష్ట్రానికి మొత్తం 5 ఉన్నత విద్యాసంస్థలు మంజూరు అయ్యాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయం మరియు గిరిజన విశ్వవిద్యాలయం కూడా త్వరలోనే రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమయిన చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.