రాజమహేంద్రవరంలో మహా సందడి
posted on May 26, 2023 @ 10:05AM
రాజమహేంద్రవరం వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు రంగం సిద్దమైంది. అలాగే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఈ మహానాడు వేదికగా ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహానాడు మరింత ప్రాధాన్యత సంతరించుకొంది. ఇప్పటికే రాజమహేంద్రవరం సమీపంలో వేమగిరిలోని వంద ఎకరాల్లో నిర్వహిస్తున్న మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లును పక్కా ప్రణాళికలతో పూర్తి చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ఆ మహానాడు వేదికగా ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఈ సభ సాక్షిగా ఎండగడతామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు మహనాడుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులు సైతం భారీగా తరలి వస్తున్నారు. ఆ క్రమంలో టీడీపీ ఎన్నారై విభాగానికి చెందిన వారు సైతం వస్తున్నారు. అయితే మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో మహానాడు నేపథ్యంలో విమాన ఛార్జీల ధరలు చుక్కలనంటాయి. మామూలు రోజుల్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి టికెట్ ధర 3 వేలు.. అదీకాకుంటే 3 వేల 5 వందల వరకు ఉండేదని... కానీ మే 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విమాన టికెట్ ధర దాదాపుగా 10 వేల రూపాయిలుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బెంగళూరు నుంచి రాజమండ్రికి కూడా దాదాపుగా ఆయా తేదీల్లో ఇదే ధర లేకుంటే మరికాస్తా అధికంగా ఉన్నట్లు సమాచారం.
అలాగే రాజమండ్రితోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని కాకినాడ, అమలాపురంతోపాటు ఇటు కోవ్వూరు, నిడదవోలులో ఇప్పటికే హోటల్స్‌లో రూములు సైతం భారీగా బుక్ అయినట్లు తెలుస్తోంది. అదీకాక మహానాడు నేపథ్యంలో హోటల్స్‌లో రూముల ధరలు సైతం ఆకాశాన్ని అంటినట్లు ఓ టాక్ అయితే రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సాగుతోంది.
మహనాడుకు వేదిక అయిన రాజమహేంద్రవరం నగరం పసుపు శోభను సంతరించుకొంది. నగరం మొత్తం బంతిపూల వనంగా మారిపోయింది. నగరం ఆ మూల నుంచి ఈ మూల వరకూ.. అలాగే నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో పసుపు రంగు జెండాలతోపాటు భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ధర్శనమిస్తున్నాయి. ఇంకోవైపు చంద్రబాబు డిజిటల్ సంతకం చేసిన మహానాడు ఆహ్వాన పత్రికలు.. ఇప్పటికే దేశవిదేశాల్లోని ప్రతినిధులకు అందాయి. 2006లో రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మహనాడు జరిగితే.... ఆ తర్వాత అంటే 2023లో.. అదే రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ మహానాడు జరుపుకొంటోంది.