అంగరంగ వైభవంగా 'అఖిల్' ఆడియో

కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానుల మధ్య అక్కినేని అఖిల్ లాంఛింగ్ ఫిల్మ్ 'అఖిల్' ఆడియో విడుదలైంది. గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పాటల వేడుకలో అక్కినేని నాగార్జున దంపతులతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు, ఇక అఖిల్ ను ఆశీర్వదించడానికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు... ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాగార్జునతో కలిసి ట్రైలర్ ను రిలీజ్ చేసిన మహేష్....అఖిల్ రూపంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద హీరోను అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక నాగార్జున మాట్లాడుతూ...కృష్ణ గారితో వారసుడు సినిమాలో నటిస్తే, ఆయన వారసుడు వచ్చి, నా వారసుడ్ని ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. అనూప్‌ రూబెన్స్, తమన్ సంయుక్తంగా సంగీతమందించిన ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మిస్తుండగా, ప్రముఖ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

హైదరాబాద్ లో మరో రైతు ఆత్మహత్య

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి, రోజుకు సగటున ఐదారుమంది రైతులు బలన్మరణాలకు పాల్పడుతున్నారు, సాగు కష్టాలు తట్టుకోలేక మొన్నామధ్య హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పై ఓ రైతు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంటే, మరో రైతు సీఎం క్యాంప్ కార్యాలయం సమీపంలోనే ఉరితాడు బిగించుకుని తనువు చాలించాడు.ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించిన ఈ దృశ్యం... బేగంపేటలో కనిపించింది. వ్యవసాయంతో అప్పులుపాలై మెదక్ జిల్లా రాంసాగర్ గ్రామం నుంచి ఉపాధి కోసం భాగ్యనగరానికి వచ్చిన జగ్గోళ్ల మల్లేశాన్ని(58)... వడ్డీ వ్యాపారులు ఫోన్లు చేసి వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే తన తండ్రి ఆత్మహత్యకు వ్యవసాయానికి చేసిన అప్పులే కారణమని, ఐదేళ్లుగా పంటలు సరిగా పండటం లేదని, అదే సమయంలో చెల్లెళ్లకు పెళ్లి చేయటంతో అప్పుల భారం మరింత పెరిగిందని, వాటిని ఎలా తీర్చాలో తెలియక మనోవ్యథకు గురవుతున్నాడని, ఈ నేఫథ్యంలోనే బలన్మరణానికి పాల్పడి ఉంటాడని కొడుకు మల్లేశ్ తెలిపాడు

పవన్ కల్యాణ్ దీక్షకు ఏర్పాట్లు

తెలుగు భాష పరిరక్షణ కోసం జనసేన అధినేత, పవర్ స్టార్  పవన్ కల్యాణ్ దీక్షకు సిద్ధమవుతున్నారు. తమిళనాడులో నిర్బంధ తమిళ భాషా చట్టాన్ని అమలు చేస్తూ, జయలలిత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్ దీక్షకు దిగుతున్నారు. ఈ నెలాఖరున పవన్ దీక్ష చేయనుండటంతో పవన్ అభిమానులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్బంధ తమిళం పేరుతో తెలుగు భాషను నిషేధించడానికి కుట్ర జరుగుతోందని, తమిళనాడులో తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని భాషాభిమానులు పిలుపునిస్తున్నారు. తమిళనాడులో 40శాతం మంది తెలుగువారుంటే, 4శాతమే ఉన్నారంటూ జీవో 136లో పేర్కొనడం అన్యాయమన్నారు.

కొత్త ట్రెండ్! జగన్ దీక్ష స్థలంలో భూమి పూజ

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చేసిన దీక్షలు, ధర్నాలకు ప్రజల నుండి మిశ్రమ స్పందన వచ్చేది. పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు, ప్రచారం, జనసమీకరణ చేయకపోయుంటే ఆ మాత్రం స్పందన కూడా వచ్చేది కాదేమో? రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 26నుండి గుంటూరు ఏసి కాలేజీ ఎదురుగా ఉన్న మైదానంలో జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. కనుక వైకాపా నేతలు ఆయన దీక్షను విజయవంత చెయ్యాలనే పట్టుదలతో ఉన్నారు. దాని కోసం వారు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే జగన్ దీక్షకు కూర్చోబోయే వేదిక వద్ద ఆ పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు భూమి పూజ కూడా నిర్వహించడం. నిరాహార దీక్షలకి భూమి పూజలు చేయడమనే సరి కొత్త ట్రెండ్ ని వైకాపా ప్రవేశపెట్టింది.   జగన్ చేయబోయేది ఆమరణ నిరాహార దీక్ష అని వారు ప్రచారం చేసుకొంటున్నప్పటికీ గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అది ఎన్ని రోజులో ఏవిధంగా ముగుస్తుందో తేలికగానే ఊహించవచ్చును. ఆ మాత్రం దానికి భూమి పూజ వగైరా హడావుడి ఎందుకంటే బహుశః తమ కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించడానికేనని భావించాల్సి ఉంటుంది. తీరా ఇంత హడావుడి చేసిన తరువాత దానికి ప్రజల నుండి సరయిన స్పందన రాకపోయినట్లయితే అభాసుపాలుకాక తప్పదు. ఆ మధ్య జగన్ డిల్లీలో నిర్వహించిన ఐదు గంటల దీక్షని స్పాన్సర్ చేసిన బొత్స సత్యనారాయణే ఈ కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేస్తున్నట్లు సమాచారం.

బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా కన్నుమూత

బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) కన్నుమూశారు. కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ, ఈనెల 17న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజులుగా కోల్‌కతాలోని కేఎం బిర్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. భారత్‌లో క్రికెట్ అభివృద్ధికి విశేష కృషి చేయడమే కాకుండా, బీసీసీఐని ఆర్థికంగా బలోపేతం చేయడంలో దాల్మియా విశేష కృషిచేశారు. ఇండియన్ క్రికెట్ పండితుడిగా పేరుగాంచిన దాల్మియా, మొదట బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1979లో బీసీసీఐలో సభ్యునిగా చేరి, 1983లో బీసీసీఐ కోశాధికారిగా, 2001 నుంచి 2004 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 2013లోనూ కొంతకాలం బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన దాల్మియా.... 1997 నుంచి 2000 వరకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు

ఖాకీ కండకావరం, ఎస్సై సస్పెన్షన్

సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే గూండాలు చెలరేగిపోతారని పేరు. అత్యాచారాలు, హత్యలు అధికంగా జరిగే యూపీలో పోలీసులు కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారనే పేరుంది. దాన్ని మరోసారి రుజువు చేస్తూ లక్నోలోని హజ్రత్ గంజ్ లో ఓ ఎస్సై రాక్షసత్వాన్ని చూపించాడు. ఫుట్ పాత్ పై టైప్ రైటర్ పనిచేసుకుని పొట్ట పోసుకునే అరవై ఏళ్ల వృద్ధుడిపై ఎస్సై ప్రదీప్ కుమార్ తన ప్రతాపాన్ని చూపించాడు. ఫుట్ పాత్ ను ఖాళీ చేయాలని చెప్పినా వినలేదని, టైప్ రైటర్ ను ఫుట్ బాల్ లా తన్ని పగలగొట్టి నానా బీభత్సం చేశాడు. తన జీవనాధారమైన టైప్ రైటర్ ను ధ్వంసం చేయొద్దని చేతులెత్తి దండం పెట్టి వేడుకున్నా, ఆ ఖాకీ మనసు కరగలేదు, 30ఏళ్లుగా తాను ఈ పనే చేసుకుంటున్నానని, రోజంతా కష్టపడితే 50 రూపాయలే వస్తాయని చెప్పినా వినిపించుకోని ఆ ఎస్సై దౌర్జన్యానికి దిగాడు, అయితే ఎస్సై దుర్మార్గాన్ని ఫొటోలు తీసి స్థానికులు సోషల్ మీడియాలో పెట్టడంతో, విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అఖిలేష్... ఎస్సై ప్రదీప్ కుమార్ ను సస్పెండ్ చేసి, బాధితుడు కిషన్ కుమార్ కు కొత్త టైప్ రైటర్ అందేలా చేశారు. సీఎం ఆదేశాలకు కిషన్ కుమార్ ఇంటికెళ్లిన జిల్లా కలెక్టర్, డీఎస్పీలు... ముసలాయనకు క్షమాపణ చెప్పి, కొత్త టైప్ రైటర్ ను అందించారు.

