తలసాని గెలవడం కష్టమే? 

మంత్రి తలసానికి స్వంత పార్టీలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సనత్ నగర్  అసెంబ్లీ      నియోజకవర్గం నుంచి గెలుపొందిన తలసానికి ద్వితీయ శ్రేణి నేతల నుంచి మద్దత్తు కరవయ్యింది. ఏళ్ల తరబడి పార్టీ జెండాలు మోస్తున్న తమకు కనీసం నామినేటెడ్ పోస్టులు దక్కకుండా తలసాని అడ్డుకుంటున్నాడని ద్వితీయ శ్రేణి నేతలు ఆరోపిస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచే బిజెపి వోట్లుఎక్కువయ్యాయి. ఈ కారణంగా సికింద్రాబాద్  నుంచి బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి గెలుపొందారు. తలసాని ప్రాతినిద్యం వహిస్తున్న సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం  ప్రజలు బిజెపి అభ్యర్థి విజయానికి కారకులయ్యారు.   గత అసెంబ్లీ ఎన్నికలలో       సనత్ నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి  ఓడిపోయిన కూన వెంకటేశ్ గౌడ్ బిఆర్ఎస్ లో చేరినప్పటికీ అతనికి నామినేట్ పోస్టులు రాకుండా తలసాని అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తలసానితో వేగలేక కూన తిరిగి టీడీపీలో చేరారు.  కాగా తలసాని కుమారుడి జోక్యం పార్టీలో పెరిగిపోతుందని ఆరోపించే వారు ఎక్కువయ్యారు. భూ కబ్జాలు, సెటిల్ మెంట్స్ లో తలసాని కుమారుడి పాత్ర ఎక్కువయ్యిందని  ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. తలసానికి పట్టు ఉన్న రెజిమెంటల్ బజార్  వంటి ప్రాంతాల్లో బిఆర్ఎస్ వోట్లు పడడం కష్టమేనన్నారు.  

ఆర్జీవీ వ్యూహం.. తెరపైకి భారతి!

మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో  వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. అలాంటి వేళ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో  జగన్ బయోపిక్.. వ్యూహాత్మకంగా తెరకెక్కుతోంది.  అయితే ఈ చిత్రంలోని పలు సన్నివేశాలకు చెందిన నాలుగు ఫొటోలను రామగోపాల్ వర్మ సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో   జగన్‌గా అజ్మల్... ఆయన భార్య   భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్   నటిస్తున్నారు. ఈ ఫొటోల్లో... వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర ఫటంలో.. ఆజ్మల్, మానస రాధాకృష్ణన్ కనిపించీ కనిపించకుండా ఉన్నారు. ఇక రెండో చిత్రంలో అజ్మల్ ఆందోళనతో ఏదో  చెబుతుండగా.. అతడి మొఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ఆందోళనను భారతీ పాత్రలో మానస రాధాకృష్ణన్ తీవ్ర ఆవేదనతో గమనిస్తున్నట్లుగా ఉంది. ఇక మరో ఫొటోలో అజ్మల్‌కు ఫోన్ రావడం.. మానస.. ఆందోళనతో మంచంపై నుంచి లేచి కూర్చొవడం.. వంటి ఫోటోలు వదిలారు. అయితే   వీరిద్దరు ఇంత ఆందోళనతో ఉండడాన్ని బట్టి చూస్తే.. ఇది వైఎస్ జగన్   చిన్నాన్న వైయస్ వివేక హత్య జరిగిన సమయంలో వచ్చిన ఫొన్ కాల్‌గా నెటిజన్లు భావిస్తున్నారని వారి కామెంట్లను బట్టి అవగతమౌతోంది.  మరోవైపు ఈ చిత్రం అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగే యుద్దం అంటూ క్యాప్షన్   పెట్టారు. మరోవైపు ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్.. బయోపిక్‌లో అబద్దాలు ఉండొచ్చు కానీ.. రియల్ పిక్‌లో వందకి వందశాతం నిజాలే ఉంటాయని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం విదితమే. ఇంకోవైపు ఈ చిత్ర షూటింగ్ శరవేగంతో జరుపుకొంటోంది. ఈ చిత్రం ఎన్నికల నాటికి విడుదల చేసి.. లబ్ధి పొందాలన్న లక్ష్యంతో  జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం రెండో భాగం తెరకెక్కనుందని.. ఆ చిత్రానికి శపథం పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.   ఇక మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి.. అధికారంలోకి రావడంతో.. మహీ వి. రాఘవ దర్శకత్వంలో యాత్ర పేరుతో మమ్ముటి నటించిన చిత్రం 2019 ఎన్నికలకు ముందు విడుదలై.. ఘన విజయం సాధించింది. అలాగే వైయస్ఆర్ మరణం తర్వాత ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ పాదయాత్ర సైతం చేశారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని మహీ వి రఘవ దర్శకత్వంలో యాత్ర 2 పేరుతో చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.   ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 2019 ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత అమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ చిత్రాన్ని సైతం తెరకెక్కించారు.  మరి ఎన్నికల వేళకు ఈ వ్యూహాం చిత్రం పూర్తయి.. ప్రజల ముందుకు వస్తుందా? వస్తే.. జగన్ పాదయాత్రలో నాడు ఇచ్చిన హామీలు.. ఆయన గద్దెనక్కిన తర్వాతా అంటే.. ఈ నాలుగేళ్లలో పుల్ ఫిల్ చేసేశారా? అనేది.. చిత్రం విడుదలై.. ప్రజలు ఎలా రిసివ్ చేసుకొంటారనే ఓ చర్చ జోరుగా సాగుతోంది. 

కవిత అరెస్ట్ పై దాగుడు మూతలు 

కర్ణాటక ఫలితాల తర్వాత మద్యం కుంభకోణంలో నిందితురాలైన కల్వకుంట్ల కవితపై బిజెపీ ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. కర్ణాటక ఫలితాల తర్వాత కవిత అరెస్ట్ ఖాయమని తెలంగాణ బిజెపి నేతలు ప్రచారం చేశారు. ఆమె జైలు గది కూడా సిద్దమైందని ఒక దశలో ప్రచారం చేశారు. కర్ణాటక ఎన్నికలకు ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎటువంటి సంబంధం లేదు. కర్ణాటక ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వెలువడ్డాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న బిజెపి ఓడిపోయింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని దేవగౌడ అభ్యర్థన మేరకు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కెసీఆర్ పాల్గొనాలి. ఢిల్లీ బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం కాగానే కెసీఆర్ నేరుగా కర్ణాటక వెళతారని షెడ్యూల్ లో ఉంది. జెడీఎస్ తరపున కెసీఆర్ ఏ ఒక్క బహిరంగ సమావేశంలో పాల్గొనలేదు. బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కూతురు కవితను అరెస్ట్ చేస్తామని బిజెపి బ్లాక్ మెయిల్ చేసిందని తెలంగాణాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. జనతాదళ్ ఎస్  పార్టీకి ఫండ్ ఇస్తానని కెసీఆర్ హామి ఇచ్చినట్లు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ ఎస్ నేత  కుమార స్వామి చెప్పారు. ఫండ్ ఇవ్వలేదు కనీసం ప్రచారం కూడా చేయలేదని కుమారస్వామి ఆరోపించారు.  కాగా తెలంగాణలో తమ పార్టీ మూడో పొజీషన్ లో ఉందని తెలంగాణ బిజెపి నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికలకు ముందు ఈ బిజెపి నేతలు తెలంగాణలో అధికారంలో వస్తామని, తమకు బిఆర్ఎస్ పోటీ కూడా ఇవ్వలేదని జోస్యం చెప్పారు. అనేక చోట్ల బిఆర్ఎస్ డిపాజిట్లు కూడా రావని చెప్పారు. కవిత అరెస్ట్ అటకెక్కిన తర్వాత తెలంగాణ బిజెపి నేతలు కాంగ్రెస్ , బిఆర్ఎస్ మధ్యే పోటీ ఉండబోతుంది. మేము థర్డ్ పొజిషన్ లో ఉంటామని అంగీకరిస్తున్నారు.  ఇంత పెద్ద భారీ స్కాంలో నిందితురాలైన కవితను కాపాడటానికి కెసీఆర్ చక్రం తిప్పారని జోరుగా ప్రచారం జరుగుతుంది.  కూతురును సిబిఐ, ఈడీ కేసుల నుంచి విముక్తి చేయడానికి కెసీఆర్ బిజెపితో అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తుంది. బిజెపిని పల్లెత్తు మాట అనడం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. కవిత అరెస్ట్ అయితే తమ పార్టీ గెలుస్తుంది. ఒక వేళ చేయకపోతే తమ పార్టీ ఓడిపోతుందని తెలంగాణ బిజెపి నేతలు బాహాటంగానే స్టేట్ మెంట్ ఇచ్చేస్తున్నారు.  ఇదిలా ఉండగా ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధం ఉన్నట్లు  ఆరోపణ ఎదుర్కొంటున్న శరత్ రెడ్డి గత సంవత్సరం నవంబర్ లో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ప్రస్తుతం ఆయన అప్రోవర్ గా మారిపోయారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం అధికారులు అతని నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను బట్టి కెసీఆర్ కూతురు కవిత అరెస్ట్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. కెసీఆర్ తమ గుప్పిట్లో ఉండే విధంగా బిజెపి ప్రభుత్వం శరత్ రెడ్డి ని అప్రోవర్ గా నియమించిందని ప్రచారం జరుగుతోంది. 

