గవర్నర్ రాజీనామా?

నోటుకు ఓటు కేసులో వ్యవహారంలో అందరి పరిస్థితి ఏమో కానీ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ కి మాత్రం మొట్టికాయలు తప్పట్లేదు. అందరూ ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్లే. ముఖ్యంగా తెదేపా శ్రేణులు గవర్నర్ వ్యవహారంపై గుర్రుమంటున్నారు. అటు ముఖ్యమంత్రి, మంత్రులు తమ ఫోన్లు ట్యాపింగ్ విషయంలో, కేసు విషయంలో గవర్నర్ ఏం పట్టించుకోవడం లేదని.. వివక్ష చూపుతున్నారని.. తమకు భద్రత లేకుండా పోయిందని తిట్టి పోయడమే కాకుండా కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు సెక్షన్ 8 అమలు పై గవర్నర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని.. దాని ప్రకారం గవర్నర్ చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేస్తున్నా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా తీవ్ర మనస్థాపానికి గురై రాజీనామాకు సిద్ధమయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజీనామా చేస్తానన్న గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం బుజ్జగిస్తున్నట్టు, మరోవైపు గవర్నర్ మార్పు కూడా ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

రాజధాని భూమ్.. పెరిగిన ట్యాక్స్..

ఆంధ్రరాష్ట్ర నూతన రాజధానికి నిర్మాణానికి శంకస్థాపన ఒక్కటే జరిగింది... ఇంకా నిర్మాణం ప్రారంభం కూడా కాలేదు. కానీ అప్పుడే నూతన రాజధాని ప్రభావం వల్ల విజయవాడ నగరంలో ట్యాక్స్ 19 లక్షలకు పెరిగింది. గడిచిన రెండు నెలల్లోనే ఏపీ ప్రభుత్వం 19 లక్షల ట్యాక్స్ ను పొందగా అందులో విజయవాడ మొదటి డివిజన్ నుండి 12.4 లక్షల ట్యాక్స్ రాగా విజయవాడ రెండవ డివిజన్ నుండి 6.69 లక్షల ట్యాక్స్ వచ్చినట్టు అధికారులు తెలుపుతున్నారు. అది కూడా ఎక్కువ మంది వీఐపీ లు రాజధానికి చూడటానికి వచ్చి వెళుతున్న నేపథ్యంలో అంతేకాక కొద్ది మంది మంత్రులు మాత్రమే తమ నివాసాలను మార్చుకోవడం వల్ల ట్యాక్స్ ఇంత పెరిగిందని తెలుస్తోంది. కొద్ది మంత్రులు వస్తేనే ఇంత ట్యాక్య్ పెరిగిందంటే ఇంకా సీఎం కార్యలయ్యాన్ని విజయవాడకు మార్చుకొని అక్కడి నుండే విధులు నిర్వహిస్తే ఈ ట్యాక్స్ విలువ కోటి 19 లక్షలు పెరుగుతుందనడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదు.   మరోవైపు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కనుక ప్రారంభమైతే అక్కడ ట్యాక్స్ 4.39 కోట్లు వచ్చే అవకాశం ఉందని.. భవిష్యత్ లో అది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. అలాకనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ కు ఉన్న లోటు బడ్జెట్ కు కొంత వరకు ఊరట కలిగించినట్టే.

ఇద్దరు సీఎంలను ఏసీబీ విచారించాలి..

ఓటుకు నోటు కేసులో తెదేపాను దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు బాగానే ప్రయత్నిస్తున్నాయి. ప్రతిపక్షాలకు ఇది ఒక ఆయుధంగా మారిందనే చెప్పాలి. అటు కాంగ్రెస్ నేతలు, వైకాపా నేతలు తెదేపాను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రా ముఖ్యమంత్రులపై ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు తమ హోదాను మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని.. అసలు ఇద్దరు సీఎంలను ఏసీబీ విచారించాలని అన్నారు. ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు.

చంద్రబాబు.. కేసీఆర్.. ఢీ అంటే ఢీ

నోటుకు ఓటు కేసులో ఇరు రాష్ట్రాల నేతలు ఎవరి వ్యూహాలతో వాళ్లు ముందుకెళుతున్నారు. ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పంతం నెగ్గించుకోవాలని, ఎలాగైనా చంద్రబాబును ఈ కేసులో ఇరికించాలని చూస్తుంటే మరోవైపు ఏపీ ప్రభుత్వం తమపై ఉన్న ఆరోపణలను ఎలాగైనా చేధించాలనే కసితో ఉంది. ఈ కేసు ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంలకు ఒక సవాల్ గా మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవైపు ఈ కేసుకు సంబంధించి కీలకమైన సమాచారం దర్యాప్తులో తెలంగాణ ఏసీబీ అధికారులు తలమునకలై ఉన్నారు. దీనిలో భాగంగానే రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఆడియో, వీడియో రికార్డింగులను, వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించగా దానికి సంబంధించిన నివేదిక రానుంది. మరోవైపు ఏసీబీ అధికారులు ఈ కేసులో అత్యంత కీలక సమాచారం స్టీఫెన్ సన్ వాంగ్మూలం తీసుకోవడానికి కూడా సన్నద్ధమయ్యారు.   ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం తమ పనిలో తాము ఉండగా చంద్రబాబు ఏలాగైనా వారిని ఎదుర్కోవాలనే పనిలో పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం నిగ్గు తేల్చాలని స్పెషల్ ఇన్వేస్టిగేటింగ్ టీమ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఏపీ పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ జేవీ రాముడు, ఏసీబీ చీఫ్‌ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనూరాధతో కలిసి సమావేశమయి సిట్ ను ఏర్పాటు చేయనున్నారు. అసలే ఈ వ్యవహారంపై లీగల్ యాక్షన్ తీసుకుందామని సమాలోచనలో ఉన్న చంద్రబాబు ఈ కేసులో ఉన్న లొసుగులు దానికి సంబంధించి పలు అంశాలపై పోలీసు అధికారులను అడిగి తెలుకొని దానిని బట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.   మొత్తానికి ఓటుకు నోటు కేసులో తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. కేసీఆర్ వేసే ఎత్తుగడలను ఎలా తిప్పి కొట్టాలో చంద్రబాబు ప్రయత్నాలలో చంద్రబాబు ఉన్నారు. ఆఖరికి ఈ పోరులో ఎవరు గెలుస్తారో!...

రేవంత్ కు రిమాండ్ పొడిగింపు

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి విధించిన కస్టడీ ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో కేసులో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఇంకా కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తి కాలేదని ఇంకా సాక్షులను విచారించాల్సి ఉందని ఇందుకోసం సమయం కావాలని ఏసీబీ అధికారులు కోర్టులో మమో దాఖలు చేశారు. అంతేకాకుండా, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా నివేదిక అందలేదని కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో రేవంత్‌తో పాటు మిగిలిన వారి రిమాండ్‌ను కూడా జూన్ 29వ తేది వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్ పై జనాగ్రహం.. రాజకీయాల్లో తప్పటడుగులు

  'నరం లేని నాలుక ఎన్ని రకాలైనా మాట్లాడుతుంది' అంటారు.. ఈ సామెత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బాగా సూటవుతుంది. అసలు జగన్ రాజకీయాలు చూస్తుంటే ఎవరైనా ముక్కునవేలేసుకోవాల్సిందే. ఏదో చేద్దామనుకొని ఇంకేదో చేసి తానే తప్పటడుగులు వేస్తున్నారు. మరీ ఎక్కువ రాజకీయాలు చేసి అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలోనూ ఎటూకాకుండా పోతారేమో అనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ సీఎంకు జగన్ మద్దతివ్వడంతో ఇప్పటికే ఆంధ్రా వాళ్లు జగన్ మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు. దీనిలో భాగంగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మీద అక్కసుతో జగన్ మోహన్ రెడ్డి పలికిన ప్రతి మాట కేసీఆర్ కు మద్దతిచ్చేదిగా ఉండటంతో జగన్ పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఎలాగైనా చంద్రబాబును ఓటుకు నోటు కేసులో ఇరికించాలని తెగ తాపత్రయపడుతున్నారు కానీ.. మరో కోణంలో ఆంధ్రా వారినుండి వ్యతిరేకత వస్తుందని ఆలోచించలేక పోయారు.     ఇప్పుడు ఎలాగో మేలుకొని ఏపీ ప్రజల వ్యతిరేకతను గుర్తించారేమో జగన్ సడన్ గా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసినప్పుడు మౌనంగా ఉన్న జగన్ కు అప్పుడు గుర్తుకురాని అనుమతులు ఇప్పుడు అంత సడెన్ గా ఎందుకు గుర్తోచ్చాయో? ఎందుకంటే ఆ రకంగా ఏదో తెరాసకు వ్యతిరేకం అని చెప్పుకోవడానికే అన్నట్టు ఉంది. అప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు ఆపాలంటూ కేంద్రమంత్రులందరినీ కాకా పట్టిన జగన్ ఇప్పుడు ఏదో నామమాత్రంగా పాలమూరు ప్రాజెక్టుపై ఓ లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. ఎందుకంటే ఎలాగూ అటూ ఆంధ్రాలో జనాలు జగన్ మీద ఆగ్రహంగా ఉన్నారు.. ఏదో ఇలా చేస్తే తాను కూడా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నానని తెలపడానికి ఏదో చిన్న ప్రయత్నం చేశారు. ఏదీ ఏమైనా జగన్ మాత్రం ఓ కన్ప్యూజన్ స్టేట్ ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు మీద కోపంతో తెరాసకు మద్దతిస్తే ఇటు ఆంధ్రాలో పూర్తి వ్యతిరేకతను చూడాల్సి వస్తుంది. మరోవైపు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే అసలే అక్కడ అంతంత మాత్రంగా ఉన్న పార్టీ తట్టాబుట్టా సర్దుకొని రావాల్సి ఉంటుంది. చివరికి ఏదో చేయబోయి జగన్ తన చేతులు తానే కాల్చుకుంటాడేమో.

కాంగ్రెస్ నేత షీలా కౌల్ మృతి

  కేంద్ర మాజీ మంత్రి షీలా కౌల్ శనివారం సాయంత్రం ఘజియాబాద్‌లోని ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆమె వయసు 101 సంవత్సరాలు. వృద్దాప్యం చేత వచ్చే ఆరోగ్యసమస్యలతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. గతంలో ఆమె హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేసారు. ఆమె ఐదు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె మాజీ భారత ప్రధాని స్వర్గీయ జవహర్‌లాల్ నెహ్రూకి మరదలు. ఆదివారం సాయంత్రం డిల్లీలో 4.30 గంటలకు ఆమె అంత్యక్రియలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తదితర అనేకమంది కాంగ్రెస్ ప్రముఖులు ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు.

తెదేపాకి వర్తించింది తెరాస ఎమ్మెల్యేకి వర్తించదా?

  ఇంతకు ముందు తెదేపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఘాటుగా విమర్శించిన లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఈసారి తెరాస ప్రభుత్వంపై తన అస్త్రాలు సంధించారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పారిశ్రామిక విధానం క్రింద పరిశ్రమలకు రెండువారాలలోనే అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తామని, పారిశ్రామికవేత్తలు ఇకపై అధికారుల చుట్తో తిరగనవసరం లేదని, ఎవరికీ దేనికీ లంచాలు చెల్లించవలసిన అవసరం లేదని హామీలు గుప్పిస్తున్నారు. కానీ వాస్తవాలు మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయని జయప్రకాశ్ మాటలు నిరూపిస్తున్నాయి.   హైదరాబాద్ లోని ఓ పారిశ్రామికవాడకు నీరు సరఫరా చేసేందుకు ఒక తెరాస ఎమ్మెల్యే రెండుకోట్లు లంచం అడిగారని ఆరోపించారు. ముందు తన ఎమ్మెల్యేలను నియంత్రించకుండా ఎన్ని పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టినా ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే ఆయన ఆ ఎమ్మెల్యే ఎవరో బయటపెట్టలేదు. తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఒక నియమం, తెరాస ఎమ్మెల్యేలకి మరొక నియమంలా ఉందని తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు.