రాహుల్... నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయించు!

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ సవాల్ విసిరింది. కాంగ్రెస్ పార్టీ తనకు లీగల్ నోటీసులు పంపడంపై ఆగ్రహించిన స్మృతీ... దమ్ముంటే తనను అరెస్ట్ చేయించాలంటూ రాహుల్ ను ఛాలెంజ్ చేశాను. ఫ్యాక్టరీ పెడతామంటూ తీసుకున్న భూమిలో పరిశ్రమ ఏర్పాటు చేయకపోగా, ఆ ల్యాండ్ ను ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలని ప్రజల తరపున మాట్లాడితే లీగల్ నోటీసులు పంపుతారా అంటూ ఆమె మండిపడ్డారు. లీగల్ నోటీసుల పేరుతో తన నోరు మూయించలేరన్న స్మృతీ... రాజీవ్ ట్రస్ట్ ఆధీనంలో ఉన్న భూమిని తిరిగిచ్చేయాలని సూచించారు, లేదంటే అక్కడ పరిశ్రమ అయినా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సైకిల్ ఫ్యాక్టరీ పెడతామంటూ తీసుకున్న భూమిని, ఓ కంపెనీ రాజీవ్ ట్రస్ట్ కి అమ్మడంతో వివాదం నెలకొంది, లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే ఆ కంపెనీకి భూమి కేటాయించి, దాన్ని రాజీవ్ ట్రస్ట్ కొనుగోలు చేసిందని స్మృతీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ.... కేంద్ర మంత్రికి లీగల్ నోటీసులు పంపింది

10 కోట్లిచ్చినా అది మాత్రం చేయను

క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే సూత్రాన్ని హీరోయిన్లు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు, అందుకే తమ డిమాండ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలని అనుకోవడం సహజం. సేమ్ టు సేమ్...మార్కెట్ లో ఎవరికైతే క్రేజ్ ఉంటుందో, వాళ్ల వెనుకే పడుతుంటాయి కంపెనీలు, తమ ఉత్పత్తులకు సెలబ్రిటీలు ప్రచారం చేస్తే త్వరగా జనాల్లోకి వెళ్తాయని, తద్వారా విజయం సాధించొచ్చని భావిస్తుంటాయ్. అలా ఎంతోమంది హీరో హీరోయిన్లు... ఆయా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లగా మారిపోయారు, అయితే హీరోయిన్ తమన్నా మాత్రం తనకు ఎంత డబ్బిచ్చినా అలాంటి యాడ్స్ లో మాత్రం నటించనంటోంది. ఇంతకీ అదేనుకుంటున్నారా? ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ అంటా?, సమాజం పట్ల తనకు బాధ్యత ఉందంటున్న తమన్నా, శరీర రంగుకి సంబంధించిన ప్రకటనల్లో మాత్రం నటించనని తేల్చిచెప్పేసింది, రంగు అనేది మన చేతుల్లో ఉండదు, కానీ ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది, అందుకే తెల్లగా ఉండాలనుకోవడం కంటే, మనసు స్వచ్ఛమైన తెలుపులా ఉండాలంటోంది ఈ మిల్కీ బ్యూటీ

మళ్లీ సింగపూర్ వెళ్లిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సింగపూర్‌ వెళ్లారు. అక్టోబర్ 22న విజయదశమినాడు జరగనున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు సింగపూర్‌ ప్రధాని లీ శాన్‌ లూంగ్‌ను స్వయంగా ఆహ్వానించనున్న చంద్రబాబు, ఏపీ రాజధానికి సంబంధించి స్విస్‌ ఛాలెంజ్‌ విధానం, భవనాల ఆర్కిటెక్చర్‌ పైనా చర్చించనున్నారు. ఇవేకాకుండా రాజధాని నిర్మాణం, మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులుచేర్పులపైనా మాట్లాడనున్నారు. బాబుతోపాటు సింగపూర్ వెళ్లినవారిలో మంత్రులు యనమల, నారాయణ, మీడియా సలహాదారు పరకాల, పలువురు నియర్‌ ఐఏఎస్‌ లు ఉన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా రేపు సింగపూర్‌ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌తో సమావేశంకానున్న బాబు, ఆ తర్వాత సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కీలకోపన్యాసం చేయనున్నారు. మంగళవారం సింగపూర్‌ సిటీ గ్యాలరీని, మూడు టౌన్‌ షిప్‌లను బాబు బృందం సందర్శించనుంది.

