రూట్ మార్చిన కేవీపీ!
posted on Sep 5, 2023 @ 5:51PM
మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో వైఎస్ఆర్‌పై రాసిన రైతే రాజు అయితే... పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేవీపీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తనను ఆంధ్రావాడు అని అనవద్దన్నారు. తాను తెలంగాణకు చెందిన వ్యక్తినని స్పష్టం చేశారు.
దేశవిదేశాల్లో సైతం మనవాళ్లను లోకల్‌గా గుర్తిస్తున్నారని గుర్తు చేశారు. వీలైతే.. తనను కూడా సగం తెలంగాణ వాడిగా అయినా గుర్తించండంటూ సభా ముఖంగా కేవీపీ విజ్జప్తి చేశారు. 1980లో హైదరాబాద్ వచ్చానని.. నాటి నుంచి తాను హైదరాబాద్‌లోనే ఓటు హక్కు వినియోగించుకొన్నానన్నారు. తాను తెలంగాణ మట్టిలోనే కలిసిపోతానని ఆయన తన ప్యామిలీ సాక్షిగా ప్రమాణం చేసి మరీ స్పష్టం చేశారు. కేవీపీ వ్యాఖ్యలు.. పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే కేవీపీ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం.. పరమార్థం.. ఏమై ఉంటాయా అనే ఓ సందేహం కూడా ఆ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉండమే కాకుండా.. అధికార బీఆర్ఎస్ కి ప్రధాన ప్రత్యర్థిగా మారిందని.. అదీకాక బీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో.. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదని.. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో సాగుతోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయిందని.. రామాయణంలో ఆంజనేయుడు సంజీవని పర్వతం తెచ్చినా.. ఆ పార్టీ ఆ రాష్ట్రంలో బతికి బట్టకట్టే పరిస్థితుల్లో ఆ పార్టీ లేదని.. అలాంటి ఏపీలో కాంగ్రెస్ పార్టీ భాద్యతలు వైఎస్ షర్మిల చేపడితే.. హస్తం పార్టీలో చురుకుదనం, చలాకీదనం వచ్చే పరిస్థితి మాత్రం లేదని.. అటువంటి పరిస్థితుల్లో ఏపీలో వైఎస్ షర్మిల వెంట ఉండాలంటూ హస్తం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. మనస్సు ఒప్పకోకపోయినా.. ఆ ఆదేశాలకు కట్టుబడి ఆమె వెంట వెళ్లాల్సి ఉంటుందని.. అందుకే ముందుగా కేవీపీ.. పార్టీ నేతలకు ముందరి కాళ్ల బంధం వేసి.. ముందే తెలంగాణ వాడిగా గుర్తించమంటూ మార్చి రాజకీయం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఓ వేళ రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏదో ఒక పోస్టింగ్ అంటే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవీపీకి కేటాయించిన లాంటి పోస్టింగ్ ఇచ్చినా... మరో అయిదేళ్లు అలా.. అలా.. గడిచిపోతాయని కేవీపీ భావిస్తున్నారంటున్నారు.
ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీలో.. వైఎస్ఆర్ టీపీ వీలినం చేసేందుకు ఇప్పటికే వైయస్ షర్మిల సంసిద్దత వ్యక్తం చేశారు. ఆ క్రమంలో హస్తం పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీతో భేటీ అయి ఆమె చర్చించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో వైయస్ షర్మిల ఎంట్రీ దాదాపుగా ఖయమైపోయింది. ఇక సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత పేరుతో భారీ ర్యాలీని నిర్వహించనున్నారు.
ఈ ర్యాలీలో వైఎస్ షర్మిల పాల్గొంటారని సమాచారం. అదే రోజు.. పార్టీ వీలినం కూడా జరిగే అవకాశాలున్నాయన్న ప్రచారం సాగుతోంది. ఓ వేళ... అదే రోజు పార్టీ వీలినం అయితే.. తెలంగాణలో వైఎస్ షర్మిలకు సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ కేవీపీకి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. ఆయనకు అంతకంటే కావాల్సింది ఏముందనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్స్ లోవాడి వేడిగా నడుస్తోంది.