గజమాలలు.. లోకేష్ పాదయాత్రలో కొత్త ఒరవడి!
అడుగడుగునా అభిమానుల పలకరింపులు.. వారితో కుశల ప్రశ్నలు, యువతీయువకులతో భవిష్యత్తుపై చర్చ, అవ్వతాతలతో క్షేమం.. సంక్షేమంపై ప్రశ్నలు, అంకుల్ ఆంటీలతో మాట మంతి, యువతీయువకులతో సెల్పీలు, చిన్నారులకు చాకెట్లు, సభలు, సమావేశాలు వీటికి పోటెత్తుతోన్న జనం..ప్రభంజనం.. గజమాలలతో స్వాగతం.., పూల వర్షంతో సుస్వాగతం.. అక్కడక్కడా శాలువాలతో సత్కారం, మహిళా లోకం ఇస్తున్న హరతులు టోటల్‌గా నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైన ఉమ్మడి చిత్తూరు జిల్లా మొదలుకొని.. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాల మీదుగా ప్రస్తుత పాదయాత్ర జరుగుతోన్న పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం అడుగడుగునా కనిపిస్తున్న దృశ్యాలు.
అయితే ఈ పాదయాత్రలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంటున్నది. నారా లోకేశ్ పాదయాత్రలో వివిధ ప్రాంతాల్లో ఆయనకు గజమాలలతో పార్టీ శ్రేణులు, ప్రజలు స్వాగతం పలుకున్నారు. అది కూడా చాలా వెరైటీల గజమాలలు రూపొందించి.. వాటితో లోకేశ్‌కు స్వాగతం పలుకుతుండడం.. పార్టీ శ్రేణులనే కాదు.. ప్రజలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
సాధారణంగా.. బంతిపూల గజమాలలో.. లేదా గులాబీల గజమాలలు ఉంటాయి. కానీ కూరగాయాలు, టమాటాలు, ఎండు మిర్చి, కూరగాయాల్లో కూడా ఆల్ వెరైటీలు, చేపలు, అరటి కాయలు, కొబ్బరి బొండాలు, అరిసెలు, పంపరపనస కాయలు.. అలాగే నారా లోకేశ్ యువగళం పేరుతో చిన్న సైజ్ కార్డులతో రూపొందించిన గజమాలలతో నారా లోకేశ్‌కు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలకో.. పార్టీ శ్రేణులకో వస్తున్న ఆలోచనలకు ఓ కార్యరూపం ఇస్తూ.. వివిధ రకాల వస్తువులు, పదార్ధాలతో గజమాలలు తయారు చేసి వాటితో లోకేష్ కు స్వాగతం పలుకుతున్నారు. దీంతో వివిధ రకాల గజమాలలు లోకేశ్ పాదయాత్రలో అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాదు.. ఇటువంటి... ఇలాంటి.. ఈ తరహా వెరైటీ గజమాలలు.. గతంలో రాష్ట్రంలో పాదయాత్ర చేసిన ఏ రాజకీయ నాయకుడికి వేయలేదని.. ఆ గౌరవం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మాత్రమే దక్కింది.
జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకొన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడమే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైంది. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు, తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజా సమస్యలు తీరుస్తామంటూ ప్రజలకు నారా లోకేశ్ స్పష్టమైన భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ క్రమంలో ఆయన చేపట్టిన పాదయాత్ర 2 వందల రోజులు దాటగా... దాదాపు 3 వేల కిలోమీటర్ల చేరువలో ఉంది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఈ పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. లక్ష్యసాధన దిశగా.. నారా లోకేశ్ అడుగులు వడి వడిగా దూసుకు వెళ్తున్నాయి.