కారెక్కడానికి 'దానం దారి' క్లియరైనట్లేనా!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ ...టీఆర్ఎస్ లో చేరతారంటూ మళ్లీ వార్తలు వస్తున్నాయి. ఈనెల 23న గులాబీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఖరారైందని, మంత్రి తలసాని మధ్యవర్తిత్వంలో కారు ఎక్కడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చినా దానం ఖండించడంతో ఊహాగానాలకు తెరపడింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ వార్తలు రావడంతో ఈసారి ఖాయంగా కారెక్కడం ఖాయమని చెప్పుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దానంకు అధికార పార్టీ వలేసిందని, ఆయన దాదాపు టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైందని గులాబీ నేతలు చెబుతున్నారట, అయితే ఎప్పటిలాగే అలాంటిదేమీ లేదని దానం నాగేందర్ ఖండించినా, ఈరోజు తిట్టి, రేపు పార్టీ మారిపోతున్న ఈరోజుల్లో ఏదైనా సాధ్యమేనంటున్నారు జనాలు. టీఆర్ఎస్ తో ఇంకా చర్చలు జరుగుతూ ఉండొచ్చని, డీల్ ఓకే కాగానే జంపై పోతారని చెవులు కొరుక్కుంటున్నారు.

ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు మూడు కోట్లు

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియా ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఓ పత్రిక కథనం ప్రకారం ఏపీలో నలుగురు మంత్రులు, 38మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఇసుక మాఫియాలో భాగస్వామ్యులుగా ఉన్నారని, కిందిస్థాయి నేతలైతే వేలల్లో ఉంటారని తెలిపింది. ఉభయగోదావరి జిల్లాల్లో అయితే టీడీపీ, వైసీపీ నేతలు కలిసి ఇసుక వ్యాపారం చేస్తున్నారని రాసుకొచ్చింది. ఒక్కో ఎమ్మెల్యే నెలకు మూడు కోట్లు సంపాదిస్తున్నారని, ఏడాదికి సగటున 30కోట్లు వెనకేస్తున్నారని లెక్కగట్టారు. ఇప్పటివరకూ 2వేలకోట్ల రూపాయలకు పైగా దోచేశారని, ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేసింది.  ఇసుక వ్యాపారంతో షార్ట్ టైమ్ లో కోట్లు సంపాదిస్తున్నారని, అందుకే అడ్డొచ్చిన అధికారులపైనా దాడులకు తెగబడుతున్నారని ఆ పత్రిక పేర్కొంది. ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడి కూడా అలాంటిదేనని రాసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇసుక మాఫియాను అరికట్టలేకపోతున్నామని వ్యాఖ్యానించారంటే సాండ్ బిజినెస్ ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు, 2019 ఎన్నికల్లో ఇసుక డబ్బే గెలుపోటములను నిర్దేశించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.,

శ్రీకాకుళం జిల్లాలో విషాదం

శ్రీకాకుళం జిల్లా భావనపాడు బీచ్ లో విషాదం చోటు చేసుకుంది, విహార యాత్రకు వెళ్లిన ముగ్గురు ఇంజనీరింగ్  విద్యార్ధులు... సముద్రంలో గల్లంతయ్యారు. భావనపాడు బీచ్ లో సముద్ర స్నానం చేస్తుండగా అలల తాకిడి అధికమై కొట్టుకుపోయారు. గల్లంతైన విద్యార్ధులను ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందినవారిగా గుర్తించారు. అయితే విద్యార్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని, మూడు నిండు ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయని అక్కడున్నవారంటున్నారు. బీచ్ ల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టి, బారికేడ్లు ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటనలను అరికట్టవచ్చని ప్రజలు సూచిస్తున్నారు

