ఐయాం విత్ బాబు అంటూ హైదరాబాద్ లో కదంతొక్కిన ఐటీ ఉద్యోగులు

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు  రాష్ట్రం, ప్రాంతం అన్న తేడా లేకుండా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  హైదరాబాద్, బెంగళూరులో ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఐయామ్ విత్ బాబు అంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్లపై బైఠాయిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బుధవారం (సెప్టెంబర్ 13)  హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు కదం తొక్కారు. గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన ఐటీ ఉద్యోగుల నినాదాలతో మార్మోగింది. చంద్రబాబు అరెస్టు అన్యాయం, అక్రమం, అధర్మం అంటూ వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినదించారు. దురుద్దేశపూర్వకంగా చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.  చంద్రబాబు విజన్ వల్లే తాను మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నత స్థాయి జీవితాన్ని గడపగలుగుతున్నామని, ఆయన మాత్రం జైల్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిజన్ బ్యాచ్ విజన్ బ్యాచ్ ను టార్గెట్ చేసిందన్నారు.  ఐయాం విత్ సీబీఎన్ వంటి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. జగన్ కు ఐటీ ఉద్యోగులు బుద్ధి చెపుతారని హెచ్చరించారు. కాగా ఐటీ ఉద్యోగుల ఆందోళనతో ఆ  ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  

చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. ఆయన తప్పు చేయరు.. లోకేష్ కు రజనీకాంత్ ఫోన్

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. ఆయనను అందరూ అజాత శత్రువుగా చెబుతారు. అందరితో మంచిగా ఉంటారు. పరుష వాక్యం అన్నది ఆయన నోటి నుంచి రాదు.  రాజకీయాలలోకి ఎంట్రీ ఇద్దామని ఆయన భావించి కూడా రాజకీయాలు తన నైనాజికి సరిపడవన్న భావనో ఏమో ఆ యోచన నుంచి విరమించుకున్నారు. అటువంటి రజనీకాంత్ ను ఏపీలోని అధికార వైసీపీ వివాదంలోకి లాగింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఎన్టీఆర్ ను యుగపురుషుడిగా, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని విజనరీగా అభివర్ణించారు.  చంద్రబాబు కారణంగానే హైదరాబాద్ లో  ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ వెళితే భారతదేశంలో ఉన్నామా? న్యూయార్క్ లో ఉన్నామా? అనిపించేలా అభివృద్ధి జరిగిందనీ, అందంతా చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందన్నారు. చంద్రబాబుతో తనకు మూడు దశాబ్దాల స్నేహబంధం ఉందనీ, తన ప్రతి పుట్టిన రోజుకూ చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతారనీ రజనీకాంత్ ఆ సందర్భంగా చెప్పారు. ఆ ప్రసంగంలో రజనీకాంత్  ఎక్కడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. కానీ చంద్రబాబును ప్రశంసించడమే ఆయన చేసిన పాపం అన్నట్లుగా  వైసీపీ రజనీకాంత్ పై విమర్శల వర్షం కురిపించింది. మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, నటుడు కం  పొలిటీషియన్ పోసాని కృష్ణ మురళి వంటి వారు రజనీకాంత్ పై అనుచిత వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. నువ్వు హీరోవా అంటూ హేళన చేశారు. దేశ విదేశాల్లో ఉన్న రజనీకాంత్ అభిమానులందరికీ ఆగ్రహం కలిగించారు. అయినా అప్పటికి రజనీకాంత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మేధావులూ, సామాన్యులూ కూడా రజనీకాంత్ పై వైసీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుపట్టారు.  అయితే అప్పటికి ఊరుకున్న రజనీకాంత్ తన చిత్రం జైలర్ సినిమా వేడుకలో  మాత్రం ‘మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా?" అంటూ వైసీపీ వారికి చురకలు అంటించారు.   మొదటి వాక్యాలను తమిళంలో చెప్పిన రజినీకాంత్.. చివరిలో మాత్రం 'అర్థమైందా రాజా' అని తెలుగులో చెప్పడం విశేషం. పోసాని మాట్లాడితే 'రాజా రాజా' అంటుంటారు. అందుకే పోసాని శైలిలోనే అర్థమైందా రాజా అంటూ వైసీపీ నాయకులకు రజినీ చురకలు అంటించారనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది కూడా. మొత్తం మీద అలుంగుటయే ఎరుగని రజనీ కాంత్ కూడా వైసీపీ తీరుపై సౌమ్యంగానైనా గట్టి రిటార్డ్ ఇచ్చారు. అటువంటి రజనీకాంత్ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు పై స్పందించారు. తన మిత్రుడు చంద్రబాబు  గొప్ప పోరాట యోధుడు అని, ఆయన ప్రజా శ్రేయస్సుకోతం నిరంతరం పరితపించే గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనను ఏం చేయలేవని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు శ్రీరామరక్ష అంటూ లోకేష్ కు ధైర్యం చేప్పారు.  తన స్నేహితుడు చంద్రబాబు తప్పు చేయరని, ఆయన చేసిన మంచి పనులు, నిస్వార్థ ప్రజా సేవే ఆయనను క్షేమంగా బయటకు తీసుకువస్తాయన్నారు.  

ఇండియా కూటమిలో లుకలుకలు ?

