రామా కనవేమి రా!
posted on Sep 4, 2023 @ 2:00PM
గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు. దీంతో ఎమ్మెల్యే సీటు ఆశించిన వారు.. హామీ ఇచ్చినా.. ఎమ్మెల్యే టికెట్ దక్కని వారు.. అలాగే ప్రస్తుత సిట్టింగ్‌లకు.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కక పోవడం..వంటి కారణాలతో వారంతా ఆసంతృప్తి జీవులుగా మారి.. ఆందోళన రాగాన్ని అందుకొన్నారు. ఆ క్రమంలో వారంతా కారు పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీకి ప్రయత్నిస్తున్నా.. వారికి అపాయింట్‌మెంట్ దొరకడం లేదు.
దీంతో పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితతో సమావేశం అవుతున్నారు. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. రానున్న ఎన్నికల్లో ఉప్పల్ ఎమ్మెల్యే సీటు బండారు లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో ఉప్పల్ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.. కవితతో బేటీ అయ్యారు. ఈ భేటీలో వారు మా ఇద్దరిలో ఎవరికీ ఎమ్మెల్యే సీటు ఇచ్చినా.. ఓకే.. అంటూ వినతి పత్రం అందజేసి వచ్చారు. అయినా అటు వైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్‌తో భేటీ కోసం అసంతృప్త జీవులంతా వేచి చూస్తున్నారు. కేటీఆర్ వద్ద తమ ఆవేదన విన్నవించుకొనేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నారని సమాచారం.
అయితే కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. వాస్తవానికి ఆయన శుక్రవారం( సెప్టెంబర్ 1)నే తన విదేశీ పర్యటన నుంచి తిరిగి రావాల్సి ఉంది. ఆయనతో కలిసి వెళ్లిన ఉన్నతాధికారులంతా ఇప్పటికే హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. కానీ కేటీఆర్ మాత్రం ఇంకా రాలేదు. దీంతో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఆసంతృప్తి జీవుల్లో బీపీ అంతకంతకు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక కేటీఆర్.. సెప్టెంబర్ 3వ తేదీన హైదరాబాద్ తిరిగి వస్తారన్న ప్రచారం జరిగినా ఆ తేదీకి కూడా ఆయన హైదరాబాద్ చేరుకున్న దాఖలాలు లేవు.
మరోవైపు కేటీఆర్.. తన అమెరికా పర్యటన మరికొన్ని రోజుల పాటు పొడుగించుకొన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని కేటీఆర్ స్వయంగా పలువురికి హామీలు ఇచ్చారనీ, వారంతా కేటీఆర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని... అలాగే తమ బాధ చెప్పుకొనేందుకు ప్రస్తుతం అసంతృప్తి జీవులు సైతం కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నారనీ, దీంతో తాను వెంటనే హైదరాబాద్ వస్తే ఈ తాకిడి తట్టు కష్టమన్న ఉద్దేశంతోనే కేటీఆర్ తన విదేశీ పర్యటనను పొడిగించుకున్నారన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. కేసీఆర్ అభ్యర్థుల ప్రకటించక ముందే కేటీఆర్ అమెరికా వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. కేటీఆర్ తన కుమారుడు హిమాన్ష్‌ను అమెరికాలో ఓ కాలేజీలో జాయిన్ చేయించేందుకు యూఎస్ వెళ్లారని.. దీంతో పాటు అధికార పర్యటన సైతం పెట్టుకున్నారని... అందులోభాగంగా తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల అధినేతలను ఒప్పించేందుకు అధికారులను ఆయన వెంట తీసుకు వెళ్లారనే ఓ చర్చ నడుస్తోంది.
మరి కేటీఆర్ ఎప్పుడు హైదరాబాద్ తిరిగి వస్తారో.. ఈ అసంతృప్తి జీవులు వేదనలు.. ఆవేదనలు ఎప్పుడు వింటారో.. వారికి టికెట్.. వస్తుందో రాదో చెప్పే వారు లేక.. తమకు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో రామా కనవేమి రా అని ఎవరికి వారు ఆరున్నొక్క రాగంలో పాడుకుంటున్నారన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.