ఏపీలో రాజ్యమేలుతున్న అరాచకత్వం!
posted on Sep 11, 2023 @ 9:57AM
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ తీరు సర్వ వ్యవస్థలనూ నిర్వీర్యం చేసేస్తోంది. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులోత్తడంలో పోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ తరించిపోతున్నాయి. సర్వ విలువలకూ తిలోదకాలిస్తూ ఏలిన వారి ప్రాపకం పొందడమే పరమావధిగా ఏపీ సీఐడీ తీరు ఉందన్న విమర్శలు గతంలోనే వెల్లువెత్తాయి. ఇప్పడు చంద్రబాబు అరెస్టు, లోకేష్ ను కూడా అరెస్టు చేస్తాం అంటూ మీడియా ఎదుటకు వచ్చి సీఐడీ చీఫ్ చెప్పిన మాటలతో ఆయన సీఐడీ అధికారా, వైసీపీ క్రియాశీల కార్యకర్తా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
సామాజిక మాధ్యమంలో ఏపీ పోలీసు వ్యవస్థ మొత్తం వైసీపీ కండువా వేసుకుని పని చేస్తున్నదంటూ నెటిజన్లు తెగ ఏకి పారేస్తున్నారు. ఏపీలో రాజకీయాలు జగన్ కు ముందు జగన్ తరువాత అన్నట్లుగా తయారయ్యాయి. అధికారంలో ఉంటే మేం చెప్పిందే వేదం.. మా మాటే శాసనం అని జనగ్ ప్రభుత్వ పాలనకు కొత్త అర్ధం చెబుతున్నారు. అధికార దండం ఉంది కనుక నాకు నచ్చని వారిని, నన్ను మెచ్చని వారినీ బయట తిరగనీయం అన్నట్లుగా ఆయన తీరు ఉంది. సాధారణంగా పాలన అంటే ప్రగతి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి, ఉద్యోగ అవకాశాల మెరుగుదల అని ఎవరైనా భావిస్తారు. కానీ ఏపీలో మాత్రం జగన్ జమానాలో అవన్నీ జనం ఎప్పుడో మరిచిపోయారు. వాటి గురించి మాట్లాడితే పోలీసులు అర్ధరాత్రి గోడలు దూకి, తలుపులు పగులగొట్టుకుని ఇళ్లల్లోకి జొరబడి మరీ అరెస్టు చేస్తారన్న భయం ఇప్పుడు ఏపీలో సర్వత్రా నెలకొని ఉంది. ప్రభుత్వ విధానాలలోని లోపాలు ఎత్తి చూపిన ప్రతి వారికీ ఇటువంటి మర్యాదే జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే..అధికారం రూపంలో అరాచకత్వం రాజ్యమేలుతోంది. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు.. ఏపీలో ఇప్పుడు
రెండు రెళ్ళు నాలుగన్నందుకు
గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమగా మారిపోయింది. క్షేమం అవిభాజ్యం అంటే
జైళ్ళు నోళ్ళు తెరుస్తున్నాయి. అవినీతి భారీ పరిశ్రమలో అన్యాయాల ధరలు పెంచేసి
సాతంత్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని చక్రవడ్డీ తిప్పే కామందుల రాజ్యం సాగుతోంది. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా రాజకీయాలు చేసే వారు పేదల, ప్రజల పక్షం వహించడమే పెద్ద అపరాధమైపోయింది. అధికారం చేతుల్లో ఉంది కనుక మేం చెప్పేదే వేదం, మేం చేసేదే న్యాయం వ్యవస్థలదేముంది.. మా చెప్పు చేతల్లోనే ఉంటాయి అన్న అహంభావం అధికారం ఏలుతోంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి గురించి, పరిశ్రమల గురించి, ఆరోగ్యం గురించి, ఉపాధి, ఉద్యోగాల గురించి ఎవరూ మాట్లాడే ధైర్యం చేయడం లేదు.
నియంతలు ఎవరైనా అధికారం తమ చేతల్లో చేతుల్లో శాశ్వతంగా ఇమిడిపోతుందని భావిస్తారు. అయితే అది శాశ్వతం కాదని చరిత్ర పలు మార్లు రుజువు చేసింది. హిట్లర్ నుంచి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నియంతలంతా మట్టిగరిచారు. అయితే ఎవరికైనా తనదాకా వస్తే కాని తత్వం బోధపడదు. ఇప్పుడు ఏపీలో అరాచకపాలన సాగిస్తున్న వారికి కూడా త్వరలోనే తత్వం బోధపడుతుంది. వెయిట్ చేయాలంతే.