లండన్ నుంచి ఇలా వచ్చి.. అలా హస్తినకు జగన్
posted on Sep 12, 2023 6:23AM
ఆంధ్రప్ర్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ లండన్ పర్యటన పూర్తి అయి.. స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన సోమవారం అర్థరాత్రి విజయవాడ చేరుకుంటారు. మంగళవారం ఉదయం రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం ఇఫ్పటికే రాష్ట్ర హోం శాఖ సిద్ధం చేసిన నివేదికను సీఎం జగన్‌కు ఉన్నతాధికారులు అందజేయనున్నారు.
మరోవైపు స్కిల్డ్ స్కాంలో ప్రేమయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో.. ఆయన్ని పోలీసులు రామమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు బెయిల్ కోసం తెలుగుదేశంపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ అగ్రనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అయితే సీఎం జగన్.. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం.. ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ పెద్దలు.. రాష్ట్రంలోని కమలం పార్టీ పెద్లల నుంచి.. చంద్రబాబు అరెస్ట్‌కు గల కారణాలు అడిగి తెలుసుకొన్నట్లు తెలుస్తోంది. అలాగే బాబు అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి తీసుకున్నారా? లేదా?.. తదితర అంశాలపై కూడా కేంద్రంలోని పెద్దలు ఆరా తీసినట్లు సమాచారం.
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం వైయస్ జగన్ సమావేశంలో చంద్రబాబు అరెస్ట్ ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని.. దీనిపై ఏపీ బీజేపీ పెద్దలు ఇచ్చిన సమాచారానికి... సీఎం వైయస్ జగన్ ఇస్తున్న సమాచారానికి పొలిక ఉందా? లేదా? అనే అంశాన్ని సైతం కమలం పార్టీలోని పెద్దలు పరిశీలించే అవకాశాలు ఉన్నాయనే ఓ ప్రచారం సైతం కొన.. సాగుతోంది.
అదీకాక.. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికలతోపాటు పలు కీలక బిల్లులను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఈ బిల్లుల ఆమోదానికి వైసీపీ మద్దతు ఎన్డీఏకి అవసరమని.. అందుకే జగన్‌తో ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారనే ఓ చర్చ సైతం పోటిలికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. ఏదీ ఏమైనా.. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయనే ఓ ప్రచారం సైతం తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకొంది.