కేసీఆర్ కోసం కొత్త క్యాంపు కార్యాలయం

తెలంగాణ సీఎం కేసీఆర్ వాస్తుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనందరికి తెలిసిన విషయమే. దీనిలో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత తన క్యాంపు కార్యాలయాన్ని బేగంపేట షిప్ట్ చేశారు. అయితే అక్కడ సీఎం క్యాంపు కార్యాలయంలో కూడా కొన్ని దోషాలు ఉన్న నేపథ్యంలో చాలా మార్పులు చేశారు. అయినా కూడా వాస్తు నిపుణులు ఇంకా చాలా మార్పులు చేయాలని నిర్ణయించారు. దీంతో వాస్తు ప్రకారం ఇప్పుడు కేసీఆర్ కు కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేసీఆర్ కూడా అధికారులను ఆదేశించగా వారు కూడా దానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించడం జరిగిందట. ఈ కొత్త క్యాంపు కార్యాలయాన్ని ప్రస్తుతం సీఎం ఉంటున్న కార్యాలయానికి ఆనుకొని ఉన్న ఐఏఎస్ క్వార్టర్  స్థలంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ క్వార్ట్రర్ ను కూల్చివేయడానికి ఉత్తర్వులు జారీ చేస్తూ.. కార్టర్ల కూల్చివేతకు రూ. 63 లక్షలను కూడా మంజూరు చేసింది. కాగా కొత్తగా నిర్మించే సీఎం క్యాంపు కార్యాలయం అన్ని రకాల హంగులతో రూపుదిద్దుకోవడమే కాకుండా సీఎం కేసీఆర్ రక్షణకు సంబంధించి అన్ని చర్యలను తీసుకుంటున్నారు.

సోమిరెడ్డి ఆరోపణ నిజమే... రామోజీ అరెస్ట్ కు ప్రయత్నించారు?

  రామోజీరావును ఒక్కరోజైనా జైల్లో ఉంచాలని ఆనాడు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనంటున్నారు టీడీపీ వర్గాలు, జగన్ కు రామోజీ అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని జీర్జించుకోలేకపోతున్న తెలుగుదేశం అభిమానులు...వైఎస్ హయాంలో రామోజీ అరెస్ట్ కు ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేసుకుంటున్నారు. రామోజీ అరెస్ట్ కు వైఎస్ ప్రయత్నించారని, తెల్లవారితే అరెస్ట్ జరుగుతుందనగా రామోజీ ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకుని దాన్ని ఆపుకోగలిగారని చెబుతున్నారు, ఎంతో పొలిటికల్ అండ్ మీడియా నెట్ వర్క్ ఉన్న రామోజీకి ఈ విషయం ముందుగా తెలియలేదని, ఓ వ్యక్తి అర్థరాత్రి  పూట చేసిన ఫోన్ కాల్ తో అప్రమత్తయ్యారని, తెల్లారితే అరెస్ట్ చేస్తారనే విషయాన్ని ఆ వ్యక్తి చెప్పినా మొదట నమ్మకలేదని, ఆ తర్వాత తనకున్న పలుకుబడితో ఫోన్లు మీద ఫోన్లు చేసి ఆరా తీస్తే నిజమని తేలిందని, దాంతో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి వైఎస్ పై ఒత్తిడి తెచ్చి అరెస్ట్ ను ఆపుకున్నారని అంటున్నారు

ఏపీ లా కాకుండా చూడండి.. కోదండరామ్

మొత్తానికి కోదండరాం తాను రాజకీయాల్లోకి వెళ్లడం లేదని ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్.. జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్నిరోజుల క్రితం వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ గురించి ప్రస్తావించారు. ఎన్‌కౌంటర్ అనేది తప్పు అని, అలాంటి సంఘటనలు జరగకూడదని అంటూ తీసుకొచ్చి కాల్చేసినట్లే కనిపిస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను ప్రతిపక్ష నేతగా ఉంటారా లేదా? అధికార పక్షనేతగా ఉంటారా అన్న దానిపై వార్తలు వచ్చిన నేపథ్యంలో దానిపై స్పందిస్తూ.. తాను రాజకీయాల్లోకి వెళ్తానని వస్తున్న వార్తలు ఊహాగానాలు మాత్రమే అని.. తనకు అధికార దాహం లేదని, తాను ఎల్లవేళలా ప్రజల పక్షమేనని అన్నారు. అంతేకాదు మరోవైపు ప్రతిపక్షాలపై తమకు ఏ విధమైన కోపం లేదని, అయితే వారితో కలిసి పనిచేయలేమని వారి కార్యాచరణలు వేరు.. మావి వేరని తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన నేపథ్యంలో చర్చలు కంటే గొడవలు.. అరుచుకోవడాలే ఎక్కువయ్యాయి.. ఆ పంథాలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగకుండా అరుచుకోవడం మాని ప్రజాసమస్యలపై చర్చించి ముఖ్యంగా రైతు ఆత్మహత్యల గురించి ఆలోచించాలని..రైతుల కుటుంబాలకు జూన్ 2వ తేదీ నుంచి నష్టపరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు.

వామ్మో.. కేసీఆర్ కు వ్యతిరేకంగా అన్ని సంఘాలా?

వరంగల్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టులపై జరిగిన ఎన్ కౌంటర్ పై పలు సంఘాలు కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎన్ కౌంటర్ పై పులువురు పలు రకాలుగా విమర్శలు చేస్తునే ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై విరసం నేత వరవరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ కేసీఆర్ ఆదేశాల వల్లే జరిగిందని.. ఎన్ కౌంటర్ కు కేసీఆరే బాధ్యత వహించాలని వరవరరావు డిమాండ్ చేశారు. మావోయిస్టులు శృతి - విద్యాసాగర్ రెడ్డిల మృతికి బూటకపు ఎన్ కౌంటరే కారణమని ఆయన ఆరోపించారు. తమ కార్యకలాపాలకు అడ్డువస్తున్నారని.. మైనింగ్ మాఫియా కోసం ప్రాజెక్టుల్లో బినామీలుగా సంపాదనకు మరిగిన అధికార పార్టీ తొత్తులే ఈ ఎన్ కౌంటర్ కు కారణమని విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈనెల 30న 370  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో ఆసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వరవరరావు ప్రకటించారు.

అప్పుడు స్నానం కూడా చేయలేదు.. చంద్రబాబు

ఏపీ రాజధానిలో పెట్టుబడులను తీసుకురావడానికి సీఎం చంద్రబాబు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం.. సింగపూర్ పర్యటనలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలతో చర్చలతో తీరిక లేకుండా గడిపామని.. రాత్రి పగలు విశ్రాంతి లేకుండా.. కనీసం స్నానం కూడా చేయకుండా పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల నుండి పారిశ్రామిక వేత్తలు తరిలి వస్తున్నారని.. ఇలాంటి సమయంలో ఏపీలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించాలని సూచించారు. ఒకప్పుడు విజయవాడ అంటే రౌడీయిజం అంటూ భయపడే పరిస్థితి ఉండేది.. ఆ అరాచకాలను అణచివేయగలనని చెప్పారు. ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే విధంగా రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని.. విజయదశమి రోజున జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి భారతదేశం, సింగపూర్ ప్రధాన మంత్రులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు.

తలసాని రాజీనామాపై రాజ్ భవన్ లేఖ.. కేసీఆర్ ఏం చేస్తారు?

తలసాని రాజీడ్రామాపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తలసాని టీడీపీ పార్టీ నుండి గెలుపొంది రాజీనామా చేయకుండా తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తలసాని రాజీనామా చేయలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తాను రాజీనామా చేశానని.. దానికి సంబంధించిన రాజీనామా పత్రం నా దగ్గరే ఉందని.. కానీ అది స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉందని కబుర్లు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే టీడీపీ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏమైనా చిక్కులు వస్తాయా అని అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే ముందునుండి తెలంగాణ ప్రభుత్వం తలసాని రాజీనామా పై చూసిచూడనట్టే వ్యవహరిస్తుంది. ఇది కోర్టు పరిధిలోకి రాదని.. తమ పరిధిలోకి వస్తుందని వాదిస్తోంది. అయితే ఇప్పుడు తలసాని రాజీనామాపై రాజభవన్ నుండి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఓ లేఖ అందింది. తలసాని రాజీనామాపై వివరణ కోరుతూ లేఖను రాశారు. అంతేకాదు ఈ లేఖతో టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాసిన లేఖను కూడా జత చేసి పంపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ లేఖ రావడం సర్వత్రా చర్చాంశనీయమైంది. ఈ లేఖపై కేసీఆర్ ఏవిధంగా స్పందిస్తారూ.. ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆసక్తికరంగా మారింది.

