కారు జోరుకు సైకిల్ బ్రేకులేసేనా?
posted on Sep 1, 2023 @ 10:22AM
ముచ్చటగా మూడోసారి అధికారం అందుకోవడం కోసం.. కారు పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోన్నారు. ఆ క్రమంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో ఈ జాబితాలో పేర్లు గల్లంతైన సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాదు.. ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ అభ్యర్థుల్లో సైతం అసమ్మతి జ్వాల పెల్లుబికుతోందిని.. వారిని సైతం చల్లబరిచేందుకు కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే రంగంలోకి దిగి.. తమ వంతు ప్రయత్నాలు చేపట్టిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఫ్యామిలీలో పసుపు పార్టీ భయం అంతర్గతంగా పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం విశ్లేషిస్తున్నారు.
ఎందుకంటే.. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించడమే కాదు.. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను దింపుతామని ఆయన పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఎన్నీ సెంటర్... సింగిల్ హ్యాండ్ అన్నట్లుగా పోటీకి దిగుబోతున్నట్లుగా పసుపు పార్టీ శ్రేణులకు చంద్రబాబు ప్రకటన ఓ క్లారిటీ ఇచ్చినట్లు అయిందని.. అలాంటి వేళ రానున్న ఎన్నికల్లో సైకిల్ పార్టీ వల్ల.. కారు పార్టీ విజయావకాశాలకు బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అయితే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికార పీఠాన్ని కైవనం చేసుకోవాలని.. బీజేపీ అగ్రనేతలు ప్రణాళిక బద్దంగా దూసుకెళ్తున్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ సైతం దూకుడుగా ముందుకు వెళ్తోంది. అదీకాక కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు హస్తం పార్టీకి అనుకూలంగా రావడంతో.. తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపినట్లు అయింది. దీంతో ఎలాగైనా గెలువాలనే ఓ పట్టుదలతో.. ఆ దిశగా హస్తం పార్టీ శ్రేణులు ముందుకు కదులుతోన్నాయి.
ఇంకోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలన సాగించినా.. అభివృద్ధి, సంక్షేమం మాత్రం అరకొరగానే జరిగిందని... కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ విశ్వనగరంగా పునాదులు వేసుకొందని.. అప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు మాత్రమే ఉంటే.. వాటికి అదనంగా సైబరాబాద్ మహానగరం పురుడు పోసుకుందని.. ఈ విషయాన్ని తెలంగాణలోని ప్రస్తుత అధికార గులాబీ పార్టీలోని అగ్రనేతలు సైతం వివిధ వేదికల మీద ఒప్పుకొన్నారని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
అలాగే ఇటీవల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపట్టారని.. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. అలాగే ఈ దశాబ్ది కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి , అదేవిధంగా ఆయా ప్రభుత్వాలు తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు, ఇక హైదరాబాద్ నగరాభివృద్ధి నాడు ఎలా ఉంది.. నేడు ఎలా ఉంది.. తదితర అంశాలను ప్రజలకు వివరించడంలో.. సైకిల్ పార్టీ శ్రేణులు.. యమ స్పీడ్‌గా దూసుకుపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో బీజేపీ కానీ, వామపక్షాలు కానీ అధికారాన్ని చేపట్టింది లేదని.. కానీ కేంద్రంలో బీజేపీ పాలన ఎలా సాగుతోందో మోదీ పరిపాలనతో అందరికీ అర్థమైందని.. అలాంటి వేళ.. రానున్న ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన ఓట్లు.. భారీగా చీలి.. అవి తెలుగుదేశం పార్టీకి పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని... దీంతో గులాబీ బాస్ కూర్చికి ఎసరు పట్టే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అదీకాక.. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందిందని... దీంతో తెలంగాణ వాదం కాస్తా అవిరైపోయిందని.. సరిగ్గా ఆదే సమయంలో ఖమ్మం వేదికగా గతేడాది చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన శంఖారావ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయిందని.. దీంతో ఆ నాటి నుంచి తెలంగాణలో సైకిల్ పార్టీ తన పూర్వ వైభవాన్ని చాటు కొనేందుకు చేపట్టిన ప్రతీ చర్య.. సఫలీకృతమవుతు వస్తుందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.