తెలంగాణ ఎన్నికల బరిలో జీవిత రాజశేఖర్
posted on Sep 12, 2023 @ 4:03PM
టాలీవుడ్‌కి చెందిన సెలబ్రిటీ కపుల్‌లో హీరో డాక్టర్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవితా రాజశేఖర్‌లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఓ వైపు సినీ ఇండస్ట్రీతో వారికి అనుబంధం ఉంది. అలాగే రాజకీయాల్లో రాణించే ప్రయత్నాలను వారెప్పుడూ చేస్తుంటారు. ఒకప్పుడు అంటే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత బీజేపీ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత వైసీపీ పార్టీ కండువాను కప్పుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. అయితే ఏమైందో ఏమో కానీ.. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదంటూ వారిద్దరూ వైసీపీకి దూరమయ్యారు. అదే క్రమంలో బీజేపీకి దగ్గరయ్యారు.
సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న తాజా సమాచారం మేరకు జీవిత, రాజశేఖర్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తమ లక్‌ను పరీక్షించుకోవాలనుకుంటున్నారని టాక్. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో పాటు బీజేపీ పార్టీ మధ్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. ఎవరికి వారే తమ బలాబలాను పరీక్షించుకోవటానికి ఇప్పటి నుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు తమ ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకుంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జీవిత, రాజశేఖర్‌లిద్దరూ తెలంగాణలో బీజేపీ పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం.
వీరిద్దరూ కలిసి నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకుని పార్టీ ఆదేశానుసారం వాటిలో రెండింటి నుంచి బీజేపీ పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్నారట. జూబ్లీహిల్స్, సనత్ నగర్, కూకల్ పల్లి, సికింద్రాబాద్ లలో రెండు స్థానాల నుంచి వారు పోటీ చేయాలనుకుంటున్నారు. మరి బీజేపీ అధినాయకత్వం వీరి అభ్యర్థనను మన్నించి వారికి ఎమ్మెల్యే స్థానాలను కేటాయిస్తుందో లేదో చూడాలి మరి.