సద్గురు శివానంద మూర్తి మృతి

  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు శివానందమూర్తి బుదవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా మూలుగురోడ్డులో గల గురుకుల ధామ్ లో కన్నుమూశారు. 87 ఏళ్ల వయసు గల ఆయన గత కొంతకాలంగా వృద్దాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఎండల ధాటికి ఆయన అస్వస్థులయ్యారు. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. చివరికి ఈరోజు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1928, డిశంబర్ 21న జన్మించారు. చిన్నప్పటి నుండే ఆయనలో ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి ఉండేవారని ఆయన గురించి బాగా తెలిసినవారు చెపుతుంటారు. ఆయన విశాఖపట్నంలో భీమిలి వద్ద ఆనందవనం పేరుతో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసారు. అత్యంత నిరాడంబరంగా ఉండే ఆయన ప్రచారార్భాటాలకి దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక భోధనలు చేసేవారు. భారతీయ కళలను కాపాడుకోవాలనే తపనతో ఆంధ్ర మ్యూజికల్ అకాడమీ సంస్థను ఆయన స్థాపించారు.

టీటీడీ ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్‌

టీడీపీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెట్ ఇచ్చేందుకు.. అంతేకాక తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులను కేటాయించాలని.. దీనికి పాలకమండలి కూడా ఆమోదం తెలిపినట్టు సమాచారం. వీటితోపాటు పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు * ఒంటిమిట్ట ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తెచ్చేందుకు కమిటీ * బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం * స్విమ్స్ ఆస్పత్రిలో అదనపు గదులు ఏర్పాటు * వకుళమాత అతిథిగృహ నిర్మాణం * అమెరికాలోని నాలుగు ఆలయాల్లో శ్రీనివాసకల్యాణం * నాగలాపురంలోని వేదనారాయణ ఆలయం అభివృద్ధి * తంబళ్లపల్లిలో 10 మెగావాట్ల సోలార్‌విద్యుత్... తిరుమలలో 7.2 మెగావాట్ల విండ్‌పవర్‌ ఉత్పత్తి

కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. ఉత్తమ్

తెలంగాణ ముఖ్యమంత్రిని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడమని ఆరాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు. కేసీఆర్ సర్కార్ చేపడుతున్న వాటర్ గ్రిడ్ పాజెక్టు మొత్తం అవినీతితో కూడుకున్నదే అని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంమంతా అవినీతితోనే సాగుతుందని, ఆంధ్రా కాంట్రాక్టర్లకు టెండర్ వేసేందుకు వీలుగా నిబంధనలు మార్చామన్నారు కాని అలాంటిది ఏం జరగలేదని అన్నారు. ఒకవైపు కేసీఆర్ టెండర్లకు పిలిచామంటే.. మరో వైరు కేటీఆర్ పిలవలేదంటున్నారు.. ఇదే వారి అవినీతి భాగోతానికి నిదర్శనమని అన్నారు. అసలు ఎన్నికల హామీలో లేని వాటర్ గ్రిడ్ గురించి కేసీఆర్ ఎందుకు అంత తాపత్రయ పడుతున్నారని.. దీనిలో ఉన్న అవినీతిని ఏసీబీ వెలికితీయాలని డిమాండ్ చేశారు. కాంగ్రస్ నేతలను అవినీతి పరులంటూ కేసీఆర్ ఆరోపిస్తున్నారని.. వాళ్ల కంటే అవినీతి పరులెవరూ లేరని.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.

ప్రముఖ గాయకుడు మృతి

"డిప్రెషన్" ఈ పదానికి చాలా మంది బలైపోతుంటారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తమ జీవితాల్ని తామే బలిగొంటారు. ఇప్పుడు ఆజాబితాలో ప్రముఖ పంజాబీ గాయకుడు ధరం ప్రీత్ సింగ్ కూడా చేరిపోయాడు. అనుకున్నది సాధించలేదని, వృత్తి పరంగా రాణించలేకపోతున్నాననే మానసిక బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ధరం ప్రీత్ సింగ్ ప్రముఖ పంజాబీ గాయకుడు. అతను ఇప్పటి వరకు 15 ఆల్బంలను విడుదలచేశాడు. కానీ 2010 నుండి ధరం ప్రీత్ సింగ్ ఒక్క ఆల్బమ్ కూడా విడుదలచేయకపోవడం.. ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో అమృత్ సర్ లోని ఒక ప్రదర్శన కు వెళ్లి తిరిగివచ్చి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. ధరం ప్రీత్ సింగ్ మరణంతో పంజాబ్ ఒక్కసారిగా నివ్వెరపోయింది. అయితే "ఈ ఫ్యాన్ నా జీవితాన్ని మింగేసేలా ఉందని" ధరం ప్రీత్ సింగ్ ఎప్పుడూ అంటుండేవాడని అతని తల్లి కన్నీరుపర్యంతమైంది. ధరం ప్రీత్ సింగ్ మృతికి సోషల్ మీడియాలో పలువురు సంతాపం తెలిపారు.

తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు... రేవంత్ రెడ్డి

  నోటుకు ఓటు కేసులో అరెస్ట్ అయిన తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు విధించిన నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డిని, ఉదయసింహ, సెబాస్టియన్ లకు ఉస్మానియా అస్పత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి.. అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచారు. అక్కడ న్యాయమూర్తి రేవంత్ రెడ్డిని పలు ప్రశ్నలు అడిగారు.. ఇందులో భాగంగా కస్టడీలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి అడగగా తాగటానికి నీళ్లు కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి న్యాయమూర్తికి చెప్పినట్టు సమాచారం.

ఇకనుండి రైలులో చైనులుండవు

రైలులో చైను లాగటం వల్ల ఎంత ఉపయోగముందో తెలియదు కాని అవి లాగటం వల్ల వచ్చే నష్టం మాత్రం చాలానే ఉందట. అవునండీ.. రైలులో ఉండే చైనును చాలామంది అత్యవసర పరిస్థితిలో కంటే ఎక్కువ దుర్వినియోగం చేయడానికే ఉపయోగిస్తున్నారని అందుకే ఇకనుండి రైలులో ఈచైనులను తొలగించాలని రైల్వేశాఖ భావిస్తోందట. ఇలా చీటికీ మాటికీ రైళ్లు ఆపడం వల్ల రైల్వేకు మూడు వేల కోట్ల నష్టం వాటిల్లిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో రైళ్లలో చైనులు తొలగించాలని.. ఉత్తరప్రదేశ్ బరేలిలో ఇజ్జత్ నగర్ లో ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని రైల్వే అధికారి రాజేంద్రసింగ్ తెలిపారు. కానీ ఏదేని అత్యవసర పరిస్థితిలో రైలు ఆపాలంటే దానికి ప్రత్యామ్నాయంగా రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ల ఫోన్ నంబర్లు కోచ్ లలో డిస్ ప్లే అయ్యేట్లు ఏర్పాట్లు చేయనున్నారు.

తెరాసను అసహ్యించుకునే రోజు వస్తుంది... ఎర్రబెల్లి

తెలంగాణ తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ పైనా, వైసీపీ పైన నిప్పులు చెరిగారు. కేసీఆర్, జగన్ కుమ్మక్కయి ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏమి చేయలేరని అన్నారు. వీరు చేసిన పనికి తెరాసను ప్రజలు అసహ్యించుకునే రోజు వస్తుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ వెనుక ఉన్న సూత్రధారి కేసీఆర్ అని.. కేసీఆర్ ట్రాప్ చేసి ఇదంతా చేశాడని.. ముందు కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని అన్నారు. అసలు తెరాసకు ఉన్నది 63 మంది ఎమ్మెల్యేలు అలాంటప్పుడు 5 ఎమ్మెల్సీ సీట్లకు ఎలా నామినేషన్ వేశారని ప్రశ్నించారు. అవినీతి కేసులు ఇంకా విచారణ జరుపుకుంటున్న జగన్ చంద్రబాబు గురించి విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉందని, అలాంటి జగన్ తో తెరాస పొత్తు పెట్టుకోవడం ఇంకా ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు.

నకిలీ సర్టిఫికేట్లతో ఢిల్లీ మంత్రి తోమర్ అరెస్ట్

నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంలో ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాంమనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ నుండి పొందిన డిగ్రీ పట్టా నకిలీదని గతంలోనే తోమర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తోమర్ నకిలీ సర్టిఫికేట్లపై దక్షిణ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి అవి నకిలీ సర్టిఫికెట్లుగా స్ఫష్టంచేశారు. అంతేకాక బిహార్ లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి ఆయన పొందిన ఎల్‌ఎల్‌బీ పట్టా కూడా నకిలీదని తేలినట్టు పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తోమర్ ను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు.

ఏపీ మంత్రివర్గం సమావేశం... కేంద్రానికి తెరాస ప్రభుత్వంపై ఫిర్యాదు

నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. అంతేకాక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి కోరనున్నట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోమని.. ఈ విషయంలో గవర్నర్ కూడా ఏం పట్టించుకోవడం లేదని మంత్రివర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో పోలీసు వ్యవస్థ రెండు రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉండేలా చేయాలని... పోలీసు వ్యవస్థ కూడా గవర్నర్ ఆధీనంలో ఉండాలని ఏపీ మంత్రివర్గం కేంద్రాన్ని కోరనుంది.

రేవంత్ రెడ్డికి నేడు ముగియనున్నకస్టడీ

రేవంత్ రెడ్డి నాలుగు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. ఈ రోజు నాలుగు గంటలకు కస్టడీ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు నిందితులనుండి వీలైనంత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు డబ్బు ఎక్కడినుండి వచ్చింది... ఆ బాస్ ఎవరు అనే విషయాలు రేవంత్ రెడ్డి ద్వారానే తెలుసుకోవడానికి ఏసీబీ గట్టి ప్రయత్నం చేస్తుంది. డబ్బు ఏ ఖాతానుండి వచ్చింది... ఏ బ్యాంకు ద్వారా డ్రా అయింది అనే విషయాలు విచారణలో తెలిసిపోయిందని నిజాలు చెపితే కేసు తీవ్రత తగ్గే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలుపగా రేవంత్ రెడ్డి మాత్రం తాను ఎమ్మెల్యేతో మాట్లాడేందుకే వెళ్లానని.. ఇంకే వివరాలు తనకు తెలియదని చెప్పినట్టు సమాచారం. మరోవైపు తనను ఏసీబీ కస్టడీ తరువాత చర్లపల్లి జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా ఏసీబీ కోర్టు దానిని తోసిపుచ్చింది.

బాబుని బ్రహ్మ దేవుడు కూడా రక్షించ లేడు: కేసీఆర్

  రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఇంత వరకు పరోక్ష యుద్ధం చేస్తున్న ఆంద్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రులిరురువు ఇప్పుడు ప్రత్యక్ష యుద్దానికి దిగారు. చంద్రబాబు నిన్న మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ని తీవ్రంగా విమర్శించడమే కాకుండా తన జోలికి వస్తే వదిలిపెట్టనని తీవ్ర స్వరంతో హెచ్చరించారు కూడా. అందుకు కేసీఆర్ వెంటనే బదులిస్తూ ఇంకా ఎక్కువ మాట్లాడితే నిన్ను (చంద్రబాబు నాయుడు)ని ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని హెచ్చరించారు. తెలంగాణాలో సమస్యలు పరిష్కరించుకోవడానికే తమకు రోజుకి 20గంటలు పనిచేసినా సరిపోవడం లేనప్పుడు ఇటువంటి వ్యవహారాల గురించి ఆలోచించే తీరిక తమకెక్కడిదని ప్రశ్నించారు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్లు తెలంగాణా రాష్ట్రం ఇచ్చినా హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని చేసి కాంగ్రెస్ సన్నాసులు తమకీ తలనొప్పులు తగిలించిపోయారన్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడుకి పోలీసులు, ఎసిబి ఉండొచ్చునేమో కానీ ఆయనేమీ హైదరాబాద్ కి ముఖ్యమంత్రి కాదనే సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. అసలు ఒక్క యంయల్సీని గెలిపించుకోలేవని తెలిసినప్పుడు పోటీలో ఎందుకు నిలబెట్టావని ప్రశ్నించారు. స్టీఫెన్ సన్ తెలంగాణా బిడ్డ గనుక ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎసిబికి పిర్యాదు చేసి రేవంత్ రెడ్డి ని పట్టించారని అన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు ఏ శాస్తి కావాలో అది అయి తీరుతుంది. ఈ తెలంగాణ ఒకనాడు ఉద్యమ బెబ్బులి. నేడు స్వయం పాలనతో ఆత్మ గౌరవంతో కాలర్‌ ఎగరేసుకుని దేశం ముందు నిలబడింది. ఇక ఈ గడ్డ మీద నీ కిరికిరి చెల్లదు. తస్మాత్‌ జాగ్రత్త!” అని తీవ్ర స్వరంతో చంద్రబాబు నాయుడుని హెచ్చరించారు.

నేను ఒంటరి వాడిననుకొన్నారా?

  తెదేపా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొన్న సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహా సంకల్పం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు. ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “హైదరాబాద్ మరో తొమ్మిదేళ్ళ వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అక్కడ గౌరవప్రదంగా నివసించే హక్కు మా అందరికీ ఉంటుంది. హైదరాబాద్ మీ జాగీరు కాదని తెరాస నేతలు గుర్తుంచుకోవాలి. నేను ఏదో మామూలు వ్యక్తినని, ఒంటరి వాడిననే అపోహలో నన్ను ఏదో చేయాలనుకొంటే మీకే ప్రమాదం. నా వెనుక ఐదు కోట్లమంది ప్రజలున్నారు. నేను వారందరికీ ప్రతినిధిని, వారు ఎన్నుకొన్న ముఖ్యమంత్రిని. కనుక నాతో చెలగాటమాడోద్దని అందరినీ హెచ్చరిస్తున్నాను. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రినయిన నా ఫోనే ట్యాపింగ్ చేసే దుస్సాహాసం చేసారు. అందుకు వారు తగిన శిక్ష అనుభవించక తప్పదు. నాతో పెట్టుకొంటే కబడ్ధార్ జాగ్రత్త! నీకు పోలీసులు ఉన్నట్లే నాకూ పోలీసులు ఉన్నారు. నీకు ఎసిబి ఉన్నట్లే నాకూ ఎసిబి ఉంది. తలుచుకొంటే నేను తగిన విధంగా బుద్ధి చెప్పగలను. కానీ గౌరవనీయమయిన ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అటువంటి నీచ రాజకీయాలు, కుట్రలు చేయడం భావ్యం కాదనే ఉద్దేశ్యంతోనే మీ ఆటలన్నీ సహిస్తున్నాను."   "రాజకీయాలు చేయడం కాదు రాష్ట్ర అభివృద్ధిలో నాతో పోటీపడమని అధికారం చేప్పట్టిన మొదటి రోజే నేను కేసీఆర్ కి సవాలు విసిరాను. కానీ అతను నాతో పోటీ పడలేకనే ఈవిధమయిన కుట్రలు పన్నుతున్నాడు. ఎవరింట్లో అయినా శుభకార్యం జరుగుతోంది అంటే బుద్దున్నవాడెవడూ దానిని చెడగొట్టాలనుకోడు. కానీ కేసీఆర్ మాత్రం ఓవైపు సంబరాలు చేసుకొంటూ మా మహాసంకల్ప కార్యక్రమానికి చెడగొట్టాలని ప్రయత్నించాడు. అక్కడ ట్యాంక్ బ్యాండ్ మీద కూర్చొని టీ-న్యూస్ ఛానల్లో ఆడియో టేపులు అంటూ ఏవో రిలీజ్ చేయించాడు. వాటిని చూసి నేనేదో భయపడిపోతాననుకొన్నాడు కానీ నేను బులెట్ లా దూసుకుపోతాను. ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి?" అని ప్రశ్నించారు.   "అసలు మా యంయల్యేలని కొనుకొన్నది నువ్వు కాదా...అని అడుగుతున్నాను. మా పార్టీ జెండాతో యంయల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మంత్రిగా ఉంచుకొన్న నువ్వా నాకు నైతిక విలువల గురించి పాఠాలు చెప్పేది? అతను నేటికీ సిగ్గు లేకుండా తెదేపా యం.యల్యేగా కొనసాగుతుంటే ఎందుకు రాజీనామా చేయించడంలేదు?అదేనా నైతిక విలువలు పాటించడమంటే?రాజకీయాల గురించి, నైతిక విలువల గురించి నీ నేను దగ్గర పాఠాలు నేర్చుకోవలసిన ఖర్మ నాకు పట్టలేదు. ఇప్పటికయినా ఇటువంటి పిల్లచేష్టలు కట్టిపెట్టి బాధ్యత గల ముఖ్యమంత్రిగా వ్యవహరించడం నేర్చుకో,” అని చంద్రబాబు నాయుడు గట్టిగా హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుంది... గవర్నర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా 'మహాసంకల్పం' పేరిట గుంటూరులో భారీ సభను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి సంవత్సరం అయిందని, ఈరోజు రాష్ట్రానికి చాలా ముఖ్యమైన రోజని అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి చాలా కృషిచేస్తున్నారని, ఎప్పటికైనా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు. రాజధాని నిర్మాణానికి పునాది రాయి పడిందని.. ఇక అభివృద్దే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మహాసంకల్పం పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని సీఎం చంద్రబాబు, గవర్నర్ ఆవిష్కరించారు.

ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు కర్నాటకలో ఫిర్యాదు..

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అవడం దాని వెనుక తెదేపా పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఉన్నాడంటూ ఎన్నో అనుమానాలు, ఆరోపణల మధ్య ఇరు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. దీని ఆజ్యం పోసినట్టుగా స్టీఫెన్ సన్ ను చంద్రబాబు ప్రలోభ పెట్టారంటూ నిన్న రాత్రి దానికి సంబంధించిన ఆడియో టేపులను టీన్యూస్ ఛానల్ లో బయటపెట్టారు. దీంతో ఏపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనికి నిప్పులు చెరుగుతోంది. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ అభ్యర్ధులు, తెదేపా అభ్యర్ధులు పోటాపోటీగా ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు మొదలుపెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమను ప్రలోభపరిచారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసుల ఎదుట వాంగ్మూలాలు నమోదు చేస్తుంటే, మరోవైపు టీఆర్ఎస్ నేతలు తమను ప్రలోభపరిచారంటూ తెలంగాణ టీడీపీ నేతలు వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే టీడీపీ వాంగ్మూలాలు తెలంగాణ పోలీసులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో కర్నాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఏసీబీ ఎప్పుడెప్పుడు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి విచారణ చేపడదామ అనే గట్టి ప్రయత్నమే చేస్తుంది. అయితే స్టీఫేన్ సన్ స్టేట్ మెంట్ ఆధారంగా చంద్రబాబును ప్రశ్నించడానికి లేదా విచారణ జరపడానికి ఏసీబీ ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఏ క్షణంలోనైనా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

వ్యవహారమంతా గవర్నర్ చూసుకుంటారు

తెలంగాణ తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారంటూ చంద్రబాబు స్టీఫెన్ ల ఆడియో టేపులను టీ న్యూస్ ఛానల్ నిన్న రాత్రి బటయపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ గవర్నర్ ను కలిసి ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడినట్టు సమాచారం. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు భవిష్యత్ రాజకీయాలకు మంచిది కాదని, ఇలాంటి పరిణామాలు జరగడం చాలా బాధాకరమని దత్తాత్రేయ అన్నారు. అయితే ఆడియో టేపుల వ్యవహారంపై ఇప్పడేమి మాట్లాడలేనని, ఈ వ్యవహారమంతా గవర్నర్ చూసుకుంటారని స్పష్టం చేశారు.