హస్తం హమీల అమలుకు శ్రీకారం ..కానీ

కొంత ఆలస్యం జరిగినా... కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు ఇచ్చిన ఐదు హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. నిజానికి, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా మొదలు ఇతర కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుంచే ఐదు హామీలు అమలోకి వస్తాయని హామీఇచ్చారు. రాష్ట మంత్రి వర్గం తొలి సమావేశంలోనే ఆమోదం తెలిపి  మలి రోజు నుంచే అమలులోకి తెస్తామని కాంగ్రెస్ నేతలు  గ్యారెంటీ ఇచ్చారు. అయితే  గత నెల (మే) 20న జరిగిన తొలి మంత్రివర్గంలో, ‘సూత్ర ప్రాయ’ అమోదంతో సరిపెట్టిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య, శనివారం (జూన్ 2)  జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పథకాల అమలుకు మరికొంత సమయం తీసుకున్నారు. అంచెల వారీగా ఒక్కొక పధకాన్ని అమలు చేస్తామని షెడ్యూలు  ప్రకటించారు. అంతే కాదు, తక్షణం అన్న మాటను తుడిచేసి  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా  ఐదు హామీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పు కొచ్చారు.  శుక్రవారం (జూన్ 2) ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీలకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కారణమైన ఐదు పథకాలను కన్నడ ప్రజలకు ఉచితంగా అమలు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం అనతరం ముఖ్యమంత్రి  సిద్ధరామయ్య పథకాల అమలులో కుల, మత బేధాలు చూడకుండా అర్హులైన అందరు లబ్ధిదారులకు ఉచిత హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. అయితే గతంలో హామీ ఇచ్చిన విధంగా కాకుండా, చిన్నచిన్న సవరణలు చేశారు. అనీ పథకాలు ఒకేసారి కాకుండా ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క ముహూర్తం ఖరారు చేశారు. అందులో భాగంగా  ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే.. గృహ జ్యోతి పథకాన్ని జులై 1 నుంచి మలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే, 200 యూనిట్స్ వరకు ఫ్రీ .. అని హమీ ఇచ్చినప్పటికీ, అందులోంచి ఒక యూనిట్ తీసేసి, 199 యూనిట్స్ కు కుదించారు. అంతే కాదు, జులై వరకు ఉన్న విద్యుత్ బిల్లులను ప్రజలే చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే,  గృహలక్ష్మి పథకం కింద కుటుంబంలోని మహిళ యజమానికి నెలకు రూ.2వేల ఆర్థిక సాయం పథకాన్ని ఆగస్ట్ 15న ప్రారంభించనున్నట్లు సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అదే విధంగా, అన్న భాగ్య పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం అందిస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.'శక్తి' పథకం కింద కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు.అయితే, ఏసీ, స్లీపర్,రాజహంస బస్సుల్లో ‘ఉచితం’ నడవదని స్పష్టం చేశారు. అలాగే  ప్రతి బస్సులో 50 శాతం సీట్లు పురుషులకు రిజర్వు చేస్తారు. మిగిలిన  50 శాతం సీట్లలో మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయిస్తారు. ఈపథకం కూడా తక్షణం అమలు కాదు. జూన్ 11 నుంచి అమలు చేస్తారు.   అదే సమయంలో 'యువ నిధి' పథకం కింద డిగ్రీ పూర్తిచేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి భృతి చెల్లిస్తామని తెలిపారు.  2022-23లో పాసై.. నిరుద్యోగులుగా ఉన్న పట్టభద్రులకు రూ.3 వేలు.. డిప్లొమా విద్యార్థులకు రూ.1,500. 24 నెలల పాటు అందజేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే ఈపథకం ఎప్పటి నుంచి అమలువుతుంది, అనేది ముఖ్యమంత్రి స్పష్తం చేయలేదు. బహుశా 2022-23 విదా సంవత్సరంలో డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్ధుల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ పథకం అమలకావచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే ఉన్న నిరుద్యోగులకు అయితే ఈ పథకం వర్తించదు. కాగా  ఈ పథకాల మలుకు రూ.50,000 (అక్షరాలా 50 వేల కోట్ల రూపాయాలు) ఖర్చవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అంటే రాష్ట్ర బడ్జెట్ లో ఆరింట ఒకవంతు ఉచితాల ఖాతాకు పోతుంది. అదలా ఉంటే, హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పెట్టి, వెనకడుగు వేస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.అయితే  సిద్ధరామయ్య ప్రకటనపై ప్రజల స్పందన ఎలా ఉంటుంది అనేది చూడవలసి ఉంది

