తెలుగుదేశం సభ్యుల సస్పెన్షన్.. కోటంరెడ్డి కూడా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయని అంతా భావించారో అలాగే జరుగుతున్నాయి. తెలుగుదేశం సభ్యులను మాట్లాడనీయకుండా వైసీపీ సభ్యులు వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడమే కాకుండా, సభలో గందరగోళ పరిస్థితి నెలకొనే విధంగా వ్యవహరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు కు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియంలోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులను మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడారు. ముఖ్యంగా అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు, సవాళ్లతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అనంతరం తెలుగుదేశం సభ్యులు 14 మందిని  స్పీకర్ సస్పెండ్ చేశారు. అలాగే సీనియర్ సభ్యుడు పయ్యావుల కేశవ్, అనగాని తస్యనారాయణ, అలాగే వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను ఈ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేసి బయటకు పంపారు. అంతకు ముందు సమావేశాలకు తెలుగుదేశం సభ్యులు పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు. వారితో పాటు నలుగురు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యూలు కూడా ఉన్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ ఓటమి భయంతో ఉన్నారని అన్నారు. చంద్రబాబు జిల్లాల పర్యటనలకు, లోకేష్ పాదయాత్రకు వస్తున్న అశేష జనవాహినిని చూసి జగన్ భయపడుతున్నారనీ, వచ్చే ఎన్నికలలో ఓటమి ఆయనకు ఇప్పుడే కళ్ల ముందు కనిపిస్తోందని అన్నారు. ఆ భయంతోనే చంద్రబాబును ప్రజలలో మమేకం కాకుండా అడ్డుకునేందుకు అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. అయినా తెలుగుదేశం విజయాన్ని బలప్రయోగంతో అడ్డుకోవడం సాధ్యం కాదని జగన్ తెలుసుకోవాలన్నారు. రెట్టించిన ఉత్సాహంతో వైసీపీ అరాచకాలను ప్రజలలో ఎండగడతామన్నారు. కేసులు, వేధింపులకు భయపడే పరిస్థితి లేదని చెప్పారు.   కాగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచీ సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.  అసెంబ్లీ నుంచి ఇద్దరు తెలుగుదేశం సభ్యులతో పాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేసారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యే ల ను గురువారం ( సెప్టెంబర్ 21) ఒక రోజు సస్పెండ్ చేశారు.   కాగా అంతకు ముందు ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.  అక్రమ కేసులు, అరెస్టులకు భయపడే ప్రశక్తే లేప్రజల్లో తెలుగుదేశానికి ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకు భయపడేది లేదని బాలకృష్ణ తేల్చిచెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు.  

చంద్రబాబు అక్రమ అరెస్టు తీరు భయం గొలుపుతోంది.. హీరో విశాల్

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు అన్ని వర్గాల నుంచీ తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. జగన్ ను విపరీతంగా అభిమానించే వారు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టును తప్పుపడుతున్నారు. చంద్రబాబు వ్యతిరేకులు కూడా జగన్ తీరును ఏవగించుకుంటున్నారు. ఇది అధికార దురహంకారం, కక్ష సాధింపు వినా మరొకటి కాదని విమర్శిస్తున్నారు. చంద్రబాబు వంటి వ్యక్తినే ఇలా అక్రమంగా, అమానుషంగా అరెస్టు చేస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తీరు చూసిన జగన్ ను సమర్ధించలేమనీ, హక్కుల కోసం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఉద్యమించడం వినా మరో మార్గం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో ఈ రంగం, ఆ రంగం, ఈ పార్టీ, ఆ పార్టీ అని లేదు.. చివరాఖరికి వైసీపీలో కూడా జగన్ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గత ఎన్నికలలో వైసీపీ తరఫున పని చేసిన ఎందరో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి జగన్ ను తప్పపడుతున్నారు. ఇంకెంత మాత్రం ఆయనను సమర్ధించలేమని చెబుతున్నారు.   సినీ ప్రముఖులు కూడా మీడియా ముందుకు వచ్చి జగన్ ను తప్పుపట్టడానికి వెనుకాడటం లేదు. తాజాగా హీరో విశాల్ జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తీరును తప్పుపట్టారు. జగన్ ను ఎంతగానో అభిమానించే విశాల్ చంద్రబాబు అరెస్టు విషయంలో మాత్రం జగన్ తప్పు చేశారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. జగన్ తన అభిమాన నాయకుడు అని చెప్పిన విశాల్.. అయినా చంద్రబాబు అరెస్టు విషయంలో ఆయన తీరును సమర్ధించలేనని అన్నారు. చంద్రబాబుకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు.    కేసు లేదు.. ఎఫ్ఐఆర్ లేదు… అరెస్ట్ చేసి విచారించి, ఆధారాలను రాబడతాం అంటూ  వందల మంది పోలీసులతో చుట్టు ముట్టి అర్ధరాత్రి చంద్రబాబును అరెస్టు చేసిన తీరు భయం గొలుపుతోందని విశాల్ అన్నారు.  చంద్రబాబు లాంటి వారికే ఈ పరిస్థితి వస్తే ఇక నా పరిస్థితి ఏమిటి  అన్న ఆందోళన కలుగుతోందని హీరో విశాల్ అన్నారు.  తాను హీరోనే అయినా  సామాన్యుడినేననీ,  చంద్రబాబు అరెస్టు తీరు చూసిన తరువాత హీరోగా సెలబ్రిటీనే అయినా తనకు భయం వేసిందని అర్ధం వచ్చేలా మాట్లాడారు.   ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ అని ఆందోళన వ్యక్తం చేశారు.  విశాల్ వ్యక్తం చేసిన భయమే నేడు ఏపీలో జనబాహుల్యంలో  కనిపిస్తున్నది. పేదలు, మధ్యతరగతి వారు, సంపన్నులు అన్న తేడా లేకుండా సర్వులూ జగన్ ఏలుబడిలో ఏపీలో భయానక వాతావరణం ఉందని అంటున్నారు. ప్రజల హక్కుల రక్షణకు ఉన్న వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయనీ ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఏపీ ప్రజలకు మానవ హక్కులనేవే లేని పరిస్థితిని జగన్ ప్రభుత్వం సృష్టించిందని విమర్శిస్తున్నారు.  

విజయసాయికి హద్దుల్లేవా? తెలియవా?

విజయసాయి రెడ్డి.. తెలుగు రాష్ట్రాలలో ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా, వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఆయన సుపరిచితుడు. అన్నిటికీ మించి.. ప్రత్యర్థులపై అనుచిత భాషతో, ఆయనకు మాత్రమే ప్రత్యేక మైన అసభ్య, అనుచిత భాషలో విమర్శలు గుప్పించడంలో ఉద్దండుడు. విజయసాయి రెడ్డి తన పార్టీ అధినేత జగన్ కంటే ఎక్కువగా విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబును తలుచుకుంటారు. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా ఇష్టారీతిన విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే  ఇటీవల  కొంత కాలంగా విజయసాయి మౌనంగా ఉన్నారు. వైసీపీలో ఆయన సీన్ అయిపోయిందనీ, జగన్ ఆయనను దూరం పెట్టారనీ పార్టీ శ్రేణుల నుంచే బలంగా వినిపించింది. అందుకు అనుగుణంగానే పార్టీలో ఆయన పదవులు ఒక్కటొక్కటిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల ఖాతాలోకి వెళ్లిపోయాయి. దాంతో అప్పటి వరకూ వైసీపీ, విజయసాయిని వేరువేరుగా చూడటం సాధ్యం కాదన్నట్లుగా ఉండే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీ ఆవిర్భావం నుంచీ, ఆఖరికి జగన్ అక్రమాస్తుల కేసులో కూడా జగన్ కు తోడూ, నీడగా ఉన్న విజయసాయి ప్రభ క్రమంగా వైసీపీలో తగ్గిపోయింది. ఆయనను పార్టీ దాదాపుగా దూరం పెట్టేసిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. వైసీపీ శ్రేణులైతే పార్టీలో విజయసాయి సినిమా అయిపోయిందని బహిరంగంగానే చెప్పుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన పార్టీలో అత్యంత కీలకంగా మారడానికి కారణమైన ఆయన మార్కు విమర్శలకు విజయసాయి దూరంగా ఉన్నారు.   అన్నిటికీ మించి తెనాలిలో జగన్ రైతు భరోసా కింద  మీట నొక్కి రైతుల ఖాతాలలో నిధులు జమ చేసే సమయంలో విజయసాయి పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకుని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ  ట్వీట్ చేయడంతో జగన్ తో ఆయన ఢీ అంటే ఢీ అనేందుకు రెడీ అయిపోయారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే   పీఎం ఒక రోజు ముందే రైతుల ఖాతాలలోకి విడుదల చేసిన నిధులకు జగన్ ఉత్తుత్తి మీట నొక్కుతున్నారన్న భావన కలిగించే విధంగా అప్పట్లో ఆయన చేసిన ట్వీట్ ఉంది.   అయితే వైసీపీలో సంక్షోభం ముదురుతున్న కొద్దీ విజయసాయి పార్టీకి దగ్గర అవ్వడం మొదలైంది. గతంలో అంత చురుకుగా, క్రియాశీలంగా కాకపోయినా విజయసాయి వైసీపీ కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు. మొల్లిమిల్లిగా జగన్ కు దగ్గర కావడానికి ఆయన తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కు నచ్చాలన్నా, మెచ్చాలన్నా చంద్రబాబుపై విమర్శలు చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడమొక్కటే మార్గమన్న సంగతి విజయసాయికి తెలిసినంతగా ఎవరికీ తెలియదని పార్టీ శ్రేణులే ఉంటాయి. అయితే కొంత కాలం చంద్రబాబు ఊసెత్తని విజయసాయి మళ్లీ ఇప్పుడిప్పుడే చంద్రబాబుపై అనుచిత విమర్శలతో విరుచుకుపడుతూ.. జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 21) రాజ్యసభలో అసందర్భంగా చంద్రబాబు ఊసెత్తారు. సభలో లేని వ్యక్తిపై సభలో ప్రస్తావన రాకూడదన్న ప్రాథమిక  విషయాన్ని కూడా పట్టించుకోకుండా, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్  బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ లో విజయసాయి చంద్రబాబు ప్రస్తావన తీసుకు వచ్చారు. ఆయన అసందర్భంగా చంద్రబాబు ప్రస్తావనను తీసుకురావడాన్ని సభలో అన్ని పార్టీల సభ్యులూ తప్పుపట్టారు. బీఎంకే, బీఆర్ఎస్.. ఆఖరికి వైసీపీతో బహిరంగంగా రహస్యమైత్రి కొనసాగిస్తున్న బీజేపీ సభ్యులు కూడా విజయసాయి తీరును తప్పుపట్టారు. అయితే నవ్విపోదురుగాక నాకేటి అన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఏళ్లతరబడి బెయిలుపై ఉన్న విజయసాయి.. గురివిందలా ఇతరుల గురించి మాట్లాడటం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని పరిశీలకులు అొంటున్నారు.  మొత్తంగా విజయసాయి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యసభలో విజయసాయి తీరు పట్ల పెద్దల సభలో సీనియర్ సభ్యులు కూడా ఆయనకు హద్దులు లేవా? తెలియవా? అంటూ విమర్శిస్తున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికలు?

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసిన తీరుగా జరుగుతాయా,  ముందస్తుకు జరుగుతాయా? ఇది ఇప్పడు కాదు, ఎప్పటి నుంచో  జరుగుతున్న చర్చ. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మరో మారు జమిలి ఎన్నికల చర్చను తెరపైకి తెచ్చిన తర్వాత ... ముందస్తు అసెంబ్లీ ఎన్నికల చర్చ మరింత ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన చేసినప్పటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా,జమిలి బిల్లు తెచ్చేందుకే ప్రత్యేక సమావేశాలు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరో వంక  సెప్టెంబర్ 18న మొదలైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అందరూ అనుకున్నట్లుగానే, కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా బిల్లుతోనే అడుగుపెట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో విపక్షాలు, బిల్లును సమర్దిస్తూనే  చిన్న చిన్న చిక్కులు సృష్టించే ప్రయత్నం చేసినా, కేంద్ర ప్రభుత్వం విపక్షాలు వెనకడుగువేసే ఆవకాశం లేకుండా ముగ్గులోకి దించింది.  బుధవారం( సెప్టెంబర్ 20) లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది,  గురువారం( సెప్టెంబర్ 21) పెద్దల సభలోనూ పాసై ..రేపో మాపో చట్టంగా బయటకు వస్తుంది. సరే, మహిళా బిల్లు చట్టం అయినా  2024 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు కాదు.  ఎన్నికల తర్వాత జనగణన, డీలిమిటేషన్  ప్రక్రియలు పూర్తయిన తర్వాతనే మహిళల రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని  హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో స్పష్టం చేశారు. అయినా చట్టం అమలుకు సంబంధించి ఇంకా కొంత సందిగ్ధత కొనసాగుతోంది. అయినా అది ప్రస్తుతానికి అప్రస్తుతం. కనుక దానిని పక్కన పెడితే.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు చాలా ముందునుంచి రాజకీయ వర్గాల్లో  జమిలి ఎన్నికల చర్చ బలంగా నడుస్తోంది. అయితే, ప్రస్తుతానికి   ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినా ఆ అంశం చుట్టూనే  చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు? అనే ఉత్కంఠ ఉంది. మహిళా బిల్లు తరహాలో ముందస్తు సమాచారం లేకుండా జమిలి బిల్లును ప్రభుత్వం తెస్తుందా అన్న అనుమానాలున్నాయి. మహిళా బిల్లు తరహాలో  2029 ఎన్నికల నుంచి అమలుచేసే విధంగా జమిలి ఎన్నికల బిల్లును తెస్తుందా, అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికలపై  బీజేపీ, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టి పెట్టారు. ఈ టర్మ్ పూర్తయ్యే లోగా, ఈ రెండు హామీలకు చట్ట బద్దత   కల్పించే ఉద్దేశంతోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వాహించానే నిర్ణయం తెసుకున్నట్లు బీజీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపధ్యంలో అవసరం అయితే, ప్రత్యేక సమావేశాలను మరో ఒకటి రెండు రోజులు పొడిగించి జమిలి బిల్లును ‘మమ’  అనిపించినా అనిపించవచ్చని అంటున్నారు.  అదే నిజమైతే, లోక్ సభ ఎన్నికలను ముందస్తుకు జరిపి, ఆ ఎన్నికలతో పాటుగా, ఐదారు నెలలు అటూ ఇటుగా ఎన్నిలు జరగ వలసిన రాష్ట్రాల శాసన సభ ఎన్నికలను అటూ ఇటు చేసిన మినీ జమిలి ఎన్నికలు జరుపుతుందా అనే విషయంలోనూ అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ అనుమానాలు మరింత  బలంగావినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి తారక రామా రావు, అసెంబ్లీ  ఎన్నికలు ఆరు నెలలు వాయిదా  పడే   అవకాశం లేక పోలేదని అన్నారు. లోక్ సభ ఎన్నికలతో పాటుగా వచ్చే మార్చి,ఏప్రిల్ లో జరిగ వచ్చని అన్నారు. అందుకు తగ్గట్టునే భారత ప్రాధాన ఎన్నికల  కమిషనర్ రాజీవ్ కుమార్, అసెంబ్లీ ఎన్నికలను గడువుకు  ఆరు నెలలు ముందు  వెనక నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని పేర్కొన్నారు.  అదలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  బుధవారం( సెప్టెంబర్20) జరిగిన మంత్రివర్గ సమావేశంలో  ముదస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.  జమిలి లేదా ముందస్తు ఎన్నికలపై  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర  ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, చూద్దాం .. ఆ తర్వాత ముందస్తు పై ఒక నిర్ణయం తీసుకుందామని అన్నట్లు తెలుస్తోంది, మరో వంక బీజేపీ నాయకులు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు యథాతథంగా గడువు ప్రకారమే జరుగుతాయని పైకి అంటున్నా, వ్యక్తిగత సంభాషణల్లో  మినీ జమిలి అవకాశాలను పూర్తిగా కొట్టివేయలేమని అంటున్నారు. అలాగే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒకే సారి ఎన్నికలు జరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు.  అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ భేటీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని చెప్పడం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరుగుతాయని అంటున్నారు. అయితే అది ఈ ఏడాది డిసెంబర్ లోనా, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే అనే విషయంలో మాత్రం స్పష్టత లేదని అంటున్నారు. 

మీసం తిప్పిన బాలయ్య.. తొడకొట్టిన అంబటి

ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నినాదాలు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. ఆ  దశలో అంబటి రాంబాబు తెలుగుదేశం సభ్యులను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు. స్పీకర్ పై దాడికి ప్రయత్నాస్తున్నారంటూ ఆరోపించి, వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరడమే కాకుండా.. ఆయన చర్యలు తీసుకోకుంటే తామే తీసుకుంటామని అర్ధం వచ్చేలా చెప్పారు. తమ సభ్యులలో ఓవర్ యాక్షన్ చేయగల వారు ఉన్నారనీ, వారు రంగంలోకి దిగితే.. సభలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని హెచ్చరించారు.   తాము రెచ్చిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఆ సందర్బంగా బాలకృష్ణ మీసం తిప్పారంటూ ...అంబటి దమ్ముంటూ రా అంటే అంటూ పరుషంగా మాట్లాడడమే కాకుండా, తొడకొట్టారు. దీంతో సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఆ దశలో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు  తెలుగుదేశం సభ్యులు పాదయాత్రగా వెళ్లారు. తొలుత వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తరువాత సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి శాసనసభ వరకు పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు వీరి పాదయాత్రలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు కూడా పాల్గొన్నారు.  కాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజధాని ప్రాంతంలో పోలీసులు కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంచుమించుగా అడుగుకో పోలీసు చొప్పున మోహరించారు. ఇక అసెంబ్లీ దారిలో పొలాలలో  కూడా కూంబింగ్ చేపట్టారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పరిసరాల్లో మెటల్‌ డిటెక్టర్‌, బాంబు స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించారు.   జగన్‌ వస్తున్న సమయంలో బలగాలు పొలాల్లోనూ కాపలా కాశారు.   

కేంద్రం పెద్దలకు తెలిసే చంద్రబాబు అరెస్ట్.. అశోక గజపతి రాజు

తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత పి.అశోక్ గజపతి రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా.. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిందంటే నమ్మబుద్ది కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇదంతా కేంద్రానికి తెలిసే జరిగిందని తమ నమ్మకమని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుకుంటున్నారని ఆయన తెలిపారు. అయితే తాను న్యాయవాది కాకపోయినా.. సుదీర్ఘ కాలం చట్టసభల్లో పని చేసిన అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇక ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. అది కేబినెట్ మొత్తం బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. అది పరిగణలోకి తీసుకోకుండా.. ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టి సాక్ష్యాలు కోసం వెతుకున్నారని ఆయన వివరించారు. అయితే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.     అశోక్ గజపతి రాజు.. మాటలకు విశ్వసనీయత ఉందని నెటిజన్లు ఈ సందర్బంగా పేర్కొంటున్నారు. అయినా నిప్పు లేకుండా పొగ రాదంటున్నారు. అదీకాక జగన్ తొలి మలి కేబినెట్లోని పలువురు మంత్రుల్లాగా అశోక్ గజపతి రాజు మాట్లాడరని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఇక అశోక్ గజపతి రాజు వ్యవహరశైలినే కాదు.. ఆయనలోని నీతి నిజాయితీని సైతం ప్రధాని మోదీ.. గతంలో ప్రశంసించిన విషయాన్ని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. మరోవైపు అశోక్ గజపతి రాజు.. ఆయన రాజకీయ జీవితం.. తెరిచిన పుస్తకమని... ఆయన ప్రజా ప్రతినిధిగా అటు ఢిల్లీలో ఉన్నా.. ఇటు విజయనగరంలో ఉన్నా.. ప్రజలు, వారి సంక్షేమం కోసమే పాటు పడ్డారని జిల్లా వాసులు సైతం చెప్పుకుంటారని నెటిజన్లు చెబుతున్నారు.   మరోవైపు.. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై జాతీయ మీడియా విస్తృతంగా కవర్ చేసిందని.. దీంతో ఈ విషయం కేంద్రంలోని పెద్దలకు తెలిసే ఉంటుందని నెటిజన్లు వివరిస్తున్నారు. అదీకాక.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారని.. ఇంకోవైపు కేంద్రంలోని పెద్దలతో జగన్ ప్రభుత్వంలోని పెద్దలు.. అంటకాగుతున్నారన్నది బహిరంగ రహస్యమేనని  నెటిజన్లు అంటున్నారు. ఎన్నికలు రానున్నాయి.. అలాంటి వేళ.. మాకు మీరు.. మీకు మేము అంటూ.. అటు బీజేపీ, ఇటు వైసీపీలు కలిసి మెలసి ఈ పని చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో మాజీ ఎంపీ మధు యాష్కి.. చంద్రబాబు అరెస్ట్ వెనుక మోడీ, కేసీఆర్ ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతిని ప్రస్తావిస్తున్నారు. ఇక చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినా.. పక్క రాష్ట్రాల నేతలు.. విభిన్నరకాల ఆరోపణలు సైతం గుప్పిస్తున్నారని.. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే.. ఆ వెనుక.. ఉన్నది కేంద్ర ప్రభుత్వమా? లేకుంటే జగన్‌తోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసి ఈ అరెస్ట్‌కు పథక రచన చేశారా? అదీ ఇదీ కాకుంటే.. జగన్ ప్రభుత్వంతో కలిసి... కేంద్రం ఈ చర్యకు పూనుకుందా? అనే సందేహాలు  నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.   ఇంకోవైపు జగన్ విదేశీ పర్యటనలో ఉండగా.. చంద్రబాబు అరెస్ట్ అయితే.. ఏపీ సీఎం స్వదేశానికి వచ్చిన వెంటనే.. ఢిల్లీ పర్యటనకు వెళ్తారంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఇప్పటికీ   సీఎం జగన్.. నేటికి ఢిల్లీకి వెళ్లిందీ లేదని.. ఓ వేళ.. జగన్ డిల్లీకి వెళ్లి.. కేంద్రంలోని పెద్దలతో భేటీ అయితే.. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మరిన్ని రాజకీయ ప్రచారాలు ఊపందుకొంటాయనే ఉద్దేశ్యంతో  కేంద్రం పెద్దలే ఆయనను రానీయలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఎన్నికల కోసం ఓటరు ఎదురు చూపు!.. సీఓటర్ సర్వే తేల్చిన వాస్తవం ఇదే!

నిండా మునిగినవాడికి చలేమిటని సామెత. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు కూడా అలాగే సాగుతున్నాయా? అంటే సామాన్య  ప్రజానీకం నుంచి మేధావులు, మధ్య తరగతి ప్రజలు మొదలు, అన్ని వర్గాల ప్రజల నుంచి అవునన్న సమాధానమే వస్తోంది. నిజానికి ప్రజలు, మధ్య తరగతి మేధావులే కాదు, గత ఎన్నికల్లో ఏదో ఆశించి వైసేపీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన వైసీపీ ఓటర్లు కూడా ఎంత త్వరగా ఎన్నికలొస్తే రాష్ట్రానికి అంత మంచిదని అంటున్నారు. అంతే కాదు  చివరకు క్షేత్ర స్థాయి వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా సైలెంట్ గానే అయినా, వైసీపీ పాలన పట్ల పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో చంద్రబాబు అంతటి  సీనియర్ నాయకుడిని, అక్రమంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపి వేధింపులకు గురిచేయడాన్ని, ఆయనతో పాటుగా,ఆయన్ని అయన కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్న తీరును పార్టీలకు అతీతంగా సామాన్య ఓటర్లు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నారు.  నిజం. చట్టాని చుట్టేసి, ఇష్టారాజ్యంగా రాజ్యంగ విరుద్ధ పరిపాలన సాగిస్తున్న జగన్ రెడ్డి పాలనపై విసుగెత్తిన ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా వైసీపీ ప్రభుత్వాన్ని వదిలించుకోవచ్చనే ఆలోచన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వైసేపీ మంత్రులు, నాయకులు చేస్తున్న ప్రకటనల పట్ల ప్రజల్లో సంపూర్ణ వ్యతిరేకత వ్యక్త మవుతోంది. ఇప్పటికే వంద తప్పులు చేసిన జగన్ రెడ్డి చద్రబాబును అరెస్ట్ చేసి, నూటొక్క తప్పులు పూర్తి చేసి  ప్రజాగ్రహాన్ని కొని తెచ్చుకున్నారని అంటున్నారు.   ఇదే నిజాన్ని సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. తెలుగు దేశం అధినేత,  మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత రాష్ట్రంలో  పరిస్థితులపై సి ఓటర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సి ఓటర్ సర్వేను ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి విపరీతమైన సానుభూతి వచ్చిందని సి ఓటర్ సర్వేలో వెల్లడైంది. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమేనని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని సర్వే తెలిపింది. చంద్రబాబు అరెస్ట్‌తో జగన్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందని సి ఓటర్ సర్వే తేల్చింది. చంద్రబాబు అరెస్ట్ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడం తథ్యమని వెల్లడించింది. జనసేన పొత్తుతో చంద్రబాబు మరోమారు, ముఖ్యమంత్రిగా సభలో కాలుపెట్టడం ఖాయమని సర్వే తేల్చింది. ఆయన అరెస్ట్ తో తెలుగు దేశం పార్టీకి, పెద్దగా నష్టం జరగదని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారని, అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెపుతే వినే రకం కాదు కాబట్టి, వాస్తవ పరిస్థితిని ఆయన ముందు ఉంచలేక పోతున్నామని వైసేపీ నేతలు  సర్వే బృదంతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకే, వైసీపీ నాయకులు ఓటమికి మానసికంగా సిద్దం కావడంతో పాటుగా, ప్రత్యామ్నాయ అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ ను కేంద్రం దూరంపెట్టిందా? పెట్టినట్టు చేస్తోందా?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు, ఆర్థిక అవకతవకలకు కేంద్రంలోని మోడీ సర్కార్ అండదండలు ఉన్నాయా అన్న విషయంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా  తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్టు విషయంలో మోడీ సర్కార్ ఆశీస్సులూ, ప్రోత్సాహం, అండదండలూ జగన్ రెడ్డి సర్కార్ కు ఉన్నాయన్న అభిప్రాయానికి రోజురోజుకూ బలం చేకూరుతోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం సకల విలువలకూ తిలోదకాలిచ్చేసి, నిబంధనలను తోసి రాజని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇష్టారీతిన అర్ధరాత్రి అడ్డగోలుగా అరెస్టు చేసే సాహసం చేసిందంటే.. కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ముందడుగు వేసిందని నమ్మలేమని పరిశీలకులు సైతం అంటున్నారు. అవన్నీ పక్కన పెడితే చంద్రబాబు అరెస్టు విషయంలో తమకు కేంద్రంలోని మోడీ సర్కార్ మద్దతు సంపూర్ణంగా ఉందని వైసీపీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. అంతే కాదు..ఈ ఒక్క కేసే కాదు రానున్న రోజులలో మరిన్ని కేసులలో చంద్రబాబును విచారిస్తామనీ, చంద్రబాబు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నూ తెలుగుదేశం ముఖ్య నాయకులనూ కూడా అరెస్టు చేస్తామని బాహాటంగానే చెబుతున్నారు. అయితే ఈ ప్రచారం వ్యూహాత్మకమా? వాస్తవమా అన్నది పక్కన పెడితే జనబాహుల్యంలో మాత్రం జగన్ రెడ్డికి మోడీ, షాల మద్దతు సంపూర్ణంగా ఉందని భావనే వ్యక్తం అవుతోంది.   అయితే వైసీపీ చెబుతున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు వైసీపీ అడ్డగోలు అరాచక చర్యలకు అండదండలు అందిస్తూనే, ఏపీ సర్కార్ ఆర్థిక అరాచకత్వాన్ని చూసీ చూడనట్లు వదిలేసి మరిన్ని అనుమతులకు అప్పులిస్తూనే.. మరో వైపు జగన్ ను బీజేపీ అధినాయకత్వం చక్రబంధంలో బిగించేసిందా? అన్న అనుమానాలూ కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని తాను విదేశీ పర్యటనలో ఉండగా స్కిల్ స్కామ్ పేరిట   అక్రమంగా, అన్యాయంగా, అప్రజాస్వామికంగా   అరెస్టు చేయించిన తీరు పట్ల దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఖండిస్తున్నాయి. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా స్పందించలేదన్న మాటే కానీ బీజేపీకి చెందిన రాష్ట్రాల అధ్యక్షులు, పలువురు కేంద్ర మంత్రలు చంద్రబాబు అరెస్టును ఖండించారు. జగన్ అరాచకాలను ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు భువనేశ్వరి అయితే చంద్రబాబు అరెస్టు తీరు అప్రజాస్వామికమని విమర్శించడమే కాకుండా, జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వాన్ని, అవినీతి పాలనను కడిగిపారేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ ఇలా బీజేపీ నాయకులంతా కూడా జగన్ అరాచకాన్ని తూర్పారపడుతూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఇదలా ఉంచితే చంద్రబాను అరెస్టుకు బీజేపీ అధినాయకత్వం  మద్దతు ఉందని చెప్పుకుంటూ వస్తున్న వైసీపీ నేతలకు ఈ పరస్థితి మింగుడు పడటంలేదు. అలాగే జగన్ తన విదేశీ పర్యటన నుంచి వచ్చీ రాగానే హస్తిన పర్యటనకు వెళతారనీ, మోడీ, అమిషాలతో భేటీ అవుతారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదిగో బయలుదేరుతున్నారు..అదిగో బయలుదేరుతున్నారు అంటూ వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే జగన్ హస్తిన పర్యటనకు వెళ్లిందీ లేదు. అసలు వెడతారో లేదో కూడా తెలియదు. ఆయన యధా ప్రకారం బటన్ నొక్కుడు కార్యక్రమాలలో మునిగిపోయారు. చంద్రబాబు అరెస్టును సమర్ధించుకుంటూ ఆయా కార్యక్రమాలలో ఆయన చేస్తున్న ప్రసంగాలు వినలేక జనం బయటకు వెళ్లి పోతున్న దృశ్యాలు మీడియాలో అందరూ చూశారు కూడా. అది పక్కన పెడితే.. ఇంతకీ జగన్ హస్తిన పర్యటనకు ఎందుకు వెళ్లలేదు. ఆయనకు మోడీ, షాల అప్పాయింట్ మెంట్ దొరకలేదా? లేదా హస్తిన వెడితే చంద్రబాబు అక్రమ అరెస్టుపై జాతీయ మీడియాకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్న బెరుకా? లేక ఇప్పటికే హస్తినలో లోకేష్.. బాబు అక్రమ అరెస్టునకు నిరసనగా జాతీయ మీడియా ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన నేపథ్యంలో జగన్ హస్తినలో అడుగుపెడితే.. లోకేష్ చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో బ్రింగ్ ఇట్ ఆన్ అంటూ జగన్ తో బహిరంగ చర్చకు విసిరిన సవాల్ కు జవాబు చెప్పాల్సి వస్తుందన్న బెరుకా అంటూ సామాజిక మాధ్యమంలో జగన్ కు ఓ రేంజ్ లో ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజనులు. వాస్తవానికి చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు కారణంగా ఏపీలోనే కాదు దేశ విదేశాల్లో కూ డా వైసీపీతో  పాటుగా మోడీ సర్కార్ పై కూడా ఆగ్రహం పెల్లుబుకుతోంది. తమ పరువును జీ20 శిఖరాగ్ర సదస్సు సాక్షిగా గంగలో కలిపేసిన జగన్ పై ఆగ్రహంతో బీజేపీ అధినాయకత్వమే ఆయనను దూరం పెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఇంతటి అరాచక పరిస్థితులు ఉన్నప్పటికీ జగన్ కు అడ్డగోలుగా అప్పులు చేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ ఇంకా అనుమతులు ఇస్తుండటంతో అసలు ఏం జరుగుతోంది? అప్పాయింట్ మెంట్ లేదనడం, జగన్ హస్తిన పర్యటన నిరవధికంగా వాయిదా పడటం, బీజేపీ నేతలు జగన్ పై విమర్శలు గుప్పిస్తుండటం ఇదంతా ప్రజలను మభ్యపెట్టే వ్యూహంలో భాగమేనా? అన్న అనుమానాలను కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీ తన ప్రతిష్టను మంటగలుపుకుని మరీ జగన్ తో బంధం కోసం ఎందుకు వెంపర్లాడుతున్నదా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఏపీలో జగన్ కు వత్తాసు పలుకుతున్న బీజేపీపై జాతీయ స్థాయిలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతున్నదనడానికి రాజకీయాలకు అతీతంగా చంద్రబాబుకు పెరుగుతున్న మద్దతే నిదర్శనమంటున్నారు.  

ఎమ్మార్వోపై వైసీపీ నేత భౌతిక దాడి

చట్టాలు వర్తించవు, నిబంధనలు పాటించరు. అధికారులను వారి పని వారిని చేసుకోనివ్వరు. తమ మాట వినకపోతే భౌతిక దాడులకు కూడా వెనుకాడరు. ఇదీ ఏపీలో అధికార వైసీపీ నేతల తీరు. తిరుమలలో నిబంధనలు పాటించకుండా విజిలెన్స్ చీఫ్ ను తోసుకుని మరీ మహాద్వారం గుండా మాజీ మంత్రి కొడాలి నాని ఆలయ ప్రవేశం చేసినా ఆయనకు దణ్ణం పెట్టడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత ఆ అధికారులదీ, అక్కడి పోలీసులదీ. చంద్రబాబును అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేసి ఇదేమిటంటూ రోడ్లపైకి వస్తున్న జనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని, ఆందోళనలను అణచివేయడం.. అదే సమయంలో చంద్రబాబును అరెస్టు చేసినా రాష్ట్రంలో ఎక్కడా కనీసం ఖండనలు లేవని చెప్పుకోవడం వైసీపీ నేతల రీతి. రాష్ట్రం మొత్తం అధికార వైసీపీ ఆడింది ఆటగా, పాడింది పాటగా చెలామణి అవుతున్న అరాచక పరిస్థితి రాజ్యమేలుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తాజాగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మార్వోగా పని చేస్తున్న లక్ష్మీనారాయణ రెడ్డికీ వైసీపీ గూండాయిజం సెగ తగిలింది. స్థానిక వైసీపీ నాయకుడు, సంతనూతల పాడు మండల వైసీపీ అధ్యక్షుడు, స్థానిక జడ్పీటీసీ సభ్యురాలి భర్త అయిన దుంపా చెవిరెడ్డి ఎమ్మార్వో లక్ష్మీనారాయణరెడ్డిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం (సెప్టెంబర్ 19)న జరిగింది. దుంపాచెవిరెడ్డి గత కొంత కాలంగా పది ఎకరాల పోరంబోకు భూమి విషయంలో వివాదం ఉంది. ఈ వివాదం నేపథ్యంలోనే ఇటీవల రెండు వారాలపాటు లక్ష్మీనారాయణ రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆయన గత వారమే తిరిగి విధులలో చేరారు. ఈ నేపథ్యంలో మంగళవారం (సెప్టెంబర్ 19)న దుంపా చెవిరెడ్డి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి మరో సారి ఆ పదెకరాల పోరంబోకు భూమినీ తన పేరుపై బదలాయించాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకు ఎమ్మార్వోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చెవిరెడ్డి కార్యాలయ సిబ్బందిని బయటకు పంపేసి లక్ష్మీనారాయణరెడ్డి గొంతు పట్టుకుని బెదరించి చెంపపై కొట్టారు.   ఈ సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. దుంపాచెవిరెడ్డి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించే పరిస్థితులు లేకుండా వైసీపీ నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మార్వోపై చేయి చేసుకున్న దుంపా చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

మేము సైతం బాబు కోసం.. దేశ విదేశాల్లో నిరసన జ్వాలలు

సరిహద్దులు చెరిగి పోతున్నాయి.  మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమ కేసుల్లో ఇరికించి, వేధింపులకు గురి చేయడాన్ని, రాష్ట్ర ప్రజలే కాదు. ఇరుగు పొరుగు రాష్టాల ప్రజలు సైతం వ్యతిరేకిస్తున్నారు. అసహ్యించుకుంటున్నారు. ఏవగించుకుంటున్నారు.  చంద్రబాబు నాయుడు, కేవలం ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి పరిమితమైన నాయకుడు కాదు. సమకాలిన రాజకీయ నాయకుల్లో ముందు వరసలో నిలిచే జాతీయ నాయకుడు. నిజనికి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, విజన్, విశ్వసనీయత మేళవించిన రాజనీతిజ్ఞుడు. స్టేట్స్ మన్. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా  చంద్రబాబు తెచ్చిన ఆర్థిక, సాంకేతిక సంస్కరణల ప్రయోజనాలు పొందిన వేలాది మంది ఐటీ రంగ నిపుణులు, ఇంజనీర్లు వైద్యులు, ఆర్థిక సంస్కరణలను ఆసరా చేసుకుని, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, సేవరంగాలలో దేశ విదేశాల్లో దూసుకుపోతున్నారు. అలాంటి ఎందరో వివేచన, విజ్ఞతగల విద్యావంతులు చంద్రబాబుకు మద్దతుగా దేశ విదేశాల్లో భారీ స్థాయిలో నిరసనలకు దిగుతున్నారు. బెంగళూరు నగరంలో ఐటీ ఉద్యోగులతో మొదలైన నిరసనాగ్రహాలు రాష్ట్రంలోని తెలుగు ప్రజలు ఉన్న మారుమూల ప్రాంతాలకు చేరాయి. బళ్లారి, విజయనగర, రాయచూరు, కొప్పళ, చిత్రదుర్గం, చెళ్లకెర, కొప్పళ, గంగావతి, హుబ్బళ్లి తదితర ప్రాంతాల్లో వివిధ సంఘాలు, క్యాంపులలో ఉండే చంద్రబాబు అభిమాన సంఘాలు నిరసనలు, ర్యాలీలు కొనసాగిస్తున్నాయి. పార్టీలకు అతీతంగా ప్రవాసాంధ్రుల ఆందోళనలకు బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌) పార్టీల నాయకులు మద్దతుగా పాల్గొంటున్నారు. మంగళవారం( సెప్టెంబర్ 19) రాయచూరు జిల్లా సింధనూరులో జరిగిన భారీ నిరసనలో జేడీఎస్‏కు చెందిన మాజీమంత్రి వెంకటరావు నాడగౌడ, బీజేపీకి చెందిన మాజీ ఎంపీ విరూపాక్షప్ప, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మస్కి ఎమ్మెల్యే బసనగౌడ తుర్విహాళ్‌ పాల్గొనడం విశేషం. అంతే కాదు  కర్ణాటక మాజీ మంత్రి వెంకటరావు నాడగౌడ మరో అడుగు ముందుకేసి  చంద్రబాబునాయుడు అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య  తప్ప మరొకటి కాదని, రాజకీయాలలో  ఇది ప్రమాదకర పరిణామమని పేర్కొన్నారు. మరోవంక చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రవాసాంధ్రులు, తెలుగు సంఘాల ఆధ్వర్యంలో సింధనూరు నగరంలోని స్టేడియం గ్రౌండ్‌లో భారీ సమావేశం నిర్వహించారు. అనంతరం నగరంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ అవినీతి వ్యవహారాలకు సంబంధించి విచారణ జరిపించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని, దాని పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి ధోరణి రాజకీయాల్లో ఎంతమాత్రం సరికాదని, ఇందుకు బాధ్యులైన వారు భవిషత్తులో భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపునకు,  రాజకీయ విద్వేషాలకు పాల్పడడం ఎంతమాత్రం సమంజసం కాదని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎంపీ కె. విరుపాక్షప్ప మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు  నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇలాంటి ధోరణి రాజకీయాల పట్ల ప్రజల్లో విశ్వానికి బదులు అసహ్యాన్ని పెంచుతుందన్నారు. ఈ పద్ధతి విడనాడాలని, ఇది ఏ పార్టీకి మంచిది కాదని హితవు పలికారు. చం ద్రబాబు అరెస్టు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తి దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తోందని, ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని, ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలంటూ తెలుగు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఇలా, దేశ విదేశాల్లోని విజ్ఞులు, వివేచనపరులు, చద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నారు, అంతే కాదు, చందబాబు అరెస్ట్ ను వ్యతిరెకిస్తూ  తెలుగు ప్రజలు సాగించే ధర్మ పోరానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాలు హాజరౌతాం.. తెలుగుదేశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు గురువారం (సెప్టెంబర్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి.  అసెంబ్లీ సమావేశాల ముందు సంప్రదాయంగా జరిగే కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు  27వ తేదీ వరకూ జరుగుతాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు ఇంటర్ నేషనల్ బాక్యులరేట్ (ఐబీ) విద్యా విధానంపై కేబినెట్ చర్చించింది. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు అరెస్టు, తదననంతర పరిణామాలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగిందని అంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అక్రమాలు, అవినీతిపై సభలో చర్చించాలని కేబినెట్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించింది. తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన తీరుపై సభలో గళమెత్తాలని నిర్ణయించింది. సభలో అధికార పార్టీ తమకు మైక్ ఇవ్వకపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఒక వేళ  మైకు ఇచ్చినా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించే అవకాశం ఉందనీ తెలుగుదేశం సభ్యులు భావిస్తున్నారు. అయినా సరే పోరాటమే ఎజెండాగా అవమానాలు భరించడానికైనా సిద్ధ పడాలని తెలుగుదేశం శాసనసభా పక్షం నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు తదనంతర పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంపై బుధవారం పార్టీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంతగా అవమానించినా ప్రజల కోసం భరిద్దామని పార్టీ ఎమ్మెల్యేలకు లోకేశ్ సూచించారు. పోరాటమే అజెండాగా ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని పేర్కొన్నారు. సభ వేదికగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై గట్టిగా గళమెత్తాలని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును, జగన్ దుర్మార్గాలనూ ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని పేర్కొన్నారు. సభలో మైక్ ఇవ్వకుంటే నిరసన ద్వారా సాధిద్దామని చెప్పారు.   

మహిళా రిజర్వేషన్ బిల్లుకు విఘ్నాలు తొలిగి నట్లేనా?

ఇంచు మించుగా మూడు దశాబ్దాలుగా పార్లమెంట్ ను పలకరించి పోతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త పార్లమెంట్ భవనంలో తొలి బిల్లుగా మరో మారు కొత్తగా  పాదం మోపింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు 1990 దశకంలో, అప్పటి ప్రధాని దేవేగౌడ సంకీర్ణ ప్రభుత్వం తొలిసారిగా లోక్ సభలో ప్రవేశ పెట్టింది.ఆతర్వాత వాజపేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు కూడా ఐదారు మార్లు ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రవేశ పెట్టాయి. కానీ సభ ఆమోదం పొందలేదు.  2010లో ఒక సారిరి పెద్దల సభ ఆమోదం పొందినా, దిగువ సభ ఆమోదం లేక గడువు ముగిసి కాలం చేసింది.  ఇప్పుడు ఇన్నాళ్ళకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం  పార్లమెంట్ కొత్త భవనంలోకి మారుతున్న శుభ సమయంలో, కొత్త పార్లమెంట్ గడప తొక్కిన  తొలి బిల్లుగా నారీ శక్తి వందన్ అధినియం బిల్లు  (మహిళా రిజర్వేషన్ బిల్లు)ను పార్లమెంట్ ఉభయ సభల్లో  ప్రవేశ పెట్టింది. పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి నడిచి వచ్చిన ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలతో పాటుగానే, మహిళా బిల్లు కూడా నడుచుకుంటూ వచ్చింది. కొత్త పార్లమెంట్ లో అడుగుపెట్టింది.   బహుశా భారత పార్లమెంట్ చరిత్రలో ఇంతకాలం త్రిశంకు స్వర్గంలో కాలక్షేపం చేసిన బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు తప్ప మరొకటి ఉండక పోవచ్చును. ఈ బిల్లు ఒకటి రెండు కాదు, ఏకంగా మూడు దశాబ్దాలుగా విఘ్నాలను ఎదుర్కొంటూ వస్తోంది. అందుకే  ఈసారైనా బిల్లు ఆమోదం పొందుతుందా  అనే అనుమానాలు, సందేహాలూ వదలడం లేదు. అదే సమయంలో  ఈసారి  విఘ్నాలను తొలిగించే వినాయకుని పుట్టినరోజు పండగ, వినాయక చవితి  రోజున పార్లమెంట్ ప్రవేశం చేసిన, బిల్లు ఖాయంగా ఆమోదం పొందుతుందనే విశ్వాసం  వ్యక్తమవుతోంది. ప్రధానంగా  లోక్ సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉండడంతో పాటుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, వైసేపీ, కమ్యూనిస్టులు సహా (ఎస్పీ, ఆర్జేడీ, వంటి రెండు మూడు పార్టీలు మినహా )మిగిలిన పార్టీలన్నీ బిల్లుకు మద్దతు ఇస్తున్న నేపధ్యంలో ఈసారి, విఘ్నాలు తొలిగి మహిళా బిల్లు చట్ట్టం అయ్యే అవకాశాలే ఎక్కుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో గట్టిగా వ్యక్తమౌతోంది.   అయితే  అదే జరిగి మహిళా బిల్లు చట్టరూపం దాల్చినా, ఆ చట్టం వెంటనే అమలులోకి రాదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే చట్టం అమలులోకి వస్తుంది. అంటే  ఈలోగా జరగవలసిన జనగణన జరిగి, 2026లో లేదా నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతనే చట్టం అమలులోకి వస్తుంది. ఆ లెక్కన  బిల్లు పాస్ అయినా ఇప్పటికిప్పుడు, మహిళలకు కలిగే ప్రత్యక్ష  ప్రయోజనం ఏమీ ఉండదనే చెప్పాలి.  2026 తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో, అ తర్వాత 2029 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మాత్రమే ఈ చట్టం అమలు అవుతుంది. మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది.  అయితే  మహిళా బిల్లు చట్ట రూపం దాలిస్తే సహజంగానే రాజకీయ పార్టీలలో మహిళల ప్రాధాన్యత పెరగ వచ్చని రేపటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ముందు నుంచే  రాజకీయ పార్టీలు అనివార్యంగానే అయినా మహిళలను ఎక్కువ సంఖ్యలో ఎన్నికల బరిలో దించ వచ్చని  అంటున్నారు. అలాగే, ఈరో జు కాకపోయినా రేపైనా అవకాశం తలపు తడుతుందనే నమంకంతోమహిళలు రాజకీయాల్లో మరింత చురుగ్గా,  ఉత్సాహంగా పాల్గొనే అవకాశం లేక పోలేదని అంటున్నారు. ఫలితంగా చట్టం కంటే ముందే చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం ఎంతో కొంత పెరిగే అవకాశం లేక పోలేదనే అభిప్రాయం మహిళా నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులో ఇంకా స్పస్థత రావలసి వుందనేది కాదన  లేని నిజం.  అందుకే, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించే వారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చట్టం అయినా అమలును వాయిదా వేయడం, చట్టం 15 ఏళ్ళు మాత్రమే అమలులో ఉంటుందని (సన్ సెట్ ఆక్ట్’) బిల్లులో పేర్కొనడంతో ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించ వలసి వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోక వర్గాల పునర్విభజనకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధం ఏముంది?  ఇప్పటికిప్పుడు చట్టాన్ని  అమలులోకి తీసుకువస్తే.. ఈ సంవత్సరం చివర్లో జరిగే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, అదే విధంగా వచ్చే సంవత్సరం (2024) సార్వత్రిక ఎన్నికల్లోనూ మహిళలకు రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయని అంటున్నారు. కానీ  కేంద్ర ప్రభుత్వం విస్తరిలో అన్నీ వడ్డించి  నోటికి తాళం  వేసిందని  విపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే  ఈబీసీ వాటా విషయంలోనూ సందేహాలు వ్యక్త మవుతున్నాయి. అయితే చర్చ సందర్భంగా ప్రభుత్వమే కొన్ని సవరణలు తెచ్చే అవకాశం లేక పోలేదనే అభిప్రాయం కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వినవస్తోంది.  నిజానికి ప్రభుత్వం విపక్షాలను ఇరకాటంలోకి నెట్టేందుకు  బిల్లులో ఉద్దేశ పూర్వకంగానే  కొన్ని గ్యాప్ లను వదిలేసిందన్న అనుమానాలు కూడా బలంగా వ్యక్తమౌతున్నాయి. మరో వంక, విపక్షాలు కూడా ప్రభుతం ఏ ఉద్దేశం, దురుద్దేశంతో ఈ  సమయంలో ఈ బిల్లు తెచ్చింది అనే విషయంలో లోతుగా  విచారిస్తున్నాయి. అందుకే, ఆచి తూచి అడుగు వేస్తున్నాయి.  ఏది ఏమైనాఎజెండా ఏమిటో తెలియకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన చేసి మహిళ బిల్లును ముందుంచిన మోడీ ప్రభుత్వం ముందు ముందు ఏమి చేస్తుందో, పార్లమెంట్ లో, మహిళా బిల్లు అంతిమ గమ్యం ఎంతో తెలియాలంటే, వేచి చూడక తప్పదని అంటున్నారు.

మరో చాన్స్ లేదా? విషయం జగన్ కు బోధపడిందా?

చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవన్న నిర్ధారణకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీని వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే చంద్రబాబును కేసుల పేరుతో వేధించి..కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపారు. ఎన్నికల ముంగిట ఇటువంటి తీరు తన సర్కార్ పై ప్రజాగ్రహం మరింత ప్రజ్వరిల్లేందుకే దోహదపడుతుందని తెలిసినా జగన్ వెనుకాడటం లేదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అన్నట్లుగా కనిపించిన ప్రతి విషయంలోనూ లొసుగులు వెతుకుతూ వాటికి చంద్రబాబును బాధ్యుడిని చేయడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన వెతికి వెతికి చంద్రబాబుపై నమోదు చేస్తున్న కేసులు న్యాయస్థానాలలో నిలవవని.. కోర్టులు, చట్టాల గురించి కనీస పరిజ్ణానం ఉన్న ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. అటువంటిది జగన్ కు ఆయన వందిమాగధులకు, ఆయన మాట పట్టుకుని కేసులు బనాయించి, వాటిని సమర్ధిస్తున్న దర్యాప్తు అధికారులకూ విషయం తెలిదనుకోలేం. అందుకే స్కిల్ కే సులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయాలంటూ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ మోస్ట్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ కూడా సమర్ధ వాదనలు వినిపించలేకపోయారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికే దర్యాప్తు జరపాల్సి ఉందనీ, అందుకే క్వాష్ పిటిషన్ కొట్టివేయాలనీ కోరడంలోనే జగన్ రెడ్డి సర్కార్  బనాయించిన కేసులలోని డొల్ల తనం బట్టబయలైందని న్యాయనిపుణులు అంటున్నారు. ఇక విషయానికి వస్తే.. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసులో క్వాష్ పిటిషన్‌పై జరిగిన మంగళవారం (సెప్టెంబర్ 13) ఏపీ హైకోర్టులో జరిగిన వాదనల్లో.. స్కిల్ స్కాంలో చంద్రబాబు ప్రమేయాన్ని విచారించి ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉందనీ, అందుకే ఆయన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయాలంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనలతో ఈ కేసులో డొల్లతనం స్పష్టంగా బయటపడింది.  అడ్వకేట్ జనరల్, సీఐడీ చీఫ్ జంటకవుల వలే ఊరూరా, తెలంగాణ రాజధాని హైదరాబాద్, దేశ రాజధాని హస్తిన సైతం వెళ్లి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చెప్పిన విషయాలనే సుప్రీం కోర్టు  సీనియర్ న్యాయవాది    ముకుల్ రోహత్గీ మరో సారి హైకోర్టులో చెప్పారు. రంజిత్ కమార్ అనే ప్రభుత్వ లాయర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇప్పటికిప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు లేవని చేతులెత్తేశారు. అదే సమయంలో ఐటీ శాఖ ఈ కేసుతో సంబంధం లేకుండా ఇచ్చిన నోటీసుల్ని చూపించారు. వాటిని చూపుతూ ఇలాంటి నేరాలు చేశారని భావించడానికి అవకాశాలు ఉన్నాయంటూ వితండ వాదన వినిపించారు.  చంద్రబాబుకు సంబంధం ఉందని ఒక్క డాక్యుమెంట్ కూడా లేదన్న ప్రభుత్వ లాయర్, సిమెన్స్‌కు, గుజరాత్ లో స్కిల్ ప్రాజెక్టుకు ఈమెయిల్స్ పంపామని  వివరాలు రావాల్సి ఉందన్నారు. అలాగే  డిజైన్ టెక్.. క్లాజ్ లో లేకపోయినా సబ్ కాంట్రాక్టులకు ఇచ్చిందని.. ఆ సంస్థ రూ. రెండు వందల కోట్లను దారి మళ్లించిందని చెప్పారు. ఆ సమయంలో ఈ సబ్ కాంట్రాక్టర్లకు.. చంద్రబాబుకు ఉన్న సంబంధం ఏమిటన్న న్యాయమూర్తి ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు.  మొత్తంగా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా ప్రభుత్వం వద్ద లేదన్న విషయం హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయమూర్తల మాటలతో తేటతెల్లమైపోయిందని న్యాయనిపుణులు అంటున్నారు.   క్వాష్ పిటిషన్ పై ఇరు వైపు వాదనలూ విన్న తరువాత న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. ఈ మధ్యలో  ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్.. వచ్చే శుక్రవానికి మరో కౌంటర్ దాఖలు చేస్తామని కోరినా హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించలేదు. కేసులో ఇవ్వాలే వాదనలు పూర్తి కావాలని స్పష్టం చేశారు.   చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే  జగన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుపై కేసు నిలవదనీ, ఆయన బయటకు రావడం ఖాయమనీ నిర్ధారణకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు ఇలా ముగిశాయో లేదో.. అలా జగన్ రెడ్డి సర్కార్ చంద్రబాబుపై మరో కేసును తెరపైకి తెచ్చింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటి వారెంట్ దాఖలు చేసింది. వెంటనే ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. విశేషమేమిటంటే ఈ ఫైబర్ నెట్ కోసు కూడా ఇప్పటిది కాదు.. ఎప్పుడో నాలుగున్నరేళ్ల నాడు, అంటే జగన్  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2019లో పెట్టిన కేసిది.   అప్పట్లో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేశారు. ఏ1గా వేమూరి హరి ప్రసాద్‌, ఏ2 మాజీ ఎండీ సాంబశివరావులను పేర్కొన్నారు. వారిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో అందరూ బెయిల్ పై విడుదలయ్యారు. ఇంత వరకూ దర్యాప్తులో ఏం తేలిందో వివరాలు లేవు. ఇప్పటి వరకూ చార్జిషీటు కూడా వేయలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందంటూ పీటీ వారెంట్ దాఖలు చేశారు.  ఇప్పుడు ఇక గురువారం (సెప్టెంబర్ 21) నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో కోర్టులో ఉన్న కేసులపై చర్చిస్తామంటున్నారు. పిచ్చివాడి చేతిలో రాయి ఎంత ప్రమాదమో, ఒక ఉన్మాది చేతిలో అధికారం కూడా అంతే ప్రమాదం అని జగన్ రెడ్డి తన నాలుగున్నరేళ్ల పాలనలో రుజువు చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

ప్రాణాలు పోతున్నా.. పాషాణం కరగదా ?

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు,  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఎక్కడి కక్కడ నిరశన దీక్షలు చేస్తున్నారు. అలాగే  తెలుగునా  తెలుగు దేశం పార్టీని ఇంటి పార్టీగా, చంద్రబాబును ఇంటి ఇలవేలుపుగా ఆరాధించే ప్రజలు, అభిమానులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రాణాలు ఇచ్చేందుకు అయినా సిద్దమనే రీతిలో దీక్షలు చేస్తున్నారు.  చంద్రబాబు క్షేమంగా తమ మధ్యకు రావాలని, వైసీపీ అరాచక, అవినీతి, అక్రమ, అధర్మ పాలనకుచరమ గీతం పాడాలని కోరుకుంటున్నారు.  జైల్లో బాబు ఎలా ఉన్నారో .. అనే బాధతో , అలాగే చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేని  తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిద్రాహారాలు మాని, బాబు కోసం ప్రార్ధనలు చేస్తున్నారు. గుళ్ళలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చంద్రబాబు విడుదల కోరుకుంటూ మొక్కులు మొక్కు తున్నారు. చంద్రబాబును తమ ఆరాధ్య దైవంగా భావించే, పూజించే ఐటీ ఉద్యోగులు,ఇటు హైదరాబాద్, అటు బెంగుళూరు, ఇంకా చెన్నైలో  నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆందోళన బాటపట్టారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేని పలువురు  ఆ బాధలో కన్ను ముస్తున్నారు.  చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ఇంతవరకు పదుల సంఖ్యలో   చంద్రబాబు అభిమానులు మనస్తాపంతో కన్ను మూశారు.  కాగా ఇప్పడు తాజాగా, విశాఖ నగరంలో  టీడీపీ బాబాయ్‌ గా పిలుచుకునే విశాఖపట్నం షీలానగర్‌కు చెందిన పి.రాధాకృష్ణమూర్తి(82) మృతి చెందారు. చంద్రబాబును అరెస్టు చేసిన నాటి నుంచి నాయకులకు ఫోన్‌ చేస్తూ ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? జైల్లో ఎలా ఉన్నారు? అంటూ వాకబు చేసిన అయన సోమవారం కన్నుమూశారు. కన్నుముసేందుకు కొద్ది క్షణాల ముందు కూడా ఆయన చంద్రబాబు బెయిల్‌ విషయంపై కుటుంబ సభ్యులతో చర్చించారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారని కుటుంబ సభ్యులు చెప్పారు. మరో వంక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో టీడీపీ కార్యాలయం వద్ద, చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో గుడ్లవల్లేరు మండలం అంగలూరు ఎస్సీవాడకు చెందిన వ్యవసాయ కూలీ కోటేశ్వరరావు(62) కుప్పకూలి కన్ను మూశారు. చంద్రబాబు అరెస్టు అయినప్పటి నుంచి అవేదన చెందుతున్న కోటేశ్వరరావు  మంగళవారం(సెప్టెంబర్ 19)దీక్షలో పాల్గొన్నారు. కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్లే పడిపోయారు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జైలులో చంద్రబాబు ఎలా ఉన్నారోనన్న బాధతో గడచిన మూడు రోజుల్లో ఆదివారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు  రాష్ట్రంలో ఏడుగురు మరణించారు.  ఇంతగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నా, ప్రజల ప్రాణాలే పోతున్నా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కక్ష సాధింపు ధోరణిని కొనసాగిస్తున్నారు. అధికారుల అండతో ఒక దాని వెంట ఒకటిగా అక్రమ కేసులు బనాయించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, మరో కేసును తెరమీదకు తెచ్చి  చంద్రబాబును వేధింపులకు గురిచేస్తున్నారు. ఫైబర్‌నెట్‌ కేసులో ఆయన్ను విచారించాల్సి ఉందంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో  మంగళవారం(సెప్టెంబర్ 19)) పీటీ వారెంట్‌ దాఖలు అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీకి అడ్డదారిలో టెండర్లను కట్టబెట్టారని.. ఈ వ్యవహారంలో రూ.120కోట్ల అవినీతి జరిగిందని వారెంట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.  దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది.  కాగా  ఓటమి భయంతోనే జగన్ రెడ్డి ఎన్నికల ముందు ఎలాంటి అధారాలు లేని  కేసులను బయటికి తీసి చంద్రబాబును, తెలుగు దేశం పార్టీని వేధింపులకు గురి చేయడమే  లక్యంగా కనిపిస్తోంది. అయితే   ఎవరు ఎన్ని కుట్రలు  చేసినా అంతిమంగా ధర్మమే విజయం సాధిస్తుంది. ఇది చారిత్రక సత్యం అంటున్నారు, విజ్ఞులు, విమర్శకులు. వినాశకాలే విపరీత బుద్ధే అన్నట్లుగా జగన్ రెడ్డి తన అధికారాంతంలో తన పతనాన్ని తనే శాశించుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అలిపిరి నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత

తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి నడకదారిలోని లక్ష్మీనరసింహ ఆలయం 2850 మెట్టు వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ బోనులోకి  చిరుత చిక్కింది. దీంతో ఇప్పటి వరకూ అలిపిరి నడకదారిలో ఆరు చిరుతలను బంధించినట్లైంది. వీటిలో మూడింటిని అటవీ అధికారులు అరణ్యంలో విడిచిపెట్టారు.   చిన్నారి లక్షితను పులి చంపిన ఘటన తర్వాత అధికారులు ట్రాప్ బోన్లు ఏర్పాటు చేసి వాటిని బంధిస్తున్నారు. మ్యాన్ ఈటర్ చిరుతను గుర్తించి దానిని జూకు తరలించాలని భావిస్తున్నారు. అయితే ఇంత వరకూ బంధించిన వాటిలో మూడు చిరుతలు మ్యాన్ ఈటర్ లు కావని నిర్ధారణ కావడంతో వాటిని అడవిలో విడిచిపెట్టారు. తాజాగా బోనులో చిక్కిన చిరుత కాకుండా మిగిలిన రెండింటిలో లక్షితను చంపిన చిరుతను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా ఉండగా అలిపిరి నడకదారిలో వెళ్లేందుకు భక్తులు భయపడాల్సిన అవసరం లేదని టీటీడీ అధికారులు, అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. భక్తుల రక్షణ కోసం అన్ని చర్యలూ తీసుకున్నామనీ, భక్తులకు కర్రలు పంపిణీ చేస్తున్నామనీ తెలిపారు.  

తిరుమలలో కొడాలి నాని దాష్టీకం..టీటీడీ విజిలెన్స్ ను తోసేసి మరీ మహాద్వార ప్రవేశం!

మేమే దేవుళ్ళం.. అసలు సృష్టిని నడిపిస్తున్నది మేమే అనుకుంటున్నారో ఏమో కానీ ఏపీలో వైసీపీ నేతల తలబిరుసు వ్యవహారం సంచలనం అవుతోంది. 151 సీట్లు వచ్చాయి కదా  మేం చెప్పిందే వేదం.. మేం రాసుకుందే రాజ్యాంగం అన్నట్లుగా పాలిస్తున్నారు. నాలుగున్నరేళ్ల జగన్ సర్కార్ లో ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో తలెత్తిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. భక్తులు కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పుణ్యక్షేత్రం ఎంతటి పవర్ ఫుల్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని నిబంధనలు  ఉంటాయి.. ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ఇవన్నీ హిందూ సంప్రదాయంతో పాటు తరతరాలుగా ఏడుకొండల  ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు సంబంధించినవి అయి ఉంటాయి. వీటిని ప్రభుత్వాలు ముందుగా గౌరవించి ఔదాల్చాలి. కానీ, ఇక్కడ వైసీపీ నేతలు మాత్రం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను తుంగలో తొక్కి ఏడుకొండల వేంకటేశ్వరస్వామి గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీ మరోసారి తన అహంకార ధోరణిని తిరుమల సాక్షిగా బయటపెట్టారు. తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోకి ప్రవేశించారు. అధికారులు అడ్డుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారిని తోసుకుంటూ కొడాలి నాని ఆలయంలోకి వెళ్లారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్రహోత్సవాల లాంటి సమయాల్లో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించే సీఎంకు తోడుగా కొందరు మంత్రులు కూడా ఆలయ మహాద్వారం నుంచి ఆలయంలోకి వెళ్తారు. సోమవారం (సెప్టెంబర్ 18) కూడా సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తుండగా అలాగే సీఎంతో పాటు మరికొందరు మహాద్వారం నుండి లోపలికి వెళ్లారు. టీటీడీ నిబంధనల ప్రకారం చూస్తే ఈ మహాద్వారం నుండి రాష్ట్రపతి నుంచి ముఖ్యమంత్రి వరకు ఒక స్థాయి ఉన్న ప్రభుత్వాధినేతలు, పాలకులకు మాత్రమే వెళ్లే వీలుంది. కానీ, ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానికి అలా వెళ్లే అవకాశం లేదు. అయితే ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఆయనకంటే ముందుగా కొడాలి నాని ఆలయ మహా ద్వారం నుంచి లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీనికి టీటీడీ విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు చేతులతో నమస్కరిస్తూనే నానీ లోపలకు వెళ్లే వీల్లేదని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సీరియస్ అయిన కొడాలి నాని నన్నేఆపుతారా? అంటూ వాగ్వాదానికి దిగారు. తన రెండు చేతులతో విజిలెన్స్ అధికారిని తోసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న టీటీడీ సీవీ అండ్ ఎస్వో నరసింహ కిశోర్ కొడాలిని లోపలకు పంపారు. దీంతో సీఎం జగన్ కంటే ముందే కొడాలి నాని ఆలయంలోకి ప్రవేశించారు. విజిలెన్స్ సిబ్బంది ఆపినా ఆగని కొడాలి నానిపై భక్తులు మండిపడుతున్నారు. తిరుమల దైవం, టీటీడీ అంటే కనీసం గౌరవం లేని ఎమ్మెల్యే కొడాలి అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే కొడాలి నానీ గతంలో కూడా టీటీడీ నిబంధనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల డిక్లరేషన్ విషయంలో కొడాలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్యమతాల వారు తిరుమల దర్శనానికి వెళ్ళినపుడు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర మతస్థులమైనా తమకి వేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని.. అందుకే దర్శనానికి వెళ్తున్నామని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో సోనియా గాంధీ ,రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చే దర్శనానికి వెళ్లారు. కానీ, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనానికి వెళ్లారు. దీనిపై అప్పుడు విమర్శలు తలెత్తగా కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని అప్పట్లో ఆయన ప్రశ్నించారు. ఏ గుడికీ, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలకు ఎందుకని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇలా మరోసారి కొడాలి నానీ టీటీడీ రూల్స్ అతిక్రమించారు.

బాబు కోసం జాబ్‌ వదిలెయ్యండి : ఐటి ఉద్యోగులకు బండ్ల గణేష్‌ పిలుపు

నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌, రిమాండ్‌ వ్యవహారం రోజురోజుకీ సంచలనంగా మారుతోంది. ఆయన అరెస్ట్‌ అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని నినదిస్తూ రోడ్లపైకి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ అవుతోంది. అన్ని రంగాలు, వర్గాల నుంచీ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగురాష్ట్రాలలోనే కాకుండా, దేశ, విదేశాలలో చంద్రబాబుకు మద్దతు పెరుగుతోంది. పార్లమెంటులో కూడా చంద్రబాబు అక్రమ అరెస్టు విషయం ప్రస్తావనకు వచ్చింది. సినీ పరిశ్రమ నుంచి కూడా ఒక్కరొక్కరుగా చంద్రబాబుకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో మొదలై, నిర్మాత  కేఎస్ రామారావు ఇలా పరిశ్రమ ప్రముఖులు ఒక్కరొక్కుగా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. తాజాగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చంద్రబాబు అరెస్టును ఖండించారు.   చంద్రబాబు జాతీయ సంపద, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నారు. చంద్రబాబు పేరు చెప్పుకొని ఎంతో మంది బాగుపడ్డారనీ, ఆయన అక్రమ అరెస్ట్‌ తననెంతగానో బాధించిందనీ పేర్కొన్నారు.   ఆ బాధతో తాను ఇంట్లో  వినాయక చవితి వేడుకలు కూడా జరుపుకోలేదన్నారు.  ఐటి రంగం అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన కృషి మామూలుది కాదని పేర్కొంటూ, పార్కుల ముందు, రోడ్ల మీద ధర్నాలు చేయడం కాదు. ఐటి ఉద్యోగులు ఒక నెల రోజులు ఉద్యోగాలు మానేసి సొంత ఊళ్ళకు వెళ్ళి బొడ్రాయి ముందు కూర్చొని ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం ఘనవిజయం సాధిస్తుదనీ, . మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారనీ ధీమా వ్యక్తం చేశారు. 

ఆర్ధిక ఉగ్రవాది శ్రీరంగ నీతులు!

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ పేరుతో ఏపీ సీఐడీ అక్రమ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడంపై జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జాతీయ పార్టీల నుండి ఏపీలో ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుండి అమెరికా వరకూ తెలుగు వారు ఎక్కడ ఉన్నా చంద్రబాబు అరెస్టుపై నిరసన తెలియజేస్తున్నారు. ఈ కేసు వ్యవహారంలో స్పందించిన మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఇది కేవలం కక్షపూరిత చర్యగానే తేల్చేయగా.. రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ న్యాయమూర్తులు కూడా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో జగన్ ప్రభుత్వం, సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని ఇప్పటికే తేల్చేశారు. చంద్రబాబు  హోదా, వయసుకు గౌరవం ఇవ్వలేదు. పౌర హక్కులు, చట్ట నియమ నిబంధనలను తుంగలో తొక్కడం ప్రభుత్వ నియంత, కక్ష సాధింపు వైఖరికి నిదర్శనమని పేర్కొంటున్నారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ సమయంలో అసలు దేశంలో లేని సీఎం జగన్.. తిరిగి రాష్ట్రానికి వచ్చిన అనంతరం కూడా చంద్రబాబు అరెస్టుపై సూటిగా సమాధానాలు చెప్పలేకపోయారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు.. అందుకే జైలుకు వెళ్లారని బట్ట కాల్చి మోహన విసిరిన చందంగా చెప్పిన జగన్.. అక్రమ అరెస్టు, అక్రమ కేసులపై వివరణ ఇవ్వలేదు. కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోవడం, అవినీతి జరిగినట్లు ఆధారాలు లేవనే ఆరోపణలపై కూడా సమాధానం ఇవ్వలేదు. కేవలం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలకే జగన్ పరిమితమయ్యారు. దీంతో జగన్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసుల వివరాలను మరోసారి వెలికి తీస్తున్న పరిశీలకులు.. 16 నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తి మరొకరు అవినీతి చేశారని న్యాయస్థానాల కంటే ముందే స్టేట్మెంట్లు ఇవ్వడంపై విస్తుపోతున్నారు. అవినీతి జరిగిందా లేదా అనేది కోర్టులు తేల్చకుండానే ఓ ఆర్ధిక ఉగ్రవాది సమాజానికి శ్రీరంగ నీతులు చెప్పడం ఏమిటంటూ విస్తుపోతున్నారు. సీఎం జగన్ రెడ్డి మొత్తం 11 సీబీఐ, 7 ఈడీ కేసుల్లోప్రధాన ముద్దాయి కాగా.. 13 ఏళ్లుగా ఈ కేసులు విచారణలో ఉన్నాయి. ఇందులో కొన్నిటిలో ఈడీ ఆస్తులను అటాచ్ కూడా చేసింది. ఈ కేసుల్లోనే జగన్ 16 నెలలు జైల్లో గడిపారు. సీబీఐ అఫిడ విట్ లో పేర్కొన్న రూ.43 వేల కోట్ల అవినీతి సంపదలో ఇప్పటివరకు రూ.10 వేల కోట్ల ఆస్తులను జప్తు చేయగా.. మిగిలిన అవినీతి సంపదను కూడా జప్తు చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది.  మనీలాండరింగ్, నేరపూరితమైన కుట్ర, మోసం, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లంచాలు  తీసుకోవడం వంటి హేయమైన అభియోగాలున్న  జగన్ ఇప్పుడు చంద్రబాబు విషయంలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని ప్రవచించడం చూస్తే  దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విశ్లేషకుల అంటున్నారు. ఆర్ధిక ఉగ్రవాదులు ఇలా శ్రీరంగ నీతులు బోధించడం మన ప్రజాస్వామ్య  దుస్థితికి అద్దం పడుతోందంటున్నారు. జగన్ అవినీతి కేసులలో ఏళ్ల తరబడి విచారణ కొనసాగుతున్నది. ఇలా సాగడం వెనక లాబీయింగ్ ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నీతి, నిజాయతీ గురించి ప్రవచనాలు చెప్తున్న జగన్ ముందుగా తనపై కేఉన్న కేసులను త్వరితగతిన విచారణ పూర్తి అయ్యేలా సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, అప్పుడే ఆయనకు నీతి, నిజాయతీల గురించి మాట్లాడే అర్హత వస్తుందని అంటున్నారు.  తనపై కేసుల విచారణకు హాజరుకాకుండా కుంటి సాకులతో తప్పించుకుంటే.. ప్రత్యర్థుల అక్రమ అరెస్టులకు స్క్రిప్ట్ రచించడం ఏమిటని నిలదీస్తున్నారు.  త విదేశాలకు విహారయాత్రలకు వెళ్లిన సీఎంకు పక్కనే ఉన్న హైదరాబాద్ కోర్టుకు వెళ్లే సమయం లేదా అని ప్రత్యర్ధులు ఏకిపారేస్తున్నా మౌనాన్ని ఆశ్రయిస్తున్న జగన్  చట్టం, న్యాయం, నేరాలు, మోసాల గురించి చెప్పడం  ఏమిటని రాజకీయ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. నిజానికి మన దేశంలో జరిగిన అతిపెద్ద ఆర్ధిక కుంభకోణాలలో జగన్ అక్రమ ఆస్తుల కేసు కూడా ఒకటి. స్వతంత్ర భారత దేశంలో ఏ రాజకీయ నాయకుడి పైనా లేనన్ని  అవినీతి కేసులు జగన్ పై ఉన్నాయి. అలాంటి వ్యక్తి అధికారంలో ఉండగా.. ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించడం పెద్ద లెక్కేమీ కాదు. తనతో పాటు అందరినీ దొంగలనే ముద్రవేయాలనుకోవడం విడ్డూరంగా అనిపించకపోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా జగన్ అదే చేస్తున్నారన్నది పరిశీలకుల వాదన.