ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో సంక్షోభాలు.. అసలేం జరుగుతోంది?
posted on Sep 12, 2025 @ 4:14PM
ఇటీవలి కాలంలో భారత్ తో స్నేహ సంబంధాలకు దూరమైన ఒక్కో దేశం సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకుంటోంది. భారత్ తో విభేదించిన దేశాలన్నీ ఇలా సంక్షోభాలలో కూరుకుపోతుండటం కాకతాళీ యమనే చెప్పాలి. బంగ్లాదేశ్,పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, మాల్దీవులు ఇలా ఈ దేశాలన్నీ వరుసగా, ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా ఆర్ధిక,రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. భారత్ ను వ్యక్తిగతంగా ఆయా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. దౌత్యపరంగా ఆయాదేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పాలన్న భారత్ ప్రయత్నాలు ఏమంత ఫలించడం లేదు. మాల్దీవుల విషయానికి వస్తే.. ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జూ ఇండియా ఔట్ నినాదంతో గెలిచారు. అనంతరం చైనాతో చేతులు కలిపారు. పర్యాటక రంగంపై ఆధారపడిన ఆ దేశపు ఆర్ధిక వ్యవస్థ 2024లో తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. దాంతో కళ్లు తెరిచిన ముయిజ్జూ భారత్ తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు అర్రులు చాస్తున్నారు. అయినా ఆ దేశంలో ఇప్పటికీ రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. గతంలో అంటే భారత్ కు మిత్రదేశంగా ఉన్నంత కాలం మాల్దీవుల్లో సుస్థిరత చెక్కు చెదరలేదు.
ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే.. ఆ దేశంలో హసీనా ప్రభుత్వం పతనం అనంతరం రాజకీయ అస్ధిరత మొదలైంది.హిందువులపై దాడులు వారి ఆస్తుల ధ్వంసం జరిగాయి. ఆదేశంలో ఇప్పుడున్న స్రభుత్వం ఆర్మీ చేతిలో కీలుబొమ్మ. పాకిస్థాన్, చైనాతో సన్నిహిత సంబంధాలు కోసం వెంపర్లాడుతోంది. బంగ్లాదేశ్ ఆవిర్భావమే భారత్ జోక్యంతో ఏర్పడింది. ఆ విషయాన్ని మరచి భారత్ ను శత్రుదేశంగా చూడటం ప్రారంభించడంతోనే ఆ దేశం సంక్షోభ, కల్లోలాల నిలయంగా మారిపోయింది. భారత అనుకూల విధానాలను అవలంబిచిన హసీనా అధికారంలో ఉన్నంత కాలం ఆ దేశం సుస్థిరంగా ఉంది. ప్రజాస్వామ్యదేశంగా సగర్వంగా నిలబడింది. ఆ తరువాతనే దేశంలో రాజకీయ అస్థిరత, అంతర్గత సంక్షోభం తలెత్తి ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఇక శ్రీలంక విషయానికి వస్తే.. ఆ దేశం కూడా అకారణంగా భారత్ పట్ల శత్రుత్వ వైఖరిని అవలంబించి చైనాకు దగ్గర కావడం కోసం ప్రయత్నాలు చేసి సంక్షోభంలో కూరుకుపోయింది. పాకిస్థాన్ విషయం చెప్పనే అక్కర్లేదు. దాయాది దేశానికి బారత్ తో ఎన్నడూ సయోధ్య, సత్సంబంధాలూ లేవు. ఆ దేశం ఆవిర్భావం నుంచీ సంక్షోభాలతో సహవాసం చేస్తున్నదని చెప్పడం అతి శయోక్తి కాదు. అలాగే మయన్మార్.. 2021లో సైనిక తిరుగుబాటు తరువాత ఆ దేశం సంక్షోభాల వలయంలో కూరుకుపోయి ఉంది. తాజాగా భారత్ పై సుంకాల యుద్ధం ప్రారంభించిన అమెరికా కూడా పెను ఆర్థిక మాంద్యం ముప్పు ముంగిట నిలిచింది. భారత్ పై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ ఆదేశాలను యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఇది అమెరికాకు నిజంగా తట్టుకోలేని దెబ్బ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు.
అంతే కాకుండా రష్యా, చైనాలు భారత్ కు స్నేహహస్తం చాచడంతో అమెరికా పెద్దన్న పాత్రకే ఎసరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పుట్టిమునగక ముందే భారత్ తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ట్రంప్ తహతహలాడుతున్నారు. ఇరుదేశాల మధ్యా వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ప్రధాని మోడీతో చర్చలకు ట్రంప్ వెంపర్లాడుతున్నారు. ఇక అలాగే సంక్షోభాలలో కూరుకుపోయిన ఇరుగుపొరుగుదేశాలు కూడా తమ భారత్ తో వైరానికి ఫుల్ స్టాప్ పెట్టి స్నేహ మార్గంలో పయనిస్తే.. ఆర్థిక, రాజకీయ ఆస్థిరత నుంచి సుస్ధిరత దిశగా వాటి అడుగులు పడే అవకాశం ఉంటుంది.