జగన్ సైలెన్స్ పై సస్పెన్స్

  ఎప్పుడు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా.. ఎప్పుడు చంద్రబాబు ప్రభుత్వపై విరుచుపడదామా అని చూస్తుంటారు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఇప్పుడు తాను ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ ఈరోజు దీక్ష చేపట్టాలని ఎప్పుడో తేదీ ఖరారు చేసుకున్నా అందుకు ఏపీ ప్రభుత్వం.. పోలీసులు అనుమతివ్వలేదు.  మరోవైపు దీక్ష కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరిస్తూ సాధారణ రీతిలో హైకోర్టులో అపీల్ చేసుకోవాలని చెప్పారు. ఈ పరిస్థితుల్లో జగన్ దొరికిందే ఛాన్స్ కదా అని అధికార పార్టీని ఏకిపారేయోచ్చు.. కానీ అలాంటిది ఏమీ లేకుండా తన దీక్షను వాయిదా వేసుకోవడంతో ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా దీక్ష చేసి తీరుతామని వైకాపా వర్గాలు కూడా చెప్పాయి. సాధారణంగా అయితే ఇలాంటి సమయంలోనే దీక్షలు చేసి పోలీసుల చేత అరెస్ట్ అయి సింపతి కొట్టేయాలని చూస్తారు. కానీ జగన్ అవేమీ చేయకుండా చాలా సింపుల్ గా హైకోర్టు మీద సాకుతో ఈ దీక్షను వాయిదా వేశారు. అయితే దీని వెనుక కారణం మాత్రం రామోజీరావు అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ రామోజీరావును కలిసిన తరువాతే మెతకబడ్డారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా జగన్ మళ్లీ దీక్షను అక్టోబర్ 6 లేదా 7 తేదీల్లో చేపడుతారని.. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని జగన్ వర్గాలు తెలుపుతున్నాయి.

కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు చిరంజీవి టెంప్ట్ అవుతారా?

  కాంగ్రెస్ పార్టీ నేత.. సినీ నటుడు చిరంజీవి కాషాయ కండువా కప్పుకోబోతున్నారా.. ఆయన బీజేపీ పార్టీలోకి చేరే దిశగా అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి మారుతున్నట్టు ఇప్పటికే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకూ చిరంజీవి కాని.. ఆయన వర్గాలు కానీ పెదవి విప్పకపోవడం గమనార్హం. అయితే ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఇంకా రాలేదు.. దీనికితోడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి లాంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తానంటే ఆనందంగా వెల్ కం చెబుతామంటూ.. చిరంజీవితమ పార్టీలోకి రావాలని భావిస్తే.. తాము నిండు మనసుతో స్వాగతిస్తామని కిషన్ రెడ్డి అంటున్నారు. మరి కిషన్ రెడ్డి మాటలకు చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

జగన్ దీక్ష అలా వాయిదా పడింది

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపట్నుంచి గుంటూరులో తలపెట్టిన నిరాహార దీక్ష వాయిదా పడింది, ఒకవైపు పోలీసులు అనుమతి నిరాకరించడం, మరోవైపు అనుమతి ఇచ్చేది లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రకటించిన నేపథ్యంలో దీక్షను వాయిదా వేసుకున్నారు, దీక్ష వాయిదా విషయాన్ని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. హైకోర్టు తీర్పు వచ్చాక జగన్ దీక్ష ఎప్పట్నుంచో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అయితే జగన్ దీక్షకు అనుమతి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైసీపీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది, హౌస్ మోషన్ పిటిషన్ కాకుండా రెగ్యులర్ పిటిషన్ వేయాలని ధర్మాసనం సూచించడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకముందన్న ఆయన, జగన్ దీక్షకు హైకోర్టు అనుమతి ఇస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.