గవర్నర్ పై సోమిరెడ్డి ఘాటు విమర్శలు

  గత ఏడాది కాలంగా ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదో ఒక అంశం మీద యుద్ధం జరుగుతూనే ఉంది. కొన్ని విషయాలలో అవి కోర్టులకి కూడా ఎక్కుతున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి గవర్నర్ నరసింహన్ కి పిర్యాదులు చేసుకొంటూనే ఉన్నాయి. గవర్నర్ ఒకసారి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేసారు గానీ అవి ఫలించకపోవడంతో ఈ సమస్యలతో, గొడవలతో తనకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.   అయితే అందుకు ఆయననే పూర్తిగా తప్పు పట్టడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన పెద్దరికాన్ని, మధ్యవర్తిత్వాన్ని మన్నించి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వంతో రాజీకి సిద్దపడినా అది సిద్దపడకపోవడంతో సమస్యలు, గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. కనుక ఆయన కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న గొడవలను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం కనుసైగ చేస్తే ఎక్కడలేని చురుకుదనం ప్రదర్శించే గవర్నర్లు, ఇటువంటి సమయంలో కూడా అదేవిధంగా వ్యవహరించిఉన్నా, లేకపోతే తన ప్రయత్నలోపం లేకుండా ఇరు రాష్ట్రాల మధ్య రాజీ ప్రయత్నాలు కొనసాగించినా ఎవరూ ఆయనను తప్పు పట్టేవారు అవకాశం ఉండేది కాదు.   కానీ ఇంతకాలంగా ఎన్ని సమస్యలు ఎదరవుతున్నా నోరు విప్పని తెదేపా, రేవంత్ రెడ్డిని తెరాస ప్రభుత్వం ఎసిబి చేత ట్రాప్ చేయించిన తరువాత ఇక మౌనంగా ఉండలేకపోయింది. గవర్నర్ అధీనంలో ఉన్న హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద సంఘటన జరిగేవరకు ఆయనకు సమాచారం లేకపోవడం, ఆ తరువాత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడటంతో తెదేపా గవర్నర్ నరసింహన్ పై నేరుగా విమర్శలు గుప్పించింది.   ఆ పార్టీ యం.యల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా ప్రభుత్వం పదేపదే విభజన చట్టంలో అంశాలను అతిక్రమిస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదు. గత ఏడాది కాలంలో తెలంగాణా ప్రభుత్వానికి కనీసం పదిసార్లు కోర్టులో మొట్టికాయలు పడ్డాయి కానీ గవర్నర్ మాత్రం ఎ విషయంలో కలిగించుకోలేదు. విభజన చట్టంలో సెక్షన్: 8 తో సహా ప్రతీ అంశం గురించి చిన్న పిల్లాడిని అడిగినా చెప్పగలడు. కానీ ఆయన ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారో అర్ధం కావడం లేదు. రెండు రాష్ట్రాలను సమాన దృష్టితో చూడవలసిన గవర్నర్ తెలంగాణా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చివరికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా ఆయన మంత్రులు అందరూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల, ఇతర మంత్రుల పట్ల, ప్రజల పట్ల చాలా అవమానకరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆయన నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం చాలా బాధాకరం. ఈ విషయం గురించి మా ప్రభుత్వంస్వయంగా ఆయనకు పిర్యాదు చేసినా ఆయనలో ఎటువంటి చలనమూ కనబడలేదు,” అని ఘాటుగా విమర్శలు గుప్పించారు.

ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు... ఇద్దరు సీఎంలకు కిషన్ రెడ్డి హితువు

తెలంగాణ జీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు రాష్ట్రాల సీఎంలకు ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే ఇద్దరు మంత్రులు మానసిక ప్రశాంతత కలిగి ఉండాలని.. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. నోటుకు ఓటు కేసు గురించి పట్టించుకోవడానికి న్యాయస్థానాలు, ఏసీబీ ఉందని.. ఈ వ్యవహారంపై తాము ఇవ్వాల్సిన నివేదిక ఇచ్చామని తెలిపారు. కాగా జీజేపీ టీడీపీ పొత్తు విషయమై మాట్లాడుతూ తప్ప, ఒప్పులు తేలిన తరువాతే పొత్తుల విషయం చూద్దామని వ్యాఖ్యానించారు. అలాగే ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదని కిషన్ రెడ్డి... ఇద్దరు సీఎంలకు హితవు పలికారు. ఈనెల 21న యోగా దినం సందర్భంగా .. సంజీయ్యపార్కులో ఉ. 7 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు

బెల్లీ బటన్ టచ్ ఛాలెంజ్..

సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఏదో ఒక ఛాలెంజ్ అంటూ ఎప్పుడూ బిజీగానే ఉంటాయి. అప్పుడెప్పుడో ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ కొన్ని రోజులు హడావిడి చేశారు. తరువాత ఫైర్ ఛాలెంజ్ కూడా అయిపోయింది. ఇంకేం ఛాలెంజ్ పెట్టాలా అని బాగా ఆలోచించారో ఏమో చైనా వాళ్లు ఓ కొత్తరకం ఛాలెంజ్ ను తీసుకొచ్చారు. అదే బెల్లీ బటన్ టచ్ ఛాలెంజ్. అంటే మీ చేతిని వెనకనుంచి ముందుకు తీసుకొచ్చి మీ బొడ్డును ముట్టుకోవడం. ఇప్పటికే చైనా నెటిజన్లు ఈ ప్రయోగం చేస్తూ తెగ బిజీ అయిపోయారట. అందులోనూ టీనేజ్ అమ్మాయిలే ఎక్కువమంది ఉన్నారట. అయితే ఈ ఛాలెంజ్ కు ఒక్కరోజులోనే కోటి 30 లక్షల మంది చూశారని.. దాదాపు 1,04,000 కు పైగా చర్చలు జరగడంతో ఫుల్లు క్రేజ్ వచ్చేసింది.

స్టీఫెన్ సన్ వాంగూల్మం.. ఏసీబీ దూకుడు

నోటుకు ఓటు కేసులో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి అరెస్ట్ సమయంలో తీసిన ఆడియో, వీడియో రికార్డింగులు, ఫోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లాయి. వాటికి సంబంధించిన నివేదిక కూడా రెండు మూడు రోజుల్లో రానుంది. మరోవైపు ఈ కేసులో తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం చాలా కీలకంగా మారనుంది. స్టీఫెన్ సన్ ఇచ్చే వాంగూల్మం బట్టి ఏసీబీ బరిలో దిగనుంది. అతను ఏ పేర్లు చెపుతాడో దాని బట్టి వారికి నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఉంది ఏసీబీ. విచారణలో నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలనుండి సేకరించిన సమాచారాన్ని ఏసీబీ కోర్టుకు సమర్పించారు. దీనిలో కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ కు అర్హత లేదు... జేసీ

రేవంత్ రెడ్డి కేసుపై టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ కేసీఆర్ పై తిట్ల వర్షం కురిపించారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏం చేయలేడని అన్నారు. అసలు ఏసీబీ విడుదల చేసిన ఆడియో రికార్డింగుల్లో చంద్రబాబు ఎక్కడా డబ్బు గురించి కానీ.. ఓటు గురించి కానీ ప్రస్తావించలేదని.. ఈ రికార్డులను అడ్డంపెట్టుకొని పార్టీ ని దెబ్బతీయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడే ఆడియో టేపులను ఎందుకు విడుదల చేయలేదని.. చంద్రబాబు ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలన్నీ గుదిగుచ్చి ఒకచోట చేర్చి ఆడియో టేపులని నాటకాలాడుతున్నారని అన్నారు. మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టి తమ పార్టీలోకి చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు.