ఈ శతాబ్దం ఎన్టీఆర్ దే!
సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. జగదేక సుందర రూపం, నవ నవోన్మేష చైతన్య స్వరూపం తారకరామనామధేయం. ఇటు సినీ జగత్తులోనూ, అటు రాజకీయ రణరంగంలోనూ రాణించిన ప్రతిభా భాస్వంతం. వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించి అన్నింటా అగ్రగామిగా నిలిచి, నిజజీవిత నాటకరంగంలోనూ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, తాతగా, నాయకుడిగా, మహానాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా.. ఇన్ని పాత్రలు గొప్పగా పోషించి అనితరసాధ్యుడు అనిపించుకున్న మహామనీషి ఎన్టీఆర్.తెలుగుజాతి ఉన్నన్నాళ్ళు ఆయన నామం చిరస్మరణీయం. దేవుడు ఎలా ఉంటాడు అంటే తెలుగువాడెవరైనా ఎన్టీఆర్ లా ఉంటాడనే అంటారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలకే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి, నభూతో న భవిష్యతి అన్న కీర్తిని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి చరిత్రకెక్కారు. జాతీయ స్థాయిలో తాము మద్రాసీయులం కాదనీ, తెలుగువారమనీ ఘనంగా చాటిచెప్పి ఢిల్లీ పీఠాన్ని వణికించిన ఘనత సాధించారు ఎన్టీఆర్. తెలుగు ఆత్మగౌరవ బావుటాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదవాడి అన్నంగిన్నెగా మారారు.
చిన్నా పెద్దా తేడా లేకుండా తెలుగువారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్.. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. పేదల కోసం, మహిళల కోసం అహరహం తపించారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, పేదల పాలిట పెన్నిధి అయ్యారు. ఆడపడుచులకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో అందరికీ అన్నగారు అయ్యారు.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు.
సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలు రాయిలా చిరస్థాయిగా నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది. అందుకే ఆయనకు సంబంధించి ఏ చిన్న అంశమైనా తెలుగు వారంతా తమ సొంతంగా భావిస్తారు. ఆయనకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం అయినా తెలుగు జాతి ఉమ్మడిగా కదిలి వస్తుంది. కాగా, ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ముఖచిత్రంతో 100 రూపాయల నాణెంను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కాయిన్‍ను ఆగస్ట్ 28న ఢిల్లీలోని రాజ్ భవన్ కల్చరల్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి నందమూరి కుటుంబీకులు బాలకృష్ణ, జయకృష్ణతోపాటు పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు.
కాగా, ఈ కాయిన్ కు ఇప్పుడు కనీవినీ ఎరుగని డిమాండ్ ఏర్పడింది. ఈ కాయిన్ కు తొలిరోజే విశేష స్పందన లభించింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్.. అందుబాటులో ఉంచిన రెండు పద్దతులలో కూడా తొలి రోజే అవుట్ అఫ్ స్టాక్ బోర్డులు పెట్టేశారు. ఇప్పటి వరకు ఏ స్మారక నాణేనికి లేని డిమాండ్ ఎన్టీఆర్ నాణేనికి ఉందని తొలి రోజే హైదరాబాద్ మింట్ ఫైనాన్స్ జాయింట్ జనరల్ మేనేజర్ గుండపునీడి శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటి వరకూ తీసుకొచ్చిన స్మారక నాణేలు ముద్రించినవన్నీ 10 వేల లోపే చేశామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ స్మారక నాణెం ఒక్కో నాణెం ధర రూ. 3,500 నుంచి రూ. 4,850 వరకు ఉండగా.. మూడు వేరియంట్లలో ఈ నాణెం అందుబాటులోకి తెచ్చారు. తొలి విడతగా 12 వేల ఎన్టీఆర్ స్మారక నాణేలు ముద్రించగా అవి సేల్స్ కి పెట్టిన గంటలలోనే అమ్ముడైపోయాయి. ఆ మాటకొస్తే వేకువజాము నుండే ఎదురుచూసి మరీ ఎన్టీఆర్ అభిమానులు ఈ కాయిన్ సొంతం చేసుకున్నారు. దీంతో మరో 8 వేల కాయిన్స్ కూడా ముద్రించనున్నట్లు మింట్ మేనేజర్ శ్రీనివాస్ అప్పుడే చెప్పుకొచ్చారు.
కాగా, తాజా సమాచారం ప్రకారం రెండో విడతలో 8 వేలు కాదు 40 వేల వరకూ ముద్రించనున్నట్లు తెలుస్తున్నది. ఈ నాణేనికి ఉన్న డిమాండ్ ప్రకారం ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి పురందేశ్వరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ నాణేన్ని పురందేశ్వరి సొంత డబ్బులతోనే ముద్రిస్తున్నారు. ఎన్టీఆర్ స్మారకంగా ప్రభుత్వం మింట్ లో ముద్రణకు అనుమతించగా.. ఇలా ఎన్ని కావాలన్నా మింట్ సిబ్బంది అందించేందుకు సిద్ధంగానే ఉంటారు. గతంలో ఇలా చాలా నాణేలను ముద్రించినా ఒక్క ఎన్టీఆర్ నాణేనికే ఎన్నడూలేని విధంగా ఊహించని డిమాండ్ ఏర్పడింది. పలు చోట్ల కొందరు ఎన్టీఆర్ అభిమానుల ముసుగులో ఈ నాణేలను సొంతం చేసుకొని బ్లాక్ లో కూడా అమ్మకాలు చేపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఈ నాణేల ముద్రణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. తొలి విడతలో 12 వేల నాణేలను తయారు చేయగా రెండో విడతలో 40 వేల వరకు ముద్రించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇందులో కూడా మూడు రకాలలో భారీ డిమాండ్ ఉన్న ఒక రకాన్ని 15 వేలకు పైగా ముద్రించనున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులెవరూ బ్లాక్ లో నాణేలను కొనే సాహసం చేయవద్దని, ఎవరికి నాణెం కావాలన్నా అందరికీ అందుతాయని, త్వరలోనే భారీ స్థాయిలో ఈ నాణేలు అందుబాటులోకి వస్తాయని సోషల్ మీడియాలో అభిమానులు మిగతా అభిమానులను కోరుతూ పోస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్ పుట్టింది 100 సంవత్సరాల క్రితం.. చనిపోయి కూడా 25 సంవత్సరాలు.. అయినా కూడా ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. ఆయన ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదు అన్నది ఈ నాణానికి ఉన్న డిమాండ్ ను బట్టే తెలిసిపోతుంది. అందుకే ఈ శతాబ్దం ఎన్టీఆర్ దే అనడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.