అంగరంగ వైభోగంగా రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్ధం

  తెదేపా యంయల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ వివాహ నిశ్చితార్ధ వేడుక ఎటువంటి అవాంతరాలు లేకుండా అంగరంగ వైభోగంగా పూర్తయింది. హైదరాబాద్ యన్. కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఈ వేడుకకు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సుమారు 700మందిని మాత్రమే ఆహ్వానించగా, సినీ, రాజకీయ, పారిశ్రామిక, మీడియా రంగాలకు చెందిన సుమారు 3,000 మంది ప్రముఖులు ఎటువంటి ఆహ్వానం లేకపోయినా తమంతట తామే తరలివచ్చి కాబోయే దంపతులను ఆశీర్వదించడం చాలా విశేషం. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ తదితరులు కుటుంబ సమేతంగా వచ్చి కాబోయే దంపతులను ఆశీర్వదించారు.   అదే విధంగా అనేకమంది కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన స్నేహితుడయిన రేవంత్ రెడ్డికి తను అండగా ఉంటానని, ఆయన నిరాపరధి అని తను నమ్ముతున్నానని అన్నారు. త్వరలోనే ఆయన తెలంగాణా ప్రభుత్వం పెట్టిన ఈ కేసుల నుండి బయటపడతారనే నమ్మకం తనకుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు దంపతులు రేవంత్ రెడ్డితో కలిసి ఫోటో దిగారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు తదితరులు ఆయనను ఆప్యాయంగా కౌగలించుకొన్నారు.   ఎసిబి అధికారులు ఆయనకు సమీపంలోనే తచ్చాడుతూ ఆయన ప్రతీ కదలికను, మాటను జాగ్రత్తగా కనిపెట్టుకొని చూస్తుండటంతో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందారు. రేవంత్ రెడ్డి తన కుమార్తె నిశ్చితార్దాన్ని ఎంతో సంతోషంగా చేస్తున్నప్పటికీ, ఆయన తిరిగి జైలుకి వెళ్లి పోవలసిన సమయం దగ్గర పడుతుండటంతో ఆయన కుటుంబ సభ్యులలో ఆందోళన కొట్టవచ్చినట్లు కనబడింది. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరినీ స్వయంగా ఆహ్వానించి మర్యాదలు చేసారు. కాకపోతే కోర్టు ఆంక్షలు మూలంగా ఆయన అందరితో క్లుప్తంగా పలకరింపులతోనే సరిపెట్టు కోవలసివచ్చింది. ఎటువంటి ఆహ్వానం లేకపోయినప్పటికీ అనేకమంది ప్రముఖులు వచ్చి తామందరం ఆయనకు, ఆయన కుటుంబానికి అండగా ఉన్నామనే బలమయిన సంకేతం ఇవ్వగలిగారు.

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదం

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రమాదం తృటిలో తప్పింది. వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఆయన నిన్న రాత్రి బెంగుళూరు నుండి కావలికి బయలుదేరగా... ఇంతలో పెళ్లకూరు మండలం శిరసనంబేడు వద్దకు రాగానే కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, వైఎస్ఆర్‌సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు బీదా రమేష్‌ తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నెల్లూరుజిల్లా అపోలో ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం ఆవిష్కరించిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. దీనితోపాటు కరివెనలో పైలాన్ ను కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిబొట్టు కోసం పాలమూరు తపిస్తోందని..నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. అంతేకాక పదిహేను రోజులకొకసారి ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రాజెక్టు ద్వారా ముంపుకు గురవుతున్న తండావాసులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తరువాత కేసీఆర్ సాయంత్రం 6 గంటలకు భూత్పూర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.  

వాళ్లనే తరిమి కొట్టాం.. కేసీఆర్ ఎంత..

ఎమ్మార్పీఎస్ వ్యవస్ఠాపక అధ్యక్షుడు మంద కృష్ణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మహిళా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో గడీల దొరలు, రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర ఇక్కడి ప్రజలకుందని.. అలాంటిది సీఎం కేసీఆర్ ను తరిమికొట్టడం పెద్ద పనేమి కాదని విమర్శించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, వాళ్లకు కూడా మంత్రివర్గంలో స్థానాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు మండల, జిల్లా కేంద్రాల్లో దీక్షకు దిగుతామని.. తెలంగాణ ఆడబిడ్డలకు ఇలాంటి పోరాటాలు కొత్తేమి కాదని.. మహిళలందరూ దీక్షలో పాల్గొనాలని సూచించారు.

రేవంత్ ను జైలుపాలు చేసిన మహానాడు స్టిక్కర్

ఒకే ఒక స్టిక్కర్ రేవంత్ రెడ్డిని జైలుపాలు చేసింది. ఒకే ఒక స్టిక్కర్ రెండు రాష్ట్రాలు మధ్య అగాథాన్ని సృష్టిస్తోంది. ఏంటా స్టిక్కర్.. స్టిక్కర్ కి రేవంత్ రెడ్డి అరెస్టుకి సంబంధం ఏంటనుకుంటున్నారా... వివరాల ప్రకారం.. మహానాడు స్టికర్ అంటించిన కారులో వెళ్లడం వల్లనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయగలిగారని జెరుసలేం మత్తయ్య వ్యాఖ్యానించారు. స్టీఫెన్‌సన్‌ తో అంతకుముందే బేరసారాలు కుదిరాయని.. కానీ సెబాస్టియన్ మహానాడు స్టిక్కర్ ఉన్న కారులో వెళ్లడం వల్ల అక్కడ ఉన్న స్టీఫెన్‌సన్‌ గన్‌మెన్‌ ద్వారా ఏసీబీ కి సమాచారం అందింది. దీంతో ఏసీబీ రంగంలోకి దిగి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయగలిగారని మత్తయ్య వివరించారు. అప్పటికే ఫోన్ ట్యాపింగ్ లు, సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోరికార్డింగులు అన్నీ జరిగిపోయాయని అన్నారు.

తత్కాల్ సమయంలో మార్పులు

  ప్రయాణానికి ఒకరోజు ముందుగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద బుక్ చేసుకొనే తత్కాల్ టికట్ బుకింగ్ సమయంలో రైల్వేశాఖ కొన్ని మార్పులు చేయబోతోంది. ఇంతవరకు ఉదయం 10గంటల నుండి 11గంటలవరకు ఏసీ మరియు నాన్-ఏసీ తరగతుల్లో టికెట్స్ బుకింగ్ చేసుకొనేందుకు సమయం కేటాయించబడింది. కానీ ఇకపై ఉదయం 10 గంటల నుండి 11గంటల వరకు ఏసీ తరగతులకి, 11నుండి 12గంటల వరకు నాన్-ఏసి టికెట్స్ బుక్ చేసుకొనే విధంగా తత్కాల్ సమయాన్ని సవరించబోతున్నారు. ఈ మార్పులు 15 నుంచి అమలులోకి వస్తాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌ కుమార్‌ తెలిపారు. టికెట్స్ క్యాన్సిలేషన్ సమయాన్ని కూడా సవరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.

జైలు నుండి రేవంత్ రెడ్డి విడుదల

  తెదేపా యంయల్యే రేవంత్ రెడ్డికి ఎసిబి కోర్టు ఈరోజు ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడంతో జైలు అధికారులు ఆయనను కొద్దిసేపటి క్రితమే జైలు నుండి విడుదల చేసారు. ఆయన అభిమానులు, తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి సోదరుడు ఆయనను తమ ఇంటికి తోడ్కొని పోయారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎసిబి అధికారులు కూడా రెండు వాహనాలలో ఆయనతో బయలుదేరివెళ్ళారు. వారితో బాటే వందలాదిగా తరలివచ్చిన అభిమానులు, తెదేపా శ్రేణులు కూడా రేవంత్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి కష్టకాలంలో తామంతా అండగా నిలబడతామని తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర మంత్రులు, తెలంగాణా తెదేపా ప్రజా ప్రతినిధులు, నేతలు కార్యకర్తలు అందరూ ఈరోజు జరుగబోయే రేవంత్ రెడ్డి కుమార్త్ నిశ్చితార్ధ వేడుకకి హాజరవబోతున్నారని తెలుస్తోంది.

మోడీతో చంద్రబాబు భేటీ.. ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు

ప్రధాని నరేంద్రమోడీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ సమావేశంలో సుమారు గంటపాటు మోడీతో చర్చించారు. రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో టీఆర్ ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై.. ఫోన్ ట్యాపింగ్ పై చంద్రబాబు మోడీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అంతేకాక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 8ను అమలు చేయాలని.. సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి హైదరాబాద్ లో అధికారాలు గవర్నర్ చేతిలో ఉండాలని మోదీని కోరారు. మరోవైపు చంద్రబాబుకు సాయంగా వెళ్లిన ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డిజీపీ రాముడు తమ వంతు ప్రయత్నంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్‌ను కలిశారు.

పుష్కరాల ఉత్సవాలపై ‘సేవ్ టెంపుల్స్’ ఫోటోగ్రఫీ పోటీలు

దేవాలయ పరిరక్షణ, సనాతన ధర్మ రక్షణ ధ్యేయంగా మహోధ్యమంగా సాగుతున్న గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్  మరియు సేవ్ టెంపుల్స్(USA) ఆద్వర్యంలో జూలై 14 నుండి 25 వరకు జరిగే పుష్కర ఉత్సవాలపై ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రో. వెలగపూడి ప్రకాశరావు మరియు సాంస్కృతిక ప్రచార సారధి డా. గజల్ శ్రీనివాస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.   ఈ పోటీలలో పుష్కరాల విశిష్టత,, పుష్కరాల వైభవాన్ని, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాలు, పుష్కర స్నాన ఘట్టాలలోని అపురూప దృశ్యాలను ప్రతిబింబించే విధంగా, కళ్ళకు కట్టినట్లుగా ఫోటోలు ఉండాలని తెలిపారు.   ఈ పోటీలో పాల్గొనేవారు ఒక్కొక్కరు 10 ఫోటోలను పంపవచ్చు. DVD ఫార్మాట్ లో ఎక్కువ స్పష్టత ఉన్న ఫోటోలను  కాపీ చేసి అప్లికేషను మరియు ఒప్పంద పత్రాలను జతచేసి ఈ దిగువ చిరునామాకు పంపగలరు. ఒప్పంద పత్రాలను www.savetemples.org వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చెసుకొనగలరు. మీ ఎంట్రీ తో పాటు మీ యొక్క గుర్తింపు కార్డును కూడా జత చేసి పంపగలరు. మీ ఎంట్రీలను 2015 ఆగష్టు 5 వ తేది లోపు ఈ క్రింది చిరునామాకు పంపగలరు.   GHHF & Savetemples.org   6-3-629/2, A2 Kabir Nivas, Anand Nagar, Khairatabad, Hyderabad Telangana, India Ph: +91 99126 26256   చిత్రం డేటా ఫైళ్లు స్మార్ట్ ఫోన్లు, (మధ్య మరియు పెద్ద ఫార్మాట్ కెమెరాలు ) డిజిటల్ స్టిల్ కెమెరాలతో  సహా ఏ  డిజిటల్ పరికరాల ను  ఉపయోగించైనా రూపొందించ వచ్చు.    సాఫ్ట్  వేర్ లేదా ఇతర మార్గాల ద్వారా ఉపయోగించి రీటచ్ చేసే  చిత్రాలు అంగీకరించబడతాయి. కెమెరా అనువర్తనం లేదా ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ఉపయోగించి రీటచ్ ఫోటోగ్రఫీ కూడా అంగీకరించబడతాయి. కలర్ మరియు మోనోక్రోమ్ చిత్రాలు అంగీకరించబడతాయి. సినిమా నుండి తీసిన ఏ ఎంట్రీలు అంగీకరించబడవు. సినిమా కెమెరాల ద్వారా స్కాన్ చేసిన  ఛాయాచిత్రాలకు  అంగీకరించబడవు. ఛాయాచిత్రా లు  గోదావరి పుష్కరాలు 2015 లో మాత్రమే తీసినవై ఉండాలి. తీర్పు ప్రక్రియలో sRGB  ప్రామాణికత  ఉంటుంది. ఇందులో విజేతలను న్యాయనిర్ణేతలు 2015 ఆగష్టు 14 వ తేదీ న వెలువరిస్తారని తెలిపారు.   విజేతలకు ప్రధమ బహుమతి :  Rs.50,000/- ద్వితీయ బహుమతి : Rs.30,000/- తృతీయ భాహుమతి : Rs.25,000/-   వీటితో పాటుగా ఐదు ప్రోత్సాహక పురస్కారాలు ఒక్కింటికి 5000 రూపాయలు మరియు ప్రశంసా పత్రము ఉంటాయని, అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహక ప్రశంసా పత్రము ఇవ్వ బడుతుందని తెలిపారు.   పోటీలో పాల్గొనే ఆశక్తి కలవారు www.savetemples.org వెబ్ సైట్ లో ఉన్న ఆన్ లైన్ అప్లికేషన్ ను 2015 జూన్ 30 వ తేది లోపు నింపి తమ సుముఖతను పంపగలరు.

కేసీఆర్ పై మత్తయ్య ఫిర్యాదు

నోటుకు ఓటు కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య కేసీఆర్ పై, ఏసీబీ అధికారులపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తనకు ప్రాణహాని ఉందంటూ ఐపీసీ 506,507,387 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాడు. నోటుకు ఓటు కేసులో చంద్రబాబును ఇరికించాలని టీఆర్ఎస్ నేతలు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నా తమ్ముడిని హైదరాబాద్ పోలీసులు తీసుకెళ్లి చితక్కోట్టారని.. నా కుటుంబాన్ని అక్రమంగా నిర్భందించారని ఆరోపించారు. అంతేకాక స్టీఫెన్ సన్ అప్పుల్లో కూరుకుపోయాడని.. దీర్ఘకాలిక రుణం కోసం స్టీఫెన్ సన్ తిరుగుతున్నాడని.. ఈ నేపథ్యంలోనే సెబాస్టియన్ తో సంప్రదింపులు జరిపాడని మత్తయ్య తెలిపాడు.

నోటుకు ఓటు కేసు.. ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై వేటు

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాధపై వేటు పడే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన కేబినేట్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్గంతోపాటు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు అనురాధపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అవడం.. ఆడియో టేపులు బయట పడటం.. ఫోన్లు ట్యాపింగ్ లు చేస్తుంటే ఏం చేస్తున్నారని.. ముందుగా పసిగట్టి సమాచారం ఇవ్వడంలో వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అనురాధ కూడా ఘాటుగానే స్పందించి తెలంగాణ అధికారులు, మంత్రులపై తాము కూడా నిఘా ఉంచితే ఇప్పుడు ఏపీ అధికారులు అడిగినట్టే వాళ్లు కూడా అడిగేవారని, మా మీద కేసు పెట్టేవారని సమావేశం జరుగుతుండగానే వెళ్లిపోయారు. దీంతో చంద్రబాబు ఇంటెలిజెన్స్ చీఫ్ గా మరొకరి పేరును సూచించాలని డీజీపీ ని సీఎం ఆదేశించడంతో ఆయన సీహెచ్ ద్వారకా తిరుమలరావు, గౌతమ్ సవాంగ్ పేర్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

కూతురి నిశ్చితార్ధం.. రేవంత్ కు బెయిలా? జైలా?

రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగనుంది. మరోవైపు రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్ధం రేపు జరగనున్న నేపథ్యంలో బెయిల్ వస్తుందా? రాదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా తన భర్తుకు బెయిల్ రాకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతుందని... కానీ బుధవారం ఆయనకు బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రేవంత్ భార్య గీత. కాగా రేపు జరగబోయే రేవంత్ కుమార్తె నిశ్చితార్ధ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన రేపు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నారు. అయినా కానీ అవసరమైతే హైదరాబాద్ వచ్చి రేవంత్ కుమార్తె నిశ్చితార్ధానికి హాజరై మళ్లీ వెంటనే ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు.