మరో వారం జైల్లోనే చంద్రబాబు?
posted on Sep 13, 2023 @ 11:54AM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో వారం రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయనను రాజమహేంద్రవరం జైలు కు తరలించారు.
కాగా ఈ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టు బుధవారం (సెప్టెంబర్ 13) విచారించింది. అనంతరం ఈ విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్ పై ఇరు వర్గాల వాదననూ పూర్తిగా వినాలని భావించిన న్యాయస్థానం విచారణను వచ్చే మంగళవారం (సెప్టెంబర్ 19)కి వాయిదా వేసింది.
ఏసీబీ కోర్టులో సీఐడీ చంద్రబాబును విచారించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను ఈ నెల 19 వరకూ విచారించవద్దని ఆదేశించింది. ఆ రోజు వరకూ చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు బెయిలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ కూడా ఈ నెల 19కి వాయిదా పడింది.