తెలంగాణలో కాంగ్రెస్ సానుకూలతను ప్రతికూలంగా మార్చుకుంటోందా?
తెలంగాణ రాష్ట్రంలో మరో సారి ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు రంగం సిద్ధమైందా? 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వలె చివరి నిముషంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా వాతావరణం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయా? వైఎస్ ఇమేజ్ అంటూ షర్మిలను పార్టీలోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ తప్పులో కాలేస్తోందా? వైఎస్సార్టీపీ విలీనం కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఉన్న సానుకూలతను ప్రతికూలతగా మార్చేస్తుందా, రాష్ట్రంలో మరోసారి ఉద్యమకాలం నాటి పరిస్థితి ఏర్పడేందుకు దోహదం చేస్తుందా? అంటే పరిశీలకులు ఆ అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
ఆంధ్రా మూలాలున్న లీడర్లు ఇక్కడ రాజకీయంగా యాక్టివ్ కావడం, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ గా మారిన తరువాత ఇక తెలంగాణ సెంటిమెంట్ అధికార పార్టీకి ఇసుమంతైనా దోహదపడే అవకాశాలు లేవని అంతా భావించారు. అయితే తెలంగాణ రాజకీయాలలో ఏపీ ప్రాంతానికి చెందిన నేతలు చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తుండటంతో బీఆర్ఎస్ కు వాతావరణం అనుకూలంగా మారుతోందా అన్న అనుమానాలను పరీశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్ మరో సారి దెబ్బతినడం ఖాయమన్న విశ్లేషణలు చేస్తున్నారు.
2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా పనిచేసింది. అయితే ఆ పరిస్థితి 2018 ఎన్నికల సమయంలో పెద్దగా కనిపించలేదు. అప్పుడు నాటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎన్నికల అజెండాగా అంతా భావించారు. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ కలిసి తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా కూటమి కట్టారో..అభివృద్ధి, సంక్షేమం అజెండాలు పక్కకు పోయి తెలంగాణ సెంటిమెంట్ బలంగా పని చేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తిగానే జనం చూశారు. ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీనే కాదు.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని కూడా ఆ ఎన్నికలలో తిరస్కరించారు. ఎంత లేదన్న కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు కాురుణంగా 2018 ఎన్నికలలో పాతిక నుంచి ముప్ఫై స్ధానాలలో కాంగ్రెస్ దెబ్బతిని పరాజయం పాలైందని అప్పట్లో కాంగ్రెస్ నాయకులే బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. పొత్తు లేకుండా నాటి ఎన్నికలలో కాంగ్రెస్ కచ్చితంగా మరో పాతిక నుంచి ముప్ఫై స్థానాలలో విజయం సాధించి ఉండేదనీ, అప్పుడు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు పెద్దగా స్పందన ఉండి ఉండేది కాదనీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు.
ఏతా వాతా అప్పుడూ, ఇప్పుడూ కూడా కాంగ్రెస్ చెప్పేదేంటంటే అప్పట్లో తాము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని నష్టపోయామని. తాము చంద్రబాబు వల్ల నష్టపోయాయని అప్పట్లో పలువురు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా అంగీకరించిన సంగతి కూడా తెలిసిందే.అయితే ఐదేళ్లు గడిచిపోవచ్చాయి. మళ్లీ రాష్ట్రంలో ఎన్నికల సమయం వచ్చేసింది. కాంగ్రెస్ కు వాతావరణం సానుకూలంగా ఉందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ మరో సారి షర్మిల పార్టీ విలీనం అంటూ ఆ సానుకూలతను ప్రతికూలంగా మార్చుకునే దిశగా ఆడుగులు వేస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏపీ నుంచి ఎవరైనా రాష్ట్రానికి రావాలంటే వీసా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ గతంలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఇప్పటికీ మరచిపోలేదు. అటువంటి నాయకుడి కుమార్తె షర్మిలను తెలంగాణ సమాజం అంగీకరించి ఆదరించే పరిస్థితులు ఇప్పటికీ లేవు. అందుకే షర్మిల వైఎస్సార్టీపీ పేర తెలంగాణలో రాజకీయంగా ఎదుగుదామని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు
తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3,600 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేసినా, ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను మించి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించినా.. జనం నమ్మలేదు. తెలంగాణలో ఆమె కానీ, ఆమె పార్టీ కానీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఈ పరిస్థితుల్లో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ ఆయ్యారు. కాంగ్రెస్ కూడా రెడ్ కార్పెట్ పరిచి వెల్ కమ్ చెబుతున్నట్లుగానే కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకించినా, వీహెచ్ వంటి సీనియర్ నేతలు అభ్యంతరం చెప్పినా కాంగ్రెస్ హై కమాండ్ ఖాతరు చేస్తున్నట్లు కనిపించదు. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేసుకుని ఆమెను తెలంగాణ రాజకీయాలకు దూరం పెట్టినా పెద్దగా ప్రయోజనం అయితే ఉండే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆమె ఏపీ రాజకీయాలలో చూపే ప్రభావం కూడా అంతంత మాత్రమేననీ, వైఎస్ ఇమేజ్ పేరిట ఆమె ఏపీ రాజకీయాలలో అక్కడి అధికార జగన్ పార్టీకి ఒకింత నష్టం చేకూరిస్తే చేకూర్చవచ్చు కానీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేంతగా ప్రభావితం చేయలేరనీ అంటున్నారు.