ఒక్కరోజైనా జైల్లో చూడాలనుకున్నాడు జగన్..!

తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. జగన్ ఇద్దరూ ఒకటే అని.. అందుకే కేసీఆర్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా.. ఏపీ ప్రభుత్వంపై సమస్యలు సృష్టిస్తున్నా జగన్ పట్టించుకోకుండా ఉండటమే దీనికి నిదర్శనమని అన్నారు. అలాకాదంటే కేసీఆర్ పై పోరాడటానికి జగన్ సిద్దమా అని సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం డిమాండ్ చేస్తూ జగన్ చేస్తున్నా దీక్ష ఒట్టి ప్రచారం కోసమే అని.. కాని ప్రజలు దీన్ని నమ్మరని అన్నారు. ఒకవేళ తన అక్రమాస్తులను ప్రజలకు ఇచ్చి చేస్తే తన దీక్షను ప్రజలను నమ్ముతారని ఎద్దేవచేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడగకుండా చంద్రబాబును ఆడిపోసుకుంటే ఏం లాభం..ప్రతిఒక్క విషయానికి చంద్రబాబును అనడం ఆనవాయితీ అయిపోయిందని అన్నారు. ఈనాడు అధిపతి రామోజీరావును ఒక్కరోజైనా జైలులో ఉంచాలని అనాడు వైఎస్‌ జగన్‌ అనుకున్నారని.. అలాంటిది ఇప్పుడు తాను రామోజీరావును ఎందుకు కలిశారు.. కలవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు నిర్ణయమే లోకేశ్ తీసుకున్నాడు..

టీడీడీ యువనేత.. పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేశ్ కూడా ఇప్పుడు తండ్రి చంద్రబాబు బాటలోనే నడవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయన తరువాత సీఎం చంద్రబాబు మొదట్లో హైదరాబాద్ నుండే పాలనా కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే అది కష్టమైని భావించి విజయవాడ నుండే తన పార్టీ కలాపాలు చూసుకోవాలని భావించి వారంలో  మూడురోజులు విజయవాడలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మూడురోజులు కాదు అన్ని రోజులు అక్కడే ఉంటున్నారు.. ఎప్పుడో అవసరమైతే తప్ప హైదరాబాద్ రావడంలేదు. ఇప్పుడు లోకేశ్ కూడా విజయవాడలోనే మూడు రోజులు విజయవాడలోనే ఉండాలని నిర్ణయించుకున్నారట. మీరు కూడా విజయవాడలో ఉంటే బావుంటుందని పార్టీలో ఉన్న పలువురు నేతలు లోకేశ్ ను అడగటంతో ఆయన కూడా విజయవాడలో ఉండాలని డిసైడయ్యారట. అయితే లోకేశ్ గా కూడా కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నారట. విజయవాడలోనే ఉండి కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటూ... ఒకవేళ తనకు ఏదైనా డౌట్ వచ్చినా తన తండ్రి చంద్రబాబు ఎలాగూ పక్కనే ఉంటారు కాబట్టి సలహాలు సూచనలు తీసుకోవచ్చనే ఆలోచనతోనే నిర్ణయం తీసుకున్నారట. మొత్తానికి తండ్రి.. కొడుకులు ఇద్దురూ ఒకే దగ్గర ఉండి పాలనా కార్యక్రమాలు చూసుకోవడం మంచి పరిణామమే.

