రేవంత్ రెడ్డి అరెస్ట్ వెనుక కేసీఆర్ హస్తం?

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి లంచం ఇస్తూ దొరికిపోయి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అసలు రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఇప్పుడు కొన్ని కీలకమైన విషయాలు బయటపడుతున్నాయి. రేవంత్ రెడ్డిని కావాలనే ట్రాప్ చేసి ఈ కేసులో ఇరికించారని, దీని వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ కు కొంతసేపటికి ముందు కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో మరికద్ది సేపటిలో మీరో వార్త వింటారు అని చెప్పినట్టు సమాచారం, అలా కేసీఆర్ చెప్పిన కొంత సేపటికే రేవంత్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ వెనుక కేసీఆర్ ఉన్నట్టు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుక ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి సంవత్సరం అయిన సందర్భంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరపనున్నారు. అయితే సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరిన శిల్పాలను చూస్తే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చేస్తున్నాయి. ఈ వేడుకలకు పలువురు కళాకారుల, పోలీసులు అప్పుడే రిహార్సల్స్ కూడా మొదలుపెట్టారు. మరోవైపు పోలీసు అధికారులు మైదానంలో ఎలాంటి అవరోధాలు, అవాంఛిత ఘటనలు జరగకుండా ఉండేందుకు తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్ మైదానం దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

100 రాహుల్ గాంధీలు.. ఒక్క మోడీ

వంద మంది రాహుల్ గాంధీలొచ్చినా ప్రధాని నరేంద్రమోడీ ముందు సాటిరాలేరని శివసేవ మండిపడింది. శివసేన తన అధికార పత్రిక సామ్నాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం గుప్పించింది. మోడీ ప్రభుత్వాన్ని సూటు-బూటు సర్కారు అని రాహుల్ గాంధీ ఎగతాళి చేసిన నేపథ్యంలో శివసేన పైవిధంగా స్పందించింది. విశ్రాంతి పేరిట చాలా రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన రాహుల్ గాంధీ బయటకు వచ్చిన తరువాత చాలా హుషారుగా ఉన్నారని కానీ మోడీ ముందు ఆ హుషారు ఎంతో సేపు ఉండదని ఎద్దేవ చేశారు. అన్ని పార్టీలూ కాంగ్రెస్ పార్టీలా ఉండవని, అనేక కుంభకోణాల పేరిట నగదు సూటుకేసులను మార్చుకున్న పార్టీ కాంగ్రెస్ అని శివసేన విమర్శించింది.

అనుకూలంగా ఉంటే ముడుపులిస్తామన్నారు.. సీబీఐ జడ్జి

బొగ్గు కుంభకోణంలో నిందితులకు అనుకూలంగా ఉండాలని దానికి ఎంత కావాలంటే అంత ముడుపులు చెల్లిస్తామని నన్ను లోపర్చుకోవాలని చూశారని సీబీఐ కోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్ స్కాంకు సంబంధించిన ఒక నిందితుడి తరపు న్యాయవాది తనను కలిశాడని, తీర్పు అనుకూలంగా ఇస్తే ముడుపులు ఇస్తామని ఆఫర్ కూడా చేశారని తెలిపారు. ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జడ్జి హెచ్చరించారు. దీంతో జడ్జి మాటలకు ఖంగుతిన్న న్యాయవాది అతనికి క్షమాపణలు చెప్పారు. అయితే జడ్జి గారు, తనను మభ్యపెట్టడానికి ప్రయత్నించిన న్యాయవాది పేరును మాత్రం బటయపెట్టలేదు.

మరో మలుపు తిరిగిన జయలలిత కేసు..

అక్రమాస్తుల కేసుపై జయలలిత పై ఉన్న ఆరోపణలు తొలగించి కర్ణాటక కోర్టు ఆమె కేసును రద్దు చేస్తూ తీర్పు నిచ్చింది. ఆ తరువాత ఆమె ఈ నెల 17న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పదవిని కూడా చేపట్టారు. అయితే ఇప్పుడు జయలలిత కేసు మరో కొత్త మలుపు తిరిగింది. జయలలిత కేసు తీర్పును సవాల్ చేయాలని కర్ణాటక హైకోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆమెపై శిక్ష నిలిపిపేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ కేసు విచారణకు వెళితే జయలలిత మళ్లీ రాజీనామా చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో జయలలిత తీర్పును సవాల్ చేస్తూ డీఎంకే పార్టీ నేతలు కోర్టులో అప్పీలు చేస్తామని, మాకు ఆ హక్కు ఉందని తెలిపిన సంగతి తెలిసిందే.

నేరం రుజువైతే 6నెలల నుండి రెండేళ్ల వరకు శిక్ష

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ ఏమ్మెల్యే రేవంత్ రెడ్డి అవినీతి కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో అతనిపై పైన ఐపీసీ సెక్షన్ 120 బీ, 34తో పాటు అవినీతి నిరోధక చట్టం1988 సెక్షన్ 12 ప్రకారం కేసు నమోదయింది. ఈ కేసులో రేవంత్ రెడ్డికి పలు సెక్షన్ లపై పలు విధాలుగా శిక్షలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రేవంత్ రెడ్డి నేరం చేశాడని రుజువైతే మాత్రం సెక్షన్ 120బీ ప్రకారం అతనికి ఆరు నెలల నుండి రెండేళ్లు లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. సెక్షన్ 34 ప్రకారం ఎవరి సహకారంతో నైనా నేరం చేసినట్లయితే వ్యక్తిగతంగానూ, అతనికి సహకరించిన వారికి కూడా శిక్ష పడుతుంది. రేవంత్ రెడ్డికి చెందిన రూ.50 లక్షలతో పాటు రెండు ఐ ఫోన్‌లను సీజ్ చేసినట్లు రిమాండు రిపోర్టులో ఏసీబీ అధికారులు తెలిపారు.

వారసుడిని కనలేదని భార్యకు, పిల్లలకు నిప్పటించిన రాక్షసుడు

కుమారుడిని కనలేదని తన వంశానికి వారసుడిని ఇవ్వలేదని ఓ రాక్షసుడు తన భార్యను, ముగ్గురు ఆడపిల్లలని సజీవదహనం చేశాడు. ఈ దారుణమైన ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. పశ్చిమబెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా కాండి అనే గ్రామంలో ఉస్తాఖ్, నజీఫాలు భార్య భర్తలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఈ నేపథ్యంలో ఉస్తాఖ్ తనకు వారసుడిని ఇవ్వలేదని తరుచుగా తన భార్యతో గొడవపడేవాడు. ఆ కోపంతో ఆ కర్కోటకుడు తన భార్యను, ముగ్గురు పిల్లలను ఇంట్లోకి నెట్టి ఇంటికి నిప్పటించాడు. వారు ఆ మంటలలో కేకలు పెడుతూ సజీవదహనం అయ్యారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

తెరాస, కాంగ్రెస్ అభ్యర్ధులకే గెలుపు అవకాశాలు

  తెలంగాణా శాసనమండలి ఎన్నికలకు వామపక్షాలు రెండూ దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడంతో ఇప్పుడు ఒక్కో యం.యల్సీ అభ్యర్ధి గెలుపుకి 17మంది యం.యల్యేల మద్దతు ఉంటే సరిపోతుందని తేలింది. మజ్లీస్, వైకాపాల 8మంది యం.యల్యేల మద్దతు, ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన 8మంది యం.యల్యేలతో కలిపి తెరాస బలం ఇప్పుడు మొత్తం 85కి చేరింది. కనుక ఇక ఆ పార్టీ ఐదవ అభ్యర్ధి విజయం కూడా దాదాపు ఖాయం అయినట్లే భావించవచ్చును. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఆకుల లలిత విజయం కూడా ఖాయమనే చెప్పవచ్చును. ఆరు స్థానాలలో ఐదింటిని తెరాస, ఒకటి కాంగ్రెస్ దక్కించుకొనే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక తెదేపా అభ్యర్ధి వేం నరేంద్ర రెడ్డి ఓడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. తెదేపా యం.యల్యే రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి జడ్జి లక్ష్మీపతి అంగీకరించడంతో ఆయన కొద్ది సేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకొని తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

