మాది సూటు-బూటు పాలన.. మీది సూటుకేసు పాలన

గతంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీది సూటు-బూటు పాలన అని విమర్మించిన సంగతి తెలిసిందే. ఆ విమర్శలకు ధీటుగా నరేంద్ర మోడీ కూడా కాంగ్రెస్ పార్టీ పై విమర్శలవర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ తమది సూటు-బూటు పాలన అని విమర్శిస్తున్నారు, కానీ.. వాళ్లలాగ తమది సూటుకేసు పాలన కాదు, దానికంటే ఇది బెటరే అని రాహుల్ కు రివర్స్ పంచ్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలన వల్లే దేశం ఇప్పటికీ పేదరికంలోనే ఉందని, నిజంగా మీరు పేదల పక్షమే అయితే ఇప్పటికీ దేశం ఇంకా పేదరికంలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల గురించి, వాళ్లకు అన్యాయం జరుగుతుందని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవ చేశారు. సొంత మనుషులకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అని అలాంటి పార్టీకి తమ గురించి విమర్శించే అర్హత లేదని తేల్చి చెప్పారు.

కొట్టుకుంటే సమస్యలు తీరవు.. చంద్రబాబు

ఏదైనా సమస్య వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ ను సూచించారు. అలాకాకుండా కొట్టుకుంటే సమస్యలు తీరవు, కోర్టుల చుట్టూ తిరిగినా ఏమాత్రం ఉపయోగం ఉండదు అందుకే మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని అన్నారు. రెండు రాష్ట్రాలకు ఉన్న సమస్యలను అధిగమించి అభివృద్ధి బాటలో నడవాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని, దానికి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, తెలంగాణ కూడా దీనికి సహకరించాలని కోరారు. అంతేకాక నీటి విడుదలపై వివాదం తలెత్తినప్పుడు గవర్నర్‌ తో సమావేశమయ్యేందుకు నేనే చొరవ తీసుకున్నా అప్పుడు 'ఏపీకి అన్యాయం జరిగితే ఢిల్లీకి వెళదామని కేసీఆర్‌ కూడా అన్నారు’ అని చంద్రబాబు గుర్తుచేశారు. అదే తరహాలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని అన్నారు.

ఏపీ రాజధాని భూమిపూజ స్థలం మార్పు?

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు ఎలాంటి అవాంతరాలు ఎదురవుతున్నాయో ఇప్పుడు నూతన రాజధాని భూమిపూజకు కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాజధాని భూమిపూజను జూన్ 6న చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికోసం మందడం శివారు తాళ్లాయపాలెం వద్ద భూమిని కూడా చూశారు. ఇదిలా ఉండగా రాజధాని భూమిపూజ కోసం కేటాయించిన భూమి జడ్పీటీసీ నరేంద్రబాబు ఆయన బంధువులకు చెందినది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇదే భూమిలో నరేంద్రబాబుకు సమీపబంధువు భార్య చనిపోగా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. నరేంద్రబాబు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లకుండా కప్పిపుచ్చారు. కానీ, ఈ విషయం ఒకరిద్దరు మంత్రుల దృష్టికి వెళ్లడంతో దాన్ని వారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారణంగా రాజధాని భూమిపూజ స్థలం మార్చే యోచనలో పడింది ప్రభుత్వం.

ఆగని ఎర్రచందనం స్మగ్లింగ్

  శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నా మరోవైపు స్మగ్లర్లు యదావిధిగా తమ స్మగ్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారని నిన్న మరొకమారు రుజువు అయింది. పోలీసులు నిఘా పెరగడంతో ఎర్రచందనం స్మగ్లర్లు ఈసారి తీర్ధ యాత్రికుల వేషంలో తమ పని చక్కబెట్టుకోవడానికి బయలుదేరడం విశేషం. తమిళనాడుకి చెందిన 72మంది కూలీలను, వారు ప్రయాణిస్తున్న బస్సులో దాచిన 77 ఎర్రచందనం దుంగలను, కత్తులు, గొడ్డళ్ళను నిన్న కడప జిల్లా సుండుపల్లి పోలీసులు చిన్నమండెం గ్రామం వద్ద పట్టుకొన్నారు. వారందరూ కడప జిల్లాలో సుండుపల్లె అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికేందుకు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారినందరినీ రాయచోటి పోలీస్ స్టేషన్లో విలేఖర్ల ముందు ప్రవేశపెట్టారు. తమిళనాడుకి చెందిన అరుణాచలం అనే ఎర్రచందనం స్మగ్లర్ వారి వెనుక ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.

నేడు జగన్ని కలవనున్న బొత్స

  వైకాపా నేతలు నిన్న హైదరాబాద్ లో బొత్స సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలో చేరవలసినదిగా ఆహ్వానించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈరోజు ఆయన స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ నివాసానికి వెళ్లి తుదివిడత చర్చలు జరుపబోతున్నారు. అనంతరం ఆయన పార్టీలో చేరికపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చేనెల 3వ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు మంగళగిరిలో సమర దీక్ష (నిరాహార దీక్ష) చేయబోతున్నారు. కనుక వీలయితే అదే రోజున బొత్స పార్టీలో చేరవచ్చును. లేకుంటే జూన్ 9న తన స్వంత జిల్లా అయిన విజయనగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరవచ్చునని సమాచారం. బొత్స సత్యనారాయణ చేరికను జిల్లాకు చెందిన వైకాపా నేతలు చాలా మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ, విశాఖ, విజయనగరం జిల్లాలలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆయనవంటి బలమయిన నాయకుడు అవసరమని జగన్ భావిస్తున్నందున ఆయనను పార్టీలో చేర్చుకోనేందుకే మొగ్గు చూపుతున్నారు. ఆయనను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా శాసనమండలికి పోటీ చేయించి మండలిలో వైకాపా పక్ష నేతగా నియమించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

టిడిపి కార్యకర్తలకు చంద్రబాబు వరాలు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు పలు సంక్షేమ చర్యలు ప్రకటించారు. కార్యకర్తల జీవితాలు బాగుచేసే బాధ్యత పార్టీదేనని స్పష్టం చేశారు. ఏడాదికి 5 వేల మంది కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, కుటుంబ పెద్దగా కార్యకర్తలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు, గౌవరం ఉండాలని నేతలకు సూచించారు. మహానాడులో పార్టీకి రూ. 12 కోట్ల విరాళాలు వచ్చాయని, వీటిని కార్యకర్తల బాగుకోసం వినియోగిస్తామని చెప్పారు.స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు పునరంకితం కావాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులు నిత్య విద్యార్థుల్లా ఉండాలని సూచించారు.

బొత్సతో జగన్ నేతల మంతనాలు

పీసీసీ మాజీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణతో జగన్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు చర్చలు జరపడం రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారింది. వైకాపా పార్టీకి చెందిన ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, పార్టీ ప్రముఖ నాయకులు విజయసాయి రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు బొత్స ఇంటికి ఆయనతో చర్చలు జరపడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. గత కొంతకాలంగా బొత్స కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరుతారనే జరుగుతున్న ప్రచారానికి ఈ చర్చలు బలాన్ని చేకురుస్తున్నాయి. ఉత్తరాంద్ర జిల్లాలలో మంచి పట్టున్న నేతైన బొత్స ను పార్టీలోచేర్చుకుంటే తనకి ఎంతో లాభం కలుగుతుందని జగన్ భావిస్తున్నారట. దీని కోసం విశాఖ జిల్లా బాద్యతలు మొత్తం ఆయనకే అప్పగిస్తానని చెబుతున్నాడట. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కని సమయంలో ఆ పార్టీ తరపున విజయనగరంలో పోటీ చేసి డిపాజిట్లు దక్కించుకున్న ఘనత బొత్స ఫ్యామిలిదే.

ఏపీ ప్రత్యేక హోదా పై త్వరలోనే నిర్ణయం.. రాజ్‌నాథ్‌ సింగ్‌

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే విధానంలో రోజుకో నేత రోజుకో విధంగా ప్రకటిస్తున్నారు. గత కొంత కాలంగా జరుగుతున్న తంతు ఇదే. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏపీ ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తెలంగాణ, ఏపీ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటికి సంబంధించి ఇరు రాష్ట్రాల ఛీఫ్ సెక్రటరీలతో మాట్లాడుతున్నామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి సంబంధించిన కొన్ని సమస్యలు గుర్తించామని, మరికొన్ని గుర్తించాల్సి ఉంటుందని అనంతరం కేంద్రహోంశాఖ కార్యదర్శితో మాట్లాడి అప్పుడు ఏపీ హోదాపై నిర్ణయం తీసుకుంటామని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

పేదల కోసం కొత్త పథకాలు.. వెంకయ్యనాయుడు

ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికాలంలో చేపట్టిన కార్యక్రమాలు వాటి విధి విధానాల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, చెప్పే బాధ్యత మాకుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. మోడీ ప్రధానిగా అధికారం చేపట్టి ఏడాది అవుతుందని, మోడీ నేతృత్వంలో ఏడాది పాలన చాలా సంతృప్తికరంగా ఉందని, దేశానికి మంచి నాయకత్వం లభించిందని అన్నారు. 2020 నాటికి ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇస్తామని, పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు ఎన్నికయ్యారు. గండిపేటలో నిర్వహించిన తెదేపా మహానాడు కార్యక్రమం చివరిరోజు భాగంగా ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ఇందుకుగాను చంద్రబాబు తరుపున ఆరు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. దీంతో చంద్రబాబు ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు అధ్యక్షునిగా ఎన్నికైన చంద్రబాబు శుక్రవారం నుండి జాతీయఅధ్యక్షునిగా కొనసాగనున్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడటంతో పాటు పార్టీలో కొత్తగా జాతీయ అధ్యక్ష పదవి ఏర్పాటు అనివార్యమైంది.

ఏపీ రాజధాని కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ మృతి

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఎంపికకు దాని సూచనల కోసం కేంద్రం ఈయనను అధ్యయన కమిటీ ఛైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. పలు పదవులలో అధికారాలు చేపట్టిన శివరామకృష్ణన్ ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నఈయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. శివరామకృష్ణన్ మృతికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పలువురు రాజకీయనేతలు సంతాపం తెలిపారు.

తల్లిదండ్రులను చంపిన మోడల్.. జీవితఖైదు

తల్లి దండ్రులను హత్య చేసిన కేసులో మోడల్ ప్రియాంకా సింగ్ కు , ఆమెకు సహకరించిన తన స్నేహితురాలు అంజూకు జీవిత ఖైదు శిక్ష పడింది. వివరాల ప్రకారం.. ప్రియాంక సింగ్ ఆమె తల్లిదండ్రులు సంతోష్ సింగ్, ప్రేమ్ వీర్ సింగ్ లు మీరట్ లోని ప్రేమ్ ప్రయోగ్ కాలనీలో ఉండేవారు. అయితే ప్రియాంక సింగ్ కు వారికి ఆస్తి గురించి, కుటుంబ సమస్యలతో తరుచుగా గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో 2008 సంవత్సరం నవంబర్ 11వ తేదీన ప్రియాంకసింగ్ కన్నతల్లిదండ్రులని కూడా చూడకుండా వారిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేసింది. అయితే ఈ హత్య కేసులో బరిలో దిగిన పోలీసులకు ప్రియాంకా సింగ్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తమ శైలిలో విచారణ చేపట్టేసరికి అసలు నిజం చెప్పింది. తానే తన తల్లి దండ్రులను హత్యచేశాని, తాను సంపాదించిన సొమ్ము తీసుకొని తనను నిర్లక్ష్యంగా చూసేవారని అందుకే హత్య చేశానని అంగీకరించింది. దీంతో ప్రియాంక సింగ్ కు యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్లు మీరట్ జిల్లా కోర్టు స్పష్టం చేసింది.

అప్పుడు అడ్డుకున్నాం.. ఇప్పుడూ అడ్డుకుంటాం.. చంద్రబాబు

ఓయూ యూనివర్సిటీ భూములు విద్యార్ధులకే చెందాలని వాటి జోలికి వస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తెదేపా మహానాడు లో చంద్రబాబు మాట్లాడుతూ ఓయూ భూమి విషయం మీద ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్ధులు చేసిన త్యాగం మరువలేనిదని, వారే లేకపోతే అంత తేలికగా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని అన్నారు. అలాంటి వారికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు చాలా శోచనీయమైనవని అన్నారు. గతంలో కూడా ఓయూ భూములను కబ్జా చేయాలని చూశారు కాని దానిని మేము అడ్డుకున్నాం.. ఇప్పుడు కూడా అడ్డుకుంటామని స్ఫష్టం చేశారు. తెలంగాణలో భూములను కాపాడిన ఘనత మాదే అని అన్నారు. ప్రజలు నమ్మి తెలంగాణను పాలించమని మీ చేతిలో పెడితే మీరు మాత్రం బంగారు తెలంగాణ పేరుతో మీ కుటుంబాన్ని బంగారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.. చంద్రబాబు

  తెదేపా 34వ మహానాడు మూడవరోజు ఘనంగా ప్రారంభమైంది. మూడవ రోజు కూడా ఈ కార్యక్రమానికి తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి సొమ్ముతో రాజకీయ హత్యలకు పాల్పడిందని, పరిటాల రవిని నిరాయుధుడిని చేసి దారుణంగా హత్య చేశారని దుమ్మెత్తి పోశారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి కాని, రాష్ట్రానికి కాని ఒరిగిందేమి లేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. శాంతి భద్రతలు అనేవి నాగరికతకు చిహ్నం అని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండాలని అన్నారు. వాళ్లకు హాని చేసే ఎలాంటి అరాచక శక్తులనైనా ఆటకట్టిస్తామని స్పష్టం చేశారు. అంతేకాక ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి కఠిన చర్యలు చేపడుతున్నామని అన్నారు.