2018లోనే జమిలికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!
posted on Sep 4, 2023 @ 4:55PM
జమిలీ ఎన్నికలు, లేదంటే కనీసం మినీ జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఇప్పుడు ఆసక్తి కనబరుస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించి ఒకే దేశం-ఒకేసారి ఎన్నికల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న చర్చ దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. అదే జరిగితే ఒకే దేశం..ఒకేసారి ఎన్నికలు అనేది చట్టరూపం దాలుస్తుంది.
నిజానికి ఒకే దేశం ఒకే ఎన్నిక కొత్తదేమీ కాదు. కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వినబడుతూనే ఉంది. కేంద్రంలో లోక్‌సభ ఎన్నికలు, ఇటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఎన్నికల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గడంతో పాటు సమయం కలిసొస్తుందని, అలాగే ఎన్నికల కోడ్ పేరిట ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలకు అడ్డు ఉండదంటూ కేంద్రం ఇప్పటి వరకూ చెప్పుకుంటూ వస్తున్నది. ఇప్పుడు ఏకంగా సాధ్యాసాధ్యాలపై దృష్టి పెట్టింది. దీంతో సహజంగానే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటన్న చర్చ సాగుతున్నది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఈ ఒకే దేశం-ఒకే ఎన్నికల నినాదానికి ఒప్పుకుంటారా అన్న చర్చ తెరమీదకు వచ్చింది. షెడ్యూల్ ప్రకారం అయితే ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటుకు వచ్చే ఏడాది ఎన్నికల జరగనున్నాయి. కేంద్ర ప్రతిపాదన ఒకే అయితే.. తెలంగాణ అసెంబ్లీకి, పార్లమెంటుకు కూడా ఒకేసారి ఎన్నికల జరగుతాయి.
తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగిసిపోతుంది. ఆలోగా ఎన్నికలు పూర్తిచేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆ లెక్కన చూస్తే ఈ ఏడాదిలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అలా జరగలేదంటే అసెంబ్లీ గడువు పూర్తి అయినప్పటి నుంచి.. ఎన్నికలు జరిగేదాకా పరిపాలన గవర్నర్ చేతికి వెడుతుంది. ఒకవేళ ఈ ఏడాది ఎన్నికల జరపకుండా వచ్చే ఏడాదిలో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకుని ఆ మేరకు పార్లమెంటు ఆమోదం పొంది చట్టం చేస్తే.. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలలో గవర్నర్ పాలన తప్పదు. అలా కాకుండా ఈ ఏడాదే పార్లమెంట్ రద్దు చేసి కలిసి వచ్చే రాష్ట్రాలతో మినీ జమిలీ ఎన్నికల జరిపితే తెలంగాణలో అసెంబ్లీతో పాటు పార్లెమెంట్ ఎన్నికల జరగుతాయి. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎన్నికల ఎప్పుంటాయా అన్నది తెలంగాణ రాజకీయాలలో ఆసక్తిగా మారింది.
జమిలి ఎన్నికలు, లేదా మినీ జమిలీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు అనుకూలంగా ఉండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో మాత్రం కాస్త కలవరపాటు వ్యక్తం అవుతోంది. డిసెంబర్ లోపే ఎన్నికలుంటాయని బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. కాంగ్రెస్ కూడా హెవీ లోడింగ్ తో టికెట్ల పంపకంపై ప్రకటనకు సిద్దమవుతున్నది. వచ్చే ఏడాదికి ఎన్నికలు వాయిదా పడితే ఇప్పటి నుండి అప్పటి వరకూ ఈ నేతలను భరించడం సామాన్యమైన విషయం కాదు. ఈ క్రమంలో తెలంగాణలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. నిజానికి అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికల జరపాలని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంటే జమిలి ప్రతిపాదనకు కేసీఆర్ ఐదేళ్ల కిందటే అంటే 2018లోనే సై అనేశారు.
అసెంబ్లీ, లోక్‌సభలకు ఒకేసారి ఎన్నికలు జరపడమే ఉత్తమమని 2018లోనే సీఎం కేసీఆర్ కేంద్రానికి తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటుకు విడివిడిగా ఎన్నికల జరపడం వలన ఐదేళ్లలో రెండుసార్లు ఎలక్షన్ కోడ్ రావడంతో అభివృద్ధి కుంటుపడుతుందని, ఐదేళ్లలో రెండుసార్లు ఎన్నికలతో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ అధికారులు, మంత్రుల సమయం వృధా అవుతుందని, అన్నిటికీ మించి ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని.. అందుకే ఒకేసారి ఎన్నికలు ఉత్తమమని కేసీఆర్ అప్పట్లో విస్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు, దేశమంతా ఒకేసారి ఎన్నికలపై తమ అభిప్రాయాన్ని కోరిన కేంద్రానికి కృతజ్ఞతలు కూడా తెలిపిన సీఎం కేసీఆర్.. అప్పుడు ఆ విధానాన్ని అమలు చేస్తారని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కార్ తో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కేంద్రానికి పూర్తి మద్దతు తెలిపారు.
మరి ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అదీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. అలా కాకపోయినా.. కేంద్రంతో ఏ మాత్రం సత్సంబంధాలు లేని ప్రస్తుత తరుణంలో తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంటుకు ఒకే సారి ఎన్నికల వల్ల బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం వాటిల్లు తుందన్న అంచనాల నేపథ్యంలో కేసీఆర్ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది తెలియాల్సి ఉంది. అయినా మాట అనడం ఆ తరువాత మార్చడం ఈ తొమ్మిదేళ్లలో పలు మార్లు చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఏ నిర్ణయం ప్రకటించినా అది తనకూ, తన పార్టీకీ ప్రయోజనకరంగా ఉండేలా చూసుకుంటారని పరిశీలకులు అంటున్నారు.