ఇంతకీ నూతన పార్లమెంట్ భవనం పేరేంటి?
posted on May 26, 2023 @ 9:43AM
అత్యాధునిక సదుపాయాలతో, సర్వాంగ సుందరంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి అంతే సర్వాంగ సుందరంగా సిద్దమైంది. మరో రెండు రోజుల్లో, అంటే మే 28 న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తారు. సరే ఇంతకీ నూతన పార్లమెంట్ భవనం పేరేంటి అంటే తెలియదు. ఎందుకంటే ఆ భవనానికి ఇంకా నామకరణం జరగలేదు. కొత్త పార్లమెంట్ భవానానికి ఇంకా ఏ పేరునూ కేంద్రం ఖరారు చేయలేదు.
అయితే ఏ పేరు పెట్టినా అదొక వివాదంగా మారుతుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం నగరాల, పట్టణాల పేర్లకు హిందుత్వ వాసనలు అద్దుతున్న నేపద్యంలో పార్లమెంట్ పేరులోనూ అవే వాసననలు గుబాళిస్తే లౌకికవాద పార్టీలు పార్లమెంట్ ను ప్రధాని ప్రారంభించడాన్ని రచ్చచేస్తున్న రీతిలోనే మరింతగా రచ్చచేయవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కొత్తగా నిర్మించిన పార్లమెంట్లో ఎన్ని ద్వారాలున్నాయి. ఆ ద్వారాలకు ఏ పేర్లు పెట్టారని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
మరోవంక నూతన పార్లమెంట్ భవనం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త పార్లమెంట్ భవనంలో మహాత్మాగాంధీ, చాణిక్యుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తో సహా ప్రముఖుల విగ్రహాలు ఉంటాయని చెబుతున్నారు. అంతే కాకుండా కొత్త పార్లమెంట్ భవనానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయట. ఈ ప్రవేశ ద్వారాలకు చారిత్రక అంశాలను మేళవించారట. వాటికి జ్ఞాన ద్వారం..శక్తి ద్వారం.. కర్మ ద్వారాలుగా నామకరణం చేశారు.
జ్ఞాన ద్వారానికి ఒకవైపున గార్గి, యాజ్ఞవల్క్య మహర్షి మధ్య జరిగిన సంభాషణ దృశ్యం, మరోవైపు నలంద చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. శక్తి ద్వారానికి ఒక వైపున చాణిక్య, మరోవైపు మహాత్మాగాంధీ దండియాత్ర దృశ్యాలు ఉండనున్నాయి. కర్మ ద్వారానికి ఒకవైపు కోణార్క్ చక్రం, మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో రాష్ట్రపతి భవన్ కు వెళ్లి చారిత్రాత్మక రహదారి రాజ్ పథ్ ను కర్తవ్య పథ్ గా మార్చింది. ఈ క్రమంలో కొత్త పార్లమెంట్ భవనానికి కూడా కొత్త పేరు పెట్టనున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే పార్లమెంట్ హౌజ్ అని పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇంత వరకు ఏ పేరునూ ఖరారు చేయలేదు. మరోవైపు నూతన పార్లమెంట్ భవనంలో బంగారు రాజదండం సెంగోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సెంగోల్ స్పీకర్ కుర్చీ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు.