నిర్మాతకి స్టార్ ఇమేజ్ తెచ్చిన రామానాయుడు
డి.రామానాయుడుకి ముందు.. డి.రామానాయుడు తరువాత.. ఇదీ తెలుగు సినిమా నిర్మాతలకి సంబంధించి చెప్పుకోవాల్సివస్తే ప్రముఖంగా చెప్పుకోవలసిన మాట. అంతగా తనదైన ముద్రను నిర్మాణ రంగంలో వేసారు రామానాయుడు. నాణ్యత ఉన్న సినిమాలను నిర్మించడమే కాదు.. ఎన్నో ఘనవిజయాలను అందించి నిర్మాతగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు ఈ మెగా ప్రొడ్యూసర్. ఐదు దశాబ్దాల పాటు నిర్మాణ రంగంలో ఎన్నో అద్భుతాలకు చిరునామాగా నిలిచిన రామానాయుడు జయంతి నేడు (జూన్ 6). ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలను స్మరించుకునే ప్రయత్నం ఇది.
రైతు బిడ్డ నుంచి నిర్మాత వరకుః
ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో జూన్ 6, 1936న జన్మించారు రామానాయుడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన రామానాయుడు.. సినిమాలపై ఉన్న ఇష్టంతో 1965లో ఎన్టీఆర్ నటించిన రాముడు - భీముడు చిత్రంతో సోలో ప్రొడ్యూసర్‌గా అడుగులు వేశారు. 1971లో వచ్చిన ప్రేమనగర్‌తో ఇక వెనుకకు చూడవలసిన పరిస్థితి లేకుండా భారీ విజయాన్ని మూటగట్టుకున్నారు. 1965 నుంచి 2014 వరకు తన బ్యానర్‌లో దాదాపు 50 ఏళ్ల పాటు సినిమాలను అందించారాయన. ఈ 50 ఏళ్లలో నాలుగైదు సందర్భాల్లో మినహాయిస్తే ప్రతి ఏడాదిలోనూ తన సినిమాలతో సందడి చేశారు. ఒక్కో ఏడాదిలో అయితే ఐదారు సినిమాలను నిర్మించిన ట్రాక్ రికార్డూ ఉంది.
రికార్డులు రివార్డులు అవార్డులు
అత్యథిక సంఖ్యలో సినిమాలను నిర్మించిన నిర్మాతగా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కిన రామానాయుడు.. మరెవరికి సాధ్యం కాని విధంగా 13 భాషల్లో సినిమాలను ప్రొడ్యూస్ చేసి తన పేరిట మరో రికార్డును సొంతం చేసుకున్నారు. దాదాపు అన్ని భాషల్లోనూ విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును, పద్మ భూషణ్ పురస్కరాన్ని తన సొంతం చేసుకున్నారు.
స్టార్స్ ప్రొడ్యూసర్
రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు.. ఇలా ఓ తరంలోని టాప్ హీరోలందరితోనూ సినిమాలను నిర్మించి హిట్స్‌ను కైవసం చేసుకున్న రామానాయుడు.. తరువాత తరంలోని స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతోనూ సినిమాలను తీసి సక్సెస్‌లను అందిపుచ్చుకున్నారు. స్టార్స్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు.
స్టార్ ప్రొడ్యూసర్
స్టార్ హీరోలతో సినిమాలు తీసి మెప్పించడమే కాదు.. నూతన నటీనటులను పరిచయం చేస్తూ ఆయన కొన్ని సినిమాలను నిర్మించారు. హరీష్, మాలాశ్రీలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ నిర్మించిన ప్రేమఖైదీ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. స్టార్‌లను కాకుండా కథలను నమ్మి ఆయన సినిమాలు తీసేవారు. అందుకే ఆయన నిర్మించిన సినిమాల్లో సింహభాగం విజయపథంలో పయనించాయి. ఎంతో మంది కొత్త నటీనటులును, సాంకేతికనిపుణులను పరిచయం చేయడమే కాకుండా.. వారిలో చాలా మందిని స్టార్స్‌గా మలిచిన ఘనత కూడా ఉన్నందున స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు రామానాయుడు.
నటనా కోణం
నిర్మాతగా ఎన్నో ఘనవిజయాలను సొంతం చేసుకున్న రామానాయుడు.. నటన మీద ఆసక్తితో కొన్ని సినిమాల్లో చిరు పాత్రలను పోషించారు. మరి కొన్ని సినిమాల్లో కథను కీలక మలుపు తిప్పే పాత్రల్లోనూ మెప్పించారు. హోప్ సినిమా కోసం పూర్తినిడివి ఉన్న పాత్రను చేసి అలరించారు.
నాయుడుగారి కుటుంబం - సినిమాకే అంకితం
సినిమాలపై తనకున్న ప్రేమను తన వరకే పరిమితం చేసుకోలేదు రామానాయుడు. తన కొడుకులను, మనవళ్లను సినీ పరిశ్రమకు పరిచయం చేసారు. రామానాయుడు పెద్ద కుమారుడు డి.సురేష్‌బాబు నిర్మాతగా తండ్రి అడుగుజాడల్లోనే నడిస్తే.. మరో తనయుడు వెంకటేష్ కథానాయకుడుగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక మూడోతరంలో రామానాయుడు మనవళ్లు రానా, నాగచైతన్య కథానాయకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నిర్మాతగా స్టార్ డమ్‌ని సొంతం చేసుకున్న రామానాయుడు ఫిబ్రవరి 18, 2015న కన్నుమూశారు. నిర్మాతకు స్టార్‌డమ్ ని తీసుకువచ్చిన ఆయన లాంటి నిర్మాత బహుశా మళ్లీ పుట్టకపోవచ్చు.