బాబుని బ్రహ్మ దేవుడు కూడా రక్షించ లేడు: కేసీఆర్
posted on Jun 9, 2015 7:20AM
రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఇంత వరకు పరోక్ష యుద్ధం చేస్తున్న ఆంద్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రులిరురువు ఇప్పుడు ప్రత్యక్ష యుద్దానికి దిగారు. చంద్రబాబు నిన్న మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ని తీవ్రంగా విమర్శించడమే కాకుండా తన జోలికి వస్తే వదిలిపెట్టనని తీవ్ర స్వరంతో హెచ్చరించారు కూడా. అందుకు కేసీఆర్ వెంటనే బదులిస్తూ ఇంకా ఎక్కువ మాట్లాడితే నిన్ను (చంద్రబాబు నాయుడు)ని ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని హెచ్చరించారు. తెలంగాణాలో సమస్యలు పరిష్కరించుకోవడానికే తమకు రోజుకి 20గంటలు పనిచేసినా సరిపోవడం లేనప్పుడు ఇటువంటి వ్యవహారాల గురించి ఆలోచించే తీరిక తమకెక్కడిదని ప్రశ్నించారు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్లు తెలంగాణా రాష్ట్రం ఇచ్చినా హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని చేసి కాంగ్రెస్ సన్నాసులు తమకీ తలనొప్పులు తగిలించిపోయారన్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడుకి పోలీసులు, ఎసిబి ఉండొచ్చునేమో కానీ ఆయనేమీ హైదరాబాద్ కి ముఖ్యమంత్రి కాదనే సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. అసలు ఒక్క యంయల్సీని గెలిపించుకోలేవని తెలిసినప్పుడు పోటీలో ఎందుకు నిలబెట్టావని ప్రశ్నించారు. స్టీఫెన్ సన్ తెలంగాణా బిడ్డ గనుక ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎసిబికి పిర్యాదు చేసి రేవంత్ రెడ్డి ని పట్టించారని అన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు ఏ శాస్తి కావాలో అది అయి తీరుతుంది. ఈ తెలంగాణ ఒకనాడు ఉద్యమ బెబ్బులి. నేడు స్వయం పాలనతో ఆత్మ గౌరవంతో కాలర్ ఎగరేసుకుని దేశం ముందు నిలబడింది. ఇక ఈ గడ్డ మీద నీ కిరికిరి చెల్లదు. తస్మాత్ జాగ్రత్త!” అని తీవ్ర స్వరంతో చంద్రబాబు నాయుడుని హెచ్చరించారు.