2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ ఓటమి,  ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపడమే  ఎజెండా గా ఏర్పడిన ఐ డాట్ ఎన్ డాట్ డి డాట్ ఐ డాట్ ఎ… (ఇండిమా) చుక్కల కూటమి... లెక్కలు తప్పుతున్నాయా? కూటమి కలలకు శ్రీకారం చుట్టిన జనతాదళ్ (యు) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  అడుగులు తడబడుతున్నాయా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నిజమే. అడుగులు తడబడుతున్నది ఒక్క నితీష్ నడక, నడతలోనే కాదు. కూటమి పెద్ద దిక్కు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అడుగులు కూడా తడబడుతున్నాయి. ఇప్పటికే పవార్  సమీప బంధువు (మేనల్లుడు) అజిత్ పవార్ మెజారిటీ ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని, బీజేపీ, శివ సేన (షిండే) కూటమితో చేతులు కలిపారు. ఆ కూటమి ప్రభుత్వంలో కొలువు తీరారు.  మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినా  శరద్ పవార్ ‘బంధుత్వం’ ముసుగులో అజిత్ పవార్ తో రాజకీయ బంధుత్వం కొనసాగిస్తున్నారనే  అనుమానాలు ఇండియా కూటమిలో వ్యక్తమవుతున్నాయి. పవార్ ముందు చూపుతోనే  రెండు పడవల ప్రయాణం చేస్తున్నారని  రేపు ఎన్నికల ముందో తర్వాతో పరిస్థితులను బట్టి  ఆయన అటు మొగ్గినా, ఇటు మొగ్గినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.    మరోవంక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్  ఆమ్ ఆద్మీ పార్టీ  (ఆప్ ) మరో అడుగు ముందుకేసింది. ఓ వంక ఇండియా కూటమి  బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి  అభ్యర్ధులను నిలబెట్టే ఆలోచనతో  సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుపుతుంటే, బుధవారం (సెప్టెంబర్ 13) ఢిల్లీలో శరద్ పవార్ నివాసంలో ఇండియా కూటమి కోఅర్దినేషన్, ఎలక్షన్ స్ట్రాటజీ సమావేశం జరుగుతోంది) మరోవంక, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే,మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాలలో పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను ఆప్   ప్రకటించేసింది.  అంతేకాకుండా. తృణమూల్, జేడీయు, ఎస్పీ, ఆప్, ఆర్జేడీ సహా కూటమి భాగస్వామ్య పార్టీలు, కూటమి మనుగడకు సీట్ల పంపకమే కీలకమని భావిస్తున్నాయి. అలాగే  అదేదో  తేలిన తర్వాతనే ఉమ్మడి ప్రచార వ్యూహం గురించి మాట్లాడదామని అంటున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం సీట్ల సర్దుబాటు కంటే కూటమి నాయకత్వం పై నిర్ణయం అవసరమని భావిస్తోంది.    ఆదలా ఉంటే  ఇప్పడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పవార్ అడుగుజాడల్లో అయితే అడుగులు వేస్తున్నారన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. నిజానికి  గత సంవత్సరం ఆగష్టులో బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఆర్జేడీతో జట్టు కట్టినా, ఆయన మళ్ళీ  ఎప్పుడైనా బీజేపీ గూటికి చేరతారనే అనుమానాలు అప్పటి నుంచీ వినవస్తూనే ఉన్నాయి. అయితే  నితీష్ గత జనవరి, ఫిబ్రవరి నెలలలో విపక్షాల ఐక్యత వేదిక ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆయన సారధ్యంలో, ఆయనే అనుసంధానకర్తగా బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీల తొలి సమావేశం  పాట్నాలో జరిగింది. ఆ తర్వాత బెంగుళూరులో జరిగిన  రెండవ సమావేశంలో  ఇండియాగా నామకరణం జరిగింది. ముంబైలో మూడవ సమావేశం కూడా జరిగింది కానీ  కూటమిని తమ గుప్పిట్లోకి తీసుకోవాలనే  నితీష్ కల మాత్రం ముందుకు సాగ లేదు. బ్రేక్ పడింది. కూటమిని, కాంగ్రెస్ పార్టీ తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిన చేసిన నేపధ్యంలో నితీష్ కుమార్  ఇండియా కూటమితో కొంత అంటీముట్టనట్లే ఉంటున్నారు. అదలా ఉంటే ఇప్పడు తాజాగా నితీష్ కుమార్  అనూహ్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత శనివారంనాడు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన జి-20  విందు సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆయన అడుగులు జోడు పడవల ప్రయాణం వైపుగా పడుతున్నాయా  అనే అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోనూ మాట కలిపారు. బీహార్‌లో బీజేపీతో గత ఏడాది ఆగస్టులో నితీష్ తెగతెంపులు చేసుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన కలవడం ఇదే మొదటిసారి. నితీష్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధానమంత్రి పరిచయం చేశారు. బీజేపీని ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించుకున్న 'ఇండియా కూటమి' నేతలకు సహజంగానే ఇది మింగుడుపడని వ్యవహరమే. నీతీష్ మంచి రాజనీతిజ్ఞుడని, సమయానికి తగు నిర్ణయాలు తీసుకోవడంలో కాకలు తీరిన నేత అని అందరికీ తెలిసిన విషయమే. జి-20 డిన్నర్‌కు హాజరుకావడం ద్వారా సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యం తనకు ఉందని  నితీష్ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెప్పకనే చెప్పినట్టు అయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జి-20 మెగా షో‌తో దేశానికి ఒరిగేదేమీ లేదని బీహార్‌లో నితీష్ భాగస్వామ పార్టీ ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ గత సోమవారంనాడు పెదవి విరిచారు. బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విపక్ష ఐక్య కూటమి యత్నాలకు నితీష్ సారథ్యం వహిస్తూ వచ్చారు. ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తేవడమే తన లక్ష్యమని నితీష్ చెబుతూ వచ్చారు. అయితే విపక్ష కూటమికి సారథ్యం వహించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును లాలూ ప్రసాద్ ఇటీవల ప్రతిపాదించడం జేడీయూకు మింగుడు పడటం లేదు. జేడీయూ అగ్రనేతలు కొందరు విపక్ష కూటమి పీఎం అభ్యర్థిగా నితీష్ పేరును ప్రతిపాదించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, ఈ ముచ్చట ఏదీ ముంబై సమావేశంలో చోటుచేసుకోలేదు. కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం, సీట్ షేరింగ్ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని మాత్రమే సమావేశంలో నిర్ణయించారు. దీంతో ఒక్క నితీష్ మాత్రమే కాదు, అటు మమత, ఇటు కేజ్రీవాల్ .. అలాగే, ఇడియా కూటమిలోని ఇతర పార్టీల నేతలు కూడా, ఇండియా కూటమి సారధ్య బాధ్యతలను హస్తం పార్టీకి అప్పగించేందుకు సిద్ధంగా లేరని, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ  సారధ్యంలో పనిచేసేందుకు సిద్ధంగా లేరని, అంటున్నారు.

ఎన్నికలపై తెలంగాణలో కన్ఫ్యూజన్.. పార్టీలలో అయోమయం

ఎన్నికల సమయం ముంచుకువస్తున్నా.. తెలంగాణలో మాత్రం రాజకీయ సర్కిల్స్ లోనే కాదు.. పార్టీల్లోనూ, నేతల్లోనూ కూడా ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం నెలకొని ఉంది. ఊరికి ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించేసిన అధికార బీఆర్ఎస్ తొందరపాటుతో రాజకీయంగా తప్పుటడుగు వేశానా అన్న మథనంలో ఉంటే.. అధికారం కోసం అన్ని విధాలుగా సమాయత్తమౌతున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల విషయంలో వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. ఇక రాష్ట్రంలో అధకారమే ధ్యేయమంటూ దూకుడుగా కదులు తున్న బీజేపీలో కూడా హఠాత్తుగా అనూహ్యంగా స్తబ్దత నెలకొంది. ఇందుకు కారణాలేమిటని ఆలోచిస్తూ తలలు బద్దలు కొట్టుకోవలసిన అవసరం ఏమీ లేదు. కేంద్రం జమిలి ఎన్నికలవైపు మొగ్గు చూపుతోందని వస్తున్న వార్తల కారణంగానే.. రాష్ట్రంలో రాజకీయంగా ఈ అనిశ్చితి వాతావరణం ఏర్పడిందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇంతకీ జమిలి చర్చ కారణంగా అన్ని రాజకీయ పార్టీలలోనూ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లో జరుగుతాయా, లేక సార్వత్రిక ఎన్నికలతో కలిపి వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలలో జరిగే అవకాశాలు ఉన్నాయా అన్న అనుమానాలే.  కేంద్రం జమిలికే మొగ్గు చూపి.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కలిసి వచ్చే రాష్ట్రాలలో కూడా ముందస్తుకు తెరతీసి పనిలో పనిగా సార్వత్రిక ఎన్నికలను కూడా ముందుకు జరిపేస్తుందా? లేక షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలలో ఎన్నికలను వాయిదా వేసి సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుపుతుందా అన్న సందేహాలు రాజకీయ పార్టీలలోనే కాదు, పరిశీలకులు, విశ్లేషకుల్లో కూడా బలంగా వ్యక్తం అవుతున్నాయి.   ఈ సందేహాలు, అనుమానాలు నివృత్తి కావాలంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వరకూ ఎదురు చూడాల్సిందే. 

ఏపీలో ముందస్తా? తెలంగాణలో రాష్ట్రపతి పాలనా?

తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రెండు రాష్ట్రాలలోనూ ఎన్నికల వేడి సెగలు కక్కుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇరు రాష్ట్రాలలోనూ కూడా అసెంబ్లీ ఎన్నికల విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ఈ ఏడాది చివరిలో ఎన్నికలకు సర్వం సన్నాహకంగా తయారైంది. ఇప్పటికే అత్యధిక అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను ప్రకటించేసింది. అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల శంఖారావం మోగించేసింది. సరిగ్గా ఈ సమయంలోనే జమిలి ప్రతిపాదన కేంద్రం తెరపైకి తీసుకు వచ్చింది. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు కేంద్రం నిర్ణయించడానికి కారణం ఇదేనని పరిశీలకులు గట్టిగా చెబుతున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ మంత్రి కేటీఆర్ కూడా మంగళవారం (సెప్టెంబర్ 18) ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ఏది ఏమైనా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలోనే తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు జరిగేది అన్న విషయంపై స్పష్టత వస్తుంది అని అన్నారు. ఒక వేళ అక్టోబర్ 10వ తేదీ లోగా తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకుంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే వచ్చే ఏడాది జరిగే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అంటే ఒక వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడటమంటూ జరిగితే.. నిర్ణీత గడువు పూర్తయిన తరువాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యమా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే   ఈ శుక్రవారం (సెప్టెంబర్ 15) జరగనున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన  ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ప్రత్యేక సమావేశాల్లో జమిలి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాలని కేసీఆర్ తమ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. గతంలో జమిలికి కేసీఆర్ సై అన్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలలోనే కాదు, జాతీయ రాజకీయాలలో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. 2018 ఎన్నికల సమయంలో  కేసీఆర్ జమిలికి సై అన్నప్పుడు బీఆర్ఎస్, బీజేపీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే  బీఆర్ఎస్ లో కేంద్రం జమిలిపై తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు ఏపీలో కూడా రాజకీయం రగులుతోంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్టుతో ఒక్క సారిగా జగన్ సర్కార్ పై ప్రజాగ్రహం భగ్గుమంది. ఆ ఆగ్రహ జ్వాలలు మరింత పెరిగి సర్కార్ ను దహించేయడానికి ముందే.. ముందస్తుకు వెళ్లి ఎలాగోలా బయటపడాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకోసమే ఆయన ఇలా లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చారో లేదో.. అలా హస్తిన పర్యటన పెట్టుకున్నారు. హస్తిన పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సారి ఆయన పర్యటన అజెండా ఏపీలో ముందస్తు ఎన్నికలేనని అంటున్నారు. వైసీపీ శ్రేణులు కూడా ఇది అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుతో దేశం శ్రేణులు షాక్ లో ఉన్నాయనీ, ఆ షాక్ నుంచి టీడీపీ శ్రేణులు తేరుకుని.. ఆందోళనలు ఉధృతం చేయడానికి ముందే రాష్ట్రంలో ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తే రాజకీయంగా ఏదో మేరకు లబ్ధి చేకూరుతుందన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ రద్దు చేయాలని జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారనీ, ఎటూ కేంద్రం జమిలి వ్యూహంతో ఉందన్న అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ లోనే ఏపీలో కూడా ఎన్నికలు జరిగితే మేలని జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే హస్తిన నుంచి తిరిగి రాగానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 21 నుంచి  ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అవసరమైతే వాటిని మరో రెండు మూడు రోజులు పొడిగించైనా ఈ నాలుగున్నరేళ్లలో తాను చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా నివేదించి అసెంబ్లీ రద్దు ప్రతిపాదనను జగన్ చేస్తారని చెబుతున్నారు. అయితే జగన్ ముందస్తు నిర్ణయానికి కేంద్రం అనుమతి, అంగీకారం తప్పని సరి కనుకనే ఆ విషయంలో కేంద్రం పెద్దల అనుమతి పొందేందుకే జగన్ హస్తిన పర్యటన అంటున్నారు. ఇప్పికే  ఇప్పటికే ఐదు రాష్ట్రాలలో  ఎన్నికల ప్రక్రియకు ఈసీ సన్నాహాలు మొదలెట్టేసింది. అయితే ఏపీలో మాత్రం ఈ ప్రక్రియ అధికారికంగా మొదలు కాలేదు.   ఎలా చూసినా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సాధారణ పరిస్థితుల్లో అయితే ఏపీ ఎన్నికలు జరిగే అవకాశం లేదనీ, అయితే కేంద్రం జమిలీ ఎన్నికలపై నిజంగానే సీరియస్ గా ఉంటే.. మాత్రం ఏపీలో ముందస్తు అసాధ్యం కాదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మొత్తం మీద జమిలి చర్చ ఇరు తెలుగు రాష్ట్రాలనూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నికలు వెనక్కు జరుగుతాయన్న ఆందోళనలో ఉంటే.. ఏపీలో  ముందస్తుకు అవకాశం లేకపోతే పుట్టి మునగడం ఖాయమన్న భయంలో అధికార వైసీపీ ఉంది. మరి కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరో వారం జైల్లోనే చంద్రబాబు?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో వారం రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయనను రాజమహేంద్రవరం జైలు కు తరలించారు. కాగా ఈ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టు బుధవారం (సెప్టెంబర్ 13) విచారించింది. అనంతరం ఈ విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్ పై ఇరు వర్గాల వాదననూ పూర్తిగా వినాలని భావించిన న్యాయస్థానం విచారణను వచ్చే మంగళవారం (సెప్టెంబర్ 19)కి వాయిదా వేసింది.   ఏసీబీ కోర్టులో సీఐడీ చంద్రబాబును విచారించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను ఈ నెల 19 వరకూ విచారించవద్దని ఆదేశించింది. ఆ రోజు వరకూ చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది.   అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు బెయిలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ కూడా ఈ నెల 19కి వాయిదా పడింది.  

స్కిల్ స్కాం అంటూ జగన్ సర్కార్ కట్టుకథలూ.. కాకమ్మ కబుర్లూ!?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడిని   ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయ‌డం, ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడం, ఆ వెంటనే ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించడం తెలిసిందే. ఇంతకీ ఆయనను ఎందుకు అరెస్టు చేశారు. ఏ కేసులో అరెస్టు చేశారు? ఈ అరెస్టు వెనక లక్ష్యం ఏంటి?  ఆసలు ఈ కేసు ఏంటి? సెక్షన్లు ఏంటి? కుంభకోణం ఏంటి?  అందులో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు పాత్ర ఏంటన్నది  అలా ఉంచితే.. అసలు ఆయనను అరెస్టు చేసిన తీరే జగన్ కక్షసాధింపు ధోరణికి, చర్యలకు పరాకాష్టగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  చంద్రబాబు అరెస్టుపై  వైసీపీ తప్ప దేశ వ్యాప్తంగా మిగిలిన అన్ని పార్టీలు, ఆయా పార్టీల నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఖండిస్తున్నారు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, కమ్యూనిస్ట్ నేతలు కూడా చంద్రబాబు అరెస్టును తప్పుపట్టారు. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ సహా అన్ని పార్టీలూ జగన్ రెడ్డి కక్షపూరిత చర్యే చంద్రబాబు అరెస్టు అంటూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.  అస‌లు జ‌డ్‌+ కేట‌గిరీ భ‌ద్ర‌త, 14 ఏళ్ల‌పాటు సీఎంగా పనిచేసిన  ఉన్న‌త ప్రొఫైల్ ఉన్న నాయ‌కుడు చంద్ర‌బాబును వారాంతంలో కోర్టుకు సెలవు చూసుకొని అరెస్టు చేయడం, అదీ రాజకీయ పర్యటనలో ఉండగా అర్ధరాతి మందీ మార్బలంతో పోలీసులు దండయాత్ర చేయడంతో ఏపీలో అసలు రాజ్యాంగం ఉందా? చట్టం, పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నాయా? లేక  ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు అనుగుణంగా ఆయన టార్గెట్ చేసిన వారిని నిర్బంధించే పనిలో మునిగిపోయారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్ మెట్ స్కాం కేసు విషయానికి వస్తే..  ఏపీలో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా యువతకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ అనే సంస్థలతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  3 వేల 300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చేందుకు ఈ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. 3 వేల 300 కోట్ల రూపాయల్లో 10 శాతం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ పెట్టుబడి పెట్టేలా ఒప్పందం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం 10 శాతం వాటాగా.. జీఎస్టీతో కలిపి 370 కోట్ల రూపాయలను ఆ రెండు సంస్థలకు చెల్లించింది. ఇందులో 240 కోట్ల రూపాయలను డిజైన్‌టెక్‌ సంస్థకు బదలాయించగా మిగతా సొమ్మును సీమెన్స్ కంపెనీకి బదలాయించారు. ఈ 370 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లుగా చూపించి వెనకేసుకున్నారనేది సీఐడీ ఆరోపణ. ఈ కేసులోనే  చంద్రబాబును   అసలు ఏ మాత్రం పసలేని ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకు కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయంలోనే చంద్రబాబుపై పదుల కొద్దీ కేసులు పెట్టారు. కానీ, న్యాయస్థానాల వద్ద ఒక్కటీ నిలబడలేదు. స్టేలు తెచ్చుకొని చంద్రబాబు మేనేజ్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ  నిజానికి ఆ కేసులలో విషయం లేకనే న్యాయస్థానాల వద్ద నిలవలేదు. ఇప్పుడు ఇది కూడా అంతే. కేవలం ఓ నాలుగు రోజుల పాటు వైసీపీ నేతలు జబ్బలు చరుచుకోవటానికి, రోజా వంటి మంత్రులు సంబరాలు చేసుకుని, స్వీట్లు పంచుకోవడానికి మాత్రమే పనికొస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పటి వరకూ జగన్ లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తుండగా.. రిటర్న్ చంద్రబాబును కూడా అవినీతి పరుడుగానే బురద జల్లేందుకు, ఆరోపణలు చేసేందుకు మాత్రమే ఈ కేసు పనికి రానుంది. అంతేతప్ప ఇందులో పసలేదన్నది పరిశీలకుల అభిప్రాయం.అదలా ఉంచితే.. ఎవరి వాంగ్మూలంతో అయితే చంద్రబాబును అరెస్టు చేశామని చెబుతున్నారో ఆ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సీఐడీ చెప్పిన దానిని నిర్ద్వంద్వంగా ఖండించారు. తన వాంగ్మూలాన్ని సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందన్న అనుమానం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం ఏదీ జరగలేదనీ, ఒక వేళ జరిగిందనుకున్నా అందులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుందని పీవీ రమేష్ అన్నారు. కేసులో విచారణ చేయాల్సినా, అరెస్టు చేయాల్సినా ముందుగా ఆ కార్పొరేష్ ఎంపీ, కార్యదర్శులనేనని అన్నారు. తన వాంగ్మూలం ఆధారంగా 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా మంచి పాలన అందించిన చంద్రబాబును అరెస్టు చేశామని చెప్పడం అమానుషమని కుండబద్దలు కొట్టారు. దీంతో కంగుతిన్న సీఐడీ.. ఇప్పుడు పీవీ రమేష్ ను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోందని కూడా విమర్శలకులు అంటున్నారు. అందుకు తార్కానంగా జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పీవీ రమేష్ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడిన మరుసటి రోజే ఆయనను మేఘా కంపెనీ నుంచి బయటకు పంపింది.  ఇది కూడా పక్కన పెడితే.. అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందేమీ లేదని.. అది కేవలం సర్వీస్ టాక్స్ కు సంబంధించిన అంశం మాత్రమేననీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకున్న  డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, ఎండీ వికాస్‌ ఖన్వీల్కర్‌  విస్పష్టంగా చెప్పారు.  అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకే కాదు, ఎవరికీ కూడా తాము సోమ్ము చెల్లించలేదనీ,  షెల్‌ కంపెనీల ద్వారా సొమ్ము తరలించారనేది పూర్తి అవాస్తవమనీ, అభూత కల్పన అనీ కుండబద్దలు కొట్టారు. అప్పటి ప్రభుత్వంతో  ఒప్పందం మేరకు పరికరాలను సరఫరా చేశామని, ఆడిటర్లను పంపితే అన్ని వివరాలనూ రశీదులతో అందిస్తామని చెప్పారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ సంస్థ, సీఐడీ నివేదికలు తప్పుల తడక అని తేల్చి చెప్పారు. ఏమీ లేకుండా కేసు నమోదు చేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడం బాధాకరమన్నారు. ఈ కేసులో విచారణ సంస్థలు తమను సంప్రదించలేదన్నారు.  అంతే కాకుండా ప్రాజెక్టుకు సంబంధించిన  వివరాలతో కూడిన వీడియో  విడుదల చేశారు. ‘మోడీ ప్రధాని అయ్యాక జర్మనీ పర్యటనలో భాగంగా సీమెన్స్‌ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. భారత్‌లో నైపుణ్యాభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని  భావించిన ఆయన చొరవతోనే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి’ అని పేర్కొన్నారు. ‘సీమెన్స్‌ సంస్థతో ఒప్పందంలో భాగంగా గుజరాత్‌లో మొదటి ప్రాజెక్టు చేపట్టామనీ,  ఆ రాష్ట్రంలో అయిదు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయగా ప్రాజెక్టు విజయవంతం అయ్యిందనీ, దీంతో గుజరాత్ ను చూసి పలు రాష్ట్రాలు సిమ్మెన్స్ ప్రాజెక్టును తమ తమ రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలంటూ తమను సంప్రదించాయని వివరించారు.  అలాగే గుజరాత్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న నమూనా ప్రాజెక్టును.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోని కార్యదర్శుల స్థాయి సీనియర్‌ అధికారుల బృందం అప్పట్లో పరిశీలించి, కళాశాలల్లో ప్రిన్సిపాల్స్‌, ఫ్యాకల్టీలు, విద్యార్థులు, డైరెక్టర్‌తో మాట్లాడిందనీ  వికాస్‌ ఖన్వీల్కర్‌ వివరించారు. ఆ తరువాతే ఆంధ్రప్రదేశ్‌, సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ సంస్థల మధ్య చర్చలు జరిగాయన్నారు. గ్రాడ్యుయేట్‌ విద్యార్థులతోపాటు డిప్లొమా, ఐటీఐ విద్యార్థులకు కూడా శిక్షణకు సంబంధించిన ప్రయోజనాలను అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.   ఒప్పందం మేరకు  కేంద్రాలు, కోర్సుల వారీగా 2.14 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా వారిలో 75వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కియా మోటర్‌ ఉద్యోగులకు కూడా వారి అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ అందింది.  నాలుగేళ్లపాటు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించామనీ, మా పనితీరును అభినందిస్తూ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ లేఖ ఇచ్చిందనీ, డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, ఎండీ వికాస్‌ ఖన్వీల్కర్‌  సోదాహరణంగా వివరించారు.   తప్పుడు ఆరోపణలతో మార్కెట్లో తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రస్తుత ఏపీ ప్రభుత్వం, సీఐడీ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.  దీంతో స్కిల్ స్కాం అంటూ ఏపీ సర్కార్, ఏపీ సీఐడీ కట్టు కథలతో.. కాకమ్మ కబుర్లతో అక్రమంగా, అప్రజాస్వామికంగా చంద్రబాబును వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

భూం భూం.. ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ శిష్యుడు సెటైర్లు!

ఏపీలో మద్యం బ్రాండ్ల గురించి సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తుంటే.. జనబాహుల్యం అవేం బ్రాండ్లు, అదేం మద్యం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ధర ఎక్కువ.. నాణ్యత తక్కువ అన్న రీతిలో ఏపీలో మద్యం విధానం ఉందన్న విమర్శలు గత నాలుగేళ్లుగా వినవస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా అనిపించడం లేదు. అది పక్కన పెడితే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. వైసీపీ కండువా కప్పుకుని ఈ మధ్య కాలంలో సినిమాలు తీస్తున్నారు. జగన్ కు ఆయన సర్కార్ కు మద్దతుగా ఎప్పుడు పడితే అప్పడు మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జనసేనాని పవన్ కల్యాణ్ నడి రోడ్డుపై పడుకున్న సంఘటనపైనా తనదైన శైలిలో స్పందించారు. పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. తన గమ్యం సినిమాలో సీన్ ను కాపీ కొటి ఆయన నడిరోడ్డుపై రక్తి కట్టించడానికి ప్రయత్నించారంటూ ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పించారు. అయితే తాజాగా ఏపీలో బీర్ తాగుతున్నా..ఏమౌతుందో.. ఏమౌతానో అంటూ టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు పొందిన శ్రీనివాస్ అయ్యంగార్, సోషల్ మీడియాలో తాను బీరు తాగుతున్న ఫొటో పెట్టి కామెంట్ చేశారు. ఇది వెంటనే వైరల్ అయ్యింది. అన్నిటికంటే మించి నటుడు శ్రీనివాస్ అయ్యంగార్ ఆర్టీవీకి అనుంగు శిష్యుడు. ఆర్జీవీ కాంపౌండ్ లోని మనిషి. అటువంటి ఆర్జీవీ శిష్యుడు జగన్ సర్కార్ మద్యం విధానంపైనా, ఏపీలో తయారౌతున్న బీరుపైనా ఈ రేంజ్ లో సెటైర్లు గుప్పించడం ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. ఔను తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్. విలక్షణ దర్శకుడు ఆర్జీవీ శిష్యుడు. గురువు ఏమో ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుంటే.. శిష్యుడేమో ఇన్ డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్ గా ఏమిటి డైరెక్ట్ గానేసెటైర్స్ వేస్తున్నారు. అసలు ఏపీ ప్రభుత్వంపై శ్రీకాంత్ అయ్యంగార్ ఏం మాట్లాడారు? అనే విషయాల్లోకి వెళితే, శ్రీకాంత్ అయ్యంగార్ పోస్ట్ చేసిన వీడియోలో..  తాను విజయవాడ వచ్చానని, ఏపీలో బీరు తాగుతున్నానని చెబుతూ.. ఆయన భూం భూం బీరుని చూపించారు. అక్కడితో ఆగకుండా.. ఇంట్లో చెప్పలేదని, ఇది తాగిన తరువాత ఏమవుతుందో ఏమోనని భయపడుతున్నానంటూ దాన్ని తాగారు. ఇప్పుడదే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దానిపై నెటిజన్స్ కూడా తమదైన శైలిలో కామెంట్స్ విసురుతున్నారు. నెటిజన్స్ ఈ రేంజ్‌లో రియాక్ట్ కావటానికి కారణం.. ఏపీలో దొరికే మద్యం అక్కడే తయారవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కొందరైతే అక్కడి మద్యం తాగలేక బయట రాష్ట్రాలకు వెళ్లి అక్కడి మద్యం కొనుక్కుని తాగుతుంటారు. అక్కడ దొరికే బ్రాండ్స్‌పై నెటిజన్స్ ట్రోలింగ్స్ చేయటాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ భూం భూం బీరు తాగే వీడియోను పోస్ట్ చేయటంతో మరోసారి ట్రోలర్స్‌కి పని కల్పించినట్లయ్యింది. ఇంకా బతికే ఉన్నావా? ఆ బీరు తాగి త్వరగా హాస్పిటల్‌కి వెళ్లు అని ఒకరంటే.. తను సరదాగా చేసుంటారని సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదని కొందరంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మద్దతుదారులు మాత్రం శ్రీకాంత్ అయ్యంగార్‌పై విరుచుకుపడుతున్నారు. అయితే కొందరు మాత్రం అసలు మందు తాగితే తాగు, లేదా తాగకపో.. కానీ దాన్ని వీడియోగా చేసి ఏదో భయపడి తాగుతున్నట్లు వీడియో ఎందుకు చేయటం దీని వల్ల లేని పోని సమస్యలు వస్తాయే తప్ప.. మరేమీ ఉండదని అంటున్నారు. ఏదేమైనా ఏపీ ప్రభుత్వం ఆర్జీవీ శిష్యుడు ఇలా వీడియో చేయటం అనేది వైరల్‌గా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు లేవా? జమిలి పేరుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు  వాయిదా పడే అవకాశాలున్నాయా అంటే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఔననే అంటున్నారు. తెలంగాణ ఎన్నికలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ అక్టోబర్ 10వ తేదీలోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. అక్టోబర్ 10 లోగా నోటిఫికేషన్ వస్తే అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లేదా జనవరిలో జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. కానీ పరిస్థితులను చూస్తుంటే అలా వచ్చే నెల 10 లోగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఆయన అన్నారు.  తన అంచనా ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు.   ఈ విషయంపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  ఇక పోతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు అంటే 22 వరకూ జరగనున్నాయి.  పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత శీతాకల సమావేశాలను నవంబరు మూడు లేదా నాలుగో వారంలో నిర్వహించడం ఆనవాయితీ. అయితే అందుకు భిన్నంగా  వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగిశాయి. అవి ముగిసి నెలన్నర రోజులు గడవక ముందే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం చర్చనీయాంశమైంది. ఇండియా పేరు మార్పు, జమిలి ఎన్నికలు అజెండాతో ఈ ప్రత్యేక సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోందన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. అందుకు అనుగుణంగానే తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.   ఈ నేపథ్యంలో ఈ నెల 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రగతి భవన్ లో జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనునన ఈ సమావేశంలో  పార్లమెంట్  ప్రత్యే కమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది.  మొత్తం మీద పార్లమంటు ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో అజెండా ఎలా ఉండాలో తాను కేంద్రానికి సూచించింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో అజెండా ఏమిటి? కేంద్రం ఏ ఉద్దేశంతో ఈ సమావేశాలు నిర్వహిస్తోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

తెలంగాణ ఎన్నికల బరిలో జీవిత రాజశేఖర్

టాలీవుడ్‌కి చెందిన సెల‌బ్రిటీ క‌పుల్‌లో హీరో డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్, ఆయ‌న స‌తీమ‌ణి జీవితా రాజ‌శేఖ‌ర్‌ల‌కు ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఓ వైపు సినీ ఇండ‌స్ట్రీతో వారికి అనుబంధం ఉంది. అలాగే రాజ‌కీయాల్లో రాణించే ప్ర‌య‌త్నాల‌ను వారెప్పుడూ చేస్తుంటారు. ఒక‌ప్పుడు అంటే వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త‌ర్వాత బీజేపీ పార్టీలోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత వైసీపీ పార్టీ కండువాను క‌ప్పుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం కూడా చేశారు. అయితే ఏమైందో ఏమో కానీ.. త‌మ‌కు  త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌టం లేదంటూ వారిద్ద‌రూ వైసీపీకి దూర‌మ‌య్యారు. అదే క్ర‌మంలో బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యారు. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న తాజా స‌మాచారం మేర‌కు జీవిత‌, రాజ‌శేఖ‌ర్ తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రోసారి త‌మ ల‌క్‌ను ప‌రీక్షించుకోవాలనుకుంటున్నార‌ని టాక్‌. ప్ర‌స్తుతం ఇక్క‌డ బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల‌తో పాటు బీజేపీ పార్టీ మ‌ధ్య పోరు ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తోంది. ఎవ‌రికి వారే త‌మ బ‌లాబ‌లాను ప‌రీక్షించుకోవ‌టానికి ఇప్ప‌టి నుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్ప‌టికే కొన్ని ప్రాంతాల‌కు త‌మ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో వేడి రాజుకుంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు త‌మ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌లిద్ద‌రూ తెలంగాణ‌లో బీజేపీ పార్టీ త‌ర‌పున పోటీ చేయాల‌నుకుంటున్న‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రూ క‌లిసి నాలుగు ప్రాంతాల‌ను ఎంపిక చేసుకుని పార్టీ ఆదేశానుసారం వాటిలో రెండింటి నుంచి బీజేపీ పార్టీ త‌ర‌పున పోటీ చేయాల‌నుకుంటున్నార‌ట‌. జూబ్లీహిల్స్‌, స‌న‌త్ న‌గ‌ర్‌, కూక‌ల్ పల్లి, సికింద్రాబాద్ లలో రెండు స్థానాల నుంచి వారు పోటీ చేయాల‌నుకుంటున్నారు. మ‌రి బీజేపీ అధినాయ‌క‌త్వం వీరి అభ్య‌ర్థ‌నను మ‌న్నించి వారికి ఎమ్మెల్యే స్థానాల‌ను కేటాయిస్తుందో లేదో చూడాలి మ‌రి.

చంద్రబాబు కోసం తొడకొట్టి ముందుకొచ్చిన బాలయ్య

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డని ఓటమి భయం వెంతడుతోందా? ఇటు లోకేష్, అటు పవన్ కళ్యాణ్, మరో వంక చంద్రబాబు నాయుడు..ముగ్గురూ మూడు దిక్కుల నుంచి ఒకే సారి సమర శంఖం పూరించడంతో  జగన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?  ఇటు చూస్తే విరుచుకు పడుతున్న విపక్షాలు, అటు చూస్తే పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం, మరో వంక వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మొదలు క్రింది స్థాయి నాయకులవరకు అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలపై ప్రజల్లో వ్యక్త మవుతున్న వ్యతిరేకత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని భయ పెడుతోందా?  విజయంపై నమ్మకం పూర్తిగా పోయిందా అంటే  రాజకీయ విశ్లేషుకులు అవుననే  అంటున్నారు.  అందుకే ఎటూ పాలుపోని ఏమి చేయాలో, ఎలా బయట పడాలో అర్థం కాని  జగన్ రెడ్డి తాచెడ్డ  కోతి వనమంతా చెరిచింది అన్నట్లుగా  ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అవినీతి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. స్వయంగా అవినీతి ఊబిలో కూరుకుపోయి, ఎన్నో అవినీతి కేసుల్లో  ఏవన్  ముద్దాయిగా ఉండడమే కాకుండా, బెయిల్  మీద కాలం వెళ్ళదీస్తూ  కోర్టు అనుమతి లేనిదే దేశం గీత దాట లేని  ఏవన్  జగన్ రెడ్డి అందరూ తనలాగే, వర్ధిల్లాలని కోరుకుంటున్నారో ఏమో కానీ, రాజకీయ ప్రత్యర్ధులందరినీ, అదే గాటన కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే, ఇప్పడు చంద్రబాబు నాయుడు పై కక్ష కట్టి కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే  నాలుగు పదుల పైబడిన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మాజీ ముఖ్యమంత్రి,  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్’ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారు.  జైలుకు పంపారు.    అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము  అన్నట్లుగా  చంద్రబాబు నాయుడిని నిర్బందించినంత మాత్రాన తెలుగు దేశం ప్రభంజనాన్ని, పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని అడ్డుకోవాలనుకుంటే అడ్డుకోగల మనుకుంటే, అది జగన్ రెడ్డి, ఆయనగారి  పాపాల పరివారం  అజ్ఞానం, అవివేకం,   అహంకారమే అవుతుంది. ఒక్క చంద్రబాబును నిర్బందిస్తే, న్యాయం కోసం , ధర్మం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం వంద మంది చంద్రబాబులు పుట్టు కొస్తారు.  కాదు.. కాదు పుట్టు కొచ్చారు. నిజం. సినిమాల్లోనే కాదు, రాజకీయ జీవితంలోనూ ప్రత్యర్ధులను దబిడిదిబిడి ఆడించే  బాలయ్య  మరో మారు తొడ కొట్టారు. చంద్రబాబు అరెస్ట్ తో నైతిక స్థైర్యం కోల్పోయిన క్యాడర్ ను తిరిగి ఛార్జ్  చేసేందుకు బాలయ్య బాబు రె ఢీ  అయ్యారు.   చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన బాలయ్య కార్యకర్తలు అధైర్య పడవలసిన అవసరం లేదని ... చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని భరోసా ఇచ్చారు. అలాగే, 'నేనొస్తున్నా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడదాం' అన్నారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు అరెస్టుతో కొందరు ప్రాణాలు కొల్పోయారని..ఆ కుటుంబాలను పరామర్శిస్తానన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరికీ భయపడనక్కర్లేదన్నారు. నేను వస్తున్నా.. నేనే ముందుంటా. స్వాతంత్ర్య సమరం మనం చూడలేదు. కానీ  గతంలో ఎన్టీఆర్ సర్కార్ ను అప్రజాస్వామికంగా కూలదోసినప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ద్వారా తెలుగోడి సత్తా చూపాం. ఇప్పడు ఆ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మరోమారు ఆనాటి పౌరుషాన్ని, పౌరుషాగ్నిని చూపుదాం అని పిలుపునిచ్చారు.   జగన్‌ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్న బాలయ్య, ఈ నాలుగున్నరేళ్లు అనుభవించిన నరకయాతన చాలు ఇక మార్పు  మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలని ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించను అన్నారు. భయపడుతూ కూర్చొంటే ఏపీ సర్వ నాశనం అవుతుందన్నారు. సైనికుల్లా ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. అంతే కాదు  అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్‌ నేమ్  గా నిలిచిన చంద్రబాబును, అరాచకానికి ప్రతిరూపంగా నిలిచే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కక్షసాధింపే లక్ష్యంగా అరెస్ట్ చేశారని బాలయ్య అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబును అరెస్ట్‌ చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే జగన్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బాలయ్య అన్నారు .స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకున్నా కక్ష సాధింపుతోనే కుట్రపన్ని అరెస్టు చేశారన్నారు. జగన్‌ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గతంలోనూ ఎన్నో సంక్షోభాలు చూసింది.. అధిగమించింది ఇప్పుడూ, ఓటమి భయంతో, కక్షపూరితంగా జగన్ రెడ్డి సృష్టించిన సంక్షోభాన్ని  అధిగమిస్తామంటూ బాలయ్య గర్జించారు.  

బాబు అరెస్టుకు నిరసనగా మరో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం!

ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ప్రారంభం కానుందా? చంద్రబాబునాయుడి అరెస్టుతో పార్టీలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా ఒక సమష్టి ఆందోళనకు రంగం సిద్ధమౌతోంది. 1984లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూలదోసిన సమయంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చేలా మరో మహోద్యమానికి బాటలు పడ్డాయా? అంటే పరిశీలకులు అవుననే అంటున్నారు. స్కిల్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్టుతో ఒక్క సారిగా ఏపీ రాజకీయం వేడెక్కింది. జాతీయ స్థాయిలోనూ పార్టీలకు అతీతంగా అరెస్టుపై ఆందోళన వ్యక్తం అవుతోంది. బీజేపీ సహా అన్ని పార్టీలూ చంద్రబాబు అరెస్టును ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. చంద్రబాబు నాయుడి అరెస్ట్ జగన్ రెడ్డి ప్రభుత్వ కక్ష సాధింపేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆయనను అరెస్టు చేసిన తీరు ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. చంద్రబాబు పాలనలో తప్పు జరిగిందని భావిస్తే విచారణ జరిపించాలని అంతే కానీ అధికారంలో ఉన్నాం కదా? ఏం చేసినా చెల్లిపోతుందన్న ధోరణిలో నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టులకు తెగబడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా అడ్డగోలుగా ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసినా ఏసీబీ కోర్టు యాంత్రికంగా రిమాండ్ కు ఆదేశించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ చంద్రబాబు అరెస్టును ఖండించాయి. తెలుగుదేశం పార్టీకి సంఘీభావం ప్రకటించాయి. లోకేష్ ను కలిసి మరీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తెలుగుదేశం పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీ నాయకుడు లక్ష్మణ్ ఖండించారు. చంద్రబాబు అరెస్టు ప్రభుత్వ కక్షపూరిత విధానానినికి నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణించారు.  గతంలో అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదింపిన సందర్భంగా సిద్ధాంత రాద్ధాంతాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపైకి వచ్చిన విధంగా చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ పార్టీలన్నీ ఒకే విధంగా స్పందించడం బీజేపీ, కాంగ్రెస్,  వంటి పార్టీలు కూడా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించడం, చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించడం చూస్తుంటే.. 1984 నాటి ఉద్యమానికి అంకురార్పణ జరుగుతోందా అనిపించకమానదని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడెనిమిది నెలల సమయం కూడా లేని ఈ తరుణంలో ఏపీలో ఒక ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి కార్యాచరణ రూపుదిద్దుకుంటోందని అంటున్నారు.  చంద్రబాబు అరెస్టుతో  వైసీపీని మినహాయిస్తే.. అన్ని పార్టీలూ రోడ్ల మీదకు వచ్చాయి. ఏపీలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నడిరోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నేతలూ చంద్రబాబు అక్రమ అరెస్టును ముక్త కంఠంతో  ఖండిస్తున్నాయి.  ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటన నుంచి చేసిన మొదటి పని రాష్ట్రంలో శాంతి భద్రతల పై సమీక్షించడం. చంద్రబాబు అరెస్టునకు సంబంధించి ఆయన నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాలేదు.  అసలు జగన్ దేశంలో లేని సమయంలో చంద్రబాబు అరెస్టు జరిగిన సంగతిని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన అవసరం ఉంది. నాడు అంటే 1984లో ఎన్టీఆర్ దేశంలో లేని సమయంలో (ఆయన ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు) అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ సర్కార్ ను కూలదోశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబును అప్రజాస్వామికంగా అరెస్టు చేశారు.  అప్పడు అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ ఖండించాయి. ఎన్టీఆర్ కు సంఘీభావం ప్రకటించాయి. ఇప్పుడు చంద్రబాబును అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని కూడా జగన్ కక్షపూరిత చర్య అంటూ జాతీయ స్థాయిలో అన్ని పార్టీలూ ఖండిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రంలో అన్ని వర్గాలూ స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. బంద్ ను భగ్నం చేయడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పినా బెదరకుండా జనం నిలబడ్డారు. రోడ్ల మీదకు వచ్చిన టీడీపీ శ్రేణులపై  పోలీసులు విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించారు. పార్టీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. మొత్తం రాష్ట్రాన్నే ఒక జైలుగా మార్చేశారు. అయినా పార్టీ శ్రేణులూ, ప్రజలూ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. చంద్రబాబు అరెస్టునకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు. రానున్న రోజులలో చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా 1984 ప్రజాస్వామ్యపునరుద్ధరణ ఉద్యమం తరహాలో జగన్ సర్కార్ వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూలదోయడానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమానికి అన్ని తానై ముందుండి నడిపించిన చంద్రబాబు ఇప్పుడు అప్రజాస్వామికంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టయ్యారు. ఇప్పుడు ఆయన కోసం నాడు ఆయన నడిపించిన మహోద్యమం స్ఫూర్తిగా అన్ని పార్టీలూ ఏకతాటిపైకి వస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 

ఆర్థిక వ్యవస్థ పై బాబు అరెస్ట్ ప్రభావం!

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాష్ట్ర, రాజకీయాలను, రాజకీయ సమీకరణలను ప్రభావితం చేస్తుంది. అందులో సందేహం లేదు. అయితే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాజకీయలను మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తుందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.నిజానికి, చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తుంది అనేది ఇప్పటికే కళ్ళ ముందు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్’కు నిరసనగా తెలుగు దేశం పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రజలు స్వచ్చందంగా స్పందించిన తీరు గమనిస్తే, చంద్రబాబు నాయుడు అరెస్ట్’ను ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతుంది. జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ప్రజలను చీదరించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు చివరకు సాధారణ కార్యకర్తలను సైతం గృహ నిర్బంధంలో కట్టి పడేసినా, రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినా, ప్రజలు స్వచ్చందంగా బంద్’ ను సక్సెస్ చేశారంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాష్ట్ర రాజకీయాలపై, రేపటి ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేరే చెప్పనక్కర లేదు.  చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ప్రతిపక్ష నాయకుడే కావచ్చును, కానీ, దేశ విదేశాల్లో ఇప్పటికే ఆయన సంస్కరణలకు, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్’గా గుర్తింపు, గౌరం పొందారు.   ఆవిధంగా ఆయనకు,జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న  గుర్తింపు, గౌరవం గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఒక్క రాజకీయ రంగంమనే కాదు,అన్ని రంగాల ప్రముఖులు అనేక మంది చంద్రబాబు నాయుడు, అంటే ఒక విజనరీ, ఒక విశ్వాసం అని పేర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అన్నిటినీ మించి నాలుగు పదులకు పైగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన సంపాదించుకున్న, విస్వసనీయత ఇంతా కాదు. ఆ విజనరీ దృక్పధం, ఆ విశ్వసనీయతల ఆధారంగానే, చంద్రబాబు నాయుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్’ నగరాన్ని, విశ్వనగరంగా, ఐటీ హబ్’ గా అభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాటిన ఐటీ విత్తనాలే ఈరోజు మహా వృక్షాలుగా ఎదిగాయి. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఐటీ హబ్’ నిలబెడుతున్నాయి.   రాష్ట్ర విభజన తర్వాత,  నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా అనేక సవాళ్ళను ఎదుర్కుంటూ కూడా చంద్రబాబు నాయుడు, తమ అనుభవం, విజ్ఞత, వివేచన.. ఈ అన్నిటినీ మించిన విస్వసనీయతలను కలగలిపి, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించారు. కియా వంటి అనేక మేజర్ కంపెనీలు కొత్త రాష్ట్రం, అని చూడకుండా, చంద్రబాబు ఎక్కడుంటే అభివృద్ధి అక్కడ ఉంటుందన్నవిశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చాయి. అయితే, దురదృష్ట వశాత్తు 2019 ఎన్నికల్లో అధికారం చేతులు మరి, అరాచక శక్తుల చేతుల్లోకి పోవడంతో, పెట్టుబడులకు బ్రేకులు పడ్డాయి. దీంతో, ప్రస్తుత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే, అప్పులు, తిప్పలు, ఆర్థిక అరాచకం తప్ప మరో మాట వినిపించని పరిస్తితిలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అద్వాన్న స్థితికి చేరింది. ఒక విధంగా చెప్పాలంటే, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి పెట్టు బడులు కాదు, కనీసం అప్పులు కుడా పుట్టని పరిస్థితి నెలకొంది, అంటే, పరిస్థితి ఏమిటో వేరే వివరించవలసిన అవసరం లేదు. . ఇప్పడు దీనికి తోడు జగన్ రెడ్డి ప్రభుత్వం, కక్షపూరితంగా విస్వసనీయతకు మారు పేరుగా నిలిచిన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం, అక్రమ నిర్భందంలో ఉంచడంతో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆ ప్రభావం ప్రబలంగా ఉంటుందని, ఆర్థిక నిపుణులు అంటున్నారు.

స్కిల్ స్కాంలో చంద్రబాబుపై చర్యలు అమానుషం.. పీవీ రమేష్

స్కిల్ స్కాంలో చంద్రబాబును ఇరికించడానికి, అరెస్టు చేయడానికి జగన్ రెడ్డి సర్కార్  కుట్రపూరితంగా ఒక డొల్ల వాదనను డెవలప్ చేశారని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ స్పష్టం చేశారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు. చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారిగా  పని చేసిన పీవీ రమేష్ ను స్కిల్ స్కాం విషయంలో సీఐడీ విచారించి లిఖిత పూర్వక సమాధానాలను తీసుకుంది. ఇప్పుడు ఆయన వాంగ్మూలం ఆధారంగా  చంద్రబాబుపై కేసు పెట్టి ఆయనను అరెస్టు చేసింది. ఈ విషయంలో స్వచ్ఛందంగా స్పందించిన పీవీ రమేష్.. తన వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అయినా ఈ స్కాంలో చర్యలు తీసుకుంటే ముందుగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ, కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆయన కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. తన వాంగ్మూలం ఆధారంగా 14 సంవత్సరాల పాటు సుపరిపాలన అందించిన చంద్రబాబుపై చర్యలు తీసుకున్నామని సీఐడీ చెప్పడం పూర్తిగా అభూత కల్పన అని.. తన ప్రతిష్టను దెబ్బతీయడమే అవుతుందని పీవీ రమేష్ అన్నారు. పీవీ రమేష్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలి కాలం వరకూ పీవీ రమేష్ సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. అటువంటి పీవీ రమేష్ వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబుపై చర్యలు తీసుకున్నామని చెప్పి అరెస్టు చేస్తే.. ఎటువంటి ఖండనలూ వచ్చే అవకాశం ఉండదని జగన్ రెడ్డ సర్కార్, ఏపీ సీఐడీ భావించాయి. అయితే స్వయంగా పీవీ రమేష్ సీఐడీ ప్రకటన అభూతకల్పన అంటూ మీడియా ముందుకు రావడంతో సీఐడీ కంగుతింది. ఇక ఇప్పుడు సీఐడీ టార్గెట్ పీవీ రమేష్ అవుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ విషయంలో పీవీ రమేష్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ అందుకు సంబంధించిన నోట్ ఇదంటూ సీఐడీ చెబుతోంది. వైసీపీ సోషల్ మీడియా ఆ నోట్ ను వైరల్ చేస్తున్నది. అయితే ఆందుకు సంబంధించిన ఒరిజినల్ పోయిందని చెబుతున్నారు. ఇక పీవీ రమేష్ అప్రూవర్ గా మారారంటూ సీఐడీ చెప్పడాన్ని పీవీ రమేష్ నిర్ద్వంద్వంగా ఖండించారు. నేరం చేసిన వారు అంగీకరించి అప్రూవర్ గా మారతారనీ, తాను నేరం చేయలేదనీ, అప్రూవర్ గా మారడం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదనీ పీవీ రమేష్ చెప్పారు. ఈ వివరాలన్నీ చెప్పిన అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ తనేవాత రద్దు చేశారు. అలా రద్దు చేయడానికి ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయినా లైవ్ లో సీఐడీ అడ్డగోలుగా తన పేరు వాడుకుని ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్టు చేసిందంటూ ఆయన లైవ్ లో చెప్పిన మాటలు ఇప్పుడు రాష్ట్ర మంతటా వైరల్ అవుతున్నాయి. తాను సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆ సంస్థ తనకు అనుకూలంగా మార్చుకుందని కూడా పీవీ రమేష్ తీవ్ర ఆరోపణ చేశారు. పీవీ రమేష్ ఆరోపణలపై వెంటనే స్పందించిన సీఐడీ.. పీవీ రమేష్ స్టేట్ మెంట్ తోనే కేసు సాగడం లేదనీ, ఈ స్కాంలో తమ వద్ద పక్కా ఆధారాలున్నాయనీ చెబుతోంది. అయినా పీవీ రమేష్ ప్రకటన ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేదిగా ఉందనీ సీఐడీ పేర్కొంది. సీఐడీ స్పందన చూస్తే ఇప్పుడు పీవీ రమేష్ టార్గెట్ గా పావులు కదుపుతోందని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినా సీఎం జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మాజీ ఐఏఎస్ అధికారి సీఐడీ తన వాంగ్మూలాన్ని తప్పుగా ఉపయోగించుకుంటోందనీ, స్కిల్ స్కాంలో చంద్రబాబును కాదు ముందుగా చర్యలు తీసుకోవలసింది ఆ కార్పొరేషన్ ఎండీ, కార్యదర్శులనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. అంతే కాకుండా కుట్రపూరితంగా, కక్ష సాధింపు కోసమే చంద్రబాబును అరెస్టు చేశారన్న వాదనకు బలం చేకూరుస్తోంది.  ఇప్పుడు పీవీ రమేష్ ను టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

చంద్రబాబు అరెస్టు.. అవినాష్ బెయిలు రద్దు పిటిషన్ విచారణ వాయిదా.. లింకేంటి?

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. స్వయంగా బెయిలు రద్దు పిటిషన్ దాఖలు చేసిన డాక్టర్ సునీతారెడ్డి విచారణ వాయిదా కోరారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఎ8, కడప ఎంపీ, వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.   అలాగే అవినాష్ బెయిల్ రద్దుకు మద్దతుగా  సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేసిన  సంగతి తెలిసిందే. అయితే డాక్టర్ సునీత అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దు పిటిషన్ వాయిదా వేయాలని సుప్రీం కోర్టుకు కోరారు. ఔను నిజంగానే సునీత విచారణ వాయిదా కోరారు.  కారణమేమిటో తెలుసా? అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దు పిటిషన్ లో సునీత తరఫున వాదించాల్సి ఉన్న సిద్ధార్థ లూద్రా.. అందుబాటులో లేకపోవడమే. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్టు చేయడంతో సిద్ధార్థ లూద్రా ఆయన హౌస్ అరెస్టు, బెయిలు పిటిషన్లను వాదించేందుకు విజయవాడ వెళ్లారు. విజయవాడ ఏసీబీ కోర్టులో  ఆదివారం సుదీర్ఘ వాదనలు వినిపించారు. సోమవారం కూడా చంద్రబాబు బెయిల్, రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలంటూ వేసిన పిటిషన్లపై రోజంతా వాదించారు. బుధవారం కూడా సిద్ధార్థ లూద్రా అదే పనిపై విజయవాడలోనే ఉంటారు. దీంతో అవినాష్ రెడ్డి బెయిలు పిటిషన్ రద్దు కోరుతూ డాక్టర్ సునీత పిటిషన్ పై వాదించేందుకు ఆయన అందుబాటులో  లేరు. దీంతో సునీత స్వయంగా సుప్రీంను విచారణ వాయిదా వేయాల్సిందిగా కోరారు. సుప్రీం అనుమతించి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.  ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకా హత్య కేసు లో అవినాష్ రెడ్డి A8 గా  ఉన్న సంగతి విదితమే.  జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేసు విచారణ జరిగింది.   తన తండ్రి హత్యకు ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని కేసు దర్యాప్తుకి సహకరించకుండా తప్పించుకుంటున్నారని తన పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు.  అలాగే వివేకా హత్యకు తండ్రీ కొడుకులు భాస్కర్ రెడ్డి , అవినాష్ రెడ్డి కుట్ర చేశారని అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. రాజకీయ వైరంతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ విస్పష్టంగా పేర్కొంది. గొడ్డలితో నరికి హత్య జరిగితే.. గుండెపోటు అంటూ కట్టుకథ అల్లారని సీబీఐ అఫిడవిట్ లో పేర్కొంది. ఈ హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందనీ,  ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ వెల్లడించింది. వివేకా హత్యకు అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డిలే సూత్రదారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని కూడా సీబీఐ పేర్కొంది. హైకోర్టు ఇతర నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందని అనుకున్నారు. కానీ న్యాయవాది లేకపోవడంతో సునీతారెడ్డినే విచారణ వాయిదా కోరుకోవాల్సి వచ్చింది. దీంతో అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పిటిషన్ విచారణ వాయిదా పడేందుకు వ్యూహాత్మకంగానే సరిగ్గా ఆ పిటిషన్ విచారణకు వచ్చే సమయంలో టైం చూసుకుని చంద్రబాబు అరెస్టుకు వైసీపీ సర్కార్ తెరతీసిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు అరెస్టు అవినాష్ రెడ్డి బెయిలు రద్దును కొంత కాలం వాయిదా వేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పోరాట యోధుడు నాన్న..ఆయన అడుగుజాడల్లోనే నేను.. లోకేష్

