తెలుగు రాష్ట్రాలలో హాల్ మార్క్ నిబంధనల పరిధిలోకి మరిన్ని జిల్లాలు
బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ నిబంధనను అమలులోకి తీసుకువచ్చింది. హాల్ మార్క్ ద్వారా బంగారు ఆభరణాల కొనుగోలు దారులు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 2021 జనవరి 15 నుంచి బంగారు నగలకు హాల్‌మార్క్ నిబంధనను తప్పనిసరి అయినప్పటికీ ఈ నిబంధన ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలోనే అమలులో ఉంది.
తాజాగా దీనిని విస్తరించడంతో తెలంగాణలో కొత్తగా ఈ నిబంధన పరిధిలోకి మరో ఐదు జిల్లాలు చేరాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలు మాత్రమే హాల్ మార్క్ నిబధన పరిధిలో ఉండగా ఇప్పుడు మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను చేర్చింది. దీంతో తెలంగాణలో 12 జిల్లాలు బంగారు నగలకు హాల్‌మార్క్ నిబంధనల పరిధిలోకి వచ్చినట్లైంది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ ఈ నిబంధన పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు మాత్రమే ఉండగా ఇప్పుడు అన్నమయ్య ,కోనసీమ , ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలయాడ్ అయ్యాయి. దీంతో ఏపీలో హాల్‌మార్క్ నిబంధనల పరిధిలోకి వచ్చిన జిల్లాల సంఖ్య 17కు పెరిగింది.