తప్పు చేస్తున్నావ్ జగన్!
posted on Sep 11, 2023 9:10AM
ఈ మాటలంటున్నది.. ఈ హెచ్చరిక చేస్తున్నది ఎవరో తెలిస్తే, ఎవరైనా ఆశ్చర్య పోతారు. అవును, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ ఓటర్లు మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, రిమాండ్’ను తప్పు పడుతూ చేస్తున్న హెచ్చరిక ఇది. అలాగే రాజకీయ విజ్ఞులు, విశ్లేషకులు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ఏ ఒక్కరూ రాజకీయంగా బతికి బట్ట కట్టలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అంతే కాదు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసేందుకు, పోలీసు యంత్రాంగం ఉచ్ఛనీచాలను పక్కన పెట్టి వ్యవహరిస్తున్న తీరును సైతం ఇటు సామాన్య ప్రజలు మొదలు వైసీపీ అభిమానుల వరకూ, మేధావులు, విజ్ఞుల నుంచి విశ్లేషకులు ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. నిజంగా, చంద్రబాబు నాయుడు కానీ, మరొకరు కానీ తప్పు చేస్తే, చట్టం తన పని తాను చేసుకు పోతుంది. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ, చంద్రబాబు విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే, చట్టాలను అతిక్రమించి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే ‘నిజం’ సామాన్య ప్రజలకు కూడా అర్థమై పోయింది. అందుకే, ప్రజల్లో ఇలాంటి పర్సెప్షన్ ఏర్పడితే, అందుకు రాజకీయంగా మూల్యం చెల్లించవలసి వస్తుందని, విశ్లేషకులు హెచ్చరిస్తుంటే , వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
నాలుగు రోజుల క్రితం (శుక్రవారం అంటే సెప్టెంబర్ 8 అర్థరాత్రి, నంద్యాలోని ఆర్.కె.ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబు నాయుడు బస చేసిన బస్సులోనే, కారణం చెప్పకుండా, ఏ కాగితం చూపకుండా ఆయన్ని అరెస్ట్ చేసింది మొదలు ఆదివారం( సెప్టెంబర్ 10) రాత్రి కోర్టు తీర్పు అనంతరం, రాత్రికి రాత్రి జోరు వానలో రాజమండ్రి జైలుకు తరలించే వరకు చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే, కక్ష సాధింపు కోణమేనని ప్రస్పుటంగా అర్ధమౌతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.జగన్ రెడ్డిని తప్పు చేస్తున్నావ్ .. అని హెచ్చరిస్తున్నారు.
నిజానికి జగన్ రెడ్డి, ఒక వ్యూహం ప్రకారమే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ స్క్రిప్ట్ నడిపించారు. గత నాలుగు సంవత్సరాలుగా విచారణ జరుగుతున్న స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలను రుజువు చేయలేని సీఐడీ అంతవరకు లేని చంద్రబాబు నాయుడు పేరును కేసులో చేర్చడంలోనే కుట్ర కోణం, కక్ష కోణం దాగున్నాయని, తెలుగు దేశం నాయకులే కాదు, న్యాయనిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఎలా చుసినా, ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్పుటంగా కనిపిస్తున్నది జగన్ రెడ్డికి పుట్టుకతో వచ్చిన, కక్ష సాధింపు నైజం తప్ప మరొకటి కాదని అంటున్నారు.
ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో విదేశాల్లో విందు వినోదాల్లో తేలియాడుతున్న సమయంలోనే ఇక్కడ చంద్రబాబును ఆయన వివహ వార్షికోత్సవం రోజునే అరెస్ట్ చేయించి రాక్షస ఆనందం పొందే స్క్రిప్ట్ లో భాగంగానే కథ నడిచిందని సామాన్య ప్రజలు కూడా గుర్తించారు. అందుకే ఇందుకు జగన్ రెడ్డి తప్పక భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుదని వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. జగన్ రెడీ తప్పు చేస్తున్నావ్...అని హెచ్చరిస్తున్నారు.
అరెస్ట్ విషయంలోనే కాదు, అరెస్ట్ అనంతరం సర్వ శాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడిన మాటలు, మంత్రి రోజా, జబరదస్త్ రేంజ్ మేకప్ లో చేసుకున్న సంబరాలు, అంతకు ముందు ఆమె ఒకరి రెండు చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆమె చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఖాయంగా, ఖచ్చితంగా నూటికి నూరు శాతం కక్షపూరిత చర్య తప్ప మరొకటి కాదని సామాన్య ప్రజలు సైతం నిర్ధారణకు వచ్చారని వైసీపీ నేతలే అంటున్నారు.అంతే కాదు జగన్ రెడ్డి. వైసీపీ ఇందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని వైసీపీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.
నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా, చంద్రబాబు పర్యటనల్లో, లోకేష్ యువ గళం పాద యాత్రలో పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తో పరాకాష్టకు చేరిందని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. అలాగే ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు, విజ్ఞులు.. వినాశ కాలే విపరీత బుద్ది.. అని జగన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు.