కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలోకి?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ టీడీపి తీర్ధం పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆయనకు ప్రశంసలు సంగతి దేవుడెరుగుకాని విమర్శలే ఎక్కువ మోశారు. దానికి తోడు అప్పుడే రాష్ట్రవిభజన జరగడం.. ఒకవైపు తాను సమైక్యాంధ్ర అంటూ ఉన్నా కాని రాష్ట్రం విడిపోవడంలో కేంద్రానికి సపోర్టు చేశారనే ప్రజలు తిట్టిపోసుకున్నారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కిషోర్ కుమార్ అన్నీ తానై చూసుకునేవారు. తరువాత రాష్ట్రం విడిపోవడం ఆయన వేరే పార్టీ పెట్టడం జరిగాయి. అప్పుడు  పీలేరు అసెంబ్లీ బరిలో నిలిచి  వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆతరువాత ఇద్దరూ దాదాపు రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ కిషోర్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన టీడీపీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు.. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈవార్తల నేపథ్యంలో మరో వార్త షికారు చేస్తుంది.  తమ్ముడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా మళ్లీ రాజకీయాల్లోకి రావాలని తన పార్టీని వేరే పార్టీలో విలీనం చేసి మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నారట. చూద్దాం ఇందులో ఎంత నిజముందో.

మోడీని రాష్ట్రపతి చేసిన ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్రపతిని చేశారు. ఎప్పుడు ఎలా అనుకుంటున్నారా. నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వాగతం పలికారు. అయితే ఆయన మోడీకి స్వాగతం పలికే క్రమంలో ‘వెల్‌కమ్ ప్రెసిడెంట్ మోడీ' అన్నారు. వెంటనే పక్కన ఉన్న అధికారులు ఇది గమనించి తప్పును సరిచేశారు. అయితే భేటీ సందర్భంగా మళ్లీ మోడీ ప్రెసిడెంట్ అనే సంబోధించడం జరిగింది.. ‘ప్రెసిడెంట్ మోడీకి స్వచ్ఛ ఇంధనం విషయంలో ఉన్న నిబద్ధత మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది' అని ఒబామా చెప్పారు.. అయితే ఈ వీడియోను వైట్‌హౌస్ వెబ్ సైట్ లో పోస్ట్ చేయగా అప్పుడు ఆవ్యాఖ్యలు విన్న సిబ్బంది నాలుక కరుచుకొని అందులో 'ప్రెసిడెంట్' అనే పదాన్ని 'ప్రధానమంత్రి'గా మార్చారు.

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పై ఎర్రబెల్లి సెటైర్లు

రైతు ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు... ముఖ్యమంత్రి కేసీఆర్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ ను తాము చూడాలనుకుంటున్నామన్న ఎర్రబెల్లి... దేశంలోనే ఆయన ఆదర్శ రైతు అంటూ సెటైర్లేశారు, తనకు ఎకరానికి కోటి రూపాయలు ఆదాయం వస్తుందన్న కేసీఆర్... మళ్లీ ఇజ్రాయెల్ ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు, ఇజ్రాయెల్, చైనా టూర్లకు రైతులను కూడా తీసుకెళితే వ్యవసాయ మెళకువలు తెలుసుకుని మంచి రాబడి సాధిస్తారు కదా అంటూ వ్యాఖ్యానించారు. తక్కువ పొలంలో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న కేసీఆర్... తన ఫాంహౌస్ ను రైతులకు, ఎమ్మెల్యేలకూ చూపిస్తే, ఆయన పాటించే వ్యవసాయ పద్ధతులను తామూ నేర్చుకుంటామంటూ చమత్కరించారు

కేసీఆర్ కాదు... వరుణుడే ఆత్మహత్యలకు కారణం

తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రకటన చేసిన వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి... బాధిత కుటుంబాలన్నింటికీ పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన సూసైడ్స్ కు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని, బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని పోచారం ప్రకటించారు, రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వం కారణం కాదన్న ఆయన... వరుణదేవుడిపై నెపం నెట్టేశారు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాలేదని, మరోవైపు వర్షాభావ పరిస్థితులు, రుణభారం కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. రుణమాఫీ కింద ఇప్పటివరకు 8వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చామన్న పోచారం... మొత్తం రుణమాఫీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

కేసీఆర్ లాగా అందరూ టోపీ పెట్టుకోవాలన్న ఓవైసీ

రైతు ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్ లో ఎప్పుడూ టోపీ పెట్టుకుని అందంగా కనిపిస్తారని, అలాగే తెలంగాణలోని ప్రతి రైతు.. కేసీఆర్ మాదిరిగా టోపీ పెట్టుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫాంహౌస్ పచ్చగా ఉన్నట్లే ప్రతి రైతు పొలం పచ్చగా ఉండాలని ఓవైసీ ఆకాంక్షించారు. రైతుల ఆత్మహత్యలకు అందరూ బాధ్యత వహించాలన్న అక్బరుద్దీన్...మంత్రుల నియోజకవర్గాల్లోనే సూసైడ్స్ ఎక్కువగా ఉన్నాయంటూ రికార్డులతో సహా వివరించారు. అన్నదాతల ఆత్మహత్యలకు వరుణదేవుడే కారణమని వ్యవసాయ మంత్రి పోచారం తప్పించుకోవాలని చూస్తున్నారని, కనీసం ఇప్పటికైనా సూసైడ్స్ కు మూలకారణాలేంటో విశ్లేషించి... నివారణా చర్యలు చేపట్టాలని కోరారు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు హైకోర్టు నోటీసులు

ఏపీ, తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై హైకోర్టు సీరియస్ అయ్యింది, బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకోకుండా ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో అన్నదాల ఆత్మహత్యలపై జన చైతన్య వేదిక వేసిన పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. బాధిత రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వడమే పరిష్కారం కాదన్న హైకోర్టు.... సరైన పరిష్కారం కోసం ఎందుకు అన్వేషించడం లేదని ఇరు ప్రభుత్వాలను ప్రశ్నించింది. చనిపోయాక పరిహారం ఇస్తే ఏం లాభం, బతికున్నప్పుడే రైతును కాపాడుకోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కి వాయిదా వేసిన ధర్మాసనం... రైతుల ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలు ఇవ్వాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. రైతు ఆత్మహత్యలపై ఇరు రాష్ట్రల్లో రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు కీలకంగా మారాయి

ఏపీకి కళా వెంకట్రావు, తెలంగాణకి మళ్లీ ఎల్.రమణే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీల నియామకానికి కసరత్తు పూర్తయింది, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే స్వయంగా రేపు కొత్త కమిటీలను ప్రకటించనున్నారు. ఏపీ, తెలంగాణ కమిటీలతోపాటు కేంద్ర కమిటీని కూడా బాబు అనౌన్స్ చేయనున్నారు, టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉండనుండగా, ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డి, నామా నాగేశ్వర్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శులుగా బోండా ఉమ, జయనాగేశ్వర్ రెడ్డి, వర్ల రామయ్యలను నియమిస్తారని తెలుస్తోంది, తీవ్ర పోటీ నెలకొనడంతో ఐవీఆర్ఎస్ విధానాన్ని అమలుచేసినా మళ్లీ ఎల్.రమణకే తెలంగాణ పగ్గాలు దక్కనున్నాయి , వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని ప్రధాన కార్యదర్శులుగా కేపీ వివేకానంద, సండ్ర వెంకటవీరయ్య, మల్లయ్యయాదవ్,  సీతక్కలను నియమిస్తారని తెలుస్తోంది. అధికార ప్రతినిధులుగా నన్నూరి నర్సిరెడ్డి, కర్నాటి విద్యాసాగర్, ప్రతాప్ రెడ్డి పేర్లు వినిపిస్తుండగా, ఢిల్లీలో జాతీయ అధికార ప్రతినిధులుగా గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, సీఎం రమేష్ లను నియమిస్తారని తెలుస్తోంది,

మన్మోహన్ పై తగిన ఆధారాలు లేవు..

యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం వ్యవహారంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ కు కోర్టులో ఊరట లభించింది. ఈ కుంభకోణంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు..మధు కోడాల మీద కూడా కేసులు నమోదయ్యాయి. అయతే సీబీఐ మన్మోహన్ సింగ్ ను విచారించవలసిన నేపథ్యంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీనిపై కోడా ఈ కుంభకోణం వ్యవహారంలో మన్మోహన్ సింగ్ ను కూడా ప్రశ్నించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపగా సిబిఐ తరపు న్యాయవాది ఆర్‌ ఎస్‌ చీమా మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బొగ్గు గనుల కేటాయింపులో కుట్రకు పాల్పడినట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. మధు కోడా కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నారని ఆయన తెలిపారు. కాగా గతంలో కూడా దాసరి బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా రేవంత్.. కేసీఆర్ ఆగ్రహం

రైతు ఆత్మహత్యల అంశంపై చర్చలో అసెంబ్లీలో వేడి రాజుకుంటుంది.  చాలా వాడీవేడీగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం తెలంగాణ టీడీపీ నేత.. కొడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారారు. ఓటుకు నోటు కేసు తర్వాత కేవలం తన నియోజక వర్గానికే పరిమితమైన రేవంత్ రెడ్డి కోర్టు తనకు విధించిన షరతులను సడలింపజేయటం వల్ల కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ కు వచ్చారు. ఇప్పుడు ఆసెంబ్లీ సమావేశాలకు హాజరైన రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎప్పటిలాగానే తన దైన శైలిలో అధికార పార్టీపై.. ముఖ్యంగా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల వైఖరి పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహిస్తేచాలు.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలో ఉండదని..అదేమి శాశ్వతం కాదని హెచ్చరించారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో సాకు చెప్పి రేవంత్ రెడ్డిని సభలో మాట్లాడనివ్వకుండా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మరి ఎలాంటి వ్యూహం వేస్తుందో.. లేక అసలే ఫుల్ ఫైర్ మీద ఉన్న రేవంత్ రెడ్డి ఈసారి వారి వ్యూహాలను తిప్పికొడతారో చూడాలి. ఇదిలా ఉండగా అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ నేపథ్యంలో గందరగోళం నెలకొంది. రైతుల ఆత్మహత్యలపై చర్చించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబట్టడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలపై చర్చించాలని బీఏసీలో నిర్ణయించామని.. ఇప్పుడు ఆత్మహత్యల పైనే చర్చించాలని ఎందుకు పట్టుబడుతున్నారంటూ.. ఎప్పుడూ నెగెటివ్ ఆలోచనలేనా? అంటూ ప్రశ్నించారు.

ఇంకా ఆంధ్రోళ్లేనా.. నవ్వుకుంటారు.. ఎర్రబెల్లి

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరుగుతుంది. రైతుల ఆత్మహత్యలపై టీడీపీ నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నా ప్రభుత్వం మాత్రం ఏం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ ధనిక రాష్ట్రం అని అనిపించుకున్నా రైతలు మాత్రం ఇంకా పేదవారిగానే ఉన్నారని అన్నారు. ఎప్పుడు చూడు ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అంటూ తిట్టడం.. గత ప్రభుత్వాల తీరును విమర్సించడం.. ముందు తిట్టడం ఆపి అసలు ఇప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పండి అంటూ ప్రశ్నించారు. ఇంకా వాళ్లనే తిట్టుకుంటూ పబ్బం గడుపుతుంటే ప్రజలు నవ్వుకుంటారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య ప్రభుత్వం ఎందుకు తగ్గిస్తుందని నిలదీశారు. పౌల్ట్రీ రైతుల కంటే మామూలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కేంద్రానికి సర్కారు నివేదిక ఎందుకు పంపించడం లేదో చెప్పాలన్నారు.

టీ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ..కేసీఆర్ ప్లాన్ సూపర్..

  తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల సెప్టెంబర్ 23న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తరువాత వాయిదాల అనంతరం మళ్లీ ఈరోజు నుండి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు మాత్రం అసెంబ్లీలో చాలా వేడి వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చోటుచేసుకున్న రైతుల ఆత్మహత్యల గురించి చర్చించనున్నారు. ఏ అంశం మీదైతే ప్రతిపక్షాలు అధికార పార్టీమీద విమర్శల వర్షం కురిపిస్తున్నారో.. ఏ అంశం మీదైతే అసెంబ్లీలో చర్చించి అధికార ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ప్లాన్ చేశాయో ఇప్పుడు ఈ రోజు అదే అంశం మీద చర్చించనున్నారు. అశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతిపక్షనేతలు ప్రశ్నించాలని అంశాల జాబితాలో తయారుచేసుకున్న నేపథ్యంలో మొదటిది రైతు ఆత్మహత్యల అంశం. దీని మీద టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెడదామనుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఆ ఛాన్స్ వారికి ఇవ్వలేదు. తానే ముందుగా ఈరోజు రైతుల అత్మహత్యలపై  ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు చర్చ జరిగే సమయంలో ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండటానికి ఈరోజు సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను సైతం రద్దు చేశారు. మొత్తానికి కేసీఆర్ ప్రతిపక్షనేతల ప్లానింగ్ ముందుగానే గమనించి తానే రివర్స్ ప్లాన్ చేసినట్టున్నారు.

ప్రధాని తల్లి పాచిపని చేయలేదట

ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ ఏనాడూ పాచిపని చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు, తమను పెంచడానికి తల్లి హీరాబెన్ చాలా కష్టపడిందని మోడీ చేసిన వ్యాఖ్యలపై తాము ఎంక్వైరీ జరిపామని, అయితే హీరాబెన్ ఎప్పుడూ పాచిపని చేయలేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇరుగుపొరుగు ఇళ్లలో పని చేసేవారని, గిన్నెలు తోమేవారని, నీళ్లు పట్టేవారని, పాచిపని చేసిందంటూ అబద్దమాడి తన తల్లిని మోడీ అవమానించారని ఆనంద్ శర్మ ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ మండిపడుతోంది, మోడీ తల్లి విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటూ మండిపడుతోంది.

కేసీఆర్, కడియంను ఉరికిచ్చి తంతారు

ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియంపై తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు, కేసీఆర్, కడియంను ప్రజలు ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు, తనను అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కుట్ర పన్నారన్న ఎర్రబెల్లి... అక్రమ కేసులతో జైల్లో ఉంచాలని చూశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంతటి దౌర్జన్యం జరగలేదని, నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ కి రోజులు దగ్గర పడ్డాయన్నారు. శృతి, సాగర్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌కు కడియం శ్రీహరే బాధ్యత వహించాలన్న దయాకర్ రావు.... దమ్ముంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు

బాబోయ్.. మెగా హీరోయిన్ కు అప్పుడే రెండో సినిమానా?

ఈటీవీ ఢీ జూనియర్స్ డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా నాగబాబు కుమార్తె నిహారిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తూ అందరినీ బాగానే ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు నిహారిక సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.. దీనిపై ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. మెగ ఫ్యామిలీ నుండి ఇప్పటివరకూ హీరోలు మాత్రమే ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మెగా హిరోయిన్ గా నిహారికా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే నిహారిక లవర్ బాయ్ నాగశౌర్యకు జోడిగా నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లనేలేదు అప్పుడే నిహారిక ఖాతాలోకి మరో సినిమా చేరిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మిణుగురులు సినిమా ద్వారా అవార్డ్ పొందిన అయోధ్య కుమార్ తాను తీయబోయే సినిమాలో నిహారిక ఎంపికైనట్టు తెలుస్తోంది. మొత్తానికి నిహారిక వరుస ఆఫర్లతో ఫుల్ జోష్ మీద  ఉన్నట్టు తెలుస్తోంది. మరి మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న పాప ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.

ఏపీ సర్కారును పొగిడిన సత్య నాదెళ్ల

  మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల్ ఏపీ సర్కార్ పై.. ఏపీ సర్కార్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి గొప్పగా ప్రశంసించారు. మోడీ అమెరికా పర్యటనలో భాగంగా సత్య నాదెళ్ల మోడీతో భేటీ అయ్యారు. ఈసందర్బంగా వారు అనేక విషయాలపై చర్చించారు. ఈ భేటీలో సత్య నాదెళ్ల ఏపీ సర్కార్ తీరుపై ప్రశంసలు కురిపించారు. భేటీ సందర్బంగా ఆయన శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాల గురించి ప్రస్తావించి అందరిని ఆశ్చర్యపరిచారు. శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు పాఠశాల విద్యార్ధులు చాలా కష్టాలు పడేవారని.. ట్రానిస్టర్ల సాయంతో అతికష్టం మీద పాఠాలు వినేవారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ఆరోజులు పోయాయి.. ఇప్పుడు అదే శ్రీకాకుళంలో పాఠశాల విద్యార్ధులు స్కైప్ ద్వారా పాఠాలు వింటున్నారని అంతర్జాతీయ వేదికపై వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఏపీ సర్కార్ టెక్నాలజీని బాగా వాడుకుంటుంది అని ప్రశంసించారు. ఏదైనా ఒక అంతర్జాతీయ వేదికపై ఏపీ సర్కార్ ప్రశంసలు అందుకోవడం ఆనందించాల్సిన విషయమే.

ఆప్ ఎమ్మెల్యేపై సుప్రీం సీరియస్.. సాయంత్రంలోపు లొంగిపోవాలి

ఆప్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  సోమ్‌నాథ్ భారతిపై ఆయన భార్య గృహహింస హత్యాయత్నం కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సోమ్‌నాథ్ భారతికి హెచ్చరిక చేసింది. సాయంత్రం 6 గంటల లోపు లొంగిపోవాలని ఆదేశించింది. ఈకేసుపై ఇప్పటికే సోమ్‌నాథ్ భారతి కింద కోర్టు.. హైకోర్టులను ఆశ్రయించారు.. అయితే అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ సాయంత్రం 6 గంటల లోపు లొంగిపోవాలని ఆదేశించింది. న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

మోడీ ముందు నవాజ్ తీసికట్టేనా?

  మోడీ రాజకీయ చతురత ముందు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏ మాత్రం సరిపోడని ఇంతకు ముందు రష్యా పర్యటనలోనే తేలిపోయింది. పాకిస్తాన్ దేశంతో ఎప్పుడు చర్చలు ప్రారంభించాలో ఎప్పుడు నిలిపివేయాలో అన్నీ మోడీ అనుకొన్నట్లే జరిపించుకొన్నారు. మోడీ రష్యా పర్యటన సందర్భంగా స్వయంగా చొరవ తీసుకొని నవాజ్ షరీఫ్ తో సమావేశమవడమే అందుకు ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అదే నవాజ్ నవాజ్ షరీఫ్ మోడీతో సమావేశం కావాలని కోరుకొన్నా వీలుపడలేదు.   రష్యాలో వారి సమావేశం ముగిసిన తరువాత ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు ఒక ఉమ్మడి ప్రకటన చేసారు. అది కూడా అంతా మోడీ వ్రాసిచ్చిన స్క్ర్పిట్ ని పాకిస్తాన్ చదివినట్లే ఉంది తప్ప దానిలో పాక్ ప్రభావం ఎక్కడా కనబడలేదు. దానిలో ఇరుదేశాలు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. వివిధ స్థాయిల్లో ఇరు దేశాల అధికారుల మధ్య డిల్లీలో సమావేశాలు నిర్వహించేందుకు అంగీకరించాయి. భారత్ పై దాడులు చేసి పాక్ లో తలదాచుకొంటున్న ఉగ్రవాదుల అప్పగింతపై పాక్ చేత మాట్లాడించగలిగారు. అలాగని పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ కి అప్పగిస్తుందని కాదు. కానీభారత్ పై దాడులు చేసిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం, రక్షణ, ప్రోత్శాహం అందిస్తోందని పాక్ చేతే దృవీకరింపజేసినట్లయింది. ప్రతీ వేదికపై కాశ్మీర్ అంశం ప్రస్తావించే పాకిస్తాన్, ఇరుదేశాల విదేశీ కార్యదర్శులు చేసిన ఆ సంయుక్త ప్రకటనలో ఆ విషయం ప్రస్తావించడం మరిచిపోయింది. దానితో నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ తిరిగి వెళ్ళిన తరువాత అక్కడ మీడియా చేత చివాట్లు చీత్కారాలు ఎదుర్కోక తప్పలేదు.   అందుకే ఆ తరువాత ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి కుంటిసాకులతో హాజరు కాకుండా తప్పించుకొంది. కానీ దాని వలన ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్నే అనుమానంగా చూసాయి. మళ్ళీ ఇప్పుడు అమెరికాలో కూడా అదే పరిస్థితి ఎదురయింది. మోడీ తన దేశానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంటే నవాజ్ షరీఫ్ మాత్రం ఇంకా కాశ్మీర్ సమస్యనే పట్టుకొని వ్రేలాడుతున్నారు. మోడీ ముందు నవాజ్ షరీఫ్ తీసికట్టేనని పాకిస్తాన్ మీడియా చెప్పడమే అందుకు ఉదాహరణ.

మోడీ పై పాక్ ప్రశంసలు.. మోడీని చూసి నేర్చుకో షరీఫ్

పాకిస్తాన్ మీడియా మన ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసల జల్లు కురిపించింది. అంతేకాదు మోడీ చూసి పాక్ ప్రధాని షరీఫ్ నేర్చుకోవాలని కూడా సూచించింది. ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పాక్ మీడియా సంస్థలు మోడీ అమెరికా పర్యటనను బాగానే కవర్ చేసింది. ఈ సందర్భంగా వారు ప్రధాని ఘనతను కొనియాడారు. అమెరికాలో మోడీకి సినిమా స్టార్ లా స్వాగతం లభించిందని.. ఆయన ప్రత్యర్ధులను తలదన్నేలా ఉంటున్నారని పాక్ మీడియా తెలిపింది. అంతేకాదు మోడీ, షరీఫ్  ఐకాససెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లగా తమ ప్రధానిని ఉద్దేశించి.. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కు ఐక్యరాజ్య సమితిలో మాత్రమే మాట్లాడే అవకాశం లభించింది కానీ మోడీకి మాత్రం ఫేస్ బుక్, గూగుల్ సంస్థల నుండి కూడా స్వాగతం లభించిందని తెలిపారు. ఇది కేవలం పాక్ వ్యతిరేక తీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. మోడీ విదేశాలతో సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే షరీఫ్ అక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అంతేకాదు మోడీ చూసి నేర్చుకోవాలని ఆయన మార్గంలో నడవాలని కూడా సూచించింది. ఏదిఏమైనా ప్రత్యర్ధి దేశమైన పాకిస్తాన్ కూడా మోడీ ఘనతను మెచ్చుకోవడం అభినందించాల్సిన విషయమే.