తెలుగు తెర మీద కథానాయకుడిగా... తెనుగు పుడిమిపై మహానాయకుడిగా... మదరాసి పదంతో అడుగున పడిపోతున్న ఆంధ్ర జాతికి వెలుగు జిలుగులద్దిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.  అలాంటి ఆయన ఇంట కుమార్తెగా జన్మించి.. హెటైక్ సిటీ సృష్టికర్త.. హైదరాబాద్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కన్సెల్టెన్సీ అంటూ హైటెక్ పదానికి అర్థాన్ని.. పరమార్థాన్ని వివరించిన విజనరీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆర్థాంగి అయి.. ఆ జంట 43వ వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో.. అంటే సెప్టెంబర్ 10వ తేదీకి ఒక రోజు ముందు సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం టీడీపీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆయన్ని 14 రోజుల రిమాండ్ విధించడంతో... చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఇదే అధికార పార్టీకి చెందిన నేతలు.. నాడు కన్నతల్లిని ఘోరంగా అవమానిస్తే... నేడు అదే పార్టీకి చెందిన ప్రభుత్వం కన్నతండ్రినీ జైలు పాలు చేసింది. ఆ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. బాధతో బరువెక్కిన హృదయంతో.. చెమ్మగిల్లిన కన్నులతో మీ కోసం ఈ నాలుగు మాటలు అంటూ తీవ్ర భావోద్వేగంలో ఓ లేఖను సోషల్ మీడియాలో సంధించారు. ఆంధ్రప్రదేశ్ కోసం.. కోట్లాది తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన హృదయంతో పాటు ఆత్మను పణంగా పెట్టి పని చేశారని.. ఆ క్రమంలో ఆయన ఒక్క రోజు కూడా విశ్రాంతి అనేది తీసుకోకుండా... అలుపన్నది లేకుండా పని చేయడాన్ని నేను పెరిగానని తెలిపారు.    అలాగే ఆయన రాజకీయాలు నిజాయతీకి, హుందాతనానికి ప్రతీకగా నిలిచేవని...  ఆయన నుంచి  సేవలు పొందిన వారు.. చూపించిన ప్రేమ, కృతజ్జతతోపాటు లోతైన స్పూర్తి పొందడం.. నేను కళ్లారా చూశానని... వారి మనస్సుతో చెప్పిన కృతజ్జతతో... ఆయన హృదయం ఆనందంతో తొణకిసలాడేదని తెలిపారు. ఇది పసి పిల్లల ఆనందంతో సమానమని నారా లోకేశ్ అభివర్ణించారు. ఇది చూసి నా తండ్రి మార్గాన్నే నేను అనుసరించి.. ఆయన అడుగులో అడుగు వేశానని... అందుకోసం అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని సైతం వదిలి .. భారత్‌కు తిరుగు వచ్చానని నారా లోకేశ్ స్పష్టం చేశారు.   కానీ నాకు.. మన దేశం మీద.. మన వ్యవస్థల మీద.. మన దేశానికి సంబంధించిన మూల సూత్రాల మీద.. అలాగే వీటన్నింటింకి మించి... మన రాజ్యాంగం మీద అపారమైన నమ్మకం ఉందని.. అయినప్పటికీ ఈ రోజు నా తండ్రి ఏ నేరం చేయకుండా.. అన్యాయంగా.. రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే.. నా కోపం కట్టలు తెంచుకొంటుందని... నా రక్తం మరిగిపోతుందన్నారు.  దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం.. ఇంతలా కష్టపడిన నా తండ్రి ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలని నారా లోకేశ్ ప్రశ్నించారు. పగ, ప్రతీకారం, విధ్వంసక రాజకీయాలను ఆయన ఏనాడు ప్రోత్సహించలేదని... మన ప్రజల అభివృద్ధి, సంక్షేమం, వారి ఆవకాశాలతోపాటు వారి భవిష్యత్తు కోసం ముందే ఊహించినందుకా.. అయినా రాజకీయ పగకు లోతులు కానీ.. హద్దులు కానీ ఉండవా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. కానీ అదీ ఈ రోజు నమ్మక ద్రోహంలా అనిపిస్తుందన్నారు.  కానీ మా నాన్న ఓ పోరాటయోధుడు, నేను ఆయన లాగానే.. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి కోసం అచంచలమైన సంకల్పంతో మార్గనిర్దేశం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతామని.. అయితే ఈ పోరాటంలో నాతో  కలిసి మీరు అడుగు వేయాలని కోరుకుంటున్నానని నారా లోకేశ్ ప్రపంచంలోని తెలుగు వారికి పిలుపు నిచ్చారు.

లండన్ నుంచి ఇలా వచ్చి.. అలా హస్తినకు జగన్

ఆంధ్రప్ర్రదేశ్ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ లండన్ పర్యటన పూర్తి అయి.. స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన సోమవారం అర్థరాత్రి విజయవాడ చేరుకుంటారు. మంగళవారం ఉదయం రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం ఇఫ్పటికే రాష్ట్ర హోం శాఖ సిద్ధం చేసిన నివేదికను సీఎం జగన్‌కు ఉన్నతాధికారులు అందజేయనున్నారు.  మరోవైపు స్కిల్డ్ స్కాంలో ప్రేమయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో.. ఆయన్ని పోలీసులు రామమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు బెయిల్ కోసం తెలుగుదేశంపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ అగ్రనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  అయితే సీఎం జగన్.. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.  ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం.. ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ పెద్దలు.. రాష్ట్రంలోని కమలం పార్టీ పెద్లల నుంచి.. చంద్రబాబు అరెస్ట్‌కు గల కారణాలు అడిగి తెలుసుకొన్నట్లు తెలుస్తోంది. అలాగే బాబు అరెస్ట్‌కు గవర్నర్‌ అనుమతి తీసుకున్నారా? లేదా?.. తదితర అంశాలపై కూడా కేంద్రంలోని పెద్దలు ఆరా తీసినట్లు సమాచారం.  ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం వైయస్ జగన్ సమావేశంలో చంద్రబాబు అరెస్ట్ ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని.. దీనిపై ఏపీ బీజేపీ పెద్దలు ఇచ్చిన సమాచారానికి...  సీఎం వైయస్ జగన్ ఇస్తున్న సమాచారానికి పొలిక ఉందా? లేదా? అనే అంశాన్ని సైతం కమలం పార్టీలోని పెద్దలు పరిశీలించే అవకాశాలు ఉన్నాయనే ఓ ప్రచారం సైతం కొన.. సాగుతోంది.  అదీకాక.. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికలతోపాటు పలు కీలక బిల్లులను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఈ బిల్లుల ఆమోదానికి వైసీపీ మద్దతు ఎన్డీఏకి అవసరమని.. అందుకే జగన్‌తో ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారనే ఓ చర్చ సైతం పోటిలికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. ఏదీ ఏమైనా.. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయనే ఓ ప్రచారం సైతం తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకొంది.