మక్కాలో మరో పెను విషాదం, 250మంది మృతి

మక్కాలో మరోసారి పెనువిషాదం చోటు చేసుకుంది, పవిత్ర హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి 250మందికి పైగా మరణించారు, మరో 500మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు, క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో మృతుల సంఖ్యగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. సైతాన్ ను రాళ్లతో కొట్టే కార్యక్రమంలో భాగంగా యాత్రికులంతా ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇటీవలే భారీ క్రేన్ కూలి 107మంది చనిపోగా, తాజా దుర్ఘటనలో 250మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో మక్కాలో ఎటుచూసినా విషాదం నెలకొంది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షలాది మంది భక్తులు పోటెత్తడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని భావిస్తున్నారు.

జగన్ కు షాకివ్వనున్న ఎమ్మెల్యే అతనేనా..!

  తన సొంతజిల్లాలోనే జగన్ పట్టు బలహీనమైపోతుందా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. సొంతజిల్లా కడప నియోజక వర్గం నుండే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నారని నిన్నమొన్నటి వరకు వార్తలు జోరుగా సాగాయి. ఆయన జిల్లాలో కీలకమైన ఎమ్మెల్యే అని.. ఆయన త్వరలోనే పార్టీ మారుతున్నారని వార్తలు వినిపించినా పేరు తెలియలేదు. అయితే ఈ ఎమ్మెల్యే ఎవరో కాదు ఆదినారాయణరెడ్డి అని ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి మారుతున్నారు అని వార్తుల వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకూడా వారి జాబితాలో చేరిపోయారు. అయితే వైకాపా పార్టీలో ఉన్న ఎవరైతే జగన్ పై అసంతృప్తితో ఉన్నారో ఆ నేతలకు టీడీపీ గాలం వేస్తుందని వార్తులు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డితో సంప్రదింపులు జరిపారట. అయితే ఎప్పటినుండో పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న ఆదినారాయణరెడ్డి కూడా టీడీపీలోకి చేరడానికి సముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కడప నుండి పది అసెంబ్లీ స్థానాల నుండి 9 స్థానాలను వైకాపా సొంతం చేసుకొన్ని ఎప్పటి లాగే అక్కడ తన పట్టు నిరూపించుకున్న జగన్ ఇప్పుడు ఒక్కోక్క ఎమ్మెల్యే పార్టీ మారే ప్రయాత్నాలు చేస్తుండటంతో అతని బలం తగ్గిపోతుందేమో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

జగన్ అక్కడ దీక్ష చేసుకోవచ్చు.. జగన్ కు పుల్లరావు సలహా

  టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఓ ఉచిత సలహా ఇచ్చారంట. జగన్ దీక్ష చేస్తున్న నేపథ్యంలో పుల్లారావు జగన్ కు ఓ సలహా ఇచ్చారు. జగన్ దీక్ష చేస్తున్నాడు కాని విపరీతమైన రద్దీ ప్రాంతంలో కాకుండా జనం లేని ప్రాంతంలో దీక్ష చేసుకోవచ్చునని తెలిపారు. ఇదేదో ప్రభుత్వం కావాలని చేస్తుంది అని అంటున్నారు అందులో ఎంతమాత్రం నిజం లేదు.. ఇది పోలీసులు తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా జగన్ ఎన్ని రోజులు దీక్షలు చేసుకున్నా ఏం పర్వాలేదని.. దీక్ష వల్ల ఏపీకి మంచి జరిగితే మంచిదేనని.. దాన్ని మేము స్వాగతిస్తున్నామని అన్నారు. అది కాక మేమేదో కావాలనే దీక్షకు అడ్డుపడుతున్నామని అంటున్నారు అది మానుకుంటే మంచిదని విమర్శించారు. యువభేరీ పేరిట జగన్ యువతను రెచ్చగొడుతున్నారని ఎద్దేవ చేశారు.

పొన్నాలకు పదవి ఖాయమా?

తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య...ఏఐసీసీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది, ఏదోఒక పదవి లేకపోతే కార్యకర్తలు కూడా లెక్కచేయరని తెలుసుకున్న పొన్నాల...పార్టీ పోస్ట్ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారట. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన పొన్నాల...రాష్ట్రంలో పరిస్థితులపై నివేదిక ఇచ్చి, పనిలో పనిగా తన గురించి ఓ మాట వేశారట, పీసీసీ పదవి పోయాక తనను ఎవరూ పట్టించుకోవడం లేదని పార్టీలో ఏదోఒక పదవి ఇవ్వాలని కోరారట, పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు తనను సార్ సార్ అంటూ గౌరవించిన నేతలంతా...కనీసం ఇప్పుడు పలకరించడంలేదని తెగ బాధపడుతున్న పొన్నాలకు మరి ఊరట లభిస్తుందో లేదో చూడాలి

టీ-కాంగ్రెస్ లో మరోసారి బయటపడ్డ విభేదాలు

గాంధీభవన్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి, యువజన కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతల స్వీకారోత్సవానికి పలువురు నేతలు హాజరుకాకపోవడంతో అంతర్గత కలహాలు ఇంకా సద్దుమణగలేదని చెప్పుకుంటున్నారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యనేతలతోపాటు, యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయిన రవికుమార్ యాదవ్ వర్గం, అతని ప్యానెల్ లో గెలిచిన రాష్ట్ర కార్యవర్గంలోని నేతలు కూడా పాల్గొనలేదు, పైగా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వంశీచంద్ రెడ్డి కూడా రాకపోవడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పుకుంటున్నారు.  

జగన్ కు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే లేఖ

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుంటూరు జిల్లా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది, ప్రత్యేక హోదా కోసం జగన్ నిరాహార దీక్షకు దిగుతున్న నేపథ్యంలో ఆయనీ లేఖ రాశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ కి తీపి కబురు అందుతుందని ఆయన తెలిపారు, ప్రధాని మోడీ ఇప్పటికే రూట్ మ్యాప్ రెడీ చేయాలని నీతి ఆయోగ్ కమిటీకి ఆదేశించారని, ఈ మేరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కసరత్తు మొదలుపెట్టారంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే ఏపీ ప్రభుత్వానికి కూడా లేని సమాచారం ఈయనకు ఎలా వచ్చిందబ్బా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు, ఒకవేళ ఆ సమాచారమే నిజమైతే...ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చి ఉండేది కదా అంటున్నారు

ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా రుణమాఫీ లేనట్లేనా?

2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది రుణమాఫీ, ఈ హామీ వల్లే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందనేది ప్రతిపక్ష వైసీపీ ఆరోపణ, ఏదిఏమైనా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంలో ముఖ్య పాత్ర పోషించిన రుణమాఫీ అమలుపై ఎన్నో విమర్శలు చెలరేగుతున్నా ప్రభుత్వం మాత్రం దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు రుణాలు మాఫీ చేశామని చెబుతోంది. కొంతవరకూ రైతుల రుణాలు మాఫీ చేసినా, డ్రాక్రా మహిళల రుణాల మాఫీపై మాత్రం నోరు మెదపడం లేదు, అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదని చెప్పిందట, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాట వాస్తవమే అయినా ఇఫ్పుడు నెరవేర్చలేమంటూ ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది, అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ మేరకు జవాబిచ్చింది. రోజా, ఉప్పులేటి కల్పన, భూమా అఖిలప్రియ, గౌరు చరితారెడ్డి, జగ్గిరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కోడాలి నాని తదితరులకు లిఖికపూర్వకంగా ప్రభుత్వం సమాధానాలు పంపించింది. దాంతో డ్వాక్రా రుణాల మాఫీ లేనట్లేనని తేలిపోయింది.

ఉన్నది 18 రోజులు.. జరిగేది 10 రోజులు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 10 వరకూ ఈ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మొత్తం 18 రోజులు ఈ సమావేశాలు జరుగుతున్నట్టు కనిపిస్తున్న వాస్తవానికి 10 రోజులు మాత్రమే సమావేశాలు జరిగేలా కనిపిస్తున్నాయి. ఈ 18 రోజుల్లో ఉన్న సెలవుల్ని తీసేస్తే మిగిలేది 10 రోజులు. దీనికి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభను జరుపుకుందాం.. మాకేం పర్వాలేదు అని చెప్పడం గమనార్హం. ఈ పదిరోజులు కూడా సభలో వివిధ అంశాలపై చర్చ జరగడంకంటే గొడవలతోనే సగం సమయం అయిపోతుంది. మరోవైపు ప్రతిపక్షనేతలు మూకుమ్మడిగా అధికార పార్టీని ఇరుకున పెట్టాలని తమ వ్యూహాలలో తాము ఉన్నారు. ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు.. ప్రాజెక్టుల రీ డిజైనింగ్.. పార్టీ ఫిరాయింపులపై.. ముఖ్యంగా తలసాని వ్యవహారం గురించి అధికార పక్షాన్ని ప్రశ్నించనుంది.  అయితే అధికార పక్షం కూడా ఈ చర్చలకు సై అని.. తాము కూడా ఈ చర్చలకు రె"ఢీ" అంటూ చెప్పింది. కానీ కొన్ని అంశాలు అంటే  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్లు తీసివేయటం.. పార్టీ ఫిరాయింపులు.. మీద మాత్రం చర్చ జరపడానికి నో చెప్పింది. మొత్తానికి ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడిగా జరగనున్నట్టు తెలుస్తోంది.

ఏపీ శంకుస్థాపన తరువాత మోడీ ప్లాన్ ఏంటి?

  ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఖర్చుతో ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని.. తన సత్తా చాటాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఇంకా ఏపీ క్యాపిటల్ రాజధాని మ్యాప్ రూపొందించిన సింగపూర్ అధికారులు.. సింగపూర్ ప్రధానమంత్రి, ఇంకా జపాన్ మంత్రివర్గం మొత్తం ఓ 1000 మంది వీవీఐపీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్న అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే సమాచారం ప్రకారం గుంటూరు వద్ద కొండవీడులో 80 ఏకరాల స్థలంలో నిర్మిస్తున్న స్వర్ణ ఇస్కాన్ మందిరం భూమి పూజలో కూడా ప్రధాని పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారు అనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గవర్నర్ పై టీ-తెదేపా నేతలు ఆగ్రహం

  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ తీసుకోవడం లేదని, తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇదివరకు ఆంద్రప్రదేశ్ మంత్రులు, తెదేపా నేతలు ఘాటుగా విమర్శలు చేసారు. ఇప్పుడు తెలంగాణా తెదేపా నేతలు గవర్నర్ ని విమర్శిస్తున్నారు. తెదేపా ఎమ్మెల్యే అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చేత గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడమే తప్పు అని భావిస్తున్నప్పుడు ఆయనతో గవర్నర్ కలిసి తిరగడాన్ని టీ-తెదేపా నేతలు తప్పు పడుతున్నారు.   “గవర్నర్ నరసింహన్ తెరాస ప్రచార కర్తలా వ్యవహరించడం చాలా బాధాకరం. రియల్ ఎస్టేట్ సంస్థలు సెలబ్రిటీలు ప్రచారం చేసినట్లే గవర్నర్ కూడా తెరాస పధకాలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నట్లుంది. ఇదివరకు ఇందిరమ్మ ఇళ్ళ పధకాన్ని ఎంతో మెచ్చుకొన్న ఆయన ఇప్పుడు తెరాస ప్రభుత్వం ఆ ఇళ్ళు నిర్మించుకొన్న పేదలకు బిల్లులు చెల్లించకపోతే ఎందుకు అడగడం లేదు? రాష్ట్రంలో నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే గవర్నర్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని వెంటబెట్టుకొని ఆయన స్వయంగా ఆత్మహత్యలు చేసుకొన్నా రైతుల ఇళ్ళకు వెళ్లి వారికి భరోసా కల్పించాలి. వీటన్నిటినీ మేము కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పిర్యాదు చేస్తాము,” అని తెదేపా శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

బీహార్ ఎన్నికలలో లాలూ ప్రసాద్ కుమారులు పోటీ!

  గడ్డి కుంభకోణం కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడి, బెయిలుపై బయటకు వచ్చిన కారణంగా ఆర్.జె.డి. పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై అనర్హత వేటు పడింది. కనుక ఆయన పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 101 స్థానాలలో పోటీ చేస్తున్నప్పటికీ ఆయన పోటీ చేయడానికి వీలుపడలేదు. కానీ తమ కూటమి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో చక్రం తిప్పాలని ఉవ్విళ్ళూరుతున్న లాలూ ప్రసాద్ ఈ సమస్యకు తనదయిన శైలిలో పరిష్కారం కనుగొన్నారు. ఇదివరకు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైలుకి వెళ్ళవలసి వచ్చినప్పుడు తన భార్య రబ్రీదేవిని తన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి అధికారం తన చేతుల్లో నుండి జారీ పోకుండా జాగ్రత్త పడ్డారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ఉపాయమే పన్నారు.   ఆయన తన ఇద్దరు కొడుకులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ లను తన తరపున ఎన్నికలలో బరిలో దింపారు. వారిద్దరూ మొట్టమొదటిసారిగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఒకవేళ జనతా పరివార్ ఎన్నికలలో గెలిచి బీహార్ లో అధికారంలోకి వచ్చినట్లయితే ఆయన తన ఇద్దరు కుమారులకు కీలకమయిన మంత్రి పదవులు ఇప్పించుకొని పరోక్షంగా ప్రభుత్వంలో చక్రం తిప్పడానికి అవకాశం కల్పించుకొన్నారు. ఒకవేళ ఏ పార్టీకి, కూటమికి పూర్తి మెజార్టీ రాకపోయినా అప్పుడు కూడా లాలూ ప్రసాద్ చక్రం తిప్పే అవకాశం ఉంటుంది.

దాల్మియా ప్లేస్ లో సౌరబ్ గంగూలీ

బీసీసీఐ ఛైర్మన్ జగ్ మోహన్ దాల్మియా మరణించడంతో అటు బీసీసీఐ అధ్యక్ష పదవికి, ఇటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నడుస్తోంది, ఎవరికి వాళ్లు ఈ పదవులను దక్కించుకునేందుకు లాబీయింగ్ చేసుకుంటున్నారు, బీసీసీఐను దక్కించుకునేందుకు మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్, శరద్ పవార్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ బీసీఏ పగ్గాల కోసం పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. దాల్మియాకు నమ్మినబంటైన గంగూలీ...ఆయన హయాంలోనే ఇండియన్ టీమ్ కు కెప్టెన్ గా ఓ వెలుగు వెలిగాడు, ఇప్పుడు ఆయన స్థానంలో  బీసీఏ పగ్గాలు అందుకోవాలని చూస్తున్నారు, అయితే బెంగాల్ సీఎం అనుగ్రహం ఉంటేనే ఈ పదవి దక్కుతుందంటున్నారు, మమతా బెనర్జీ కూడా గంగూలీ పట్ల సానుకూలంగానే ఉన్నారనే వార్తలు వస్తున్నాయి, అదే నిజమైతే బీసీఏ చీఫ్ గంగూలీయే కావడం ఖాయం

తెలుగుదేశంలోకి కృష్ణాజిల్లా వైసీపీ నేత

కృష్ణాజిల్లా వైసీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్... త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి, టీడీపీలో చేరడానికి  ఆ పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, మంచి ముహూర్తం చూసుకుని పసుపు కండువా కప్పుకోవడమేనంటున్నారు.అయితే మొన్నటివరకు వేదవ్యాస్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినట్లు టాక్ ఉంది, కానీ చివరికి తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వేదవ్యాస్...చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో పీఆర్పీలో చేరారు, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడంతో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. అయితే 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వేదవ్యాస్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు, దాంతో మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

పబ్లిక్ గా మోడీ.. సీక్రెట్ గా రాహుల్

    బీహార్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలందరూ బిజీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు ముఖ్య నేతలు పర్యటనలకు వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అది కూడా ఇద్దరు ఒకే దేశానికి పర్యటనకు వెళ్లడం గమనార్హం. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన గురించి వివరాలు తెలిసినా రాహుల్ గాంధీ పర్యటన గురించిన వివరాలు కాంగ్రెస్ పార్టీ గోప్యంగా ఉంచుతోందని అర్ధమవుతోంది.    ప్రధాని మోడీ ఐక్యరాజ్యసమితి జనరల్ సమావేశాల్లో పాల్గొనడానికి పదిరోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే రాహుల్ ఎందుకు పర్యటనకు వెళ్లారబ్బా అని అందరికి సందేహాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ప్రతినిధులతో ప్రకటన చేయించింది. రాహుల్ కొలరాడాలో జరగనున్నసమావేశాల్లో పాల్గొనడానికి వెళ్లారని ప్రతినిధి సుర్జేవా చెప్పారు. అయితే అవి ఏసమావేశాలు.. అక్కడ రాహుల్ ఎన్నిరోజులు ఉంటారని మాత్రం చెప్పలేదు. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయం ఆ మాట చెప్పిన కొద్దిగంటలకే రాహుల్ గాంధీ తన వ్యక్తిగత పనిమీద విదేశాలకు వెళ్లారని త్వరలో తిరిగి వచ్చి బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయనే చెప్పడం గమనార్హం. మొత్తానికి రాహుల్ గాంధీ పర్యటనను కాంగ్రెస్ నేతలు బయటపెట్టడంలేదని అర్ధమవుతోంది. 

కోదండరామ్ అడుగు ఎటు.. ప్రతిపక్షంగానా? అధికారపక్షంగానా?

    జేఏసీ సారధి కోదండరామ్ రెడ్డి ఇక నుండి ఫుల్ ఫ్రీగా ఉండబోతున్నారు. అంటే ఈ నెలాఖరున తాను తన ప్రొఫెసర్ వృత్తి నుండి రిటైర్ అవ్వబోతున్నారు. అయితే ఇప్పుడు కోదండరామ్ రిటైర్ అయిన తరువాత ఏం చేస్తారు అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే తెలంగాణ ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన కోదండరామ్.. ఆతరువాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత తన ప్రొఫెసర్ వృత్తినే సాగిస్తూ అప్పుడప్పుడు తెలంగాణ ప్రజల సమస్యల గురించి అధికార పార్టీని ప్రశ్నించేవారు. గతంలో కూడా కోదండరామ్ తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేరే పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే అవి వార్తలు గానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు కోదండరామ్ రిటైర్ అయిన తరువాత తాను ప్రతిపక్షనేతగా ఉంటారా లేక అధికార పక్షానికి దగ్గరవుతారా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.    ఇదిలా ఉండగా మరోవైపు ఆయన అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశమే లేదనే వార్తుల కూడా వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ప్రజా సంఘాలతో సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలకోసం పోరాడుతారని అనుకుంటున్నారు. మరోవైపు కోదండరామ్ కూడా అడుగు ఏటు వేయాలో తెల్చుకోలేకపోతున్నారుట. దీనికి సంబంధించి మూడు నెలలుగా చర్చలు జరుగుతున్నా ఆయన మాత్రం ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ఉన్నారట. మరి కోదండరామ్ అడుగు ఎటు పడుతుందో ..ఆయన ప్రతిపక్షంగా ఉంటారా? లేక అధికార పక్షంగా ఉంటారో చూడాలంటే ఇంకా కొంత సమయం ఆగాల్సిందే..

జగన్ కు గాలి కౌంటర్.. యువభేరి కాదు కుర్చీభేరి

    టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ విశాఖలో యువభేరి కార్యక్రమంలో చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జగన్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు గాలి జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ యువభేరి అంటూ విద్యార్ధులను మోసం చేస్తున్నారని.. అది కేవలం తన కుర్చీ కోసం చేస్తున్న భేరీ అని మండిపడ్డారు. జగన్ మాటలు నమ్మి విద్యార్ధులు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు అని సూచించారు. అంతేకాదు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబుకు తెలియదు అని మాట్లాడుతున్నారు.. అసలు ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోడీని.. కేంద్రాన్ని ప్రశ్నించకుండా చంద్రబాబును అనడం సబబుకాదని అన్నారు. ఒకపక్క చంద్రబాబు ఏపీ రాష్ట్ర అభివృద్ధికి... ఏపీలో  పెట్టుబడులు పెట్టడానికి అహర్నిశలు కష్టపడుతుంటే దానికి సహకరించాల్సింది పోయి ఎప్పుడూ ఏదో విమర్శ చేస్తూ అడ్డుగా నిలుస్తున్నారని ఎద్దేవ చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ లోకా?

    వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన సొంత నియోజక వర్గమైన కడపజిల్లాలోని ఒక ఎమ్మెల్యే షాకివ్వనున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. వైకాపాలోని ఒక ఎమ్మెల్యే  టీడీపీ తీర్ధం పుచ్చుకోబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఎమ్మెల్యే ఎవరనేది మాత్రం పేరు వినిపించడంలేదు. కానీ జిల్లాలో ఆయన కీలక ఎమ్మెల్యే అని.. ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే గతంలో వైకాపా పార్టీ ఇలాగే మైండ్ ఆడి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కోనేందుకు ప్రయత్నాలు చేసిందని విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు టీడీపీ కూడా మైండ్ గేమ్ ఆడుతుందా.. ఈనేపథ్యంలోనే ఇలాంటి ప్రచారం జరుగుతుందా అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.

అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి.. నేతలకు కేసీఆర్ సూచనలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షనేతలు అడిగే ప్రశ్నలను ఎలా తిప్పికొట్టాలి అనే విషయంలో ఏ పార్టీ వ్యూహాలు ఆపార్టీకి ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీపై పలు రకాల ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షపార్టీలు ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు.. కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు తదితర అంశాలపై టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తుంది. అంతేకాదు గత అసెంబ్లీ సమావేశాల్లా కాకుండా ఈసారి మాత్రం పార్టీలన్నీ ఏకమై టీఆర్ఎస్ పార్టీపై దాడి చేయాలని చూస్తున్నాయి. దీనిలో భాగంగానే టీటీడీపీ కాంగ్రెస్ పార్టీ.. వైకాపా పార్టీ నేతలతో సంప్రదింపులు కూడా జరిపారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.   అయితే వీళ్ల పనిలో వీళ్లు ఉంటే అటు కేసీఆర్ మాత్రం చాలా ధీమాగా ప్రతిపక్షనేతలకు భయపడాల్సిన అవసరం లేదని పార్టీనేతలకు చెప్పారంట. అయితే రైతుల ఆత్మహత్యల విషయంలో కూడా ప్రతిపక్షాల అనవసరం రాద్దాంతం చేస్తున్నారు కానీ వారి దగ్గర విషయం ఏం లేదు.. ఏదో అసెంబ్లీలో రచ్చ చేయడానికే ప్రయత్నిస్తున్నారని పార్టీ నేతలకు సూచించారట. అంతే కాదు అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేతలు అడిగే ప్రశ్నలకు జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పాలని.. అన్ని విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని.. వారి ఉచ్చులో పడకుండా ఉండాలని చెప్పారంట. మొత్తానికి పార్టీలన్నీ కలిసి ఎవరి ప్లానింగ్లో వాళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఎవరి ఎత్తులను ఎవరు పడగొడతారో.. చిక్కుకుంటారో చూడాలి మరి.