డబ్బు పట్ల నిజాయితీగా ఉండటం అంటే ఏంటి.. మీరెలా ఉంటారు?
posted on May 8, 2023 @ 9:30AM
డబ్బు పట్ల నిజాయితీ అంటే తీసుకుంటున్న డబ్బుకు సరిపడ పని చేస్తున్నామా అని! పిండి కొద్ది రొట్టి అన్నమాట. కాని మనం చాలా ఎక్కువ సందర్భాలలో డబ్బు పట్ల నిజాయితీని ప్రకటించం. తీసుకుంటున్న జీతానికి తగ్గ పనిచేయం. పైగా ఇంతకంటే ఎక్కువ ఎవడు చేస్తాడు? అని ప్రశ్నిస్తాం. ఎపుడూ ఎర్న్ లీవులు, క్యాజువల్ లీవులు, మెడికల్ లీవులు పెట్టేస్తుంటాం. మనం తీసుకునే జీతానికి బాస్ ని ఒప్పించడానికి లేదా బాస్ని ఆనందపర్చడానికి మాత్రమే చూస్తాం తప్ప, చేతికి వచ్చిన డబ్బుకి తగ్గ పనిని చేస్తున్నామా అని ప్రశ్నించుకోం. దీనివలన నష్టం ఏమిటంటే, ఆ వ్యక్తులు జీవితంలో పెద్దగా ఎదగలేరు. జీవితంలో ఎదుగుదల అంటే ఎంతసేపూ ఓ ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లేదా ఎక్కువ డబ్బు రావడం కాదు. జీవితాన్ని నిత్య నూతనంగా గడపడమే.
ఎప్పుడూ ఓ తెలియని చిరాకు, గుబులు, భయం ఇలాంటి ఆలోచన గల వారి జీవితాల్లో చోటు చేసుకుంటాయి. ఓ సిటీ బస్ కండక్టర్ బస్సు ఎక్కే పాసింజర్లకు మర్యాద ఇవ్వడు. చిల్లర ఇవ్వకుండా అల్లరి పెడుతుంటాడు. ఆ కండక్టర్ చెప్పే కారణాలు నిజమైనప్పటికీ తనకు 'జీతం' ఇస్తున్నది ఓ ప్రయాణికుడన్న విషయం మరచిపోతాడు. తనకు ఆర్.టి.సి. జీతం ఇస్తోందనుకుంటాడు. సరియైన దృక్పథం లేకుండా ఉద్యోగం చేస్తుంటాడు. ఓ పోలీసు ఇన్స్పెక్టర్ తన పవర్ ప్రజల మీద చూపెడుతుంటాడు. తన బాస్ లకు సలాం కొడుతుంటాడు. అందుకనే “నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్గా తీసుకునే జీతంలో కనీసం ఓ రూపాయికైనా న్యాయం చెయ్" అన్న సినిమా డైలాగుకి మనం తెలియకుండానే జోహార్లు అర్పిస్తాం.
మనందరం ఎదుగుదల లేని జీవితం గడపడానికి కారణం డబ్బు పట్ల నిజాయితీ ప్రకటించకపోవడమే. అంత వరకు ఎందుకు "నేను ఆర్.టి.సి. డిపో మేనేజర్ అయితే ఈ బస్సులన్నీ సమయానికి వచ్చేటట్లు చేయగలను" అని మనం ఎన్ని సార్లు అనుకోలేదు? పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ చైర్మన్ అయితే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటానా? కమీషనర్ ఆఫ్ పోలీస్ అయితే ఈ ట్రాఫిక్ సిస్టమ్న ఒక్క రోజులో బాగు చేయనూ! ముఖ్యమంత్రినయితే కరెంట్, నీటి సమస్యలను వెంటనే తీర్చనూ! ఇలా ప్రతి విషయంలో మనం ప్రకటించే దృక్పధం తీసుకుంటున్న డబ్బుపట్ల నిజాయితీ, మనం చేస్తున్న ఉద్యోగాలలో లేదా వ్యాపారాలలో చూపెడుతున్నామో అని ప్రశ్నించుకోవాలి. నేర్చుకోవడానికి పని చెయ్యాలి కానీ డబ్బు గురించి పని చేయకూడదు. నాకేంటిట లాభం అని ప్రశ్నించుకుని పని చేస్తామో, అప్పుడు డబ్బుకి సరిపడ పని చేయలేము. అసలు నిజమైన పని కూడా చేయలేము.
◆నిశ్శబ్ద.