అసెంబ్లీలోనే ఉండరు.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కమ్యూనిస్ట్ ల వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వారు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులకు అసలు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు.. అలాంటిది వారు కూడా ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఏదో మీడియాలో కనిపించడం కోసం ప్రతి చిన్న విషయానికి సంఘర్షణ చేస్తే కాదు.. సంయమనంతో ఉంటేనే ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని హితవు పలికారు. ఈసందర్భంగా ఆయన దీన్‌దయాల్‌ ను గుర్తు చేశారు.  దీన్‌దయాల్‌ ఓ స్వప్నికుడు, ఆయన జీవితం ఆదర్శనీయమని..జాతి పునరుజ్జీవనానికి దీన్‌దయాల్‌ ఆనాడే బీజం వేశారని అన్నారు. సిద్ధాంతపరమైన ఓటమిని కమ్యూనిస్టులు ఎప్పుడూ అంగీకరించడంలేదని దుయ్యబట్టారు. కమ్యూనిస్టుల ప్రభావం పరిమితమని.. కానీ వారికి ప్రచారం అపరిమితమని చెప్పారు. ప్రతిపక్షాలు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబుకు అప్పుడున్న భయం ఇప్పుడు పోయిందా?

  ఒకపక్క ప్రత్యేక రాష్ట్ర కావాలని తెలంగాణ వాదులు.. మరోపక్క రాష్ట్ర విభజన జరగడానికి వీలులేదని సీమాంధ్ర ప్రజల ఆరోపణలు.. అన్ని గొడవల మధ్య ఎట్టకేలకు రాష్ట్ర విభజన జరిగింది. అయితే ఈ విభజన వల్ల తెలంగాణ రాష్ట్రం సంగతి ఏమో కాని ఏపీకి మాత్రం నష్టం జరిగిందనే అనుకోవచ్చు. కొత్త రాష్ట్రం.. రాజధాని లేదు.. ప్రభుత్వ కార్యాలయాలు లేవు.. రాష్ట్రం విడిపోయిన హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఏలాగో అక్కడి నుండే పాలన కొనసాగించుకోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఏపీ అభివృద్ధి చేయాలంటే దానికి కాస్తంత ధైర్యం ఉండాలనే చెప్పాలి.  మరి అలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏపీ అభివృద్ధిని తలపెట్టిన చంద్రబాబుకు దైర్యం ఉందనే చెప్పాలి. కానీ మొదట్లో చంద్రబాబుకు కూడా విమర్శలు తప్పలేదు. తలపెట్టిన ప్రతి పని రివర్స్ అవడం.. ప్రతిపక్షనేతల విమర్శలు ఇవన్నీ ఆయనకు పెద్ద తలనొప్పిగానే.. భయంగాను తయారయ్యాయి. కానీ రాను రాను పరిస్థితి కొంచెం మారింది. ఏపీని అభివృద్ధి పంథాలో నడపడానికి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారు. విదేశాలనుండి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అంతేకాదు ప్రపంచ బ్యాంకే ఏపీ పెట్టుబడులు పెట్టుకోవడానికి అనువైనది అని చెప్పి రెండో స్థానాన్నికల్పించింది.. అంతేకాక విద్యుత్ పంపిణీ సరఫరాల నేపథ్యంలో ఏపీ ఘనత మరో మెట్టు ఎక్కింది.. కేంద్ర ప్రభుత్వమే విద్యుత్ సరఫరాల నష్టాల తగ్గింపులో ఏపీని చూసి నేర్చుకోండి అంటూ సూచన కూడా చేసింది. 2022 నాటికి ఖచ్చితంగా రాష్ట్రంలో 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తిచేస్తామని ధీమా కూడా వ్యక్తం చేశారు. అంతేకాదు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నదులు అనుసంధానం చేసి జాతీయస్థాయి క్రెడిట్ కూడా చంద్రబాబు ఖాతాలో చేరింది. మొత్తానికి చంద్రబాబు రాష్ట్రం విడిపోయిన తరువాత ఎంత మదన పడ్డారో.. ఎంత భయపడ్డారో ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో కాస్తంత స్థిమితపడినట్టు తెలుస్తోంది. అప్పుడు ఉన్న భయం ఇప్పుడు లేదని తెలుస్తోంది.

