గవర్నర్ పై టీ-తెదేపా నేతలు ఆగ్రహం
posted on Sep 24, 2015 @ 9:35AM
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ తీసుకోవడం లేదని, తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇదివరకు ఆంద్రప్రదేశ్ మంత్రులు, తెదేపా నేతలు ఘాటుగా విమర్శలు చేసారు. ఇప్పుడు తెలంగాణా తెదేపా నేతలు గవర్నర్ ని విమర్శిస్తున్నారు. తెదేపా ఎమ్మెల్యే అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చేత గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడమే తప్పు అని భావిస్తున్నప్పుడు ఆయనతో గవర్నర్ కలిసి తిరగడాన్ని టీ-తెదేపా నేతలు తప్పు పడుతున్నారు.
“గవర్నర్ నరసింహన్ తెరాస ప్రచార కర్తలా వ్యవహరించడం చాలా బాధాకరం. రియల్ ఎస్టేట్ సంస్థలు సెలబ్రిటీలు ప్రచారం చేసినట్లే గవర్నర్ కూడా తెరాస పధకాలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నట్లుంది. ఇదివరకు ఇందిరమ్మ ఇళ్ళ పధకాన్ని ఎంతో మెచ్చుకొన్న ఆయన ఇప్పుడు తెరాస ప్రభుత్వం ఆ ఇళ్ళు నిర్మించుకొన్న పేదలకు బిల్లులు చెల్లించకపోతే ఎందుకు అడగడం లేదు? రాష్ట్రంలో నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే గవర్నర్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని వెంటబెట్టుకొని ఆయన స్వయంగా ఆత్మహత్యలు చేసుకొన్నా రైతుల ఇళ్ళకు వెళ్లి వారికి భరోసా కల్పించాలి. వీటన్నిటినీ మేము కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పిర్యాదు చేస్తాము,” అని తెదేపా శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.