మహానాడుకు లోకేష్
posted on May 26, 2023 @ 9:56AM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమహేంద్రవరం వేదికగా జరుగుతోన్న మహానాడుకు హాజరవుతున్నారు. ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రకు ఆయన గురువారం (మే25) తాత్కాలిక విరామం ఇచ్చి.. అమరావతి చేరుకున్నారు. శుక్రవారం (మే 26) నారా లోకేశ్ రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. మే 27, 28 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ఆయన మహానాడులో పాల్గొని.. మళ్లీ సోమవారం అంటే మే 29వ తేదీన తన పాదయాత్రకు ఎక్కడ తాత్కాలిక విరామం ఇచ్చారో అక్కడ నుంచి తిరిగి కొనసాగించనున్నారు.
నందమూరి తారకరత్న మరణించిన నేపథ్యంలో.. హైదరాబాద్ వచ్చి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి.. నివాళులర్పించి.. ఆ వెంటనే ఆయన మళ్లీ తన పాదయాత్రను కొనసాగించారు. ఆ సమయంలో తప్ప నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి.. ఇప్పటి వరకూ ఒక్కరోజు కూడా విరామం ఇవ్వకుండా, విశ్రాంతి తీసుకోకుండా ముందుకు సాగుతున్నారు. నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ... విజయవాడ, హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు కానీ.. అలాగే హైదరాబాద్ నడిబొడ్డు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభకు కానీ.. నారా లోకేశ్ రాలేదు.
ఇప్పుడు మహానాడుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వస్తుండడం పట్ల.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 2023, జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం వేదికగా నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన చేపట్టిన ఈ పాదయాత్ర నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర సాగనుంది. ఆ క్రమంలో ఇప్పటికే నారా లోకేశ్.. 14 వందల కిలోమీటర్ల మేర తన పాదయాత్రను పూర్తి చేసుకొని.. అనుకొన్న లక్ష్యాన్ని సాధించే దిశగా.. ఆయన వడివడిగా అడుగులు వేసుకొంటు వెళ్తున్నారు.
ఇంకోవైపు ఈ మహానాడుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, కాసాని జ్జానేశ్వర్లతోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులు సైతం భారీగా ఈ మహనాడుకు తరలిరానున్నారు. అందుకోసం అన్నిఏర్పాట్లు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు వివరించిన సంగతి తెలిసిందే.