రేవంత్ కి రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీ

  ఏసిబి అధికారులు తెదేపా కొండగల్ యం.యల్యే. రేవంత్ రెడ్డిని ఈరోజు ఉదయం న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపరచగా అయన రేవంత్ రెడ్డికి రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కానీ ఈరోజు జరగనున్న శాసనమండలి ఎన్నికలలో ఆయనను ఓటు వేసేందుకు అనుమతించడంతో కొద్ది సేపటి క్రితమే ఏసిబి అధికారులు కట్టుదిట్టమయిన భద్రత నడుమ రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి తీసుకువచ్చారు. అక్కడ ఆయన కోసం వేచి చూస్తున్న తెదేపా శాసనసభ్యులు, ఆయన రాగానే అందరూ కలిసి తెదేపా శాసనసభా పక్ష కార్యాలయంలోకి వెళ్ళబోతుంటే వారిని ఏసిబి అధికారులు అడ్డుకొన్నారు. తాము అందరం ఏవిధంగా ఓటింగ్ వేయాలనే విషయంపై ముందుగా చర్చించుకోవాలని అది కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో భాగమేనని తెదేపా యం.యల్యేలు గట్టిగా చెప్పడంతో ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డిని అందుకు అనుమతించారు. ఓటింగ్ అనంతరం ఆయనని చర్లపల్లి జైలుకి తరలించవచ్చును. రేవంత్ రెడ్డికి బెయిలు కోసం మరికొద్ది సేపటిలో ఆయన న్యాయవాదులు కోర్టులో పిటిషను వేయబోతున్నారు.

మరికొద్ది సేపటిలో కౌన్సిల్ ఎన్నికలు ప్రారంభం

  మరి కొద్దిసేపటిలో తెలంగాణా శాసనమండలి ఎన్నికలు మొదలవబోతున్నాయి. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తరువాత 5గంటలకు ఓట్లు లెక్కింపు చేసి వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. యం.యల్యే.ల కోటా క్రింద జరుగుతున్న ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్ధులు బరిలో నిలవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.   తెరాస తరపున ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నేతి విద్యాసాగర్ రావు,యాదవ రెడ్డి, బి.వెంకటేశ్వరులు అభ్యర్ధులుగా నిలబడ్డారు. కాంగ్రెస్ తరపున ఆకుల లలిత, తెదేపా-బీజేపీ కూటమి తరపున వేం నరేంద్ర రెడ్డి అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. మజ్లిస్ పార్టీకి చెందిన ఏడుగురు యం.యల్యేలు వైకాపాకు చెందిన ఒక యం.యల్యే తెరాసకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించగా, చెరో ఒక్క సీటు ఉన్న సీపీఎం, సీపీఐ పార్టీలు మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం.   ఇక కాంగ్రెస్ పార్టీకి మొత్తం 18మంది, తెదేపా(11), బీజేపీ(5) లకు కలిపి మొత్తం 16 మంది యం.యల్యేలున్నారు. ఒక్కో యం.యల్సీ. అభ్యర్ధికి కనీసం 18మంది యం.యల్యేల మద్దతు ఇస్తే తప్ప ఎన్నికలలో గెలవలేరు. కనుక కాంగ్రెస్ అభ్యర్ధికి ఆ పార్టీకి చెందిన అందరు యం.యల్యేలు తప్పకుండా ఓటేస్తే గెలిచే అవకాశం ఉంది. కానీ వారిలో ఏ ఒక్కరు తెరాస వైపు మళ్ళినా ఆ పార్టీ అభ్యర్ధి గెలుపు అనుమానమే. ఇక తెదేపాకు చెందిన మాధవరం కృష్ణారావు మొన్న తెరాసలోకి పార్టీ ఫిరాయించడం, పార్టీ సీనియర్ యం.యల్యే రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు నిన్న అరెస్ట్ చేయడంతో తెదేపా యం.యల్సీ. అభ్యర్ధి గెలుపు అనుమానాస్పదంగానే కనబడుతోంది.   తెదేపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 8మంది యం.యల్యేలను తెరాస ఆకర్షించగలిగినప్పటికీ వారందరికీ కూడా ఆ రెండు పార్టీలు విప్ జారీ చేసినందున, వారు తెరాస ఐదవ అభ్యర్ధికి ఓటు వేసినట్లయితే వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఉంది. వారు అందుకు సిద్దపడి ఓటు వేస్తారా లేదా అనే దానిపై తెరాస ఐదవ అభ్యర్ధి జయాపజయాలు నిర్ణయం అవుతాయి. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తమ ఐదవ అభ్యర్ధిని ఎట్టి పరిస్థితులలో గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు కనుక కాంగ్రెస్, తెదేపాల నుండి తెరాసలో చేరిన ఆ పార్టీల యం.యల్యేలు తమ పార్టీలు జారీ చేసిన విప్ ని దిక్కరించి తెరాస ఐదవ అభ్యర్ధికి ఓటు వేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ ఒకవేళ ఇదంతా ప్రతిపక్షాలను గందరగోళంలో పడేయడానికే తెరాస అధ్యక్షుడు పన్నిన వ్యూహమయితే చివరి నిమిషంలో తెరాస తన ఐదవ అభ్యర్ధిని పక్కనబెట్టినా ఆశ్చర్యం లేదు.

కోడలి మరణవార్త విని అత్త మృతి

కోడలి మరణవార్త విని అత్త గుండెపోటుతో మరణించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం రాజానగరం గ్రామంలో జరిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెంగమ్మ (40) అనే మహిళ ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మృతదేహాన్ని ఆదివారం మధ్యాహ్నానికి రాజానగరం గ్రామానికి తరలించారు. కోడలి మృతదేహాన్ని చూసిన వెంటనే ఆమె అత్త గిరమ్మ (70) గుండెపోటుకు గురై అక్కడికక్కడే మరణించింది. అత్తాకోడళ్ళు ఒకేసారి మరణించడంతో ఆ ఇంట్లో విషాదం కమ్ముకుంది. ఈరోజుల్లో కూడా ఇంత అన్యోన్యంగా వుండే అత్తాకోడళ్ళు వుండటం విశేషమేనని పలువురు అనుకుంటున్నారు.

రేవంత్ రెడ్డికి ప్రాణహాని వుంది

  తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ప్రాణహాని వుందని తమకు అనుమానాలు వున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేని ప్రలోభపెట్టారన్న ఆరోపణలమీద రేవంత్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారని వస్తున్న వార్తల మీద వారు స్పందించారు. దీనిమీద తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మను కలసి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిని వెంటనే బయటకు తీసుకురావాలని కోరారు. అధికారం వుంది కదా అని ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్ష తీర్చుకుంటున్నారని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటన మీద వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

ఏసీబీ అదుపులో రేవంత్ రెడ్డి?

  తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేని ప్రలోభపెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏసీబీ అధికారులు, పోలీసులు ఈ విషయాన్ని ఇంతవరకు ధ్రువీకరించలేదు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది కూడా రేవంత్ రెడ్డి అరెస్టు కాలేదని చెబుతున్నారు. తమకు అనుకూలంగా ఓటు వేస్తే 5 కోట్లు ఇస్తామని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌తో రేవంత్ రెడ్డి బేరం ఆడారని ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి అరెస్టుతోపాటు 50 లక్షల డబ్బును కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే తన దగ్గర ఎలాంటి డబ్బు లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తెదేపాకు మాధవరం గుడ్ బై

  శాసనమండలి ఎన్నికల ముందు తెదేపాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కూకట్ పల్లి యం.యల్యే. మాధవరం కృష్ణారావు ఈరోజు తెదేపాను వీడి తెరాసలో చేరిపోయారు. ఆయన ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు.   అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఇంతవరకు నన్ను ఎంతో ప్రోత్సహించిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి, ఆయన కుమారుడు లోకేష్ కి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. వారిరువురి పట్ల నాకు గౌరవమే తప్ప ఎటువంటి ద్వేషభావమూ లేదు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను తెరాసలో చేరాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు.” అని అన్నారు.   ఆయన తెరాసలో చేరాలనుకొంటున్నట్లు చాలా కాలంగానే చెపుతున్నారు. చివరికి ఈరోజు పార్టీ మారారు. కానీ పార్టీకి అత్యవసరమయిన మండలి ఎన్నికల సమయంలో మారడమే తెదేపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మండలి ఎన్నికలలో తెరాస తనకు తగినంత బలం లేకపోయినప్పటికీ 5వ అభ్యర్ధిని నిలబెట్టి, ప్రతిపక్ష పార్టీల యం.యల్యేలను ఈవిధంగా ఫిరాయింపులకి ప్రోత్సహించడాన్నిప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.   కాంగ్రెస్, తెదేపాలు రెండూ కూడా తమ యం.యల్యేలందరూ కూడా కేవలం తమ పార్టీ అభ్యర్ధులకే తప్పనిసరిగా ఓటు వేయాలని విప్ జారీ చేసాయి. నేటికీ తెదేపా యం.యల్యేలుగా ఉంటూ తెరాసలో కొనసాగుతున్నవారికి కూడా ఆ విప్ లేఖలు అందజేశాయి. కనుక మాధవరం కృష్ణారావుతో సహా తెరాసలో కొనసాగుతున్న తెదేపా, కాంగ్రెస్ యం.యల్యేలు అందరూ తెరాస అభ్యర్ధికి ఓటు వేసినట్లయితే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. మరి అప్పుడు తెరాస తన 5వ అభ్యర్ధిని ఏవిధంగా గెలిపించుకొంటుందో వేచి చూడాలి.