కూకట్‌పల్లి రేణు హత్య కేసులో నిందితుల అరెస్ట్
posted on Sep 13, 2025 @ 11:23AM
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రేణు అగర్వాల్ మహిళ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులు రోషన్, హర్షను జార్ఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలు, టెక్నికల్ సాక్ష్యాలు ఆధారంగా ప్రత్యేక బృందం నిందితులను ఆచూకి తెలుసుకోని వారిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను హైదారాబాద్‌కు తరలిస్తున్నారు. హత్య అనంతరం క్యాబ్‌లో విశాఖపట్టణం మీదుగా రాంచీ పారిపోయిన నిందితులు పారిపోయినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో చూసి నిందితులను గుర్తించి, పోలీసులకు క్యాబ్ డ్రైవర్ సమాచారమిచ్చారు.
రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులకు హైదరాబాద్ ఫతేనగర్‌లో స్టీల్ సామాన్ల దుకాణం ఉంది. వారి కూతురు తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటుండగా.. కొడుకు శుభంతో కూకట్ పల్లిలోనే ఇంట్లో ఉంటున్నారు. స్వాన్ లేక్ లోనే రేణు బంధువుల ఇంటిలో రోషన్ 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అతనే జార్ఖండ్ లో తమ గ్రామానికి చెందిన హర్షను కొద్దిరోజుల క్రితం రేణు ఇంటిలో వంటమనిషిగా పెట్టించాడు. రాకేష్, శుభం తమ షాపుకు వెళ్లగా.. రేణు అగర్వాల్ ఇంట్లో ఒంటరిగా ఉంది.
ఆ రోజు సాయంత్రం 5 గంటలకు రాకేష్ ఫోన్ చేసినా తీయకపోవడంతో 7 గంటల సమయంలో ఇంటికి వెళ్లాడు. తలుపు ఎంతసేపటికీ తీయకపోవడంతో ప్లంబర్ ను పిలిపించి బ్యాక్ డోర్ ఓపెన్ చేయించారు. ఇంటి లోపలికి వెళ్లి చూడగా.. రేణు కాళ్లు, చేతులు కట్టేసి.. రక్తపు మడుగులో పడి ఉంది. శరీరంపై తీవ్రగాయాలుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ సహాయంతో రేణును హర్ష, రోషన్ లు చంపినట్లు నిర్థారించారు. ఆమెను తాళ్లతో కట్టేసి డబ్బు, నగల కోసం చిత్రహింసలు చేసినట్లుగా గుర్తించారు. ఆపై కూరగాయల కత్తులతో గొంతుగోసి, కుక్కర్ తో తలపై బలంగా కొట్టడంతో రేణు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు.