టీటీడీ కర్రలు చూసి చిరుతలు భయపడి బొన్లో కొచ్చేస్తున్నాయా? ఏమిటీ జగన్మాయ

గత నెలలో తిరుమల నడకదారిలో  చిరుత పులి నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే  అభం శుభం తెలియని చిన్నారిపై దాడి చేసి చంపేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చిరుతల నుంచి రక్షణ కోసం టీటీడీ పలు రకాల చర్యలను ప్రతిపాదించింది. వెంటనే వాటిని అమలు చేస్తామని ఘనంగా చాటింది.  ముందుగా పులుల జాడ కనిపెట్టేలా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పులులను బంధించేందుకు బోనులను ఏర్పాటు చేశారు. ఆ తరువాత   తర్వాత నడక దారిన  వేళ్ళే భక్తులకు  చేతి కర్రలను అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అంతే కానీ వన్యప్రాణులు నడక దారి భక్తులపై దాడులను నిరోధించేందుకు ఆ మార్గంలో ఒక ఫెన్సింగ్ నిర్మించాలన్న ప్రతిపాదనపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. భారీ వ్యయం అవుతుందని, అందుకు టీటీడీ వెనకాడుతోందని భావించడానికి వీల్లేదు. ప్రతి రోజూ శ్రీవారి హుండీ ఆదాయం కోట్లలోనే ఉంటుంది. శ్రీవారి భక్తుల రక్షణ కోసం ఆ హుండీ ఆదాయాన్ని వాడుకోవచ్చు. కానీ ఆ దిశగా టీటీడీ చర్యలు తీసుకోవడం లేదు. కేవలం కర్రలు పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకుని ఆ పని చేసి చేతులు దులిపేసుకుంటున్నది. కర్రలు పంపిణీ చేసి వన్యప్రాణులను తరిమేయవచ్చని టీటీడీ భక్తులకు చెబుతోంది. ఈ కర్రలను అలిపిరిలో  కర్రలు అందించే టీటీడీ కొండపై వీటిని తిరిగి తీసేసుకుంటుందట. సరే అదలా వదిలేస్తే భక్తులు వారి రక్షణ వారే చూసుకోవాలంటూ కర్రలను పంపిణీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.   క్రూర మృగాలు ఎప్పుడు ఎటు వైపు నుండి దాడి చేస్తాయో తెలియక బిక్కుబిక్కుమంటూ ఆ ఏడుకొండలవాడిపైనే భారం వేసి కాలి నడకన వెళ్తున్న భక్తులు చేతి కర్రలతో ఏం చేయాలని టీటీడీని సామాజిక మాధ్యమం సాక్షిగా నెటిజన్లు సెటైర్లు వేశారు. పులులు, సింహాలను కర్రలతో  భక్తుల తరిమికొట్టగలరా? అంటు నిలదీస్తున్నారు.  సరే కర్రల పంపిణీ సంగతి అలా ఉంచితే.. స్వల్ప వ్యవధిలో అలిపిరి నడకమార్గంలో ఐదు చిరుతలను బంధించినట్లు అటవీశాఖ, టీటీడీ అధికారులు తెలిపారు.  మరో రెండు చిరుతల కదలికలను గుర్తించామని అంటున్నారు. అయితే తిరుమల నడక దారిలో బాలికను బలితీసుకున్న చిరుత పులి ఈ బంధించిన ఐదు చిరుతలలో ఉందో లేదో చెప్పలేమంటున్నారు అధికారులు. అయినా ఇంత కాలం ఎన్ని ప్రయత్నాలు చేసిన పట్టుబడని చిరుతలు టీటీడీ భక్తులకు కర్రలు అందించడం ప్రారంభించగానే  భయపడి.. వాటంతట అవే వచ్చి బోనుల్లో కూర్చుంటున్నాయా? అసలు టీటీడీ నిజంగా ఐదు  చిరుతలను బంధించిందా? మరో రెండు చిరుతల సంచారాన్ని గుర్తించామని టీటీడీ చెబుతోంది. ఒక్కసారిగా ఇన్ని చిరుతలు నడకమార్గం సమీపంలో సంచరించడమేమిటి? అడవిలో వాటి జీవనానికి ఆటంకం కలిగేలా ఏవైనా కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయా? అలాగే   బంధించిన చిరుతలను ఎస్వీ జూ పార్క్ కు తరలించి వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్న అధికారులు.. అందులో ఏ చిరుత డీఎన్ఏ ద్వారా చనిపోయిన లక్షితను చంపిందో తెలుసుకోడానికి కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. లక్షితను చంపిన చిరుత ఏదో తెలితే మిగిలిన చిరుతలను దూరంగా ఉన్న చిట్టడవి ప్రాంతాల్లో వదిలిపెడతామంటున్నారు. అలాగే లక్షితపై దాడి చేసిన చిరుత దొరికితే కొన్ని నెలలు దాన్ని జూలోనే ఉంచి తగినంత మార్పు వచ్చిన తరువాత అడవిలో వదిలేస్తామని, ఒకవేళ మనిషి రక్తం రుచి మరిగిన ఆ చిరుతలో మార్పు రాకపోతే కేంద్ర అధికారుల అనుమతితో చంపడం చేయాల్సి వుంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ సాధారణంగా చెప్పే విషయాలే. అయితే ఇక్కడే అధికారుల తీరు, మాటలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వన్యప్రాణులు తిరుమల నడక మార్గానికి సమీపంలోకి రాకుండా చర్యలు తీసుకోవడం మాని అసలు సింహాచలం అడవులలో వన్యప్రాణులనేవే ఉండకుండా చేయాలన్న దుర్మార్గమైన యోచన ఏదైనా అదికారులలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  శేషాచలం అడవులను వన్యప్రాణ రహిత ప్రాంతంగా మార్చేయాలన్న అటవీ శాఖ అధికారుల చర్యలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అడవి నుండి మృగాలు తిరుమల మార్గంలోకి వచ్చే దారిలో రైలింగ్ వాల్స్ ఎత్తు పెంచడం.. నడక మార్గంలోకి అడవి నుండి మృగాలు వచ్చే అవకాశం ఉన్న చోట ఐరన్ గ్రిల్స్ తో జాలీలను ఏర్పాటు చేయడం వంటివి చేయవచ్చు. కానీ, టీటీడీ అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోకుండా అడవి మీద పడడం చూస్తే జగన్ ప్రభుత్వ దోపిడీ ఖాతాలో ఈ అటవీ ప్రాంతం కూడా చేరిపోయిందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే తిరుమలకు నడక దారిలో వచ్చే భక్తుల సంఖ్యను భారీగా తగ్గించే ప్రణాళికలో భాగంగానే  ఈ చిరుతల సంచారానికి దోహదపడేలా చేస్తున్నారాభక్తుల రద్దీని తగ్గించే ఆలోచన చేస్తుందా అన్న అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి.  గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేంకటేశ్వరస్వామికి ఏడు కొండలు ఎందుకు.. రెండు కొండలు సరిపోవా అని అసెంబ్లీ సాక్షిగా వాక్రుచ్చారు. ఇప్పుడు ఆయన కుమారుడు  ఏపీ సీఎంగా ఉన్నారు. తన తండ్రి మాటలను నిజం చేసే కార్యక్రమాన్ని ఆయన మొదలెట్టారా? అని పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  ఒకవైపు శేషాచలం అడవులలో వైసీపీ ప్రభుత్వ అండదండలతో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే  నడకదారిలో వెళ్లే భక్తులకు రక్షణ చర్యలు తీసుకోకుండా  అసలా దారిలో వెళ్లే భక్తులను భయభ్రాంతులకు గురి చేసి పూర్తిగా అలిపిరి నడకాదారిలో వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులకు క్రియేట్ చేసి, వన్యప్రాణఉల సంచారాన్ని సాకుగా చూపి శేషాచలం అడవుల్లో  క్రూర మృగాలను అడ్డు లేకుండా చేసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తం మీద  అలిపిరి నడకదారిలో పెద్ద ఎత్తున చిరుతలు పట్టుబడుతుండటం, అయినా వాటి సంచారం కొనసాగుతూనే ఉందని అధికారులు చెబుతుండటం వెనుక మరో కారణమేదో ఉందని.. అందుమే అలిపిరి నడకమార్గం నుంచి  తిరుమల వెళ్లాలన్న ఉద్దేశాన్ని భక్తులలో తొలగించేలా చేయడం కోసమే చిరుతల సంచారం, భక్తులకు మేం భద్రత కల్పించలేం, మీ భద్రత మీరే చూసుకోండంటూ టీటీడీ భక్తులకు కర్రలు పంపిణీ చేస్తోందనీ అంటున్నారు. మరి శేషాచలం అడవులలో ఏం జరుగుతోంది. అక్రమ కార్యకలాపాలేమిటి? వాటిని సాగిస్తున్నవారెవరు వంటి విషయాలు తెలియాలంటే ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు, అదీ కేంద్ర దర్యాప్తు సంస్థ చేత చేయిస్తేనే అసలు వాస్తవాలు బయటపడతాయని పరిశీలకులు అంటున్నారు. 

జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని.. లూద్రా

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన తెలుగుదేశం అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలసిందే. శుక్రవారం (సెప్టెంబర్ 9)అర్ధరాత్రి దాటిన తరువాత నెల్లూరులో ఆయనను నిర్బంధంలోకి తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు  శనివారం (సెప్టెంబర్ 10)తెల్లవారు జామున అరెస్టు చేసినట్లు ప్రకటించి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. ఆదివారం(సెప్టెంబర్ 10) రాత్రి వరకూ విచారణ, వైద్యపరీక్షలు, కోర్టులో వాదనల అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.  దీంతో ఆదివారం (సెప్టెంబర్ 10) రాత్రి ఆయనను విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.  కోర్టు ఆదేశాల మేరకు   ప్రత్యేక గదిని కేటాయించారు. ఇక జైలు అధికారులు చంద్రబాబుకు ఖైదీ నెంబర్ 7691ను కేటాయించారు. దీంతో 45 ఏండ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు తొలి సారిగా  జైలుకు వెళ్లినట్లైంది.  జైలులో  చంద్రబాబుకు ఐదుగురు సిబ్బందితో భద్రతా కల్పించారు. అంతే కాకుండా జైల్లో ఆయనకు ఓ వ్యక్తిగత సహయకుడు ఉండేందుకు కూడా అనుమతి ఇచ్చారు. అలాగూ జైల్లో చంద్రబాబుకు ఇంటి నుంచి అల్ఫాహారం, భోజనం, మెడిసన్‌కు అనుమతి ఇవ్వాలన్న కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు అవకాశం కల్పించారు.  చంద్రబాబును ఉంచిన రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే రాజమహేంద్రవరంలో సెక్షన్ 30 ఆంక్షలను విధించారు. సోమవారం (సెప్టెంబర్ 11) జైలు ఆవరణలోనే చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్ కు ఎదురుగా ఉన్న జైలు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.  చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి ములాఖత్ ద్వారా కలిశారు. అదలా ఉండగా  జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ఆయన తరఫు న్యాయవాది  లూద్రా పేర్కొన్నారు. సోమవారం (సెప్టెంబర్ 11) ఆయన  ఏసీబీ కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా హైకోర్టులో కూడా చంద్రబాబు బెయిలు కోసం హైస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.   అదలా ఉండగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో  సీఐడీ తరఫున వాదించిన  సిఐడి తరఫున  వాధించిన న్యాయవాది సుధాకర్ రెడ్డి కి 4+4 గన్ మన్ లతో తో భద్రత  కల్పిస్తూ జగన్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.  

బాబుకు సర్వత్రా సంఘీభావం- ప్రజలను కదిలించిన లోకేష్ బహిరంగ లేఖ

స్కిల్ డెవలప్ మెంట్ కేసు మెరిట్ లు డీమెరిట్ తో సంబంధం లేదు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన తీరుకు సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఆయనకు మద్దతు లభిస్తోంది. తమ కూటమిలో లేకపోయినా విపక్షాల ఐక్య కూటమి ఇండియా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండించింది. ఏపీలో జగన్ అరాచక పాలనకు ఇది నిలువెత్తు నిదర్శనమనీ, జగన్ అరాచక పాలనకు కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నదని ఇండియా పేర్కొంది. ఏపీలో జగన్, కేంద్రంలో మోడీ ఇద్దరూ కూడా నియంతృత్వ పోకడలకు పోతున్నారనీ, ప్రజాస్వామ్యాన్ని దేశ రాజ్యాంగాన్ని ఆపహాస్యం చేస్తున్నారనీ ఇండియా పేర్కొంది. ఇక ఏపీలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిన్న మొన్నటి వరకూ దేశం పేరు భారత్ అని మార్చడాన్ని స్వాగతించిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు అరెస్టు తీరును తీవ్రంగా ఖండిస్తూ రోడ్డుపైకి రావడం, నడి రోడ్డుపై పడుకోవడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని  కనీసం బయటకు రానీయడం లేదన్న సంకేతాన్ని బలంగా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా లోకేష్ కు స్వయంగా ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పడం తో పాటు పూర్తి సంఘీభావం ప్రకటించారు. సైకో జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదామని లోకేష్ కు పవన్ చెప్పారు. తెలుగుదేశం అధినేతను జగన్ సర్కార్ అరెస్టు చేసిన నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ లోకేష్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. ప్రజల తరఫున నిలబడి పోరాడుతున్న విపక్ష నేతను అక్రమంగా అరెస్టు చేయడం అన్నది జగన్ కు రివాజుగా మారిపోయిందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.   రాష్ట్రం నలుమూలల నుంచీ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ, విపక్ష నేతలను హౌస్ అరెస్టులు చేస్తూ రాష్ట్రం మొత్తాన్ని జైలుగా మార్చేసిన నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా.. బాధతో బరువెక్కిన హృదయంతో, కన్నీళ్లతో తడిసిన గుండెతో ఈరోజు మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ - తెలుగుప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన హృదయాన్నీ - ఆత్మనూ ధారపోస్తూ ఉండటం కనులారా చూస్తూ నేను పెరిగాను. లక్షలాది తెలుగుప్రజల జీవితాలను అభివృద్దికరంగా మార్చడానికే అవిశ్రాంతంగా శ్రమిస్తూ ప్రయత్నిస్తున్న ఆయనకి విశ్రాంతి అనే ఒక రోజే తెలియదు. తన రాజకీయాలు ఎల్లప్పుడూ గౌరవం - నిజాయితీతో కొనసాగటం అందరికీ తెలిసిందే! తను సేవ చేసిన వారి ప్రేమ - కృతజ్ఞతల నుండి ఆయన మరింత లోతైన ప్రేరణను పొందుతూ మరింతగా సేవల్లో మునిగిపోవటమే నేను నిరంతరం చూశాను. ప్రజల హృదయపూర్వక కృతజ్ఞతలు చాలు వారికి.. స్వచ్ఛమైన ఆనందంతో వారి హృదయం ఆయన్ని నిరంతరం ఆనందసాగరంలో ఉంచేది, ఇది ఒక చిన్న బాలుడు పొందే ఆనందంతో సమానం. నేను కూడా ఆయన నడిచే గొప్ప మార్గం నుండి ప్రేరణ పొందాను - తన అడుగుజాడలనే అనుసరించాను. అమెరికాలో ఎంతో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చాను. ఇది నాకు చాలా కఠినమైన నిర్ణయం, కానీ నాకు మన దేశం, మన వ్యవస్థలు, మన పునాది సూత్రాలు - అన్నింటికంటే మించి మన రాజ్యాంగంపై నమ్మకం, గౌరవాలపై ఎంతో విశ్వాసం ఉంది. ఐనప్పటికీ, ఈ రోజు, మా నాన్న ఎప్పుడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే, నా కోపం ఉప్పొంగింది - నా రక్తం ఉడికిపోతుంది. 'రాజకీయపగ' అనే సముద్రం ఆయనను ముంచేసే లోతులకు హద్దులే లేవా? తన దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఇన్నిన్ని ఘనకార్యాలు చేసిన నాన్నగారి స్థాయి వ్యక్తి.. ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలి? ఎందుకంటే?! తను ఎప్పుడూ పగ రాజకీయాలకు లేదా విధ్వంసక రాజకీయాలకు దిగలేదు.. తను ఇతరుల కంటే చాలా ముందే మన ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం  - అవకాశాలను ఊహించి, ఆ దిశగా కృషి చేసినందుకా? ఇదంతా చూస్తుంటే ఈరోజు ఒక నమ్మకద్రోహంలా అనిపిస్తుంది. కానీ, మా నాన్న పోరాట యోధుడు. నేనూ అలాగే స్ఫూర్తి పొందాను. ఆంధ్రప్రదేశ్ - ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్పంతో మార్గనిర్దేశం చేస్తూ ఈ అన్యాయం నుంచి బైటపడి తిరుగులేని శక్తిగా తిరిగి ఎదుగుతాం. ఈ యుద్ధంలో ప్రజలే అంతిమంగా గెలవాలి! అందుకోసం నాతో మీరంతా కలిసి రావాలనీ మనందరికోసం నేను మిమ్మల్ని కోరుతున్నాను. - మీ లోకేష్ నారా లోకేష్ రాసిన ఈ ఉద్వేగ పూరిత ఈ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు స్వచ్ఛందంగా లోకేష్ కు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు దుర్మార్గమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజాగ్రహ జ్వాల వచ్చే ఎన్నికలలో జగన్ అధికారాన్ని దహించి వేయడం ఖాయమని నెటిజన్లు గట్టిగా చెబుతున్నారు. నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా రాసిన ఈ లేఖను నెటిజన్లు రీట్వీట్ చేయడమే కాక భారీగా షేర్ చేస్తున్నారు. 

స్కిల్ కేసులో చంద్రబాబు విచారణను పర్యవేక్షించిందెవరో తెలుసా?

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబును అరెస్టు చేయడానికి సీఐడీ పోలీసులు ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో రాష్ట్రం మొత్తం శుక్రవారం అర్ధరాత్రి నుంచీ గమనిస్తూనే ఉంది.   మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును.. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టు చేసిన సీఐడీ పోలీసుల విచారణ తీరును  విపక్షాలు, న్యాయనిపుణులు, పరిశీలకులే కాదు..సామాన్యజనం కూడా తప్పుపడుతున్నారు. అసలు మొత్తంగా సీఐడీ చంద్రబాబునాయుడును విచారిస్తున్న ఫొటో, వీడియో సామాజిక మాధ్యమంలో రచ్చరచ్చ చేస్తున్నాయి.  చంద్రబాబు  విచారణకు   కనీసం చంద్రబాబు న్యాయవాదులను సైతం అనుమతించని సీఐడి ఒక మీడియా ఫొటోగ్రాఫర్ కు మాత్రం రెడ్డ కార్పెట్ పరిచి మరీ అనుమతి ఇచ్చింది.   నంద్యాల నుంచి విజయవాడ సిట్ ఆఫీసుకు తీసుకువచ్చిన చంద్రబాబును, సీఐడీ ఉన్నతాధికారులు గంటల తరబడి సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే.   తన తండ్రిని చూసేందుకు లోకేష్, , తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, మామ బాలకృష్ణతో కలిసి  సిట్ కార్యాలయానికి వచ్చారు. కానీ సిట్ అధికారులు మాత్రం  చంద్రబాబు నాయుడు ఉన్న పై అంతస్తులోకి వారిని అనుమతించలేదు. గంటల తరబడి వారు కింద ఫ్లోర్‌లోనే వేచిచూడాల్సి వచ్చింది.  తరువాత ఎప్పుడో చంద్రబాబును కలిసేందుకు వారికి అనమతించారు.  చంద్రబాబు  అధైర్యపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. అదలా ఉంచితే చంద్రబాబు విచారణ సమయంలో తాము కూడా ఆయన వెంట ఉంటామంటూ వచ్చిన తెలుగుదేశం లీగల్ సెల్ న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. ఆయనతో ఏమైనా మాట్లాడాలంటే కోర్టు హాలులోనే మాట్లాడుకోండంటూ నిష్కర్షగా చెప్పారు. కానీ చంద్రబాబును విచారిస్తున్న చోటికి మాత్రం ఓ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ను పోలీసులు రాచమర్యాదలతో అనుమతించారు. చంద్రబాబును విచారిస్తున్న సిట్ అధికారుల పక్కనే ఆ ఫొటో గ్రాఫర్ ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో  విపరీతంగా వైరల్ అవుతోంది.   సిట్ కార్యాలయం వద్దకు మీడియాను అనుమతించని పోలీసులు ఏకంగా ఒక ఫొటో గ్రాఫర్ ను విచారణ గదిలోనికి ఎలా అనుమతించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విపక్ష నేతలు సైతం ఫొటోగ్రాఫర్ ను అనుమతించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  చంద్రబాబు విచారణను పర్యవేక్షిస్తున్నది పోలీసులా.. అధికార పార్టీ మీడియా ప్రతినిథులా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.  న్యాయవాదులకే అనుమతి నిరాకరించిన  పోలీసులు, ఆ ఫొటోగ్రాఫర్‌ను ఎలా, ఎందుకు  అనుమతించారు? ఆయన ఏమైనా  ప్రత్యేక ఆహ్వానితుడా? అంటు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.   అధికార పార్టీ ఫొటోగ్రాఫర్‌ను అనుమతించిన పోలీసు అధికారిపై  చర్యలు తీసుకోవాలని   డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతామని   తెలుగుదేశం లీగల్ సెల్ నేతలు స్పష్టం చేశారు.  జగన్ హయాంలో పోలీసుల విచారణ ఇలా హాస్యాస్పదంగా, ఒక ఫార్సుగా మారిపోయిందని అంటున్నారు.  ఇలా ఉండగా ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ ఇచ్చిన తరువాత ఏపీ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు విధించారు. ఏపీ మొత్తం 144వ సెక్షన్ విధించారు. కానీ అంతకు ముందు నుంచే రాష్ట్రంలో జనం స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నుంచీ ఆదివారం చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువడేంత వరకూ రాష్ట్రం మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. జనం అంతా టీవీలకు అతుక్కుపోయి ప్రొసీడింగ్స్ ను నిశితంగా గమనిస్తూ ఇళ్లకే పరిమితమైపోయారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, ఆయనను సిట్ ఆఫీసు నుంచి ప్రభుత్వాసుపత్రికి అక్కడ నుంచి మళ్లీ సిట్ ఆఫీసుకూ తిప్పిన తీరును తీవ్రంగా నిరసించారు. కనీసం రిమాండ్ రిపోర్టు తయారు చేయడానికే  సీఐడీ పడిన ప్రయాసను గమనించారు. చంద్రబాబుపై కక్ష సాధింపు ధోరణి వినా కేసులో మెరిట్స్ ఏవీ లేవన్న విశ్లేషకుల అభిప్రాయంతో వారు పూర్తిగా ఏకీభవించారు. రాష్ట్రం మొత్తం పోలీసుల కంట్రోల్ లో పెట్టి బంద్ ను నిరసనలను అడ్డుకుని చంద్రబాబును అరెస్టు చేస్తే జనంలో కదలిక లేదన్న బిల్డప్ ఇవ్వడానికి అధికార వైసీపీ, జగన్ సర్కార్ ఎంతగా తాపత్రేయపడినా, రోజా వంటి మంత్రులు సంబరాలు చేసుకున్నా జనం మాత్రం బాబుకు రిమాండ్ విధించిన తరువాత స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అరెస్టులకు బెదరకుండా రోడ్లపైకి వస్తున్నారు. బాబు అరెస్టుకు నిరసనగా సీఎం జగన్ బసచేసిన లండన్ నివాసం వద్ద ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారంటేనే తెలుగు వారిలో చంద్రబాబు అరెస్టు తీరు పట్ల ఎంతటి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయో అర్ధమౌతోందని అంటున్నారు పరిశీలకులు. 

ఏపీలో రాజ్యమేలుతున్న అరాచకత్వం!

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ తీరు సర్వ వ్యవస్థలనూ నిర్వీర్యం చేసేస్తోంది. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులోత్తడంలో పోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ తరించిపోతున్నాయి. సర్వ విలువలకూ తిలోదకాలిస్తూ ఏలిన వారి ప్రాపకం పొందడమే పరమావధిగా ఏపీ సీఐడీ తీరు ఉందన్న విమర్శలు గతంలోనే వెల్లువెత్తాయి. ఇప్పడు చంద్రబాబు అరెస్టు, లోకేష్ ను కూడా అరెస్టు చేస్తాం అంటూ మీడియా ఎదుటకు వచ్చి సీఐడీ చీఫ్ చెప్పిన మాటలతో ఆయన సీఐడీ అధికారా, వైసీపీ క్రియాశీల కార్యకర్తా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమంలో ఏపీ పోలీసు వ్యవస్థ మొత్తం వైసీపీ కండువా వేసుకుని పని చేస్తున్నదంటూ నెటిజన్లు తెగ ఏకి పారేస్తున్నారు. ఏపీలో రాజకీయాలు జగన్ కు ముందు జగన్ తరువాత అన్నట్లుగా తయారయ్యాయి. అధికారంలో ఉంటే మేం చెప్పిందే వేదం.. మా మాటే శాసనం అని జనగ్ ప్రభుత్వ పాలనకు కొత్త అర్ధం చెబుతున్నారు. అధికార దండం ఉంది కనుక నాకు నచ్చని వారిని, నన్ను మెచ్చని వారినీ బయట తిరగనీయం అన్నట్లుగా ఆయన తీరు ఉంది. సాధారణంగా పాలన అంటే ప్రగతి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన,  ఉపాధి, ఉద్యోగ అవకాశాల మెరుగుదల అని ఎవరైనా భావిస్తారు. కానీ ఏపీలో మాత్రం జగన్ జమానాలో అవన్నీ జనం ఎప్పుడో మరిచిపోయారు. వాటి గురించి మాట్లాడితే పోలీసులు అర్ధరాత్రి గోడలు దూకి, తలుపులు పగులగొట్టుకుని ఇళ్లల్లోకి జొరబడి మరీ అరెస్టు చేస్తారన్న భయం ఇప్పుడు ఏపీలో సర్వత్రా నెలకొని ఉంది. ప్రభుత్వ విధానాలలోని లోపాలు ఎత్తి చూపిన ప్రతి వారికీ ఇటువంటి మర్యాదే జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే..అధికారం రూపంలో అరాచకత్వం రాజ్యమేలుతోంది. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు.. ఏపీలో ఇప్పుడు రెండు రెళ్ళు నాలుగన్నందుకు గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమగా మారిపోయింది.  క్షేమం అవిభాజ్యం అంటే జైళ్ళు నోళ్ళు తెరుస్తున్నాయి.   అవినీతి భారీ పరిశ్రమలో అన్యాయాల ధరలు పెంచేసి సాతంత్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని చక్రవడ్డీ తిప్పే కామందుల రాజ్యం సాగుతోంది. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా రాజకీయాలు చేసే వారు పేదల, ప్రజల పక్షం వహించడమే పెద్ద అపరాధమైపోయింది.  అధికారం   చేతుల్లో ఉంది కనుక మేం చెప్పేదే వేదం, మేం చేసేదే న్యాయం వ్యవస్థలదేముంది.. మా చెప్పు చేతల్లోనే ఉంటాయి అన్న అహంభావం అధికారం ఏలుతోంది.  అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి గురించి, పరిశ్రమల గురించి,  ఆరోగ్యం గురించి, ఉపాధి, ఉద్యోగాల గురించి ఎవరూ మాట్లాడే ధైర్యం చేయడం లేదు.   నియంతలు ఎవరైనా అధికారం తమ చేతల్లో చేతుల్లో శాశ్వతంగా ఇమిడిపోతుందని భావిస్తారు. అయితే అది శాశ్వతం కాదని చరిత్ర పలు మార్లు రుజువు చేసింది. హిట్లర్ నుంచి  ఇష్టారాజ్యంగా  వ్యవహరించిన నియంతలంతా మట్టిగరిచారు. అయితే ఎవరికైనా తనదాకా వస్తే కాని తత్వం బోధపడదు. ఇప్పుడు ఏపీలో అరాచకపాలన సాగిస్తున్న వారికి కూడా త్వరలోనే తత్వం బోధపడుతుంది. వెయిట్ చేయాలంతే. 

తప్పు చేస్తున్నావ్ జగన్!

ఈ మాటలంటున్నది.. ఈ హెచ్చరిక చేస్తున్నది ఎవరో తెలిస్తే, ఎవరైనా ఆశ్చర్య పోతారు. అవును, వైసీపీ నాయకులు, కార్యకర్తలు,  అభిమానులు, వైసీపీ ఓటర్లు  మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, రిమాండ్’ను  తప్పు పడుతూ చేస్తున్న హెచ్చరిక ఇది.  అలాగే రాజకీయ విజ్ఞులు, విశ్లేషకులు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ఏ ఒక్కరూ రాజకీయంగా బతికి బట్ట కట్టలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.    అంతే కాదు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసేందుకు, పోలీసు యంత్రాంగం ఉచ్ఛనీచాలను పక్కన పెట్టి వ్యవహరిస్తున్న తీరును సైతం ఇటు సామాన్య ప్రజలు మొదలు వైసీపీ అభిమానుల వరకూ, మేధావులు, విజ్ఞుల నుంచి విశ్లేషకులు ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. నిజంగా, చంద్రబాబు నాయుడు కానీ, మరొకరు కానీ తప్పు చేస్తే, చట్టం తన పని తాను చేసుకు పోతుంది. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ, చంద్రబాబు విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే,  చట్టాలను అతిక్రమించి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే ‘నిజం’ సామాన్య ప్రజలకు కూడా అర్థమై పోయింది. అందుకే,  ప్రజల్లో ఇలాంటి పర్సెప్షన్ ఏర్పడితే, అందుకు రాజకీయంగా మూల్యం చెల్లించవలసి వస్తుందని, విశ్లేషకులు హెచ్చరిస్తుంటే ,  వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.   నాలుగు రోజుల క్రితం (శుక్రవారం అంటే సెప్టెంబర్ 8 అర్థరాత్రి, నంద్యాలోని ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ వద్ద చంద్రబాబు నాయుడు బస చేసిన బస్సులోనే, కారణం చెప్పకుండా, ఏ కాగితం చూపకుండా  ఆయన్ని అరెస్ట్ చేసింది మొదలు  ఆదివారం( సెప్టెంబర్ 10) రాత్రి కోర్టు తీర్పు అనంతరం, రాత్రికి రాత్రి జోరు వానలో రాజమండ్రి జైలుకు తరలించే వరకు చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే, కక్ష సాధింపు కోణమేనని ప్రస్పుటంగా అర్ధమౌతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే వైసీపీ నాయకులు  ఆందోళన చెందుతున్నారు.జగన్ రెడ్డిని తప్పు చేస్తున్నావ్ .. అని హెచ్చరిస్తున్నారు.  నిజానికి  జగన్ రెడ్డి, ఒక వ్యూహం ప్రకారమే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ స్క్రిప్ట్  నడిపించారు. గత నాలుగు సంవత్సరాలుగా విచారణ జరుగుతున్న స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలను రుజువు చేయలేని సీఐడీ అంతవరకు లేని చంద్రబాబు నాయుడు పేరును కేసులో చేర్చడంలోనే కుట్ర కోణం, కక్ష కోణం దాగున్నాయని, తెలుగు దేశం నాయకులే కాదు, న్యాయనిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఎలా చుసినా, ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్పుటంగా కనిపిస్తున్నది జగన్ రెడ్డికి పుట్టుకతో వచ్చిన, కక్ష సాధింపు నైజం తప్ప మరొకటి కాదని అంటున్నారు.   ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో విదేశాల్లో విందు వినోదాల్లో తేలియాడుతున్న సమయంలోనే ఇక్కడ  చంద్రబాబును ఆయన వివహ వార్షికోత్సవం రోజునే అరెస్ట్ చేయించి రాక్షస ఆనందం పొందే స్క్రిప్ట్ లో భాగంగానే కథ నడిచిందని సామాన్య ప్రజలు కూడా గుర్తించారు. అందుకే   ఇందుకు జగన్ రెడ్డి తప్పక భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుదని  వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. జగన్ రెడీ తప్పు చేస్తున్నావ్...అని హెచ్చరిస్తున్నారు.  అరెస్ట్ విషయంలోనే కాదు, అరెస్ట్ అనంతరం సర్వ శాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడిన మాటలు, మంత్రి రోజా, జబరదస్త్ రేంజ్ మేకప్ లో చేసుకున్న  సంబరాలు, అంతకు ముందు ఆమె ఒకరి రెండు చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆమె చేసిన వ్యాఖ్యలను గమనిస్తే,   చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఖాయంగా, ఖచ్చితంగా  నూటికి నూరు శాతం  కక్షపూరిత  చర్య తప్ప మరొకటి కాదని సామాన్య ప్రజలు సైతం నిర్ధారణకు వచ్చారని  వైసీపీ  నేతలే అంటున్నారు.అంతే కాదు జగన్ రెడ్డి. వైసీపీ ఇందుకు భారీ మూల్యం చెల్లించక  తప్పదని వైసీపీ నాయకులు కూడా  అంగీకరిస్తున్నారు. నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా, చంద్రబాబు పర్యటనల్లో, లోకేష్  యువ గళం  పాద యాత్రలో  పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తో  పరాకాష్టకు  చేరిందని  వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. అలాగే  ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న  రాజకీయ విశ్లేషకులు, విజ్ఞులు.. వినాశ కాలే విపరీత బుద్ది.. అని జగన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు.

చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నతెలుగుదేశం  అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ రిమాండ్ విధించింది.  14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్లుగా ఏసీబీ కోర్టు ప్రకటించింది. ఈ నెల 22 వరకు ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హై ప్రొఫైల్ ఉన్న నేత కావడంతో ఆయన్ను జిల్లా జైలులో ఉంచే పరిస్థితి లేకపోవడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే పోలీసులు విజయవాడ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలు వరకూ రూట్ క్లియర్ చేసిన పోలీసులు.. ఆయన్ను తరలించేందుకు వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో తెలుగుదేశం శ్రేణులలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక  రాష్ట్రమంతా   144 సెక్షన్ విధించారు.  సభలూ సమావేశాలపై నిషేధం విధించారు. ఏసీబీ కోర్టులో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాదనలు మధ్యాహ్నం 2.30 గంటలకు ముగిసాయి. మధ్యలో మూడు సార్లు విచారణకు బ్రేక్ ఇచ్చిన న్యాయమూర్తి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత అర్ధగంట విచారణతో ముగించారు. సుమారు ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగగా తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. కాగా, ఆరున్నర గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో కొన్ని కీలక అంశాలు హైలెట్ అయ్యాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. మొత్తం మీద ఈ కేసు విచారణ సందర్భంగా ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. ఒకవైపు కోర్టులో వాదనలు సాగుతుండగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలను తెలిపారు. రెండో రోజు కూడా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల నిర్బంధం కొనసాగింది. పలుచోట్ల రిలే నిరాహార దీక్షలు కూడా సాగాయి.   కాగా, ఆదివారం సాయంత్రం తీర్పు రిజర్వ్ అనంతరం.. న్యాయమూర్తి తీర్పు ప్రకటన సందర్భంగా ఏసీబీ కోర్టు బయట ఉద్రిక్త వాతావరణం కనిపించింది. చంద్రబాబుకు అనుకూలంగా టీడీపీ కార్యకర్తల నినాదాలు చేసుండగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని అక్కడ నుండి తరలించారు. తీర్పు నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో పోలీసులు, పారా మిలిటరీ బలగాల భారీగా మోహరించాయి. కోర్టు నుంచి 500 మీటర్ల మేర పోలీసులు, భద్రత సిబ్బంది మినహా ఇతరులకు అనుమతి నిరాకరిస్తూ ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. చంద్రబాబును తరలించేందుకు కాన్వాయ్ కూడా పోలీసులు సిద్ధం చేశారు.  న్యాయమూర్తి తీర్పును బట్టి, పోలీసులు తమ కార్యాచరణను అమలు చేసే విధంగా అన్ని సిద్ధం చేసుకున్నారు. కోర్టు సమీపంలోకి మీడియాకు కూడా అనుమతి నిరాకరించారు పోలీసులు. అటు విజయవాడ నుంచి టీడీపీ పార్టీ ఆఫీస్ వరకు రూట్ క్లియర్ చేసిన పోలీసులు.. కోర్టు రిమాండ్ విధిస్తే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయవాడ నుండి రాజమండ్రి వరకూ కూడా పోలీసులు పక్కా ఏర్పాట్లతో పోలీసులు రూట్ క్లియర్ చేశారు. కోర్టు రిమాండ్ తిరస్కరిస్తే చంద్రబాబు కోర్టు నుండి టీడీపీ ఆఫీసుకు వెళ్లే అవకాశం ఉండగా.. అక్కడ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. మొత్తం మీద సుమారు నాలుగు గంటల పాటు చంద్రబాబు అరెస్ట్ పై న్యాయమూర్తి వెలువరించే తీర్పు కోసం అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎదురు చూశారు. మొత్తంపై చంద్రబాబు నాయుడుకి ఏపీబీ కోర్టు రిమాండ్ కు ఆదేశించడంతో.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

ఆరున్నర గంటల పాటు సుదీర్ఘ వాదనలు!

తెలుగుదేశం ప్రభుత్వ హయంలో చేపట్టిన స్కిల్‌డెవలప్‌మెంట్ లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ పోలీసులు శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి వెళ్లిన డీఐజీ రఘు రామిరెడ్డి నేతృత్వంలో పోలీసులు అక్కడ భయానక వాతావరణం సృష్టించారు. అర్ధరాత్రి చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న భస్సు తలుపులు బలంగా కొట్టి మరీ ఆయనను బయటకు రప్పించారు. చంద్రబాబును అరెస్ట్ చేయనున్నారని తెలుసుకున్న అక్కడే ఉన్న టీడీపీ నేతలు పోలీసులను అడుకునే ప్రయత్నం చేశారు. తనను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని, తాను చేసిన తప్పేంటో చెప్పాలని చంద్రబాబు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తెల్లవారు జాము వరకూ అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు చంద్రబాబును కలిసి అరెస్టు చేశారు.  నంద్యాల నుండి విజయవాడకు రోడ్డు మార్గం ద్వారానే చంద్రబాబును తరలించిన పోలీసులు.. ఆదివారం ఉదయం వరకూ న్యాయమూర్తి ఎదుట హాజరు పరచలేదు. సాయంత్రం 5 గంటలకే ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చినా రాత్రంతా విచారణ పేరుతో వేధించారు. రాత్రి సమయంలో నిద్ర పోకుండా.. విశ్రాంతి తీసుకొనే వీలు లేకుండా చంద్రబాబును పోలీసులు వేధించారు. అయితే, అరెస్ట్ చేసిన 24 గంటలలోపు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాల్సిన నిబంధనతో ఆదివారం ఉదయం ఆయన్ను ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టులో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాదనలు  సుదీర్ఘంగా సాగాయి.   మధ్యలో మూడు సార్లు విచారణకు బ్రేక్ ఇచ్చిన న్యాయమూర్తి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత   విచారణ  ముగిసింది. సుమారు ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగగా తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు . కాగా, ఆరున్నర గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో కొన్ని కీలక అంశాలు హైలెట్ అయ్యాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలువినిపించగా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. అసలు చంద్రబాబు పేరు కూడా ఎఫ్ఐఆర్ లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును చేర్చడంపై కోర్టులో సుదీర్ఘ వాదన జరిగింది. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాల్సి ఉండగా ఏసీబీ ఎందుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా వాదించగా సెక్షన్ 409 కింద అభియోగాలు మోపి ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం విచారణ మొదలైన కేసులో ఏ ఆధారాలు సమర్పించక ముందే అకస్మాత్తుగా అరెస్ట్ చేయడం, సీఐడీ పేర్కొన్నట్లుగా ఈ కేసులో చంద్రబాబు వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు ఆధారాలు ఉన్నాయా అనే అంశాలపై వాదనలు నడిచాయి. చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని పేర్కొన్న లూథ్రా.. చంద్రబాబు అరెస్ట్ చేసిన పోలీసు అధికారుల ఫోన్ కాల్ రికార్డును కోర్టుకు సమర్పించాలన్నారు.  ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నించగా కోర్టు రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు చేర్చామని అదనపు ఏజీ వివరించారు. 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేసి తర్వాత రిమాండ్ రిపోర్ట్ రాస్తారా అని లూథ్రా ప్రశ్నించారు. అలాగే 2021లో ఈ కేసు పెడితే ఇప్పటి వరకూ ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేయలేదని కోర్టు ఏజీని ప్రశ్నించింది. అలాగే సెక్షన్ 409 కింద అరెస్ట్ చేయాలంటే ఎఫ్ఐఆర్‌లో పేరు ఉండాలని.. కనీసం వారం రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని.. కానీ ఇవేమీ లేకుండానే సీఐడీ అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసులో చంద్రబాబును ఇరికిస్తున్నారని లూథ్రా కోర్టుకు తెలిపారు. సెక్షన్ 17ఏ గురించి కోర్టుకు వివరించిన సిద్ధార్థ లూథ్రా.. సెక్షన్ 24, 8 ఆఫ్ పీసీ యాక్ట్ గురించి కూడా వివరించారు. ఈ కేసులో నిందితులందరికీ బెయిల్ మంజూరైందని తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం కాగా దానిని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది. అలాంటి ప్రభుత్వ చర్యలలో తనకు వ్యక్తిగతంగా లాభం ఉందని.. అందులో అసలు చంద్రబాబు పాత్ర ఉందని కానీ రెండేళ్లలో సీఐడీ ఎక్కడా పేర్కొనలేదు. అలాగే ఇప్పుడు అలాంటి ఆధారాలు కూడా లేవన్న దానిపై కోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి.

ఎఫ్ఐఆర్ లో అప్పటికిప్పుడు చేరిన చంద్రబాబు పేరు!

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం జరిగినట్లు ఏపీ సీఐడీ పోలీసులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం(సెప్టెంబర్ 8) అర్ధరాత్రి నుండి హైడ్రామా తర్వాత శనివారం (సెప్టెంబర్ 9)ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రబాబుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 24 గంటలలోపు న్యాయస్థానం లేదా న్యాయమూర్తి ముందు హాజరుపరచాలన్న నిబంధన మేరకు ఆదివారం(సెప్టెంబర్ 10) ఉదయం 5 గంటలకు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు వద్దకు తండోపతండాలుగా తెలుగుదేశం అభిమానులు చేరుకోగా భారీగా పోలీసులు మోహరించారు. ఏసీబీ కోర్టు వద్దకు భారీ సంఖ్యలో న్యాయవాదులు కూడా చేరుకున్నారు. సీఐడీ అరెస్ట్, కేసు పూర్వాపరాలు, అరెస్ట్ చేసిన తీరు, నమోదు చేసిన సెక్షన్లు, చట్టబద్దంగానే అరెస్ట్ చేసారా లేదా ఇలా పలు కోణాలలో కోర్టులో వాదనలు కొనసాగాయి.  అయితే, చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. కొన్ని గంటల పాటు కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కాగా, అరెస్ట్ అంశంలో ప్రధానంగా కొన్ని అంశాలు కోర్టుకు ఆగ్రహాన్ని తెప్పించాయి. పీసీ యాక్ట్ ప్రకారం వారం రోజులు ముందే నోటీసులు ఇవ్వాల్సి ఉండగా.. చంద్రబాబు అరెస్టుపై ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు శిబిరం వద్దకు వచ్చిన సీఐడీ పోలీసులు అప్పటికప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అలాగే 2021లో ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైతే అప్పుడు ఇందులో చంద్రబాబు పేరు లేదు. గతంలో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోగా ఇప్పుడు తాజాగా ఆయన పేరు చేర్చి హడావిడిగా అరెస్ట్ చేసారు. అలాగే ఇప్పటికిప్పుడు రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు పేరును చేర్చారు. అలాగే సెక్షన్ 17ఏ కింద అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. కానీ, సీఐడీ పోలీసులు చంద్రబాబు అరెస్టు కోసం గవర్నర్ అనుమతి కోరలేదు. దీంతో ఇవే ఇప్పుడు సీఐడీ కొంపముంచాయి. చంద్రబాబు అరెస్టుపై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరగగా ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును ఇప్పటికిప్పుడు చేర్చడంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సీఐడీ, ఏఏజీకి ప్రశ్నలు సంధించారు. గతంలో ఎఫ్ఐఆర్ చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు పేరు ఎందుకు చేర్చారో చెప్పాలని నిలదీశారు. అలాగే సెక్షన్ 409 కింద అరెస్ట్ చేసినట్లు సీఐడీ పేర్కొనగా.. అందుకు ఈ స్కామ్ లో చంద్రబాబు ప్రమేయంపై తగిన ఆధారాలున్నాయా అని న్యాయమూర్తి ఏఏజీని ప్రశ్నించారు. లాజికల్ గా జడ్జి అడిగిన ప్రశ్నలకు సీఐడీ అధికారులు, ఏఏజీ సుధాకర్ రెడ్డి ఖంగుతిన్నారని తెలుస్తోంది. ఆ ప్రశ్నల తర్వాత పది నిమిషాల పాటు వాదనలకు న్యాయమూర్తి బ్రేక్ ఇచ్చేంతగా కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసు విచారణ సందర్భంగా ముందుగా న్యాయమూర్తి చంద్రబాబు నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలో తన వాదనలు తానే వినిపించుకుంటానని చంద్రబాబు కోరగా న్యాయమూర్తి  అంగీకరించారు. దీంతో తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కక్ష్ పూరిత పాలన జరుగుతుందని.. గతంలో జరిగిన ఉదంతాలను ఉటంకిస్తూ ఇప్పుడు తన అక్రమ అరెస్టును చంద్రబాబు న్యాయమూర్తి ఎదుట వినిపించారు. రాజకీయ లబ్ధి కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సీబీఐ రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని న్యాయమూర్తిని చంద్రబాబు కోరారు. గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేశారని, తనపై కేసు నమోదు చేశారని, ఇది చట్ట విరుద్ధమని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ఆనాటి కేబినెట్ నిర్ణయమని, ప్రభుత్వం 2015 బడ్జెట్ లో స్కిల్ డెవలప్మెంట్ అంశాన్ని కూడా పొందుపరిచామని, అది అసెంబ్లీ ఆమోదం పొందిందని గుర్తు చేశారు. అలాగే 2021లో నమోదైన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులో తన పేరు, తన పాత్ర గురించి పేర్కొనలేదని చంద్రబాబు వివరించారు. వాదన విన్న న్యాయమూర్తి మీరు కోర్లు హాల్లోనే ఉంటారా అని చంద్రబాబును ప్రశ్నించగా.. వాదనలు పూర్తయ్యేవరకూ కోర్టులోనే ఉంటానని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. మొత్తంగా చంద్రబాబు వాంగ్మూలం, న్యాయవాదుల ప్రశ్నలకు సీఐడీ అధికారుల వద్ద సమాధానాలే కరువయ్యాయి.

పెళ్లి రోజు ఇంతలో..

స్కిల్ డవలప్‌మెంట్ స్కీంలో కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు శనివారం ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు, ధర్నాలు చేపట్టాయి. అయితే నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి శనివారం మద్యాహ్నం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.  అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. భాదలు చెప్పుకునేందుకే దుర్గమ్మను దర్శించుకున్నట్లు తెలిపారు. తన భర్తను కాపాడమని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. తన భర్త ప్రజల కోసమే పోరాడుతున్నారని.. ఈ పోరాటంలో ఆయన సాధిస్తారని ఆకాంక్షించారు. చంద్రబాబు పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజలకు నారా భువనేశ్వరి విజ్జప్తి చేశారు.    సెప్టెంబర్ 10వ తేదీ నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఆదివారం వారు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకోవాలనుకొన్నారు. కానీ ఇంతలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం.. ఆయన్ని విజయవాడకు పోలీసులు తరలించడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి శనివారం మధ్యాహ్నం దుర్గమ్మను దర్శించుకొన్నారు. ఆమె వెంట పార్టీ శ్రేణులు ఉన్నాయి.  ఓ వైపు నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. అయితే తన తండ్రి  చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన విజయవాడకు బయలుదేరారు. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 200 రోజులు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా మంగళగిరిలో లోకేశ్‌ను ఆయన తల్లి భువనేశ్వరి కలిశారు. మరోవైపు చంద్రబాబునాయుడు.. బాబు ష్యూరిటీ -భవిష్యత్తు గ్యారంటీ.. పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం నంద్యాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన నంద్యాలలోనే విశ్రాంతి తీసుకొంటు ఉండగా శనివారం ఉదయం ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

చంద్రబాబు అరెస్ట్.. ఒక్కటిగా కదిలిన ఏపీ ప్రతిపక్షాలు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందునుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగానే ఏపీ పోలీసులు  అరెస్ట్ చేశారు. నంద్యాలలో రాజకీయ పర్యటనలో ఉన్నచంద్రబాబును కనీసం రెండు బెటాయిలియన్ల పోలీసుల్ని పంపి అక్రమంగా అరెస్ట్ చేశారు. అర్థరాత్రి నుంచి మొదలు పెట్టిన అరెస్ట్ డ్రామాను తెల్లవారే వరకూ కొనసాగించి టీడీపీ శ్రేణులను భయాందోళనకు గురి చేశారు. అసలు తెల్లవారే వరకూ చంద్రబాబును ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పడానికి పోలీసులు నిరాకరించడం తీవ్ర విమర్శల పాలవుతున్నది. కనీసం జెడ్+ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు అరెస్టుపై ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వకపోవడం.. కేంద్ర హోమ్ శాఖ భద్రత ఉన్న ఆయన అరెస్టుపై కేంద్ర హోమ్ శాఖకు కూడా సమాచారం ఇవ్వకపోవడం మరింత విమర్శల పాలవుతోంది.  చంద్రబాబు అరెస్టు కేవలం కక్షపూరిత రాజకీయంగా మాత్రమే కనిపిస్తుండగా.. ఒక్క రోజు అయినా చంద్రబాబును జైల్లో పెట్టాలన్న సీఎం జగన్ రెడ్డి కోరికను తీర్చుకునేందుకు ఇలా పోలీసు వ్యవస్థను,    అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శని, ఆదివారం కోర్టులకు సెలవు కావడం, మరో వైపు ఢిల్లీ వేదికగా జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతుండటం అన్నీ చూసుకొని శుక్రవారం అర్ధరాత్రి అరెస్టుకు ఉపక్రమించడం చూస్తే వైసీపీ ప్రభుత్వం ఎంతటి సైకో మెంటాలిటీతో ఉందో అర్ధమవుతున్నదని టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాను తప్పు చేస్తే నడి రోడ్డులో ఉరి తీయాలని చంద్రబాబు సవాల్ చేయగా.. ఆయన చేసిన తప్పేంటో, కేసేంటో చెప్పకుండా అరెస్ట్ కు ప్రయత్నించడం ఏపీ పోలీసు వ్యవస్థను అభాసుపాలు చేసింది. అప్పటికప్పుడు నోటీసులు అందించడం.. మిగిలిన వివరాలను రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేస్తాం.. ఇప్పుడు మాకు సహకరించాలని పోలీసులు వేడుకోవడం చూస్తే.. పోలీస్ వ్యవస్థ జగన్ మోహన్ రెడ్డికి ఎంత ఊడిగం చేస్తున్నదో స్పష్టమవుతుంది.  అయితే, చంద్రబాబు అరెస్టు ఏపీలో ప్రతిపక్షాల ఐక్యతకు వేదికగా మారింది. చంద్రబాబు అరెస్టును వైసీపీ మినహా దాదాపుగా అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండిచాయి. ప్రతిపక్ష నేతలంతా ఈ అరెస్టును ప్రజాస్వామ్యం మీద దాడిగా అభివర్ణించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, కమ్యూనిస్ట్ నేతలు కూడా చంద్రబాబు అరెస్టుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రాథమిక ఆధారాలను చూపించకుండా అర్థరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఏ తప్పూ చేయని నాయకులపై మర్డర్ కేసులు పెట్టి జైళ్లకు నెడుతున్నారంటూ విమర్శించారు. పాలన పరంగా అనుభవం ఉన్న వ్యక్తి పట్ల ప్రభుత్వ తీరు సరైంది కాదని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంలో ప్రభుత్వం పోలీసులు అందరి పట్ల ఒకేలా ఉండాలని పవన్ హితవు పలికారు. అరెస్టుపై నిరసన తెలిపితే హౌస్ అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు అండగా ఉంటూ మద్దతు తెలుపుతున్నామని పవన్ స్పష్టం చేశారు.  చంద్రబాబును అరెస్టు చేసిన తీరును బీజేపీ చీఫ్ పురందేశ్వరి తప్పు పట్టారు. ప్రోసీజర్ పాటించకుండా చంద్రబాబును అరెస్టు చేయడమేమిటని ఆమె ప్రశ్నించారు. కనీసం ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చకుండా చంద్రబాబును అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును ఆమె ఖండించారు. చంద్రబాబు అరెస్టును సిపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పోలీసులు అర్థరాత్రి హంగామా సృష్టించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నారా లోకేష్ సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను నిర్బంధించడం దుర్మార్గమని ఆయన అన్నారు. వైఎస్ జగన్ సర్కార్ ప్రతిపక్షాలపై పాల్పడుతున్న వేధింపు చర్యలకు చంద్రబాబు అరెస్టు  పరాకాష్టగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు తీరు పట్ల సీపీఎం రాష్ట్ర కమిటీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి చంద్రబాబు వసతిపై దాడిచేసి, జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు.  రానున్న ఎన్నికల సమయానికి పొత్తులు ఉంటాయా.. విడివిడిగానే ఎన్నికలకు వెళ్తారా అన్నది తెలియదు కానీ చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఎన్నికల సమయానికి ఎవరు ఎలా అనేది పక్కన పెడితే ఇప్పుడైతే అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.   చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని.. అలాంటిది ఇష్టారాజ్యంగా అర్ధరాత్రి అక్రమ అరెస్టులను తెరతీయడాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ అరెస్టు అంశంలో అధికార పార్టీ వైసీపీ ఒక్కటీ ఒకవైపు ఉంటే.. మిగిలిన  పార్టీలన్నీ ఒకవైపున నిలబడ్డాయి. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డే ఏపీ ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎన్నికలకు ముందు బాబు అరెస్ట్.. కోరి మరీ టీడీపీకి మైలేజ్ ఇస్తున్న జగన్?!

ఎట్టకేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరిక కొంతమేర నెరవేరింది. టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష పడుతుందా? పడితే ఎన్నేళ్లు పడుతుంది? రిమాండ్ కు తరలిస్తారా? ఎన్నిరోజుల రిమాండ్ విధిస్తారు? బెయిల్ వస్తుందా? ఇలాంటి అనుమానాలన్నీ ముందు ముందు తేలాల్సి ఉండగా.. ప్రస్తుతానికి అయితే కొంతమేర సీఎం జగన్ తన కోరిక నెరవేర్చుకున్నారు. రూ.371 కోట్ల రూపాయలను లేని కంపెనీలను సృష్టించి నిధులు తరలించారన్న ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగింది. దీనికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ పేరుతో స్కాంకు పాల్పడినట్టు వైసీపీ తీవ్ర ప్రచారం చేస్తుంది. మరి ఈ అరెస్ట్ రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుంది? చంద్రబాబును అరెస్ట్ చేసిన హీరోగా జగన్ మైలేజ్ పొందుతాడా? తనను అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు సానుభూతి పొందుతారా అన్న చర్చలు జరిగిపోతున్నాయి. నిజానికి ఏపీలో ఇప్పుడు టీడీపీ ఫుల్ స్వింగ్ లో ఉంది. జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు యమా దూకుడు మీదున్నారు. ఒకవైపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ తీరును ఎండగడుతుంటే.. చంద్రబాబు బస్సు యాత్రలు, సాగునీటి ప్రోజెక్టుల పరిశీలన అంటూ జగన్ మోహన్ రెడ్డిని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న ఈ యాత్రలతో టీడీపీ క్యాడర్ ఉత్సహం రెట్టింపు అవుతుంది. ప్రజల నుండి కూడా అనూహ్య స్పందన వస్తుంది. టీడీపీ నేతలు ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా ప్రజల నుండి ఊహించని రీతిలో స్పందన వస్తుంది. దీంతో వైసీపీ నేతలకు ఇది మింగుడు పడడం లేదు. వైసీపీకి ఊపిరాడని పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా టీడీపీ దూకుడుకు బ్రేక్ వేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అదే ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ రూపంలో ఆచరణలోకి వచ్చిందా అనే అనుమానాలు కలిగిస్తుంది. అయితే, ప్రస్తుతానికి చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి కాస్త ఇబ్బందిగానే మారినా తర్వాత మాత్రం టీడీపీకి ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయ నిపుణులు సీఐడీ సృష్టించిన హడావుడి అంత సీన్ ఈ కేసులో ఉండదని తేల్చేశారు. ఒకవేళ నిజంగా చంద్రబాబు హయంలో అవినీతి జరిగిందని ఆధారాలున్నా మహా అయితే 14 రోజుల రిమాండ్ సాధ్యమవుతుందని.. అయితే, కేసు తీవ్రత లేని దృష్ట్యా బెయిల్ దొరకడం పెద్ద కష్టమేమీ కాదని చెప్తున్నారు. ఈక్రమంలో మహా అయితే శని, ఆదివారాలు చంద్రబాబు కస్టడీలో ఉండనున్నారు. సోమ లేదా మంగళవారం బెయిల్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ కేసులో హైకోర్టుకు వెళ్లేందుకు కూడా టీడీపీ నేతలు అన్ని సంప్రదింపులు జరుగుతుండగా ఏది ఏమైనా ఎక్కువ రోజులు ఈ కేసులో చంద్రబాబును తమ అధీనంలో ఉంచుకోవడం సీఐడీకి కుదరని పనిగానే భావించాలి. ఈ క్రమంలో ఈ అరెస్ట్ వ్యవహారం టీడీపీకి సానుభూతిపరంగా మరింత మైలేజీ తేవడం గ్యారంటీగా కనిపిస్తుంది. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నందుకే తనను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని చంద్రబాబు ప్రజలకు చెప్పుకొనేందుకు మంచి స్టఫ్ దొరికినట్లే భావించాలి. తమను ఎదుర్కోలేని జగన్ పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష్య సాధింపు చర్యలకు పాలపడ్డాడని ఆరోపించేందుకు టీడీపీకి ఇది ఆయుధంగా మారనుంది. ప్రశ్నించిన వారిపై ఇలా కేసులు బనాయించి నోళ్లు మూయించాలని చూడడం జగన్ మోహన్ రెడ్డికి కొత్తేమీ కాదని.. ఇప్పటికే రాష్ట్రమంతా జగన్ బాధితులు ఉన్నారని ఉదాహరణలతో సహా టీడీపీ గోల్ చేసుకోవడం గ్యారంటీ. సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్ ఈ అరెస్టుతో తన చేతులతో తానే మరో ఆయుధాన్ని సిద్ధం చేసి టీడీపీ నేతలకు ఇచ్చినట్లే భావించాల్సి వస్తుంది. భావోద్వేగాలకు విలువలనిచ్చే ఏపీ ప్రజలు ఈ అరెస్టు పట్ల కూడా ఎమోషనల్ అయ్యేలా అన్ని దారులు కనిపిస్తున్న తరుణంలో ఇది జగన్ మోహన్ రెడ్డికి మరో సంకటంగా మారనుంది.

జగన్ బరితెగుంపునకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అరెస్ట్!

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం జరిగినట్లు ఏపీ సీఐడీ పోలీసులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం (సెప్టెంబర్ 8) అర్ధరాత్రి పెద్ద ఎత్తున మోహరించి  శనివారం (సెప్టెంబర్ 9) ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రాబుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించి ముందుగా నోటీసులు ఇవ్వకుండా అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన న్యాయవాదులు సీఐడీ అధికారులతో వాదనకు దిగారు. రిమాండ్ రిపోర్ట్ ద్వారా అన్ని అనుమానాల్ని నివృత్తి చేస్తామని సీఐడీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. మరోవైపు వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబు అరెస్టును అడ్డుకోగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు చంద్రబాబు తన కాన్వాయ్ లోనే వచ్చేందుకు అంగీకరించడంతో ఆయన్ను అక్కడ నుండి తరలించారు. కాగా  చంద్రబాబుపై 120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ, 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సి),(డి) నమోదు చేసినట్టు చంద్రబాబుకు ఏపీ సీఐడీ డిప్యూటీ సూపరింటెండెండ్ ధనుంజయుడి పేరుతో అప్పటికప్పుడు జారీ చేసిన నోటీసులో ఉంది. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటలకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో చంద్రబాబును నాన్ బెయిలబుల్ నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నట్టుగా ఆయన మీడియాకు  తర్వాత వివరించారు. అయితే ఈ మొత్తం  ఆరోపణలు, ఈ కేసులు, అర్ధరాత్రి హైడ్రామా, వందలాది కార్యకర్తలున్న ఓరాజకీయ కార్యక్రమం జరిగే చోట వందలమంది పోలీసులతో సీఐడీ రణరంగం సృష్టించడం చూస్తుంటే ఒక్కటి క్లియర్ కట్ గా అర్ధమవుతుంది. కేసేంటి అన్నది పక్కన పెడితే ఈ వ్యవహారంలో జగన్ కక్షసాధింపు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నది.  16 నెలల పాటు జైల్లో ఉన్న వైఎస్ జగన్ కనీసం 16 రోజులైనా చంద్రబాబును జైల్లో ఉంచాలి. తనను లక్ష కోట్ల అవినీతి పరుడిగా ముద్ర వేసిన చంద్రబాబు కూడా అవినీతి పరుడే అని ప్రచారం చేయాలి. ఇదే జగన్ లక్ష్యం. ఇందుకోసమే వ్యవస్థలను అడ్డగోలుగా వాడేసి తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే  జగన్ జైలుకు కాంగ్రెస్ కదా కారణం చంద్రబాబును ఏం చేశారని చాలా మందికి ఒక అనుమానం ఉంది. జగన్ పదహారు నెలలు జైలు పాలు చేసిన ఘటనలో కాంగ్రెస్ తో పాటు చంద్రబాబు హస్తం కూడా ఉందని వైసీపీ ఆది నుంచి అనుమానిస్తోంది. జగన్ కి కనీసం బెయిల్ కూడా రానీయకుండా అన్ని నెలల పాటు జైలులో ఉంచారన్నది వారి బాధ. చంద్రబాబే వ్యసస్థలను మ్యానేజ్ చేసి బెయిల్ రాకుండా చేశారని జగన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే అప్పటి నుండి ఏ చిన్న కేసు దొరికినా దాన్ని చంద్రబాబుకు ఆపాదిస్తున్నది. నిజానికి అమరావతి రాజధాని అతి పెద్ద స్కాం అని, దాని మీద ఎన్నో విచారణలు జరిపించిన జగన్ ప్రభుత్వం  ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లభించక  స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసును అందిపుచ్చుకుంది. లేని కంపెనీలను సృష్టించి ప్రభుత్వ వాటాగా నిధులు మళ్లించారన్నది ప్రభుత్వ వాదన. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగస్వామ్యం కావాలని ఈడీని కోరారు సీఐడీ అధికారులు. అయితే, ఈడీ ఈ వ్యవహారంలోకి రాలేదు. ఈ కేసు మిస్ చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయడం కుదరదని భావించిన సీఐడీ నియమ నిబంధనలను తుంగలో తొక్కి అర్ధరాత్రి అరెస్టుకు తెర తీశారు. అయితే   ఈ కేసులో బాబు పాత్ర ఉందని ఆధారాలు పట్టుకోవడం అసంభవమని ఇప్పటికే విశ్లేషకులు తేల్చేశారు. కేవలం కక్షసాధింపు కోసమే  జగన్   ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లుగా ఉందన్న  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు అరెస్టు ను జగన్ బరితెగింపునకు నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. 

చంద్రబాబు అరెస్ట్.. అసలు కేసేంటి? సీఐడీ అత్యుత్సాహం ఎందుకు?

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగిన విషయం తెలిసిందే. మూడు రోజుల కిందట చంద్రబాబు అనుమానం వ్యక్తం చేసినట్లుగానే చివరికి ఏపీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. అయితే, ఈ అరెస్టు వెనక లక్ష్యం ఏంటి? ఆసలు ఈ కేసు ఏంటి? సెక్షన్ ఏంటి? కుంభకోణం ఏంటి? అందులో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు పాత్ర ఏంటన్నది కాసేపు పక్కన పెడితే అసలు అరెస్ట్ చేసిన తీరుపైనే తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. ముందుగా రాజకీయ పర్యటనలో ఉండే సమయంలో అరెస్టుకు ఉపక్రమించడం విమర్శలకు తావిస్తోంది. అదీ ముందుగా ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం.. అదీ అర్ధరాత్రి హడావిడి చేయడం మరింత అభ్యంతరకరంగా ఉంది. చుట్టూ వందలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉండగా, అరెస్టు చేసేందుకు ఏపీ సిఐడి అధికారులు వెళ్లడం తప్పుడు చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అరెస్టుపై ఏపీలో వైసీపీ తప్ప మిగతా అన్ని పార్టీలు, ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, కమ్యూనిస్ట్ నేతలు కూడా చంద్రబాబు అరెస్టుపై తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు రాజకీయ పరిశీలకులు, మేధావులు కూడా చంద్రబాబు అరెస్ట్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అస‌లు జ‌డ్‌+ కేట‌గిరీ భ‌ద్ర‌త, 14 ఏళ్ల‌పాటు సీఎంగా పనిచేసి ఉన్న‌త ప్రొఫైల్ ఉన్న నాయ‌కుడు చంద్ర‌బాబును వారాంతంలో కోర్టుకు సెలవు చూసుకొని అరెస్టు చేయడం, అదీ రాజకీయ పర్యటనలో ఉండగా అర్ధరాతి మందీ మార్బలంతో పోలీసులు దండయాత్ర చేయడంతో ఏపీలో అసలు రాజ్యాంగం అనే ఒకటుందా? చట్టం, పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నాయా? లేక రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగా ప్రభుత్వ తొత్తులుగా మారిపోయాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, అసలు ఈ కేసు విషయానికి వస్తే ఏపీలో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా యువతకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ అనే సంస్థలతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 3 వేల 300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తామని ఈ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. 3 వేల 300 కోట్ల రూపాయల్లో 10 శాతం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ పెట్టుబడి పెట్టేలా ఒప్పందం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం 10 శాతం వాటాగా.. జీఎస్టీతో కలిపి 370 కోట్ల రూపాయలను ఆ రెండు సంస్థలకు చెల్లించింది. ఇందులో 240 కోట్ల రూపాయలను డిజైన్‌టెక్‌ సంస్థకు బదలాయించగా మిగతా సొమ్మును సీమెన్స్ కంపెనీకి బదలాయించారు. ఈ 370 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లుగా చూపించి వెనకేసుకున్నారనేది సీఐడీ ఆరోపణ. ఈ కేసులోనే  చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఈ కేసు చూస్తేనే అర్ధమవుతుంది ఎంత సిల్లీగా ఉందో.. కానీ ఈ కేసును అడ్డం పెట్టుకొనే జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయడం చూస్తే కుక్క తోక పట్టుకొని నదిని ఈదినట్లే కనిపిస్తుంది. అసలు ఏ మాత్రం పసలేని ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకు కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయంలోనే చంద్రబాబుపై పదుల కొద్దీ కేసులు పెట్టారు. కానీ, న్యాయస్థానాల వద్ద ఒక్కటీ నిలబడలేదు. స్టేలు తెచ్చుకొని చంద్రబాబు మేనేజ్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ, నిజానికి ఆ కేసులలో విషయం లేకనే న్యాయస్థానాల వద్ద నిలవలేదు. ఇప్పుడు ఇది కూడా అంతే. కేవలం ఓ నాలుగు రోజుల పాటు వైసీపీ నేతలు జబ్బలు చరుచుకోవటానికి మాత్రమే పనికి వస్తుంది. ఇప్పటి వరకూ జగన్ లక్ష్య కోట్ల అవినీతి ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తుండగా.. రిటర్న్ చంద్రబాబును కూడా అవినీతి పరుడుగానే బురద జల్లేందుకు, ఆరోపణలు చేసేందుకు మాత్రమే ఈ కేసు పనికి రానుంది. అంతేతప్ప ఇందులో పసలేదన్నది పరిశీలకుల అభిప్రాయం.

బెజవాడలో ఉద్రిక్తం.. భారీగా మోహరించిన పోలీసులు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని ఏపీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేసి.. విజయవాడకు తీసుకు వచ్చారు. అయితే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో... శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా విజయవాడ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.  అయితే చంద్రబాబును కలిసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. చంద్రబాబుని కలిసేందుకు ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తుండగా.... అతడి ప్రయాణించే ప్రత్యేక విమానాన్ని అనుమతించవద్దని ఎయిర్ పోర్ట్ అధికారులను పోలీసులు కోరారు. చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేశ్, నారా భువనేశ్వరిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు.  స్కిల్డ్ డెవలప్‌మెంట్ స్కీంలో కుంభకోణం జరిగిందంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ స్పందంచారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని పవన్ ఆరోపించారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడమే కాకుండా.. ఆయనకు మద్దతు తెలిపారు. అందులోభాగంగా.. చంద్రబాబును కలిసేందుకు పవన్ కల్యాణ్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన ప్రయాణించే విమానానికి అనుమతి ఇవ్వవద్దంటూ గన్నవరం ఎయిర్ పోర్ట్ అధికారులను ఏపీ పోలీసులు కోరారు.  ఇక తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ అయ్యారని తెలుసుకొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. పాదయాత్రను ఆపి.. విజయవాడకు బయలుదేరారు. అలాగే చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. శనివారం మధ్యాహ్నం. ఇంద్రకీలాద్రిపై కోలువైన దుర్గమ్మ వారిని దర్శించుకొన్నారు.  నంద్యాల నుంచి తీసుకు వస్తున్న చంద్రబాబు నాయుడిని పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు టీడీపీ శ్రేణులు, చంద్రబాబు నాయుడు అభిమానులు భారీగా ఏసీబీ కోర్టు వద్దకు చేరుకున్నారు. ఆ క్రమంలో పార్టీ శ్రేణులు చంద్రబాబుకు అనుకూలంగా.. అధికార జగన్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సిటీ కోర్టు కాంప్లెక్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదించనున్నారు. అందుకోసం ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి ఆయన విజయవాడ చేరుకున్నారు.

ఆర్థిక అసమానతలకు జి20 సదస్సులో పరిష్కారం!

దేశ రాజధాని ఢిల్లీలో  జీ 20 శిఖరాగ్ర సదస్సు మొదలైంది. శని, ఆదివారాలు రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 9. 10) జరిగే ఈ శిఖరాగ్ర సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు, భారత ప్రభుత్వం సకల ఏర్పాట్లూ చేసింది.  వివిధ దేశాల దేశాధి నేతలు, మరెందరో ప్రపంచ ప్రముఖులు,హాజరవుతున్న ఈ సదస్సు ద్వారా భారత దేశ శక్తి, సామర్ధ్యాలు, భారతీయ సంస్కృతీ సాంప్రదాయ విలువలను ప్రపంచం ముందు ఉంచేందుకు  భారత ప్రభుత్వం సమున్నత స్థాయిలో సన్నాహాలు చేసింది.  దేశ రాజధాని నగరం దిల్లీ కనీ వినీ ఎరుగని రీతిలో అంగ రంగ వైభవంగా ముస్తాబైంది. ఇండియా అనుకుని భారత దేశంలో అడుగు పెట్టిన విదేశీ  ప్రముఖులు సైతం విస్తుపోయేలా రాజధాని నగరం అందంగా అలంకరించుకుంది. ఓ వంక కట్టు దిట్టమైన భద్రతా ఏర్పట్లు,మరో వంక అతిథులను రంజింప చేసే విధంగా స్వాగత సత్కారాలు. కనువిందు చేస్తున్న భారతీయ కళా రూపాల ప్రదర్శనలు. హస్త కళల వైభవ ప్రదర్శనలు.. ఇలా  ఢిల్లీ నగరంలో ఎటు చూసినా  పండగ కళ కనువిందు చేస్తోంది.  కొత్త ఢిల్లీ  ప్రపంచానికి  కొత్త  భారత్ ను పరిచయం చేస్తోందా అన్న విధంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు ఉన్నాయి.  మరో వైపు మొదటి సారిగా భారత దేశానికి  జీ 20 అధ్యక్ష బాధ్యతలు దక్కడం, మరో మరుపు రాని మధుర జ్ఞాపకంగా మిగిలి పోతుందని అంటున్నారు.   నిజమే భారత దేశానికి జీ 20 అధ్యక్ష బాధ్యతలు దక్కడం, యాధృచ్ఛికమే కావచ్చు. వరస క్రమలో వచ్చిందే అయినా, ఇన్నేళ్ళలో మొదటి సారిగా భారత దేశానికి  జీ 20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే గౌరవం దక్కడం ఒక మధుర స్మృతిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అందుకే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్   అంతటి వారు ఈ గౌరవం భారత్ కు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన  జీవిత కాలంలో భారత దేశానికీ  జీ 20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే గౌరవం దక్కడం, నిజంగా .. చాలా చాలా సంతోషంగా వుంది. జీ 20 దేశాధి నేతలకు భారత దేశం ఆతిధ్యం ఇవ్వడం   చూస్తున్నాను  అంటూ మన్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. ఆవిధంగా ఆయన ఈ సదస్సు ప్రాముఖ్యత ఏమిటో చెప్పకనే చెప్పారు. అలాగే, భారత దేశ పరిపాలనా విధానంలో, అభివృద్ధిలో విదేశాంగ విధానం అత్యంత కీలకమని చెప్పడం ద్వారా మన్మోహన్ సింగ్ 20 శిఖరాగ్రసదస్సు ప్రాముఖ్యతను   వివరించారు. ఆ సదస్సును భారత్ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసి మన్మోహన్ తన రాజనీతిజ్ఞతను చాటుకున్నారు. అదలా ఉంటే అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారతీయ సంతతికి చెందిన ఇంగ్లాండ్   ప్రధానమంత్రి రిషి సునాక్ సహా వివిధ దేశాల అధినేతలు  ఈ రెండు రోజుల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. మరోవంక రెండు రోజుల చర్చలు, సంప్రదిపుల అనంతరం ఢిల్లీ డిక్లరేషన్ పేరున వెలువడే, జీ 20, 18 వశిఖరాగ్ర సమావేశం  ప్రకట కోసం ప్రపంచం మొత్తం, ఎదురు చూస్తోంది. నిజానికి, అంగరంగ వైభవంగా జరిగిన ఏర్పాట్లు, మన దేశం పై ప్రపంచ దేశాలు కురిపిస్తున్న ప్రశంసల జల్లుల విషయాన్ని పక్కన పెడితే  రెండురోజుల సదస్సు ముగిసిన అనంతరం వెలువడే,  న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్  కోసం సభ్య దేశాలే కాదు, ప్రపంచం మొత్తం  వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. మరో వంక ఢిల్లీ డిక్లరేషన్, గతానికి భిన్నంగా  ఆచరణ సాధ్యంగా ఉటుందని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, దక్షిణ ప్రపంచం (గ్లోబల్ సౌత్) ఆశలు, ఆశయాలకు ప్రతీకగా నిలుస్తుందని, భారత దేశం విశ్వాసాన్ని ప్రకటించింది. నిజానికి జీ 20 శిఖరాగ్ర సదస్సుల గత చరిత్ర అంత ఘనంగా లేదనేది అంగీకరించి తీరాల్సిన వాస్తవం. అయితే   కొవిడ్ అనంతర ప్రపంచానికి  ఇండియా చూపిన వెలుగు మార్గం నేపధ్యంలో  జి 20 శిఖరాగ్ర  సదస్సు ప్రధాన వేదికైన భారత్ లో కనుల పండగగా కొలువు తీరిన నేతలు గతానికి భిన్నంగా ఆచరణయోగ్యమైన, అంతకంటే ముఖ్యంగా మారుతున్న ప్రపంచం అవసరాలకు అనుగుణంగా భారత దేశం రూపొందించిన ఢిల్లీ డిక్లరేషన్’కు  ఆమోద ముద్ర వేస్తాయని ఆశిద్దాం.   జీ20లో ప్రారంభంలోనే కీలక  పరిణామం చోటు చేసుకొంది.  ఆఫ్రికన్‌ యూనియన్‌ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. నేడు భారత్‌ లో జరిగిన వన్‌ ఎర్త్‌ సెషన్‌ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆఫ్రికన్‌ యూనియన్‌ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ తమ ప్రారంభోపన్యాసంలోనే 21వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దిశ, దశ సూచించడానికి ఇదే కీలక సమయం అంటూ భారత ఆలోచనలు  సభ్య దేశాల ముందుంచారు.  పాత సవాళ్లు ఇప్పుడు కొత్త సమాధానాలు కోరుతున్నాయి  తన మాన్ కీ బాత్ ను పంచుకున్నారు.  అందుకనే మనం హ్యూమన్‌ సెంట్రిక్‌ అప్రోచ్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. కొవిడ్‌ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడిందనే నగ్న సత్యాన్ని గుర్తు చేస్తూ యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచిందని, అందరి మనసులోని మాటను మోడీ తన నోట వినిపించారు. కొవిడ్‌ను ఓడించిన మనం ఈ విశ్వాస రాహిత్యంపై కూడా విజయం సాధించవచ్చునని అదరం  కలిసి ప్రపంచంలో నెలకొన్న అపనమ్మకాన్ని పారదోలుదామని పిలుపు నిచ్చారు. ఈ క్రమంలో సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ మంత్రం మనకు మార్గదర్శిగా ఉంటుందని అన్నారు. ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య తేడాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్‌, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం ముందుకు వెళ్లాల్సిందే. భారత్‌ జీ20 అధ్యక్షతన దేశం లోపలా, బయట అందరిని కలుపుకొని పోవడానికి ప్రతీకగా నిలిచింది. ఇది ప్రజల జీ20 అనడానికి నిదర్శనంగా మారింది. దేశంలోని 70 పైగా నగరాల్లో 200కుపైగా జీ20 సదస్సులు జరిగాయి.   అయితే, జీ 20 శిఖరాగ్ర  సదస్సుపై ఎన్నో ఆశలు ఉన్న మాట ఎంత నిజమో, అంతకు పదిరెట్లు .. అనుమానాలు ఉన్నాయన్నది కుడా అంతే నిజం. ఈ నేపధ్యంలో   మొదలైన  జీ 20 మరో ప్రస్థానం .. ప్రపంచ సమస్యలకు  ముఖ్యంగా ప్రపంచ ప్రగతికి ప్రతిబంధకంగా నిలిచిన పర్యావరణ, కాలుష్య సమస్యలు, ఆర్థిక అసమానతల వంటి సంస్యలకు పరిష్కారం చూపుతుందని ఆశిద్దాం.

ఏలిన వారికి అడుగులకు మడుగులొత్తడానికే పరిమితమా?.. నవ్వుల పాలౌతున్న ఏపీ పోలీసు వ్యవస్థ!

చట్టానికీ, న్యాయానికీ ధర్మానికీ కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అనే పవర్ ఫుల్ సినిమా డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. పోలీసు ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందరూ ఈ డైలాగ్ ను ఉటంకించడం పరిపాటిగా మారిపోయింది. అటువంటి నాలుగో సింహం ఏపీలో మాత్రం నవ్వుల పాలౌతోంది. అభాసుపాలౌతోంది. అధికార పార్టీ క్రియాశీల కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారుల తీరుతో మొత్తం పోలీసు వ్యవస్థపైనే జనంలో నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర పోలీసు వ్యవస్థ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పాలి. ముఖ్యంగా సీఐడీ నమోదు చేసే ప్రతి కేసూ, చేసే ప్రతి అరెస్టు కేవలం అధికార పార్టీ ప్రాపకం కోసమే అన్నట్లుగా ఉంటున్నాయి. ఇందుకోసం సీఐడీ సీఆర్పీసీ నిబంధనలను సైతం తుంగలో తొక్కి ముందుకు సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇక పోలీసు వ్యవస్థ విపక్ష నేతల పర్యటనలకు భద్రత కల్పించాల్సింది పోయి వారిపై దాడులు జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషించడం కొండొకచో.. దాడులకు పాల్పడేవారికి రక్షణ కవచంగా నిలబడటం చేస్తోందంటున్నారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు.. జనసేనాని పవన్ కల్యాణ్.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇలా విపక్షాల నాయకులపై అధికార పార్టీ శ్రేణులు దాడులకు తెగబడుతుంటే పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి నిలబడిపోతోందన్న విమర్శలను ఎదుర్కొంటోంది.  నిందితులపై చర్యలు తీసుకోవలసిన, ముద్దాయిలపై కేసులు పెట్టాల్సిన వాళ్లు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ, విపక్షాల నేతలను, కార్యకర్తలను వేధింపులకు గురి చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   ఏ రాష్ట్రంలోనయినా వీవీఐపీలు, కేంద్రభద్రత ఉన్న ప్రముఖులకు.. ఆయా రాష్ట్రాల పోలీసులు భద్రత కల్పించడం రివాజు. సదరు ప్రముఖుల పర్యటన పూర్తయ్యేవరకూ  ఎటన్షన్ లో ఉండాల్సిన పోలీసులు ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విపక్ష నేతల. మరీ ముఖ్యంగా జడ్ ప్లస్ క్యాటగరీ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలకు పోలీసుల ప్రోత్సాహం, సహకారం ఉందన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.    ఏపీలో అధికార పార్టీ మూకలు జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటనలలో ఆయనకు అత్యంత సమీపంగా వెళ్లి దాడులకు తెగబడుతున్నా.. ఏపీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పైపెచ్చు అధికార పార్టీ శ్రేణులకు చంద్రబాబుకు అత్యంత సమీపంలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు పర్యటనలలో వరుసగా చోటు చేసుకున్న, చోటు చేసుకుంటున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు తెలుగుదేశం విమర్శలు అక్షర సత్యాలనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అంతా జరిగిన తరువాత  తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేసి స్వామి భక్తిని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.    డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం  కార్యాలయంపై  వైసీపీ శ్రేణులు  దాడి చేసి, అద్దాలు-తలుపులు ధ్వంసం చేసి, కార్యాలయ సిబ్బందిని గాయపరిస్తే వారిపై కేసులు నమోదు చేయడం కానీ, అరెస్టు చేయడం కానీ జరగకపోవడాన్ని తెలుగుదేశం వర్గాలు ఎత్తి చూపుతున్నాయి. పోలీసుల చిత్తశుద్ధిని, విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయి. తెలుగుదేశం కార్యాలయంపై వైసీసీ దాడి అనంతరం ఎస్పీజీ అధికారులు  వచ్చి పరిశీలించి బాబు భద్రత విషయంలో మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి వెళ్లారంటే ఏపీ పోలీసుల తీరు ఎంత దివ్యంగా ఉందో ఇట్లే అవగతమౌతుంది.    హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్టింగుల విషయంలో చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర పోలీసులు, సీఐడీ విఫలమయ్యారంటూ హైకోర్టు ఆ కేసులు సీబీఐకి అప్పగించిందంటేనే ఏపీలో పోలీసు వ్యవస్థ తీరు తెన్నులు ఎలాగున్నాయన్నది ఎవరికైనా అర్ధమైపోతుంది.  అయితే సీఎంపై సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టారన్న కారణంతో వృద్ధులు, వికలాంగులు, విద్యార్ధులపై కేసులు పెట్టే పోలీసుల ఉత్సాహం.. హైకోర్టు జడ్జిలపై పోస్టింగుల విషయంలో ఏమైందని ప్రశ్నలు అదే సమాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి.    అలాగే మార్గదర్శి కేసుల , అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్న కోర్టు ఆదేశాలు కూడా  సీఐడీ ధిక్కరిస్తున్న వైనం పరిశీలిస్తే పోలీసులకు నిజమైన బాస్ ఎవరో ఇట్టే తెలిసిపోతుందని పరిశీలకులు అంటున్నారు.  అధికారంలో ఉన్న వారికి అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం పూర్తిగా కోల్పోక ముందే  తీరు మార్చుకుంటే మేలని పరిశీలకులు హితవు పలుకుతున్నారు.    తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ నంద్యాలలో అరెస్టు చేసిన తీరు, ఆ సందర్భంగా పోలీసులు చూపిన అత్యుత్సాహం, ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు ఉందో లేదో కూడా చూసుకోకుండా అరెస్టు చేస్తున్నట్లుగా నోటీసు ఇచ్చి విజయవాడకు తరలించడం చూస్తుంటే.. పోలీసులు చట్టానికి లోబడి కాకుండా.. అధికారంలో ఉన్న కొద్ది మంది వ్యక్తుల ఆదేశాల మేరకు పని చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

కార్డు ఎందుకు దండగ.. ఏటీఎంలో యూపీఐ స్కాన్ ఉండగా!

ఏటీఎం.. ఇప్పుడంటే పేటీఎం, జీపే, ఫోన్ పే, భారత్ పే, వాట్సాప్ పే, భీమ్ పే ఇలా ఎన్నో రకాల యూపీఐ పేమెంట్ యాప్స్ వచ్చాయి కానీ.. అంతకు ముందు బ్యాంకు, లేదంటే ఏటీఎం మాత్రమే లావాదేవీలకు దిక్కు. బ్యాంకులో రద్దీని తట్టుకోలేక వీలైనంతవరకు అందరూ ఏటీఎంల మీదనే ఎక్కువగా ఆధారపడేవారు. ఇప్పటికీ చాలా మంది నగదు కావాలంటే ఏటీఎంలలో విత్ డ్రా  చేసుకుంటారు. అయితే  తరచుగా ఎక్కడో చోట పెట్టేసి కార్డులు మర్చిపోవడం, పోగొట్టుకోవడం, లేదా పిన్ నంబర్ మర్చిపోవడం పలువురికి పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే కొన్ని బ్యాంకులు కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్  అప్షన్స్ తీసుకొచ్చారు. అయితే  సదరు బ్యాంక్ యాప్ ఉంటేనే ఇది వీలవుతుంది. ముందుగా యాప్ లో ఎంత కావాలో అంతకు కార్డ్ లెస్ లో సెలక్ట్ చేసుకుంటే ఒక పాస్ వర్డ్ వస్తుంది. దాంతో ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ కార్డ్ లెస్ విత్ డ్రాయల్ విధానంలో ఇప్పుడు మరో ముందడుగు పడింది. యూపీఐ పేమెంట్ అప్షన్ ద్వారా కూడా ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.  హిటాచీ పేమెంట్ సర్వీసెస్ కంపెనీ ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. యూపీఐ ఏటీఎంను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా భాగస్వామ్యంతో ఈ సర్వీస్‌ను లాంచ్ చేసింది. దీన్ని  హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎం  అని పిలుస్తారు. దీనిని ఉపయోగించుకుని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుతో పని లేకుండానే  ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2023లో ఈ హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎంను లాంచ్ చేశారు. త్వరలో ఈ ఏటీఎంలను  అందుబాటులోకి రానున్నాయి.  యూపీఐ ద్వారా నగదు పొందాలంటే ముందుగా ఎంత మెుత్తం డ్రా చేయాలో నిర్ణయించుకోవాలి. తర్వాత ఏటీఎంలో యూపీఐ క్యాష్ విత్‌డ్రా అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ సాధారణ ఏటీఎంల మాదిరే రూ.100, రూ.500, రూ.1000,  వంటి మొత్తాల వంటి నగదు అప్షన్స్ కనిపిస్తాయి. ఎంత డబ్బు విత్‌డ్రా చేస్తున్నారో ఎంటర్ చేయాలి. అనంతరం ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్‌ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఫోన్‌లో యూపీఐ యాప్ ఓపెన్‌ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. తర్వాత మీ యూపీఐ పిన్  ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ పిన్ కరెర్ట్‌గా ఎంటర్ చేసిన తర్వాత ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ప్రక్రియ మెుదలవుతుంది. అది పూర్తి అయిన తర్వాత ఏటీఎం నుంచి డబ్బులు వచ్చేస్తాయి.  సాధారణంగా ఏటీఎం కార్డుతో ఎలా ట్రాన్సక్షన్ చేస్తామో ఈ ఏటీఎంలో కూడా అంతే ఉంటుంది. అక్కడ కార్డు వివరాలను ఏటీఎం రీడ్ చేసి మీ వివరాలను స్క్రీన్ మీద చూపిస్తే.. ఈ యూపీఏ ఏటీఎంలలో మాత్రం మీరు స్కాన్ చేసిన అనంతరం యూపీఐ యాప్ వివరాలను స్కాన్ చేస్తుంది అంతే తేడా. ప్రస్తుతం దేశంలో 3000 ఏటీఎంలకు ఇది యాక్సస్ కలిగి ఉన్నట్లు చెప్తుండగా.. త్వరలోనే ఈ ఏటీఎంలలో సేవలు అందుబాటులో రానున్నాయని చెప్తున్నారు. ఇది నాన్ బ్యాంకింగ్ సంస్థలచే నిర్వహించబడుతుండగా.. యూపీఏ, కార్డుల స్కిమ్మింగ్ వంటి ఆర్థిక మోసాలను నిరోధించేందుకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని టెక్నాలజీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్?!

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టు అనూహ్యమేమీ కాదు. గత కొంత కాలంగా రాజకీయ సర్కిల్స్ లో చంద్రబాబు అరెస్టు పై విస్తృతంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. స్వయంగా చంద్రబాబే తనను జగన్ సర్కార్ రెండు మూడు రోజులలో అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రకటించారు. ఆయన తన అరెస్టు గురించి చెప్పి మూడు రోజులు గడిచాయో లేదో ఆయన అనుమానాలు నిజమేనని తేలుస్తూ ఏపీలో అత్యంత విదూషక పాత్ర పోషిస్తున్న సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసింది. అయితే సీఐడీ గత అరెస్టులు, కేసులకు భిన్నంగా చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ అధిష్ఠానం మాస్టర్ ప్లాన్ ఉందని పరిశీలకులు అంటున్నారు. తీవ్ర మైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మోడీ మరో సారి అంటే ముచ్చటగా మూడో సారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాలంటే దేశంలో, అలాగే బీజేపీకి కనీసం ఒక శాతం ఓటు స్టేక్ కూడా లేని ఏపీలో కూడా ఏదో ఒక విధంగా అలజడి, అనిశ్చితి ఏర్పడితే.. అది అంతిమంగా జగన్ కు అనుకూలంగా మారితే.. ఏపీలో సీట్లు, ఓట్లూ లేకపోయినా బీజేపీకి వచ్చిన బాధేమీ లేదు. కేంద్రంలో మరో సారి మోడీ అధికారంలోకి రావడమంటూ జరిగితే..జగన్ ఎటూ తన చెప్పుచేతల్లోనే ఉంటారు కనుక మద్దతుకు ఢోకా ఉండదు. జగన్ పార్టీ పేరుకు ఎన్డీయే భాగస్వామ్య పార్టీ కాదు కానీ.. ఆ భాగస్వామ్య పక్షాలకు మించిన విధేయతా, విశ్వాసం వైసీపీ నుంచి బీజేపీకి దక్కుతోంది. ముందు ముందు దక్కుతుంది కూడా. ఇక బీజేపీ మాస్టర్  ప్లాన్ ప్రకారం ఏపీలో బలమైన రాజకీయ పార్టీ ఉండకూడదు. 2019 ఎన్నికలలోనూ అదే లక్ష్యంతో పని చేసింది. ఇప్పుడు 2024 ఎన్నికలలోనూ అదే లక్ష్యంతో పని చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే ఏపీలో తెలుగుదేశం బలం తగ్గించడం కోసం రాష్ట్రంలో బీజేపీ స్వయంగా ఉనికిని సైతం కోల్పోవడానికి రెడీ అవుతోంది. అందుకే పార్టీ రాష్ట్ర నాయకులతో సంబంధం లేకుండా నేరుగా కేంద్ర నాయకత్వమే జగన్ తో సంబంధాలు నెరుపుతోంది. అడ్డగోలు అప్పులకు సహకారం అందిస్తోంది.  జగన్ కు మద్దతుగా నిలవడం వల్ల రాష్ట్రంలో బీజేపీ ఏమాత్రం బలపడే అవకాశాలు లేవు. అసలా పార్టీకి ఏపీలో ఉన్న బలం దాదాపు శూన్యం. అందుకే తన ప్రయోజనాల కోసం కాకుండా జగన్ ప్రయోజనాల పరిరక్షణ కోసం బీజేపీ అధినాయకత్వం ఏపీల పావులు కదుపుతోంది.  ప్రస్తుతం ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీలో తెలుగుదేశం పార్టీకి జనం సానుకూలంగా ఉన్నారనీ, ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పొత్తులతో సంబంధం లేకుండా ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమనీ బీజేపీ అంచనాకు వచ్చింది. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఐటీ షోకాజ్ నోటీసుల పేరుతో జగన్ కు ఒక ఆయుధాన్ని ఇచ్చింది. ఆ షోకాజ్ నోటీసులతో చంద్రబాబు అరెస్టయ్యే అవకాశం లేకపోయినా.. జగన్ చేతుల్లో ఉన్న ఏపీ సీఐడీని చంద్రబాబుపై ప్రయోగించే వెసులు బాటు వచ్చింది. చంద్రబాబు అరెస్టు వెనుక ఐటీ నోటీసులే ఉన్నాయన్న భావన ఏపీ ప్రజలలో కల్పించి.. ఏపీ సీఐడీ అడ్డగోలుగా రెండేళ్ల కిందటి స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసింది. ఇందుకు వెనుక నుంచి బీజేపీ  మద్దతు, ప్రోత్సాహం దండిగా ఉన్నాయనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.   వచ్చే ఎన్నికలలో చంద్రబాబు అధికారంలోనికి వచ్చి మళ్లీ బలపడకుండా బీజేపీ  చేస్తున్న వ్యూహరచనలో భాగమే ఈ అరెస్టు అని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే జనగ్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబును ప్రజలలోకి వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా తెరవెనుక నుంచి ఏపీలో తన మిత్రపక్షమైన జనసేన పట్ల జనం మొగ్గు చూపేలా ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చి కొత్త అంకానికి బీజేపీ తెరలేపే అవకాశం ఉందని కూడా పురిశీలకులు విశ్లేషిస్తున్నారు.