చిత్తూరు కోర్టులో బాంబు పేలుడు... ఉగ్రవాదుల పనేనట..!
posted on Jun 18, 2016 @ 11:26AM
చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య నేపధ్యంలో.. నిందితుడు చింటూను కోర్టులో హాజరుపరిచే సమయంలో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనకు చింటూకు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానించారు. చింటూనే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బాంబు పేలుడు ప్లాన్ వేసి ఉంటాడని అనుకున్నారు. దీనికి గాను చింటూ బాంబు పేలుడుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అతడు... రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ జేవీ రాముడు, హైకోర్టు, జిల్లా కోర్టులతో పాటు పోలీసులకు లేఖలు రాశాడు కూడా.
అయితే ఇప్పుడు దీనిపై ఓ కొత్త విషయం బయటపడింది. ఈ దాడులకు పాల్పడింది.. ఉగ్రవాద సంస్థ ఆల్- ఉమా అని తెలిసింది. ఈమేరకు ఉగ్రవాద సంస్ధ కోర్టులో బాంబు పేల్చింది తామేనంటూ చిత్తూరు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. అయితే ఈ లేఖపై పోలీసులు మొదట అనుమానం వ్యక్తం చేశారు. దాడి జరిగిన ఘటనను లేఖలోని విషయాలను పోలుస్తూ పరిశీలించారు. ఈ క్రమంలో అన్ని విషయాలను పరిశీలించిన చిత్తూరు పోలీసులు కోర్టులో జరిగిన పేలుడు చింటూ పని కాదని తేల్చుకున్నారు. ఆల్- ఉమా ఉగ్రవాదులే నాడు బాంబులు పేల్చారని నిర్ధారించారు. 2013లో పుత్తూరులోని ఓ ఇంటిలో తలదాచుకున్న ఇద్దరు ఉగ్రవాదులు పెను బీభత్సమే సృష్టించారు. ఆ తర్వాత రంగప్రవేశం చేసిన పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేయగా..ఈ కేసు విచారణ తిరుపతిలోని కోర్టులో జరుగుతోంది. తమ సహచరులు కోర్టుకు వచ్చిన సందర్భంగా బాంబులు పేల్చి వారిని విడిపించుకునేందుకు ఆల్- ఉమా ఉగ్రవాదులు పథకం పన్నారు.