రాజస్థాన్ సీఎం రాజేకి పదవీ గండం

లలిత్ మోడీ వివాదంలో ఇరుక్కుని ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుని మోడీ అండతో గట్టెక్కిన రాజస్థాన్ సీఎం వసుంధరరాజే మళ్లీ చిక్కుల్లో పడింది. మొన్న లలిత్ గేట్ బయటపడితే, ఇప్పుడు తాజాగా గనుల కుంభకోణం వెలుగుచూసింది, ప్రధాని కార్యాలయమే స్వయంగా కోవర్టు ఆపరేషన్ చేసి ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రాజస్థాన్ సీఎం వసుంధరకు కూడా మోడీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ సింఘ్వీని పీఎంవో ఆదేశాల మేరకే అరెస్ట్ చేశారట. అంతేకాదు అరెస్ట్ కు సంబంధించి ముఖ్యమంత్రికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని, పైగా ఈ స్కాంలో వసుంధరరాజేతోపాటు ఆ రాష్ట్ర హోంమంత్రి కటారియా పాత్ర కూడా ఉందని పీఎంవో గుర్తించిందట . మరుగున పడిపోవాల్సిన ఈ కేసును ప్రధాని చొరవతోనే బయటికి వచ్చిందని, వసుంధరరాజేని ఎలాగైనా తప్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చారని ప్రముఖ ఆంగ్ల పత్రిక సంచలన కథనం ఇచ్చింది. అందుకే అరెస్ట్ చేసేవరకూ ఏం జరుగుతుందో కూడా సీఎం రాజేకి తెలియలేదని, చివరికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ కి కూడా సమాచారం లేదని రాసుకొచ్చింది. ఒకవేళ ఆ పత్రిక కథనమే నిజమైతే, వసుంధరరాజే ప్లేస్ లో మరొకరు రావడం ఖాయం

నాపేరు వెనుక తోక లేదనేగా..

  కొత్తగా ఉన్న తలనొప్పులు సరిపోవన్నట్టు ఇప్పుడు మరో సమస్య వచ్చిపడింది టీఆర్ఎస్ పార్టీకి. ఇప్పటికే అనేక విషయాల్లో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై విమర్శల బాణాలు వేస్తునే ఉన్నారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ మనిషే టీఆర్ఎస్ వైఖరిపై మండిపడుతున్నారు. అతనెవరో కాదు టీఆర్ఎస్ తరుపున పెద్దపల్లి నియోజక వర్గం నుండి పోటీ చేసి సీనియర్ నేత వివేక్ ను ఓడించిన ఎంపీ బాల్క సుమన్. ఈయనే స్వయంగా స్వయంగా పార్టీ తీరుపై ఆరోపిస్తున్నారు. తన పేరు వెనుక రెడ్డి, రావు అనే తోకలు లేవని తనను లెక్కచేయడంలేదని.. తనని చులకనగా చూస్తున్నారని.. కనీసం ఓ ఎంపీననే విషయం కూడా మరిచిపోయి పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవకుండానే నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇదే వైఖరి కొనసాగిస్తే పార్లమెంట్ కార్యదర్శికి ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా బాల్కా సుమన్ తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తిలో ఒకరు. అయితే అప్పట్లో మీడియాలో ఎక్కువగా కనిపించిన బాల్క ఆతరువాత మీడియాలో పెద్దగా కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ నేతల వైఖరి ద్వారా మీడియా ముందుకువచ్చారు.

రాహుల్ సభలో గన్ కలకలం

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ...బీహార్ ఎన్నికల ప్రచారంలో ఓ యువకుడు ఎయిర్ గన్ తో తిరుగుతూ తీవ్ర కలకలం రేపాడు. చంపారన్ రామ్ నగర్ లో రాహుల్ ర్యాలీ నిర్వహిస్తుండగా అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఎయిర్ గన్ పట్టుకుని ఉండటాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు, అయితే నిందితుడు తయ్యబ్ జాన్ మానసిక స్థితి సరిగా లేదని, విచారణలో వివరాలు చెప్పలేకపోతున్నాడని ఎస్పీ ఆనంద్ కుమార్ సింగ్ తెలిపారు. తయ్యబ్ నుంచి ఓ బ్యాగును కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపిన పోలీసులు, అతను ఉద్దేశపూర్వకంగానే ఎయిర్ గన్ తో రాహుల్ సభకు వచ్చాడా లేదా అనేది తేలాల్సి ఉందంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్ షాక్

ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు రంగంసిద్ధమవుతోంది. 7200కోట్ల రూపాయల మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు అనుమతి కావాలంటూ డిస్కంలు(విద్యుత్ పంపిణీ స్థలు)...ఈఆర్సీ(విద్యుత్ నియంత్రణ మండలి)ని కోరాయి. ఉత్పత్తి-పంపిణీ వ్యయాలు భారీగా పెరిగి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున పెంపు అనివార్యమని డిస్కంలు చెబుతున్నాయి, అయితే విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనపై ఈఆర్సీ అక్టోబర్ లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. అయితే ఇంత పెద్దమొత్తంలో ప్రజలపై భారం వేస్తే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముందని భావిస్తున్న ప్రభుత్వం...కొంచెం అటూఇటుగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందట, ఇప్పటికే ఒకసారి ఛార్జీలు పెంచి ఉన్నందున మరోసారి భారీగా భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ 13వ ర్యాంకు.. అందుకేనట

  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతాల్లో ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికలో  ఏపీ రాష్ట్రానికి 2 స్థానం.. తెలంగాణ రాష్ట్రానికి 13వ స్ఠానం దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ నివేదిక రాకముందునుండి పెట్టుబడులు పెట్టడానికి గాను.. పరిశ్రమల స్థాపనకు గాను అనువైన వాతావరణం కలిగి ఉన్న ప్రాంతాల్లో ఏపీ కంటే తెలంగాణ రాష్ట్రమే అనువైనదని భావించారు. కాని ప్రపంచ బ్యాంకు తెలిపిన దానిని బట్టి సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. అయితే ఇప్పుడు తెలంగాణకు 13వ ర్యాంకు రావడంపై పలు కథనాలు వెలువడుతున్నాయి. తెలంగాణ నేతలైతే ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వెంకయ్యనాయుడులు కలిసి మేనేజ్ చేసి ఈ ర్యాంకు తెప్పించారని అన్నారు. అయితే దీనికి కారణం వేరే ఉంది అంటున్నారు అధికార నేతలు. రాష్ట్ర ర్యాంకింగ్లకు సంబంధించి వరల్డ్ బ్యాంకు తోపాటు మేక్-ఇండియా, కేఎంజీ, సీఐఐ లాంటి తదితర సంస్థలు రాష్ట్ర పరిస్థితి గురించి అడుగుతూ అందరితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారంట. కానీ తెలంగాణ ప్రభుత్వం నాయకులు ఆసమయంలో మొద్దునిద్రలో ఉండి వాటికి స్పందించలేదు. దురదృష్టమేంటంటే అదే టైమ్ కి కేసీఆర్ కూడా ఇక్కడ విదేశీ పర్యటనలో ఉండి ఇక్కడ లేకుండా ఉండటం మొత్తానికి రాష్ట్రానికి అనూహ్యరీతిలో ఆ ర్యాంకు వచ్చిందని అంటున్నారు. మొత్తానికి కారణమేదైతే కాని ఈ ర్యాంకు విషయంలో మాత్రం ఏపీ ముందుండగా.. తెలంగాణ మాత్రం వెనుకంజలో ఉంది. ఇదిలా ఉండగా తెలంగాణ నేతలు చేసిన పనిని పక్కనపెట్టి.. ఏపీ ర్యాంకు విషయంలో చంద్రబాబు మేనేజ్ చేశారు అని విమర్శించడం వారికే చెల్లింది.

కేసీఆర్ ఇందులో పోటీపడు

టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ కేసీఆర్ ప్రభుత్వ విధానంపై మరోసారి మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుల రుణమాపీ చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందుందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనుకబడి ఉందని అన్నారు. ఒకపక్క ఏపీ  ప్రభుత్వం చేసిన రుణమాఫీలు రైతులకు ఊరట నిస్తుంటే మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రైతు రుణమాఫీలు లేక.. రైతులు ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి పరిస్థితి వస్తుందంటూ ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ టూర్లు అంటూ పర్యటిస్తున్నారు.. కానీ వాళ్ల గురించి ఆలోచించడంలేదని అన్నారు. కేసీఆర్ చేసిన హామీలన్నీ నెరవేర్చాలని.. రైతుల రుణమాఫీ చేయాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకు ఏపీ ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంటే.. మరి అన్నింటిలో పోటీపడే కేసీఆర్ ఈవిషయంలో మాత్రం ఎందుకు ఎక్కువ పరిహారాన్ని ఇవ్వడంలేదు.. రైతు కుటుంబాలకు పదిలక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తమ పోరాటం వల్లే చీఫ్ లిక్కర్ పై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పారు.