హైదరాబాద్ లో వర్ష బీభత్సం
posted on Sep 5, 2023 7:47AM
హైదరాబాద్ నగరంలో ఈ తెల్ల వారు జామునుంచీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, నార్సింగీ, మణికొండ, గండిపేట, బండ్లగూడ భారీ వర్షం కారణంగా రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
చిమ్మ చీకటిలో చుట్టు నీటితో పలు కాలనీలలో ప్రజలు నరకం చూస్తున్నారు. ఉప్పర్ పల్లి 191 ఫిల్లర్ వద్ద నీరు భారీగా చేరింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాజేంద్రనగర్ శివరాంపల్లి వద్ద రహదారి చెరువును తలపిస్తోంది. ఈ తెల్లవారు జాము (సెప్టెంబర్ 5)నుంచి ఇప్పటి వరకూ శేరిలింగంపల్లిలో 11.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అలాగే మియాపూర్ వద్ద 9.78, హైదర్ నగర్9.78, మారేడ్ పల్లి, బహదూర్ పురాలలో 4.98, అల్వాల్, ముషీరాబాద్ లో 5,03 సెంటీమీటర్ల చొప్పున వర్ష పాతం నమోదైంది. హిమాయత్ సాగర్ కు పెరిగిన ఇన్ ఫ్లో కారణంగా రెండు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.