బీహార్ ఎన్నికలలో లాలూ ప్రసాద్ కుమారులు పోటీ!
posted on Sep 24, 2015 7:07AM
గడ్డి కుంభకోణం కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడి, బెయిలుపై బయటకు వచ్చిన కారణంగా ఆర్.జె.డి. పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై అనర్హత వేటు పడింది. కనుక ఆయన పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 101 స్థానాలలో పోటీ చేస్తున్నప్పటికీ ఆయన పోటీ చేయడానికి వీలుపడలేదు. కానీ తమ కూటమి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో చక్రం తిప్పాలని ఉవ్విళ్ళూరుతున్న లాలూ ప్రసాద్ ఈ సమస్యకు తనదయిన శైలిలో పరిష్కారం కనుగొన్నారు. ఇదివరకు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైలుకి వెళ్ళవలసి వచ్చినప్పుడు తన భార్య రబ్రీదేవిని తన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి అధికారం తన చేతుల్లో నుండి జారీ పోకుండా జాగ్రత్త పడ్డారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ఉపాయమే పన్నారు.
ఆయన తన ఇద్దరు కొడుకులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ లను తన తరపున ఎన్నికలలో బరిలో దింపారు. వారిద్దరూ మొట్టమొదటిసారిగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఒకవేళ జనతా పరివార్ ఎన్నికలలో గెలిచి బీహార్ లో అధికారంలోకి వచ్చినట్లయితే ఆయన తన ఇద్దరు కుమారులకు కీలకమయిన మంత్రి పదవులు ఇప్పించుకొని పరోక్షంగా ప్రభుత్వంలో చక్రం తిప్పడానికి అవకాశం కల్పించుకొన్నారు. ఒకవేళ ఏ పార్టీకి, కూటమికి పూర్తి మెజార్టీ రాకపోయినా అప్పుడు కూడా లాలూ ప్రసాద్ చక్రం తిప్పే అవకాశం ఉంటుంది.