బెజవాడలో ఉద్రిక్తం.. భారీగా మోహరించిన పోలీసులు
posted on Sep 9, 2023 @ 5:24PM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని ఏపీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేసి.. విజయవాడకు తీసుకు వచ్చారు. అయితే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో... శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా విజయవాడ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
అయితే చంద్రబాబును కలిసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. చంద్రబాబుని కలిసేందుకు ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తుండగా.... అతడి ప్రయాణించే ప్రత్యేక విమానాన్ని అనుమతించవద్దని ఎయిర్ పోర్ట్ అధికారులను పోలీసులు కోరారు. చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేశ్, నారా భువనేశ్వరిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు.
స్కిల్డ్ డెవలప్‌మెంట్ స్కీంలో కుంభకోణం జరిగిందంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ స్పందంచారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని పవన్ ఆరోపించారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడమే కాకుండా.. ఆయనకు మద్దతు తెలిపారు. అందులోభాగంగా.. చంద్రబాబును కలిసేందుకు పవన్ కల్యాణ్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన ప్రయాణించే విమానానికి అనుమతి ఇవ్వవద్దంటూ గన్నవరం ఎయిర్ పోర్ట్ అధికారులను ఏపీ పోలీసులు కోరారు.
ఇక తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ అయ్యారని తెలుసుకొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. పాదయాత్రను ఆపి.. విజయవాడకు బయలుదేరారు. అలాగే చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. శనివారం మధ్యాహ్నం. ఇంద్రకీలాద్రిపై కోలువైన దుర్గమ్మ వారిని దర్శించుకొన్నారు.
నంద్యాల నుంచి తీసుకు వస్తున్న చంద్రబాబు నాయుడిని పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు టీడీపీ శ్రేణులు, చంద్రబాబు నాయుడు అభిమానులు భారీగా ఏసీబీ కోర్టు వద్దకు చేరుకున్నారు. ఆ క్రమంలో పార్టీ శ్రేణులు చంద్రబాబుకు అనుకూలంగా.. అధికార జగన్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సిటీ కోర్టు కాంప్లెక్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదించనున్నారు. అందుకోసం ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి ఆయన విజయవాడ చేరుకున్నారు.