అతి విశ్వాసం జగన్ లక్షణమా?
posted on Sep 4, 2023 7:11AM
ఏపీలో రాజకీయ పరిస్థితులు విచిత్రంగా కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఉందని, ఈసారి ఇక్కడ తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు తేల్చి చెప్పేశాయి. అయినా తెలుగుదేశం ఏ మాత్రం రిలాక్స్ కాకుండా రెట్టింపు ఉత్సహంతో పనిచేస్తున్నది.
ఆ పార్టీ నేతలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకునే ప్రయత్నంలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా బలీయమైన నేతలను రంగంలోకి దింపే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేల ఆధారంగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నది. మరోవైపు ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ.. నాలుగేళ్ళలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజలు ఎన్ని విధాలుగా, ఎంతగా నష్టపోయారో వివరిస్తున్నారు. టీడీపీతో పాటు జనసేన కూడా ఇదే అంశాన్ని సమర్ధవంతంగా ప్రజలలోకి తీసుకు వెడుతోంది. ప్రతిపక్షాల పొత్తుల వ్యవహారం కూడా త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నది.
దాదాపుగా ఏపీలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లి అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకుంటుండగా.. అధికార వైసీపీ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. ప్రతిపక్షాలు టార్గెట్ చేసి ఘాటు విమర్శలకు దిగుతున్నా తిప్పికొట్టేందుకు తమ వద్ద సమాధానం లేదన్నట్లుగా సైలంట్ గా ఉండిపోతోంది. మంత్రుల నుండి ఎమ్మెల్యే వరకూ అంతా సైలెంట్ మోడ్ లోనే ఉంటున్నారు. ఒకవైపు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరగా.. వాటిని అణచివేసే ప్రయత్నం కూడా ఈ పార్టీ అధిష్టానం తూతూ మంత్రంగానే చేస్తున్నది. ఇంకా చెప్పాలంటే అసలు మాకు పోటీనే లేదు.. మా నేతకి సాటే లేదు అన్నట్లు వైసీపీ నేతల తీరు కనిపిస్తున్నది. ద్వితీయ స్థాయి నేత నుండి ఎమ్మెల్యేల వరకూ కొందరికి ఇప్పటికే 2024 సినిమా క్లారిటీ వచ్చినా వారి మాటలను, సూచనలనూ పార్టీ అధిష్టానం పట్టించుకొనే పరిస్థితి లేకుండా పోగా.. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో వైసీపీ పోకడపైనే చర్చ జరుగుతున్నది.
వైసీపీ ఇలా కూల్ గా ఉండడం చూస్తే ఇది ఓవర్ కాన్ఫిన్స్ అనే భావన పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి జగన్ మళ్ళీ గెలుస్తారన్న పిచ్చి భ్రమల్లో ఉన్న నేతలు కొందరు.. అసలు సంగతి మరచి పార్టీ పెద్దలను కూడా అదే మాయలో ఉంచుతున్నారన్న భావన కలుగుతున్నది. పేదలకు డబ్బులు పంచేశాం వాళ్లే మనల్ని గట్టెక్కిస్తారని ఆ పార్టీ పెద్దలు కూడా సీఎం వద్ద బాకాలు ఊదుతున్నట్లు తెలుస్తున్నది. ఇంటింటికీ మీ డబ్బులు జమ అయ్యాయని వాళ్ళెవరూ మిమ్మల్ని మర్చిపోరని సీఎంను ఆకాశాన్ని ఎత్తేస్తుండడంతో ఆయన ఊహాలోకాల్లో విహరిస్తున్నారనీ, చివరికి పార్టీ నేతల కుమ్ములాటను కూడా సీఎం వద్ద పార్టీకి అనుకూల అంశంగానే ప్రచారం చేస్తున్నారని వైసీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నది. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనే నేతలు టికెట్ల కోసం కొట్టుకుంటున్నారని.. అదేమీ పెద్ద సమస్య కాదని, తామెళ్లి చిటికెలో వాటిని క్లియర్ చేస్తామని కొందరు బడా నేతలు సీఎం వద్ద చెప్పి మెప్పు పొందుతున్నట్లు చెబుతున్నారు,
అయితే, ప్రభుత్వం డబ్బులు పంచితే ప్రజలు పార్టీకి ఓటేసే రోజులు పోయాయి. చివరికి పార్టీ సొంత డబ్బులే ఎన్నికలకు ముందు రోజు ఓటర్ల చేతిలో పెట్టినా ఓటు పడుతుందన్న గ్యారంటీ లేదు. అందునా గత ప్రభుత్వానికి మించి ఈ ప్రభుత్వం ఇచ్చింది లేదని ఇప్పటికే లెక్కలు తేలాయి. దీనికి తోడు పూర్తిగా పథకాలు రాని వాళ్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఉద్యోగులు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామా అని ఉన్నారు. వైన్ షాపుల వద్ద కాపాలా కాసిన టీచర్లు, నిత్యం బెదిరింపులు అనుభవిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు, కక్ష పూరిత రాజకీయాల పాపం మోస్తున్న పోలీసులు అందరూ ఇలా వారి వంతు అవకాశం కోసం చూస్తున్నారు. జగన్ అంటే నమ్మకం అనుకున్న యువత నిండా మునిగాక ఇప్పడు జగన్ అంటే మోసానికి షర్ట్ ప్యాంట్ వేసిన రూపమేనని మాట్లాడుకుంటున్నారు.
భవన నిర్మాణ కార్మికులు అనుభవించిన ఆకలి బాధలు నేటికీ మర్చిపోలేకపోతున్నారు. మందుబాబులు ప్రతిరోజూ ఒక్కసారైనా సీఎంను తలచుకుని తిట్టుకోకుండా ఉండలేకపోతున్నారు. కోర్టులో మొట్టికాయలు, ఇంత వరకూ తేలని సొంత బాబాయ్ హత్య కేసు, కోడికత్తి కేసు, సీఎం సొంత తల్లి, చెల్లిని తరిమేయడం.. ఇలా చెప్పుకుంటూ పొతే చాంతాడంత లిస్టు. దీంతో ప్రతి వర్గంలోనూ అసంతృప్తి కనిపిస్తున్నది. ఇదేమీ జగన్ కళ్ళకు కనిపించడం లేదంటే చుట్టూ చేరిన నేతలు ఆయన్ను ఏస్థాయిలో భ్రమల్లో ముంచేశారో అర్ధం చేసుకోవచ్చు.