Read more!

మాటని ఒకే మాటని.. నీతోనే ఉంటానని…

◆ప్రామిస్ డే◆  

ఓ మనిషికి నమ్మకాన్ని ఇవ్వడం, ఆ నమ్మకంతో భరోసా కల్పించడం ఈ ప్రపంచంలో చాలా గొప్ప విషయం. అయితే ఆ నమ్మకం ఇతరుల్లో ఎట్లా కల్పిస్తారు?? అది ఎదుటివారికి ఎలా ధైర్యాన్ని ఇస్తుంది?? 


వాలెంటైన్స్ వీక్ లో భాగంగా అయిదవ రోజును ప్రామిస్ డే గా జరుపుకుంటారు. మీ భాగస్వామి పట్ల మీకున్న అభిమానం, ప్రేమ ఎంత గొప్పదో.. వారికి మీ జీవితంలో ఎలాంటి స్థానం ఉందో తెలియజేసి వారితో ఎప్పటికీ ఉంటానని వాగ్దానం చేయడం ఈ ప్రామిస్ డే లో ఉన్న ప్రత్యేకత.


ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11 వ తేదీన ప్రేమికుల నుండి, ప్రేమలో ఉన్న  భార్యాభర్తల వరకు అందరూ ప్రామిస్ డే ని సెలెబ్రెట్ చేసుకుంటారు. ఇందులో భాగంగా తమ జీవిత భాగస్వామితో బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవడం, బంధాన్ని మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా సాగేలా చేయడం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా జీవితంలో భాగస్వామి తమకు ఎంతో ముఖ్యమని చెప్పడమే ఇక్కడ ప్రధానాంశం. జీవితాంతం తోడు నిలిచేది ఒక్క జీవన సహచరులే.. అందుకే జీవితంలో తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నా జీవిత భాగస్వాములకు అంత ప్రాధాన్యత ఉంది. 

 

ప్రామిస్ ప్రాముఖ్యత..



బంధంలో ఉన్నప్పుడు నమ్మకం ఇస్తే ఆ బంధం పదిలంగా ఉంటుంది. అంటే.. నమ్మకం అనేది బంధాలకు పునాది లాంటిది. జీవితంలో భాగస్వాములకు ఎన్నో వాగ్ధానాలు చేస్తుంటాం. కొన్నిసార్లు వాటిని విస్మరిస్తుంటాం. అయితే ఈ ప్రామిస్ డే రోజును వాటిని క్లియర్ చేసి భాగస్వామి కళ్ళల్లో మెరుపును, పెదవుల మీద చిరునవ్వును చూడగలిగితే.. ఒక భాగస్వామిగా మీరు సఫలం అయినట్టే.. ఒకరి పట్ల మరొకరు చూపించే అనురాగం వెలకట్టలేనిదే..


అలాగే మాట ఇవ్వడం ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో.. ఆ మాట తప్పడం వల్ల జీవిత భాగస్వాములు ఎంత డిజప్పాయింట్ అవుతారో కూడా అలాంటి సందర్భాలలో స్పష్టం అవుతుంది. వీటన్నింటినీ పక్కన పెడితే.. ఇలాంటి చిన్న చిన్న మాట ఇవ్వడాలు, తప్పడాల గురించి వదిలేస్తే.. నిన్ను నేను ఎప్పటికీ వదలను.. జీవితాంతం నీతోనే ఉంటానని మాట ఇవ్వడం ఆ మాటను నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యం. 


ప్రామిస్ డే రోజు మీ భాగస్వామికి ప్రామిస్ చేయండి. మాటని ఒకే మాటని.. నీతోనే ఉంటానని.. అని ఓ రిథమ్ లో చెప్పండి..


                                        ◆నిశ్శబ్ద.