నారాయణ కాలేజీలో మరో విద్యార్ధి ఆత్మహత్య

కర్నూలులో నారాయణ కాలేజీ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు, నన్నూరు నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న శ్రీకాంత్... క్యాంపస్ వెలుపల సూసైడ్ చేసుకున్నాడు, అయితే ఏ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడో తెలియకపోయినప్పటికీ, అతను కాలేజీ బయట సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి తమకు సంబంధం లేదని యాజమాన్యం వాదిస్తోంది. శ్రీకాంత్ క్యాంపస్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడని, నారాయణ యాజమాన్యం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్ధులు ఆందోళనకు దిగారు, శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

రెండ్రోజులపాటు ఇంటర్నెట్ బంద్

జమ్మూకాశ్మీర్ లో రెండ్రోజులపాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయ్, బక్రీద్ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రి వరకూ ఇంటర్నెట్ ను నిలిపివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది, బక్రీద్ పండుగను సంతోషంగా ప్రశాంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది, అసాంఘిక శక్తులు మతవిద్వేషాలు రెచ్చగొట్టకుండా ముందుజాగ్రత్తగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది, దాంతో బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు సంతోషంగా జరుపుకునే వీలుంటుందని  తెలిపింది, జమ్మూ సర్కార్ ఆదేశాలతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు...డేటా సేవలను నిలిపివేసే పనిలో పడ్డారు

నారాయణఖేడ్ లో హరీష్ సుడిగాలి పర్యటనలు

నారాయణఖేడ్ ఉపఎన్నికపై అప్పుడే టీఆర్ఎస్ దృష్టిపెట్టింది, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి హరీష్ రావు... నారాయణఖేడ్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్టారెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నారాయణఖేడ్ ను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్న గులాబీ బాస్... ఆ బాధ్యతలను హరీష్ కి అప్పగించడంతో ఇప్పట్నుంచే పని మొదలుపెట్టారు, సిద్దిపేట మాదిరిగా నారాయణఖేడ్ ను డెవలప్ చేస్తానంటూ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రజలను ఏ అధికారులైనా డబ్బులు కోసం వేధిస్తే తమకు చెప్పాలని, వాళ్లని 24గంటల్లో సస్పెండ్ చేస్తామని హరీష్ హామీ ఇచ్చారు. నారాయణఖేడ్ ను ఎవరూ సరిగా పట్టించుకోలేదన్న హరీష్, తాము అధికారంలోకి వచ్చాక రెండు మార్కెట్ యార్డులను, గిడ్డంగులను నిర్మించామని గుర్తుచేశారు.  గత సంప్రదాయానికి భిన్నంగా నారాయణఖేడ్ బైపోల్ లో పోటీకి దిగాలనుకుంటున్న టీఆర్ఎస్ కి ప్రజలు పట్టంకడతారో, లేక సెంటిమెంట్ ప్రకారం కృష్టారెడ్డి కుటుంబ సభ్యులను ఎన్నుకుంటారో చూడాలి.

పట్టిసీమతో పరపతి పెరిగింది

  సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టిసీమ ప్రాజెక్టుకు.. అది అనుకున్నప్పటినుండి అడ్డంకులు మొదలవుతూనే ఉన్నాయి. ప్రతిపక్షనేతలు ఎన్నివిమర్శలు చేసినా అవేమి పట్టించుకోకుండా పట్టుదలతో పట్టిసీమ ప్రాజెక్టును తలపెట్టారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం చేసి అరుదైన ఘనత దక్కించుకున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు కేంద్రమంత్రి ఉమాభారతి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతిని కలిశారు. ఈ సందర్బంగా ఉమాభారతి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. నదుల అనుసంధానంలో సాధించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని ఆమె ప్రశంసించారు. మేము ఇంకా నదుల అనుసంథానం విషయంలో పథకాల రూపకల్పనలోనే ఉంటే చంద్రబాబు మాత్రం ఆపని చేసి చూపించారని.. సరికొత్త రికార్టు సృష్టించారని కొనియాడారు.  నదుల అనుసంధానంపై చంద్రబాబు కృషి దేశానికి ఆదర్శం అన్నారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టును కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని.. పోలవరంకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి చంద్రబాబు పట్టుదలతో నిర్మాణం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల మంచి గుర్తింపే లభించినట్టు తెలుస్తోంది.