బిజెపిలో చేరికలు నిల్

భారతీయ జనతా పార్టీకి క్రమశిక్షణ పార్టీ అని పేరు గడించింది. వాక్ స్వాతంత్రానికి ఆ పార్టీలో నూకలు చెల్లు అనే టాక్ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరు ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా విమర్శించవచ్చు. వాళ్ల మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం అత్యంత అరుదు.  కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతుండగా బిజెపిలో కొత్తగా చేరికలు ఉండడం లేదు. ఉన్నవారినే కాపాడుకోవడం గగనమైంది కెసీఆర్ కూతురు కల్వ కుంట్ల కవితను అరెస్ట్ చేస్తే తమ పార్టీ అధికారంలో రావడం నేత కల్ల అని చేవెళ్ల మాజీ ఎంపీ, బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. కర్ణాటక ఎన్నికల  ప్రచార సమయంలో బిఆర్ ఎస్ మూడోసారి అధికారంలో రాదని తమ పార్టీ మాత్రమే అధికారంలో రాగలుగుతుందని బిజెపి నేతలు గొప్పగా చెప్పేవారు. కానీ కర్ణాటక ఫలితాల తర్వాత బిజెపి పరాజయంతో తెలంగాణ బిజెపి నేతలు జోరు తగ్గించారు. కవితను అరెస్ట్ చేస్తేనే తెలంగాణలో బిజెపి అధికారంలో రాగలుగుతుందని ప్రచారం చేస్తున్నారు. బిజెపి జాతీయ నేత ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తెలంగాణలో 40 మంది బిజెపి అభ్యర్థులు దొరకడమే గగనమన్నారు.  మా పార్టీకి అభ్యర్థులు కరవయ్యారు అని సంచలన కామెంట్ చేశారు. అతనిపై ఇప్పటి వరకు పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. గతంలో ఇంద్ర సేనారెడ్డి చేరికల కమిటీలో ఉండి చేరికలను ప్రోత్సహించారు. ప్రస్తుతం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేరికల కమిటీకి సారథ్యం వహిస్తున్నారు. గమ్మత్తు అయిన విషయం ఏమిటంటే చేరికల కమిటీ చైర్మన్ హోదాలో ఆయన పొంగులేటి, జూపల్లిలకు ఆహ్వానం పలికారు.  కవితను అరెస్ట్ చేయలేని మీ పార్టీ ప్రభుత్వం మేము చేరితే ప్రజలు మమ్మల్ని ఓడగట్టడం ఖాయమన్నారు. మేమే కొత్త పార్టీ పెడుతున్నాం మీరే మా పార్టీలో చేరండి అని పొంగులేటి, జూపల్లిలు ఈటెలను ఆహ్వానించారు. చేసేదేమి లేక ఈటెల వెనుదిరిగిపోయారు. బిజెపిలో చేరికల కమిటీకి బదులు ఎగ్జిట్ కమిటీ పెట్టి బిజెపినుంచి బయటకు వెళ్లే వారిని కాపాడుకోవాలని రాజకీయ విశ్లేషకుడు ఒకరు వాఖ్యానించారు. 

నేడు హస్తినకు తెలుగుదేశం అధినేత.. మోడీ షాలతో భేటీ

తెలుగురాష్ట్రాలలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.  తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఆ రెండు పార్టీల నుంచీ పెద్ద సంఖ్యలో నాయకులు బయటకు వస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ వేగంగా జరుగుతోందన్నది పరిశీలకుల విశ్లేషణ. అదే సమయంలో ఏపీలో కూడా రాజకీయాలు వేగంగా మారుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి హస్తిన పర్యటన నేపథ్యంలో ఈ ఊహాగానాల జోరు పెరిగింది. ఇప్పటి వరకూ ఏపీలో తెలుగుదేశంన, జనసేనల మధ్య పొత్తు ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే  బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన.. బీజేపీని కూడా కలుపుకుని పోతామని పదే పదే చెబుతున్నా కమల నాథుల తీరు  చూస్తే.. అది సాధ్యమయ్యేలా లేదనే రాజకీయ వర్గాలు భావించాయి.  బహిరంగంగా పొత్తు ప్రకటన లేకపోయినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ పార్టీకే బీజేపీ వత్తాసు పలుకుతోందన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది.  ఎన్నికల వేళ, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో  పదివేలక కోట్ల రూపాయలకు పైగారెవెన్యూ లోటు నిధులను గంపగుత్తగా ఒకే సారి విడుదల చేయడంతో కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా జగన్ కు అండగా నిలవాలని నిర్ణయానికి వచ్చేసిందన్న అభిప్రాయమే సర్వత్రా నెలకొంది. అలాంటి వేళ.. హఠాత్తుగా చంద్రబాబు హస్తిన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. శనివారం (జూన్ 3) సాయంత్రం ఆయన హస్తిన బయలదేరనున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అలాగే  ప్రధాని మోడీతో  కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అమిత్ షాతో శనివారం ( జూన్ 3) రాత్రి భేటీ అవుతారని తెలుస్తోంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు ఆదివారం (జూన్ 4) భేటీ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏకమౌతున్న నేపథ్యంలో.. ఏపీలో మునిగిపోయే నావలా ఉన్న వైసీపీతో కలిసి వెళ్లడం కంటే.. తెలుగుదేశం, జనసేన కూటమితో కలవడమే మేలని కమలనాథులు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అందుకే గత నాలుగేళ్లుగా ఎన్నడూ లేనిది చంద్రబాబుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఏది ఏమైనా బాబు హస్తిన పర్యటనతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 

ఘోర రైలు ప్రమాదం..250 మంది మృత్యువాత

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం  చోటు చేసుకుంది. 250 మంది  మృత్యువాత పడ్డారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన బాలాసోర్ చిల్లాలో జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రెండు రైళ్లు ఢీకొన్నాయా? మూడు రైళ్లు ఢీకొన్నాయా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కోరమండల్ రైలు బోగీలు పట్టాలు తప్పాయనీ,  ఆ బోగీలను... యశ్వంత్‌పూర్- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. ఢీకొట్టిందనీ రైల్వే శాఖ చెబుతుంటే.. ఆగి ఉన్న రైలును కోరమాండ్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొందని చెబుతున్నారు. ఈ ఘటన బహనాగ్ రైల్వే స్టేషన్ లో జరిగింది.   కాగా అధికారిక సమాచారం మేరకు శుక్రవారం (జూన్ 2) రాత్రి 7 గంటల సమయంలో షాలిమార్- చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పది నుంచి 12 బోగీలు ఎదురుగా ఉన్న ట్రాక్ పై పడిపోయాయి.  అదే సమయంలో ఎదురుగా ఉన్న ట్రాక్ పై వస్తున్న యశ్వంత్ పూర్ నుండి హౌరాకు వెళ్లే మరో రైలు పట్టాలు తప్పిన కోచ్ లలోకి దూసుకెళ్లింది ఫలితంగా ఆ రైలు కూడా పట్టాలు తప్పింది.    కాగా ఘోర రైలు ప్రమాదం పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమౌతోంది. రాష్ట్రపతి, ప్రధాని తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరితంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఇలా ఉండగా ప్రమాద స్థలానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.  కాగా రైలు ప్రమాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మంత్రులు ఉదయనిథి స్టాలిన్, అనిల్ మహేష్, శివశంకర్ లను హుటాహుటిన సంఘటనా స్థలిని పంపించారు.   ఏపీ ముఖ్యమంత్రి ప్రమాదానికి గురైన రైళ్లలో ఏపీ వాసుల గురించి ఆరా తీశారు. ప్రమాద ఘటనా స్థలికి సహాయక బృందాలు హెలికాప్టర్ లో చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే  అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాద కారణాలపై విచారణకు రైల్వే శాఖ మంత్రి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. 

చంద్రబాబు రికార్డు బద్దలు కొట్టిన చంద్రశేఖరరావు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు రికార్డును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బద్దలు కొట్టేశారు. ఇంతకీ ఆ రికార్డు  ఏమిటంటారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన పదేళ్ల కాలం కలుపుకుంటే తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కాలం  ఏకథాటిగా ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు శుక్రవారం ( జూన్ 2) వరకూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి పేరిట ఉంది. అయితే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన రోజుతో ఆయన రికార్డు బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కాలం పని చేసిన ముఖ్యమంత్రి గా  చంద్రబాబు ను వెనక్కు నెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబర్ 1 నుంచి ఏకధాటిగా   8 ఏళ్ల 256 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికి అదే రికార్డు. ఆ రికార్డు ఇప్పటి వరకూ అంటూ జూన్ 2, 2023 వరకూ పదిలంగా ఉంది. అయితే రాష్ట్ర విభజన తరువాత   తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఏకధాటిగా తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. దీంతో చంద్రబాబు రికార్డు చెరిగిపోయింది.

దస్తగిరి డిస్కషన్స్ లో ఉన్నాడా.. రోజా ఆరా!

దస్తగిరి.. ఈ మాట ఇప్పుడు వైసీపీ నాయకులకు ఓ పీడకలగా మారిపోయింది. నిద్రలోనూ ఆ పేరే కలవరిస్తున్నారా అన్న అనుమానాలు కలిగేలా వారి వ్యవహార శైలి ఉంది. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. చుట్టే వైసీపీ నేతల చర్చలు, ఆరాలూ సాగుతున్నాయి. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి దస్తగిరిని అప్రూవర్ గా ఎలా అంగీకరిస్తారని సీబీఐని ప్రశ్నిస్తుంటే.. ఆ పార్టీ నేతలంతా దస్తగిరి ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు అన్న ఆరాల్లోనే మునిగిపోయారు. ఇందుకు ఉదాహరణగా మంత్రి రోజా దస్తగిరి విషయం ఆరాతీస్తూ అడ్డంగా దొరికి పోయిన వీడియోనే సాక్ష్యం. ఆ వీడియోలో దస్తగిరి డిస్కషన్స్ లో  ఉన్నాడా అని ఫోన్ లో ఎవరిలో అడగడం స్పష్టంగా వినిపిస్తోంది. ఆ తరువాత కూడా రెండు మూడు నిముషాలు ఆమె ఫోన్ లో అవతల ఉన్న వారు చెబుతున్నది విన్నారు. అంత సేపూ కూడా ఆమె ముఖకవళికలు పరిశీలిస్తే మంత్రి రోజా ముఖంలో ఒకింత ఆందోళన కనిపిస్తుంది. ఫోన్ పెట్టేసిన తరువాత కూడా కొన్ని క్షణాలు ఆమె మౌనంగా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ రోజా ఫోన్ లో ఎవరితో మాట్లాడారన్నది తెలియకపోయినా.. దస్తగిరి గురించి ప్రశ్నిస్తూ ఆమె చూపిన ఆత్రత, ఫోన్ లో అవతలి వారు చెబుతున్నది వింటూ ఆమె పడిన ఆందోళనా చూస్తుంటే వివేకా హత్య కేసులో తమ అధినేత ఇరక్కుంటున్నారా అన్న భయం స్పష్టంగా తెలిసిపోతుంది. వివేకా హత్య లో కుట్రకోణం.. ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయంలో రోజాకు ఒక అవగాహన ఉందా అన్న అనుమానం కలుగుతుంది. అదేమీ లేకపోయినట్లైతే.. అసలు దస్తగిరి ఏ డిస్కషన్స్ లో ఉంటే ఆమె కెందుకు, ఎవరితో భేటీ అయితే ఆమె కెందుకు అన్న ప్రశ్నలు తెలెత్తుతున్నాయి.  మొత్తం మీద వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సూత్రధారులు, పాత్రధారులకు చేరువ అవుతున్న సంకేతాలు కనిపించడం మొదలైనప్పటి నుంచీ వైసీపీ నేతల వెన్నులో వణుకుపుడుతోందన్న పరిశీలకుల విశ్లేషనల్లో వాస్తవం ఉందనిపించక మానదు.  దస్తగిరి ప్రస్తావన అనేసిరి కెమేరా ఆన్ లో ఉందనీ, తానొక మీటింగ్ లో ఉన్నానన్న సంగతీ మంత్రి రోజా మరచిపోయి అమితాసక్తిని ప్రదర్శించడం స్పష్టంగా తెలుస్తోంది.  

సిట్టింగులకే టికెట్లు.. బీఆర్ఎస్ లో గందరగోళం

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ లో లుకలుకలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. సిట్టింగులకు సీట్ల విషయంలో ఆ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. గత ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీ తలుపులు బార్లా తెరిచి మరీ చేర్చుసుకున్నారు. అంతే కాదు కొంత కాలం కిందట సిట్టింగులందరికీ వచ్చే ఎన్నికలలో మళ్లీ పోటీ చేసేందుకు టికెట్లు ఇస్తానని కూడా ప్రకటించేశారు. ఆయన ఏ వ్యూహంతో ఆ ప్రకటన చేశారో కానీ అదే బూమరాంగ్ అయ్యింది.   ఈ ప్రకటనతో ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ  ఎంపీ పొంలేటి సుధాకర రెడ్డిలు  ఆత్మీయ సమ్మేళనాలు అంటూ సందడి చేశారు. భారాస ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు దౌత్యంతో తుమ్మల వెనక్కి తగ్గారు కానీ, పొంగులేటి మాత్రం తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకు పోయారు. ఆయన ధిక్కార ధోరణితో పార్టీ నుంచి బహిష్కృతులయ్యారు కూడా. ఆయనకు తోడుగా జూపల్లి కృష్ణారావు ఉన్నారు. అలాగే వరంగల్ కు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్, సిట్టిగులకే టికెట్ ప్రకటన చేసినప్పటి నుంచి,  సిట్టింగ్ ఎమ్మెల్ల్యే కడియం  చిరకాల ప్రత్యర్ధి తాటికొండ రాజయ్యల మధ్య ఎప్పటినుంచో సాగుతున్న ప్రత్యన్న యుద్ధం పీక్ కు చేరింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కడియమ నేరుగా కేసీఆర్ నే టార్గెట్ చేశారు. అందుకే ఆయన ఎవరికీ తలవంచను, ఎవరికీ పాదాభివందనాలు చేయనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.  పరిస్థితి చేయి జారుతోందని గ్రహించిన కేసీఆర్ నష్టనివారణ చర్యలలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చేత సిట్టింగులలో కొందరికి పార్టీ టికెట్లు వచ్చే అవకాశం లేదన్న ప్రకటన చేయించారు. అయితే అది కూడా ఎమంత ఫలితాన్ని ఇవ్వలేదు. మొత్తం మీద సిట్టింగులకు టికెట్ల వ్యవహారం బీఆర్ఎస్ లో పెద్ద సంక్షోభానికీ, గందరగోళానికీ దారి తీసింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరికి మించే ఆశావహులు ఉండటం.. ఎవరూ వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా ఉడటంతో వారిలో టికెట్ దక్కని వారు రెబల్స్ గా బరిలో నిలిస్తే చాలా నియోజకవర్గాలలో బీఆర్ఎస్ విజయంపై ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వచ్చే ఎన్నికలలో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలన్న కేసీఆర్ ఆశలకు గండి కొడుతుందని అంటున్నారు. ఎన్నికలు ఇక నెలల వ్యవధిలోకి వచ్చిన నేపథ్యంలో  సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై మంత్రి కేటీఆర్  రంగంలోకి దిగారు.  ఇప్పటికిప్పుడు అసమ్మతి, అసంతృప్తి భగ్గుమనకుండా నష్ట నివారణ చర్యలలో భాగంగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో పని తీరు బాగున్న సిట్టింగుల టికెట్లకు ఢోకా లేదని చెప్పారు. అలాగే పనితీరులో వెనుకబడ్డవారు తమ తీరు మార్చుకుని పుంజుకుంటే.. టికెట్లు దక్కే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.   పార్టీ కోసం, పార్టీ విజయం కోసం ఎళ్ల వేళలా కృషి చేసే వాళ్లందరిపై పార్టీ అధినేత ఓ కన్నేసి ఉంచారని వివరించారు. మొత్తం మీద సిట్టింగులకు టికెట్ల విషయంలో కేసీఆర్ ముందుగానే చేసిన ప్రకటన బీఆర్ఎస్ లో కలకలం సృష్టించింది. సంక్షోభానికి తేరతీసింది. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇప్పుడు నష్ట నవారణ చర్యలకు శ్రీకారం చుట్టినా.. ఆశావహులందరినీ సంతృప్తి పరచడం సాధ్యమౌతుందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

మంత్రి మల్లారెడ్డా.. మజాకానా?

రాజకీయాలలో హాస్యం పండించడంలో దిట్టలు చాలా తక్కువ మంది ఉంటారు. వారు ఏం మాట్లాడినా జనం సీరియస్ గా తీసుకోరు. హాయిగా నవ్వుకుంటారు. వారి ప్రెస్ మీట్లకు మీడియా ప్రతినిథులు ఉత్సాహంగా హాజరౌతారు. ఎందుకంటే వారి మాట్లల్లో వెల్లివిరిసే హాస్యం పాఠకులను, ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.   అలాంటి వారిలో ప్రముఖంగా విశ్వశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ముందు వరుసలో ఉంటారు. ఆ తరువాతి స్థానం కాకపోయినా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కూడా అలా హాస్యం ఒలికించే  పొలిటీషియన్లలో ముందు వరుసలో ఉంటారు. మల్లారెడ్డి రూటే సెపరేటు. ఆయన మాటే డిఫరెంటు. అందులో సందేహం లేదు. ఆయన ఏం మాట్లాడినా వెంటనే సామాజిక మాధ్యమంలో వైరల్ అయిపోతుంది. ఆయన సీరియస్ గా వేసే జోకులకు ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. గతంలో ఒక సారి ఆయన తన ఎదుగుదలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ అయ్యారు. కష్టపడ్డా.. పాలమ్మా, పూలమ్మా బోర్ వెల్ నడిపించా.. కాలేజీలు పెట్టా అంటే చేసిన వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. తాజాగా కూడా ఆయన బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా సరదాగా ఉన్నాయంటూ నెటిజన్లు అంటున్నారు.  పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  హోమ్ శాఖ మంత్రి మహముద్ అలీ, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులతో కలిసి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంగా తన ప్రసంగంలో  బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని తెలంగాణ హోం మంత్రి మొహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లను ఆయన కోరారు. పోలీసులు ఫిట్ నెస్ పెంచుకోవడానికి పోలీస్ స్టేషన్లలోనే జిమ్ లు ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చేశారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, మన పోలీసులు బాగా పని చేస్తున్నారని అన్నారు. కేసులను త్వరగానే  పరిష్కరిస్తున్నారని మల్లారెడ్డి ప్రశంసించారు. పోలీసులు కూడా మంచి ఫిట్ గా ఉండాలని చెప్పారు. పోలీసులను చూస్తే దొంగలు గజగజ వణికిపోవాలని అన్నారు. తాజాగా మంత్రిగారు చెప్పిన మాటల్లో ట్రోల్ చేయడానికి ఏమీ లేదు కానీ ఆయన నవ్వూతూ చెప్పిన ఈ మాటలు గతంలో  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు  పోలీసులు స్టిఫ్ నెస్ కు..ఫిట్ నెస్ కు ఉదాహరణగా ఉండాలి అని చెప్పడాన్ని గుర్తుకు తెచ్చాయి.  బొజ్జ పెంచుకున్న పోలీసులకు ఇంక్రిమెంట్ ఇవ్వద్దని అప్పట్లో ఎన్టీఆర్ ఆదేశించారు. మల్లారెడ్డి నవ్వుతూ చెప్పినా వాస్తవమే చెప్పారు. పోలీసులు ఫిట్ నెస్ పై దృష్టి నిలపాలి అని నెటిజన్లు అంటున్నారు.

ప్రతి పక్ష కూటమికి బీఆర్ఎస్ దూరం  

జూన్ 12న బిజెపి యేతర పార్టీలు పెట్టబోయే మీటింగ్ లో బీఆర్ఎస్ గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి బిజెపి ప్రభుత్వం ఆహ్వానించకుండా రాష్ట్రపతిని అవమానించినట్లు ప్రతి పక్షాలు ఆరోపించాయి. ప్రతి పక్షాలు చేసిన నిరసన కార్యక్రమాల్లో కెసీఆర్ పాల్గొనలేదు.  కూతురు కవిత ఢిల్లీ మద్యం కేసులో చిక్కుకుపోవడంతో కెసీఆర్ తన స్ట్రాటజీ మార్చినట్లు కనబడుతోంది. బిజెపితో మెతక వైఖరి కనిపిస్తోంది. ఇరు పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతి పక్షాలు  కూడా కెసీఆర్ ను కలుపుకోవడం లేదు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ కోసం కెసీఆర్  కాళ్లకు చక్రాలు కట్టుకుని బొంగరంలా తిరిగారు. ప్రతి పక్షాలను ఏకం చేసే కార్యక్రమాలు భుజాన వేసుకున్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కేవలం కాంగ్రెస్ కు మాత్రమే కెసీఆర్ వ్యతిరేకి. బిజెపితో కేసీఆర్ కు శత్రుత్వం లేదు. కర్ణాటక ఫలితాల తర్వాత కెసీఆర్ బిజెపిని కాకుండా కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వం వహించే ప్రతి పక్ష కూటమి జూన్ 12న బీహార్ పాట్నాలో సమావేశమవుతుంది. కాంగ్రెస్ గొడుగు క్రింద కెసీఆర్ ఉండటం ఇష్టం లేక ఈ కూటమిలో కలవడం లేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోఆర్డినేషన్ లో ఈ కూటమి సమావేశమవుతుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూఎస్ పర్యటనలో ఉన్నారు. 12 సమావేశానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. బిజెపి ప్రభుత్వాన్ని తూర్పార బట్టడానికి  కూటమి సమావేశాలను ఇక నుంచి వరుసగా నిర్వహించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.     

అవినాష్ వెనుకే వైసీపీ క్యాడర్? జగన్ లో ఖంగారు!?

తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదన్నట్లుగా తయారైంది ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిస్థితి. వివేకా హత్య కేసులో సీబీఐ అఫిడవిట్ లో తన పేరు ప్రస్తావించడం, విచారించాలని విస్పష్టంగా పేర్కొనడంతో ప్రతిష్ట దిగజారడమే కాకుండా ఉమ్మడి కడప జిల్లాలోనే కాకుండా తన సొంత నియోజకవర్గం పులివెందులలో  కూడా పరపతి కోల్పోయారు. అదే సమయంలో వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ.. సీబీఐ విచారణకు హాజరు కాకుండా కోర్టుల ద్వారా అరెస్టును తప్పించుకున్న అవినాష్ రెడ్డికి జిల్లాలో పరపతి విపరీతింగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక వైపు జగన్ బేలగా తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు విపక్షంపై దూషణలకు దిగుతుంటే.. మరో వైపు అవినాష్ రెడ్డి పకడ్బందీగా క్యాడర్ ను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్, జగన్ ఇరువురూ కూడా తమదాకా దర్యాప్తు రాకుండా ఉంటే చాలన్నట్లుగానే వ్యవహరించారు. అయితే ఆ విషయంలో ఇద్దరూ విఫలమైనా.. దర్యాప్తు సంస్థను ముప్పుతిప్పలు పెట్టడంలోనూ.. అరెస్టు ను వాయిదాల మీద వాయిదాలు వేయించుకోవడంలోనూ సక్సెస్ అయిన అవినాష్ రెడ్డికి క్యాడర్ అండగా నిలబడుతూ వచ్చింది. అదే సమయంలో వివేకా హత్య కేసులో తన పేరు బయటకు రాకుండా ఉంటే చాలు అన్నట్లుగా వ్యవహరించిన జగన్ ఆ విషయంలో విఫలం కావడంతో క్యాడర్ దృష్టిలో పలుచన అయ్యారు. తొలుత వివేకా హత్య కేసులో అవినాష్ తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అయితే తండ్రి అరెస్టు తరువాత అవినాష్ అరెస్టు ఖాయమనే అంతా భావించారు. కానీ తన అరెస్టును తప్పించుకోవడానికి కోర్టు మెట్లెక్కిన అవినాష్ రెడ్డి, తండ్రి అరెస్టయిన తరువాత ఒక్క సారి కూడా ఆయనను జైలులో పరామర్శించిన దాఖలాలు లేవు. కనీసం ఆయన కోసం బెయిలు పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. అదే విధంగా జగన్ కూడా అవినాష్ ను సీబీఐ విచారణకు పిలిచిన వెంటనే తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హస్తిన వెళ్లి కార్యం చక్కబెట్టుకు వచ్చిన  జగన్ ఆ సందర్భంగా చేసిన ప్రయత్నాలన్నీ ఆ దర్యాప్తు అవినాష్ తో ఆపేయాలనీ తన వరకూ రాకుండా ఉంటే చాలన్న రీతిలోనే సాగాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే అవినాష్ కు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లూ దర్యాప్తు సంస్థ నుంచి వెసులుబాటు లభించిందనీ, అయితే విషయం తెలుసుకున్న  అవినాష్  నేరుగా సీబీఐ దర్యాప్తు తీరుపైనే విమర్శలు గుప్పించడం, ఆరోపణలు చేయడంతో దర్యాప్తు సంస్థ మరింత పకడ్బందీగా ఉచ్చు బిగించిందనీ అంటున్నారు. వివేకా హత్యకు ముందు రాసినట్లుగా చెబుతున్న లేఖ ఫ్యాబ్రికేటెడ్ అని జగన్ అంటే అందుకు భిన్నంగా అవినాష్ ఆ లేఖనే తాను నిర్దోషిని అనడానికి సాక్షీభూతంగా ఉపయోగించుకున్నారు. దీంతో జగన్ చిక్కుల్లో పడినట్లైంది. వివేకా తనను హత్య చేస్తుంటే లేఖ ఎలా రాయగలరని జగన్ ప్రశ్నిస్తే.. సీబీఐ దర్యాప్తులో ఆ లేఖ వివేకానందరెడ్డే రాశారని ధృవీకరించింది. దీంతో జగన్ చిక్కుల్లో పడ్డారు.  ఒక వైపు అవినాష్ సీబీఐని ముప్పతిప్పలు పెడుతుంటే.. జగన్ అందుకు భిన్నంగా తనంత తానుగా కేసులో దర్యాప్తును ఎదుర్కొనేలా చిక్కుకున్నారన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్నది. నాలుగేళ్ల పాలనలో  అన్ని వర్గాలకూ దూరమైన జగన్ పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడంలో కూడా విఫలమయ్యారన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నది. అందుకు భిన్నంగా అవినాష్ రెడ్డి నిత్యం కేడర్ మధ్యే ఉంటూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. అందుకే జగన్ సభల నుంచి జనం పారిపోతున్నా నిలువరించడంలో  పార్టీ క్యాడర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో  అవినాష్ రెడ్డి తల్లిని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చేర్చి తాను కూడా అక్కడే షెల్టర్ తీసుకున్న సమయంలో సీబీఐ అధికారులు కనీసం ఆయన దగ్గరకు కూడా వెళ్లేందుకు వీలు లేకుండా వైసీపీ క్యాడర్ రోజుల తరబడి ఆస్పత్రి వద్ద తిష్ట వేసి నిలువరించింది. పరిస్థితిని గమనిస్తుంటే.. వివేకా హత్య కేసు దర్యాప్తు ఔట్ కమ్ ఏదైనా రానున్న రోజులలో పార్టీపై జగన్ పట్టు సడిలే అవకాశాలు కనిపిస్తున్నాయనీ, అదే సమయంలో అవినాష్ రెడ్డి పట్టు సాధించే అవకాశాలున్నాయనీ అంటున్నారు.   పార్టీపై పట్టు సడలిపోతుందన్న భయంతో శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి జగన్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడు ఉండే అవకాశం లేదు. నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే అలా ఎన్నికలు జరిగితే ఏకగ్రీవ ఎన్నికకు అవకాశం ఉండదన్న భయంతోనే జగన్ శాశ్వత అధ్యక్ష హోదా కోసం తహతహలాడారనీ, ప్రస్తుతం పార్టీలో ఆయన ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని గమనిస్తే ఆయన ఎందుకు భయపడ్డారో అవగతమౌతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బాబాయ్ హత్య కేసు జగన్ ను పార్టీలో బలహీనుడిని చేస్తే అదే కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి పార్టీపై పట్టు బిగించే అవకాశాన్ని ఇచ్చింది. జనవరిలో తొలి సారి అవినాష్ కు సీబీఐ నోటీసులు ఇచ్చినప్పటి నుంచీ ఈ ఐదు నెలలలో అవినాష్ నిత్యం వార్తల్లో ప్రముఖంగా నిలుస్తూ వస్తుంటే.. జగన్ మాత్రం జనానికి దూరమయ్యారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అదీగాక త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో  అధికార పార్టీ సీట్టింగులలో  సగం మందికి పైగా టిక్కుట్లుఇచ్చే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో  టికెట్ దక్కదన్న నిర్ధారణకు వచ్చిన సిట్టింగులు జగన్ కు వ్యతిరేకంగా అవినాష్ నాయకత్వం కింద తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. లేదా అవినాష్ నాయకత్వంలో పార్టీలో చీలిక వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. 

కలిసొస్తే పవన్ తో.. లేకుంటే ఒంటరిగా!

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అడుగులు ఎటుగా పడుతున్నాయో, ఇప్పటికే కొంత స్పష్టత వచ్చింది. కలిసొస్తే పవన్ కళ్యాణ్ తో కాదంటే ఒంటరిగా... ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. మరోవంక పవన్ కల్యాణ్ వందకు రెండొందల శాతం తెలుగు దేశం పార్టీతో పొత్తుకు సిద్దమయ్యారు. సో  అటు బీజేపీ, ఇటు జనసేన అలాగే, టీడీపీ ఆలోచనలు ఇదే విధంగా కొనసాగితే, ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవంక బీజేపీ అడ్డు తొలిగి పోవడంతో తెలుగు దేశం, జనసేన కూటమి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని  వామపక్షాలు ఇతర పార్టీలు టీడీపీ కూటమితో చేతులు కలిపితే ఇక టీడీపీ, జేనసేన కూటమి గెలుపునకు తిరుగుండదని పరిశీలకులు భావిస్తున్నారు.    అదలా ఉంటే బీజేపీ ఒంటరిగా మిగిలినా  వైసీపీతో సీక్రెట్ సంసారం సాగించినా  రాష్ట్రంలో బీజేపీకి ఉన్నదీ లేదు, పోయేదీ లేదనీ, ఆపార్టీ ప్రత్యక్షంగా ఎన్నికలను ప్రభావితం చేసే పరిస్థితిలో లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువగా ఒక శాతం లోపు ఓట్లు తెచ్చుకున్న కమలం పార్టీ  ఈసారి ఒంటరిగా వెళితే ఆ మాత్రం ఓట్లు కూడా రావని పరిశీలకులే కాదు బీజేపీ నాయకులు సైతం అంటున్నారు. పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రత్యేక హోదాను బీజేపీ నాయకత్వం ముగిసిన అధ్యాయం అని తేల్చేసినప్పుడే, రాష్ట్రంలో బీజేపీ చరిత్ర ముగిసిపోయిందననీ బీజేపీ అభిమానులు, కార్యకర్తలు సహా  అందరూ అంగీకరిస్తున్నారు.  అదలా ఉంటే,ఇప్పటికే ఒకసారి  హస్తం పార్టీ మాజీ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించి అభాసు పాలైన బీజేపీ ఇప్పుడు మళ్ళీ అదే విఫల ప్రయోగానికి తెర  తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్  కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచన కమలదళం చేస్తోందని అంటున్నారు. అయితే ఎనిమిది సంవత్సరాలకు పైగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పై బీజేపీ ఆశలు పెంచుకోవడం ఆత్మహత్యా సదృశ్యమనే విచారం సంఘ్ పరివార్ వర్గాల్లో వినవస్తోంది.  మరోవంక  కాలం చెల్లిన రాజకీయ నాయకుడిగా తనకు తానుగా ముద్రవేసుకుని ఒక విధంగా రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి అన్ని రకాల రుగ్మతలతో చతికిల పడిన పార్టీని పరుగులు తీయించగలరా? అది అయ్యే పనేనా? అంటే  ఇటు పార్టీ వర్గాలు,అటు రాజకీయ పరిశీలకుల నుంచి కాదనే సమాధానమే వస్తోంది. అయితే, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి కొందరు విశ్లేషకులు మాత్రం మోడీషా జోడీ నాయకత్వంలోని  బీజేపీకి తివిరి ఇసుమున తైలంబు తీసే సామర్ధ్యం ఉందని అంటున్నారు.  నిజానికి, పార్టీ పరిస్థితి ఏపీ కంటే అద్వాన్నంగా అస్సాం, త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ నేరుగా అధికారంలోకి వచ్చిన విషయాన్ని, అదే విధంగా 33 ఏళ్ళు లెఫ్ట్ ఫ్రంట్ పాలించిన పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి రాకున్నా,లెఫ్ట్, కాంగ్రెస్ కూటమిని జీరో కు నెట్టేసి, 70కి పైగా అసెంబ్లీ  స్థానాలతో బీజేపీ అధికార తృణమూల్  కు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.  అయితే  ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల విద్యలు దక్షిణాదిన పనిచేయవని  కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగులేని విజయం నిరూపించిన నేపధ్యంలో ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు,కేరళ రాష్ట్రాలలో కమలం పార్టీ కాషాయ రాజకీయాలు సాగవనే వాదన కూడా లేక పోలేదు.  అదెలా ఉనా  కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం విషయంలో బీజేపీ వర్గాల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కిరణ్ కుమార్  రెడ్డి అవుట్ డేటెడ్ పొలిటీషియన్, కాలం చెల్లిన రాజకీయ నాయకుడు. అదెలా ఉన్నా వంటి నిండా నరనరాన కాంగ్రెస్ రక్తం నింపుకున్న నాయకుడు. అనేక సందర్భాలలో అసెంబ్లీ లోపలా బయటా కూడా బీజేపీను తూలనాడిన నాయకుడు.   అలాంటి కిరణ్ కుమార్  రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని అనుకోవడం లేద ని పార్టీ పాత తరం నేత ఒకరు  చిన్నగా నవ్వేశారు. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యారేకానీ, ఆయనకు రాష్ట్రంలో కాదు, కనీసం ఆయన సొంత జిల్లా చిత్తూరులో కూడా  పెద్దగా పట్టున్న నాయకుడు కాదు. రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి  సరైన సమయంలో సరైన  నిర్ణయం తీసుకోక, ఆఖరి బంతి అదీ ఇదని చివరి క్షణం వరకు ముఖ్యమంత్రి కుర్చీకి అతుక్కుని కూర్చున్నారు. అందుకే రాష్ట్ర విభజన క్రతువు మొత్తం శాస్త్రోత్రంగా అయ్యే వరకు ఆగి అప్పుడు రాజీనామా చేసిన ఆయన పెట్టిన సమైక్యాంధ్ర పార్టీని ప్రజలు సీరియస్ గా తీసుకోలేదు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి, సొంతంగా సమైక్యాంధ్ర (చెప్పుల) పార్టీ పెట్టి 2014లో పోటీ చేసిన ఆయనకు 175 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కలేదు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినా  ఇంచు మించుగా దశాబ్ద కాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  సో .. కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించినా రాష్ట్రంలో కమల దళం వికసించే అవకాశం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా, ఆయనకు  ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ... అది తెలంగాణలో బీఆర్ఎస్  కు మరో అస్త్రం ఇచ్చినట్లవుతుందని అంటున్నారు.

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి.. జగన్ స్కెచ్చేనా?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు ఇరుక్కుపోయారు. అలా ఇరుక్కుపోయారనడానికి ప్రత్యక్ష నిదర్శనమే వైసీపీఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో వారసుడు  శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోవడమే. శతర్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనుక ఏపీ సీఎం జగన్ స్కెచ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అప్రూవర్ గా మారేందుకు శరత్ చంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. అంతే కాదు.. ఆయనకు భద్రత కల్పించేందుకు వై కేటగరి సెక్యూరిటీని కూడా కల్పించింది. ఈ పరిణామాలన్నీ ఏపీ సీఎం   జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన  అనంతరం చోటు చేసుకున్నాయి.   శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో   కవిత  పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయినట్లేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమౌతోంది. అందరూ కలిసి స్కాం చేసినందున.. అసలు స్కాం ఎలా జరిగింది.. నగదు వ్యవహారాలు ఎలా జరిగాయో వీరు బయటపెడారు. వీరు అప్రూవర్ గా మారినందున వీరికి పరిమిత శిక్షలు అమలు చేస్తారు. కానీ అసలు కేజ్రీవాల్, కవిత మాత్రం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే కేసులో గతంలోనే ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు సైతం అప్రూవర్ గా మారారు.    లిక్కర్ లైసెన్సుల రేట్లు ఫిక్స్ చేయడంలో శరత్‌‌‌‌ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది. స్కామ్‌‌‌‌లో శరత్‌‌‌‌ చంద్రారెడ్డిని కింగ్‌‌‌‌పిన్‌‌‌‌గా పేర్కొంది. ఈ కేసులో నిందితులైన విజయ్‌‌‌‌నాయర్‌‌‌‌‌‌‌‌, సమీర్ మహేంద్రుతో కలిసి రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు చేసినట్లు ఆధారాలు సేకరించింది. శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్ గా కొనసాగుతున్న ట్రైడెంట్, ఆర్గోనామిక్స్, అవంతిక కాంట్రాక్టర్స్‌‌‌‌ కంపెనీలు ఢిల్లీలో రెండు కంటే ఎక్కువ రిటైల్ జోన్స్ నిర్వహిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో నిందితుడైన సమీర్ మహేంద్రు కంపెనీ ఇండో స్పిరిట్ లో శరత్ చంద్రారెడ్డి పెట్టుబడులు పెట్టారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో  తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిండా మునిగినట్లేనా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన   చార్జిషీట్లలో పేర్కొన్న అంశాలు సంచలనంగా మారాయి. డాక్యుమెంట్లు, పత్రాలు, వాట్సాప్ చాట్‌లు, ఈ మెయిల్స్ పత్రాలను కూడా ఈడీ  ఈ చార్జిషీట్ లో పాటుగా కోర్టుకు సమర్పించింది.   ఇప్పటి వరకూ ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లలో   పొందు పరిచిన అంశాల మేరకు.. కవిత కు సంబంధించిన అంశాలే ప్రముఖంగా ఉన్నాయని అంటున్నారు. కవిత హైదరాబాద్ లో కొన్న బూములు.. ఏవి, ఎక్కడ కొన్నారు.. యిందుకు సొమ్ములు ఏ విధంగా చెల్లించారు వంటి వివరాలను పొందుపరిచారు.  వీటిని కవిత నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో  ఉన్న సమాచారం ఆధారంగానే కాకుండా, మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, ఆమె బినామీగా చెబుతున్న పిళ్లై లు విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగానే ఈడీ అధికారులు ఈ చార్జిషీట్ లో ఆ వివరాలు పొందుపరచడం సాధ్యమైందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ గా మారారు. అలాగే కవిత బినామీగా చెబుతున్న రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ గా మారుతున్నట్లు ప్రకటించి మళ్లీ ఉపసంహరించుకున్నారు. ఇక బుచ్చిబాబు అయితే కవిత ఆర్థిక వ్యవహారాలు.. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆదాయాలు.. ముడుపులు.. పెట్టుబడులు భూముల గురించి మొత్తం  ఈడీ అధికారుల ముందు వెల్లడించినట్లుగా అ చార్జిషీట్ లో తేటతెల్లం అయ్యిందని అంటున్నారు.  ఒక ఆడిటర్ తన క్లయింట్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చెప్పారంటే.. ఆషామాషీగా ఉండదని, తాను చెప్పిన విషయాలను సంబంధించిన ఆధారాలు ఉంటేనే ఆయన చెబుతారని అటున్నారు.  ఇక కవిత  బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై  యిప్పటికే అప్రూవర్ గా మారారు. తరువాత కోర్టులో కాదని పేర్కొన్నప్పటికీ అప్పటికే ఆయన వివరాలన్నీ వెల్లడించేశారనీ, ఆయన చెప్పిన అంశాల ఆధారంగానే ఈడీ  కేసును పకడ్బందీగా దర్యాప్తు చేస్తూ కవిత చుట్టూ ఉచ్చు బిగించిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కాలు ఫ్రాక్చర్ అయ్యిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  గత ఇరవై రోజులుగా  ఎక్కడా కనిపించడంలేదు. ఈ మధ్యలో  ఒక సారి మాత్రం సుప్రీంకోర్టులో తాన పిటిషన్ పై త్వరగా విచారణ కావాలని  మెన్షన్ చేయించారు.  అవన్నీ పక్కన పెడితే  ఇప్పుడు  శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనుక అరబిందో కుటుంబంతో దగ్గర బంధుత్వం ఉన్నావిజయసాయిరెడ్డి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. శరత్ చంద్రారెడ్డి విజయసాయి అల్లుడికి స్వయానా సోదరుడు. దీంతో శరత్ చంద్రరెడ్డి అప్రూవర్ గా మారడంతో  జగన్.. తాను ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ కుమార్తెను చిక్కుల్లో పడేశారన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమౌతోంది. కాగా ఈ పరిణామం ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ రచ్చకు కారణమయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ కొత్త పార్టీకి నూకలు చెల్లినట్టేనా? 

ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు పెద్దలు. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలో వచ్చిన  బీఆర్ఎస్ అనే రాజకీయపార్టీ  చివరకు తెలంగాణ అనే పేరును తొలగించడం పట్ల తెలంగాణవాదులు మండిపడుతున్నారు. పొంగులేటి, జూపల్లి పెట్టబోయే కొత్త పార్టీ పేరులో తెలంగాణ అనే పదాన్ని చేర్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రిజిస్టర్ కూడా జరిగినట్లు సమాచారం.  తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ అంకురార్పణ జరగనుందని జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. కేసీఆర్ తో విభేధించిన వ్యక్తులను, పార్టీలను బతికి బట్ట కట్టనిచ్చే పరిస్థితి లేదని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. బిఆర్ఎస్ లో కీలకంగా పని చేసిన టైగర్ నరేంద్రను, తల్లి తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు విజయశాంతిని రాజకీయంగా చావు దెబ్బ కొట్టిన కేసీఆర్ పొంగులేటి, జూపల్లి పెట్టే కొత్త రాజకీయ పార్టీని మొగ్గలోనే తెంపివేయాలని  ప్లాన్ చేస్తున్నారు  . కొత్తగా పెట్టబోయే జనం తెలంగాణను రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నే నిలుపుదల చేయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిఆర్ఎస్ తో విభేధించి భారతీయ జనతాపార్టీలో చేరిన ఈటెలను కేసీఆర్ మూడు చెరువుల నీరు తాగించారు. ఈటెలపై, ఆయన భార్యపై క్రిమినల్ కేసులను పెట్టించారు. జాతీయ పార్టీలో చేరి అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరిన ఈటెలనే  కేసీఆర్ వదల లేదు. అమిత్ షా అండదండలున్న ఈటెలపై బిఆర్ఎస్ వెనక్కి తగ్గింది. కానీ  కొత్తగా వచ్చే జనం తెలంగాణ ఒక ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి నేతలు జనం తెలంగాణలో చేరే అవకాశం లేదు. పసి కూన పార్టీలో చేరి నాయకులు ఇబ్బందులకు గురి కారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశించే నేతలు కొత్త ప్రాంతీయ పార్టీలో చేరే అవకాశం లేదు. బీఆర్ఎస్ నుంచి విభేధించి బయటకొచ్చిన పొంగులేటి , జూపల్లిలు సైతం కొత్త రాజకీయ పార్టీ అంశాన్ని విరమించుకోనున్నారు. ఎందుకంటే వారికి కాంగ్రెస్, బిజెపి అధినాయకత్వం నుంచి ఆహ్వానాలు అందాయి. ఖమ్మంజిల్లాలో తిరుగులేని నాయకుడు పొంగులేటి. అక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. బిజెపి ఖమ్మంలో బలహీనంగా ఉంది. ఓడిపోయే పార్టీలో ఏ నేత చేరే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జూపల్లి తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయి.  చేరికల కమిటీ  చైర్మన్ అయిన ఈటెలను జనం తెలంగాణ పార్టీలో చేరాలని కోరిన పొంగులేటి, జూపల్లిల కొత్త పార్టీకి మనుగడలేదని ఈటెల వారికి నచ్చ జెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కొత్త పార్టీకి  నూకలు చెల్లినట్టు కనబడుతోంది. 

నల్లారికి ఏపీ బీజేపీ పగ్గాలు.. కమలనాథుల వ్యూహమేంటి?

ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. మూడున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించారు. రాష్ట్ర విభజనకు ముందు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన అధిష్ఠానాన్ని ధిక్కరించి కాంగ్రెస్ ను వీడి  సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014లో ఆ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపారు. సీన్ కట్ చేస్తే సమైక్యాంధ్ర పార్టీ 2014 ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయింది. పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి సహా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఎవరికీ కనీసం డిపాజిట్ కూడా రాలేదు. దీంతో  అప్పటి నుంచి ఆయన   నాలుగేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  అయితే కాంగ్రెస్ పిలుపుతో ఆయన మళ్లీ సొంత గూటికి చేరారు. అయినా కూడా మౌనం వీడలేదు. ఇక అయన రాజకీయాలకు దూరమైనట్లేనని అంతా అనుకుంటున్న సమయంలో  ఆయన మరోసారి కాంగ్రెస్ కు రాజీనామా చేసి కమలం గూటికి చేరారు.  ఆయన బీజేపీ తరఫున కర్నాటకలో ప్రచారం కూడా చేశారు. అయితే కర్నాటక ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైంది. మళ్లీ షరామూములే. కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి మౌనముద్ర వహించి అమెరికా పర్యటనకు వెళ్లారు.  అది వ్యక్తిగత పర్యటన అంటూ ఆయన త్వరలోనూ తిరిగి వచ్చి బీజేపీలో చురుకుగా వ్యవహరిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ నుంచే ఓ ప్రకటన విడుదల చేశారు. అంతే తప్ప రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి కానీ, ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తీరుపై కానీ, విపక్ష తెలుగుదేశం కార్యక్రమాల గురించి కానీ ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెబుతున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీనియర్ నాయకుడైన కిరణ్ కుమార్ రెడ్డి నుంచి సూచనలూ, సలహాలూ స్వీకరించేందుకే కలిసినట్లు సోము వీర్రాజు చెప్పుకున్నారు. అదలా ఉంచితే.. ఏపీలో బలోపేతం అయ్యేందుకు బీజేపీ గత కొంత కాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు రాష్ట్ర పార్టీ పగ్గాలను తొలుత కన్నా లక్ష్మీనారాయణకు, ఆయన తరువాత సోము వీర్రాజుకు అప్పగించినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో సోము స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకులే కాకుండా పార్టీ జాతీయ స్థాయి నాయకులు కూడా జగన్ సర్కార్ పై విమర్శల దాడి పెంచడం, ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ లు విడుదల చేయడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నల్లారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో వైసీసీకి అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందన్నది బీజేపీ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.