స్కిల్ స్కాంలో చంద్రబాబుపై చర్యలు అమానుషం.. పీవీ రమేష్
posted on Sep 12, 2023 @ 10:30AM
స్కిల్ స్కాంలో చంద్రబాబును ఇరికించడానికి, అరెస్టు చేయడానికి జగన్ రెడ్డి సర్కార్ కుట్రపూరితంగా ఒక డొల్ల వాదనను డెవలప్ చేశారని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ స్పష్టం చేశారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు. చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారిగా పని చేసిన పీవీ రమేష్ ను స్కిల్ స్కాం విషయంలో సీఐడీ విచారించి లిఖిత పూర్వక సమాధానాలను తీసుకుంది. ఇప్పుడు ఆయన వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబుపై కేసు పెట్టి ఆయనను అరెస్టు చేసింది.
ఈ విషయంలో స్వచ్ఛందంగా స్పందించిన పీవీ రమేష్.. తన వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అయినా ఈ స్కాంలో చర్యలు తీసుకుంటే ముందుగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ, కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆయన కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. తన వాంగ్మూలం ఆధారంగా 14 సంవత్సరాల పాటు సుపరిపాలన అందించిన చంద్రబాబుపై చర్యలు తీసుకున్నామని సీఐడీ చెప్పడం పూర్తిగా అభూత కల్పన అని.. తన ప్రతిష్టను దెబ్బతీయడమే అవుతుందని పీవీ రమేష్ అన్నారు. పీవీ రమేష్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలి కాలం వరకూ పీవీ రమేష్ సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. అటువంటి పీవీ రమేష్ వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబుపై చర్యలు తీసుకున్నామని చెప్పి అరెస్టు చేస్తే.. ఎటువంటి ఖండనలూ వచ్చే అవకాశం ఉండదని జగన్ రెడ్డ సర్కార్, ఏపీ సీఐడీ భావించాయి. అయితే స్వయంగా పీవీ రమేష్ సీఐడీ ప్రకటన అభూతకల్పన అంటూ మీడియా ముందుకు రావడంతో సీఐడీ కంగుతింది. ఇక ఇప్పుడు సీఐడీ టార్గెట్ పీవీ రమేష్ అవుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ విషయంలో పీవీ రమేష్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ అందుకు సంబంధించిన నోట్ ఇదంటూ సీఐడీ చెబుతోంది. వైసీపీ సోషల్ మీడియా ఆ నోట్ ను వైరల్ చేస్తున్నది.
అయితే ఆందుకు సంబంధించిన ఒరిజినల్ పోయిందని చెబుతున్నారు. ఇక పీవీ రమేష్ అప్రూవర్ గా మారారంటూ సీఐడీ చెప్పడాన్ని పీవీ రమేష్ నిర్ద్వంద్వంగా ఖండించారు. నేరం చేసిన వారు అంగీకరించి అప్రూవర్ గా మారతారనీ, తాను నేరం చేయలేదనీ, అప్రూవర్ గా మారడం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదనీ పీవీ రమేష్ చెప్పారు. ఈ వివరాలన్నీ చెప్పిన అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ తనేవాత రద్దు చేశారు. అలా రద్దు చేయడానికి ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయినా లైవ్ లో సీఐడీ అడ్డగోలుగా తన పేరు వాడుకుని ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్టు చేసిందంటూ ఆయన లైవ్ లో చెప్పిన మాటలు ఇప్పుడు రాష్ట్ర మంతటా వైరల్ అవుతున్నాయి.
తాను సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆ సంస్థ తనకు అనుకూలంగా మార్చుకుందని కూడా పీవీ రమేష్ తీవ్ర ఆరోపణ చేశారు. పీవీ రమేష్ ఆరోపణలపై వెంటనే స్పందించిన సీఐడీ.. పీవీ రమేష్ స్టేట్ మెంట్ తోనే కేసు సాగడం లేదనీ, ఈ స్కాంలో తమ వద్ద పక్కా ఆధారాలున్నాయనీ చెబుతోంది. అయినా పీవీ రమేష్ ప్రకటన ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేదిగా ఉందనీ సీఐడీ పేర్కొంది. సీఐడీ స్పందన చూస్తే ఇప్పుడు పీవీ రమేష్ టార్గెట్ గా పావులు కదుపుతోందని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినా సీఎం జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మాజీ ఐఏఎస్ అధికారి సీఐడీ తన వాంగ్మూలాన్ని తప్పుగా ఉపయోగించుకుంటోందనీ, స్కిల్ స్కాంలో చంద్రబాబును కాదు ముందుగా చర్యలు తీసుకోవలసింది ఆ కార్పొరేషన్ ఎండీ, కార్యదర్శులనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. అంతే కాకుండా కుట్రపూరితంగా, కక్ష సాధింపు కోసమే చంద్రబాబును అరెస్టు చేశారన్న వాదనకు బలం చేకూరుస్తోంది. ఇప్పుడు పీవీ రమేష్ ను టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.