అడకత్తెరలో పోకచెక్కలా కేసీఆర్ పరిస్థితి!
posted on May 26, 2023 @ 9:30AM
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధంగా మొదలైన వివాదం, రాజకీయ దుమారంగా మారింది. పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి ఎలా ప్రారంభిస్తారని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించడం సముచితంగా ఉంటుందని, రాజ్యాంగాన్ని ఉటంకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ప్రాధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభించడం రాష్ట్రపతిని అవమానించడమే అని అరొపిస్తున్నాయి.
అంతే కాదు, చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే, ఆ గౌరవం ప్రధాని మోడీకి ఎట్టి పరిస్థితుల్లో దకక్కుండా అడ్డుకునేందుకు విపక్షపార్టీలన్నీ ఏకమయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 19 ప్రతిపక్ష పార్టీలు నూతన పార్లమెంట్ భవన సముదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభ వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించాయి. మరో అడుగు ముందుకేసి ప్రదాని మోడీ చేతుల మీదుగా పార్లమెంట్ భవనం ప్రారంభం కాకుండా అడ్డుకునేదుకు న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తున్నారు. సరే, చివరకు న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది ఏమిటి అనే విషయాన్ని పక్కన పెడితే, విపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మోడీ చేతుల మీదుగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం జరగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
నిజానికి, ప్రారంభ వేడుకలనే కాదు, పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గట్టిగా వ్యతిరేకిస్తోంది. పార్లమెంట్ భవన శంకు స్థాపన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అప్పటి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కొవిడ్ కారణంగా చూపించి, పార్లమెంట్ నిర్మాణ పనులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర నాయకులు అనేక సందర్భాలలో అసలే దేశం క్లిష్ట పరిస్థితిల్లో ఉందని అంటూ ఇప్పడు నూతన పార్లమెంట్ భవనం అవసరమా అని ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే, విపక్షాలు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకున్న విధంగా పార్లమెంట్ నిర్మాణ పనులను కొనసాగించింది. అనుకున్న విధంగానే నిర్మాణం పూర్తిచేసింది. ఈనెల (మే) 28 న ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ దశలో విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి గౌరవాన్ని అస్త్రంగా చేసుకుని వేడుకను వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నది.
అయితే.. పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన భవనాలను ప్రధానమంత్రి టెంకాయ కొట్టడం ఇదే తొలిసారి కాదని అధికార బీజేపీ నాయకులు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషీ ఇతర మంత్రులు గుర్తుచేస్తున్నారు. గతంలో 1975లో పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించారు. ఆతర్వాత 1980లలో అదే పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రారంభించారని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు.
అదలా ఉంటే, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా పార్లమెంట్ నితన భవనాలను ప్రధానమంత్రి ప్రారంభించడాన్ని తప్పు పడుతూ విపక్షాలు చేస్తున్న ఆందోళన, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అగ్ని పరీక్షగా మారింది. ఒక విధంగా 2024 ఎన్నికల్లో మోడీ ఓడించేందుకు ఏకమవుతున్న విపక్షాలు పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరు కావడం అంటే, అది దేశ ద్రోహం కంటే మహాపరాధం అన్నట్లుగా, మోడీ వ్యతిరేకతకు లిట్మస్ టెస్ట్’గా భావిస్తున్నాయి. అటో ఇటో తేల్చుకోమని బీఆరేఎస్ వంటి బీజేపీ వ్యతిరేక పార్టీలకు సవాలు విసురుతున్నాయి. నిజానికి ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు సాగిస్తున్న నితీష్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు ఎవరూ బీఆర్ఎస్ పార్టీని, కేసేఆర్ ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దూరం ఉంచుతున్నారు. ఈ పరిస్థితిలో కేసీఆర్ .. సుమోటోగా పార్లమెంట్ భవన ప్రరంభోత్సవ వేడులకలను భాహిష్కరించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకో వచ్చు. కానీ తెలంగాణ సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి గవర్నర్ పిలవక పోవడంతో, ఇప్పుడు ఎటూ తేల్చుకోలేక న్యూట్రల్ గా మిగిలి పోయారు.
అదలా ఉంటే తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఇదే అదనుగా కేసీఆర్ కు చురక అంటించారు. పార్లమెంటును ప్రధాని మోడీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె, తెలంగాణ సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తుచేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని తెలిపారు. దీంతో తెలంగాణ సర్కార్ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిపోయింది.