అలిపిరి నడక మార్గంలో మరో చిరుత
posted on Sep 2, 2023 @ 12:32PM
అలిపిరి నడక మార్గాన్ని టీటీడీ చిరుత పులల అభయారణ్యంగా మార్చేసిందా? నడకదారి భక్తులు ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడేలా పరిస్థితులను మార్చేసిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా కలియుగ వైకుంఠంగా భక్తకోటి భావించే తిరుమల పవిత్రతను మంటగలపడంతో ఊరుకోకుండా.. తిరుమల వెంకన్నను దర్శించుకునే భక్తల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా టీటీడీ అడుగులు వేస్తున్నదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చిరుత దాడిలో ఓ చిన్నారి మరణించిన సంగతి తెలిసిందే.
అంతుకు కొద్ది రోజుల ముందు చిరుత దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ రెండు సంఘటనలతో అలిపిరి కాలినడకన తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఒకటికి పది సార్లు ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడింది. చిరుత సంచారం ఉన్న ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేసి నాలుగు చిరుతను బంధించారు. భక్తులు హమ్మయ్యా అని ఊరట పొందే లోగానే మరో చిరుత సంచారాన్ని గుర్తించడంతో భక్తులలో ఆందోళన పెరిగిపోతున్నది.
కాలిబాటలో లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు కెమేరాలలో రికార్డు కావడంతో చిరుతల భయం కాలినడక భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇటీవల చిరుత దాడిలో బాలిక మరణించిన ప్రదేశంలోనే చిరుత సంచారాన్ని గుర్తించడంతో అసలు నడక మార్గం లో భక్తుల భద్రతను టీటీడీ గాలికి వదిలేసిందా అన్న అనుమానాలు భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అలిపిరి నడకమార్గంలో నాలుగు చిరుతలను బంధించామని టీటీడీ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఆ మార్గంలో మరో చిరుత అంటే ఇది ఐదోది సంచరిస్తోందన్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయి.
అలిపిరి నడకమార్గంలో భక్తుల రక్షణకు చేయాల్సిన ఏర్పాట్లు పూర్తిగా విస్మరించిన టీటీడీ భక్తులు తమను తామే రక్షించుకోవాలంటున్నది. ఇందు కోసం నకడమార్గంలో వెళ్లే వారికి కర్రలను సప్లై చేస్తున్నది. అంతే కాకుండా ఆ కర్రలతో చిరుతలను భయపెట్టి భద్రంగా వెళ్లండని సలహాలిస్తోంది. అయితే ఆ కర్రలు కూడా ఉచితం కాదట. ప్రతి కర్రకు రుసుం వసూలు చేస్తున్నది. కొండ కింద అలిపిరి నడక మార్గం వద్ద టీటీడీ కర్రలు అందజేస్తుంది. కొండపైకి వెళ్లగానే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. కర్రలను అందించడం ద్వారా శ్రీవారిని నడక మార్గంలో దర్శించుకోవాలనుకునే భక్తులు కర్రసాము నేర్చుకుని మరీ రండి అని టీటీడీ చెబుతోందా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు అలిపిరి నడక మార్గంలో సంచరిస్తున్న చిరుతల సంఖ్య ఎంత అన్న విషయాన్ని సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించి నిర్ధారించే దిశగా టీటీడీ ఏమైనా చర్యలు తీసుకుంటున్నదా? నడకమార్గంలోకి వన్యప్రాణులు చొచ్చుకు రాకుండా కంచె నిర్మాణం ప్రతిపాదన ఎప్పటికైనా కార్యరూపం దాలుస్తుందా? లేక కర్రలు ఇచ్చేశాం. ఇక మీ రక్షణ మీదే అంటు చేతులెత్తేసిందా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.