గులాబీ బాస్ కోటకు బీటలు!?
posted on Sep 2, 2023 @ 3:42PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? రాష్ట్రంలో రాజకీయాలను తనయుడు కేటీఆర్ కు అప్పగించేసి తాను జాతీయ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించే లక్ష్యంతో లోక్ సభకు పోటీ చేస్తారా? అన్న అనుమానాలు నిన్న మొన్నటి వరకూ కొందరిలోనై ఉండేవి. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఒక స్థానం నుంచి కాదు ఏకంగా రెండు స్థానాల నుంచి పోటీకి నిలబడతానంటూ ప్రకటించడంతో ఆయన జాతీయ రాజకీయాల ప్రకటనలన్నీ రాజకీయ పబ్బం కోసం చేసినవేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే ఆయన తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్నది ప్రకటించడానికి ముందే.. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ తాను ప్రత్యర్థిగా పోటీలోకి దిగుతామంటూ ప్రకటనలు చేస్తున్న వారి సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే గజ్వేల్ నుంచి కేసీఆర్ ప్రత్యర్థిగా తాను రంగంలోకి దిగుతానంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రకటించారు. అంతే కాకుండా ఆ మేరకు బీజేపీ అధిష్ఠానం అనుమతి కూడా కోరానని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, బీజేపీ నేత సువేందు అధికారి ఓడించిన విధంగా ఇక్కడ తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మరో బీజేపీ ఎమ్మెల్యే, రఘునందన రావు కూడా పార్టీ ఆదేశిస్తే, ముఖ్యమంత్రి పై పోటీ చేసేందుకు తాను సిద్దమని ప్రకటించేశారు.
ఇప్పుడు కేసీఆర్ తాను స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తన బలహీనతను తానే చాటుకున్నారు. గజ్వేల్ లో తనకు ఎదురుగాలి వీస్తున్నదని ఆయన పరోక్షంగా అంగీకరించేసినట్లైంది. రెండో నియోజవకర్గంగా ఆయన కామారెడ్డిని ఎంచుకోవడంతో బీజేపీ ఎంపీ అర్వింద్ తాను కేసీఆర్ పై పోటీకి సిద్ధమని సవాల్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే బీఆర్ఎస్ ను బహిష్కృతుడైన తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ కు తాజాగా ఓ సవాల్ విసిరారు. గజ్వేల్, కామారెడ్డి కాదు.. ఖమ్మంలోని మూడు జనరల్ స్థానాలలో ఒక స్థానం నించి కేసీఆర్ పోటీ చేయాలనీ, ఆయన ఏ స్థానాన్నిఎంచుకున్నా సరే ఆయనకు ప్రత్యర్థిగా తాను నిలబడతాననీ, ఒక వేళ తాను పరాజయం పాలైతే రాజకీయ సన్యాసం చేస్తాననీ సవాల్ విసిరారు.
తెలంగాణ ఉద్యమ నేతగా, ప్రత్యేక రాష్ట్రం సాధించిన నేతగా ఇప్పటి వరకూ తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్ ఈ సారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారనడానికి ఆయనపై పోటీ చేసి గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటమే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఇంకెంత మాత్రం తిరుగులేని శక్తిగా లేదనీ, అలాగే కేసీఆర్ కూడా గతంలోలా బలమైన నాయకుడిగా లేరనీ అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో గులాబీ కోటకే కాదు.. కేసీఆర్ నాయకత్వ సౌధం కూడా బీటలు వారిందని చెబుతున్నారు.