ఏపీలో ముందస్తా? తెలంగాణలో రాష్ట్రపతి పాలనా?
posted on Sep 13, 2023 @ 12:42PM
తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రెండు రాష్ట్రాలలోనూ ఎన్నికల వేడి సెగలు కక్కుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇరు రాష్ట్రాలలోనూ కూడా అసెంబ్లీ ఎన్నికల విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ఈ ఏడాది చివరిలో ఎన్నికలకు సర్వం సన్నాహకంగా తయారైంది.
ఇప్పటికే అత్యధిక అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను ప్రకటించేసింది. అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల శంఖారావం మోగించేసింది. సరిగ్గా ఈ సమయంలోనే జమిలి ప్రతిపాదన కేంద్రం తెరపైకి తీసుకు వచ్చింది. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు కేంద్రం నిర్ణయించడానికి కారణం ఇదేనని పరిశీలకులు గట్టిగా చెబుతున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ మంత్రి కేటీఆర్ కూడా మంగళవారం (సెప్టెంబర్ 18) ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ఏది ఏమైనా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలోనే తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు జరిగేది అన్న విషయంపై స్పష్టత వస్తుంది అని అన్నారు. ఒక వేళ అక్టోబర్ 10వ తేదీ లోగా తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకుంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే వచ్చే ఏడాది జరిగే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
అంటే ఒక వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడటమంటూ జరిగితే.. నిర్ణీత గడువు పూర్తయిన తరువాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యమా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ శుక్రవారం (సెప్టెంబర్ 15) జరగనున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ప్రత్యేక సమావేశాల్లో జమిలి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాలని కేసీఆర్ తమ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. గతంలో జమిలికి కేసీఆర్ సై అన్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలలోనే కాదు, జాతీయ రాజకీయాలలో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ జమిలికి సై అన్నప్పుడు బీఆర్ఎస్, బీజేపీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లో కేంద్రం జమిలిపై తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు ఏపీలో కూడా రాజకీయం రగులుతోంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్టుతో ఒక్క సారిగా జగన్ సర్కార్ పై ప్రజాగ్రహం భగ్గుమంది. ఆ ఆగ్రహ జ్వాలలు మరింత పెరిగి సర్కార్ ను దహించేయడానికి ముందే.. ముందస్తుకు వెళ్లి ఎలాగోలా బయటపడాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకోసమే ఆయన ఇలా లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చారో లేదో.. అలా హస్తిన పర్యటన పెట్టుకున్నారు. హస్తిన పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఈ సారి ఆయన పర్యటన అజెండా ఏపీలో ముందస్తు ఎన్నికలేనని అంటున్నారు. వైసీపీ శ్రేణులు కూడా ఇది అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుతో దేశం శ్రేణులు షాక్ లో ఉన్నాయనీ, ఆ షాక్ నుంచి టీడీపీ శ్రేణులు తేరుకుని.. ఆందోళనలు ఉధృతం చేయడానికి ముందే రాష్ట్రంలో ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తే రాజకీయంగా ఏదో మేరకు లబ్ధి చేకూరుతుందన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ రద్దు చేయాలని జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారనీ, ఎటూ కేంద్రం జమిలి వ్యూహంతో ఉందన్న అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ లోనే ఏపీలో కూడా ఎన్నికలు జరిగితే మేలని జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే హస్తిన నుంచి తిరిగి రాగానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 21 నుంచి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అవసరమైతే వాటిని మరో రెండు మూడు రోజులు పొడిగించైనా ఈ నాలుగున్నరేళ్లలో తాను చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా నివేదించి అసెంబ్లీ రద్దు ప్రతిపాదనను జగన్ చేస్తారని చెబుతున్నారు. అయితే జగన్ ముందస్తు నిర్ణయానికి కేంద్రం అనుమతి, అంగీకారం తప్పని సరి కనుకనే ఆ విషయంలో కేంద్రం పెద్దల అనుమతి పొందేందుకే జగన్ హస్తిన పర్యటన అంటున్నారు. ఇప్పికే ఇప్పటికే ఐదు రాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియకు ఈసీ సన్నాహాలు మొదలెట్టేసింది. అయితే ఏపీలో మాత్రం ఈ ప్రక్రియ అధికారికంగా మొదలు కాలేదు.
ఎలా చూసినా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సాధారణ పరిస్థితుల్లో అయితే ఏపీ ఎన్నికలు జరిగే అవకాశం లేదనీ, అయితే కేంద్రం జమిలీ ఎన్నికలపై నిజంగానే సీరియస్ గా ఉంటే.. మాత్రం ఏపీలో ముందస్తు అసాధ్యం కాదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద జమిలి చర్చ ఇరు తెలుగు రాష్ట్రాలనూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నికలు వెనక్కు జరుగుతాయన్న ఆందోళనలో ఉంటే.. ఏపీలో ముందస్తుకు అవకాశం లేకపోతే పుట్టి మునగడం ఖాయమన్న భయంలో అధికార వైసీపీ ఉంది. మరి కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.