Read more!

నెట్టింట్లో అబ్బాయిల ఆసక్తికరమైన వెతుకులాటలు!

వెర్రి వెయ్యి విధాలు ఉంటుందని పెద్దలు చెబుతారు. ఒకప్పుడు ఏవైనా అనుమానాలు వస్తే వాటిని ఎవరిని అయినా అడిగి ఆ అనుమానాలు తీర్చేసుకోవడానికి బాగా కష్టపడేవాళ్ళు. వచ్చే అనుమానాలు అలా ఉండేవి మరి. కొన్ని తింగరి అనుమానాలు వస్తే వాటిని ఎవరిని అడిగి నివృత్తి చేసుకోవాలో తెలియదు కొందరికి. కొందరు ధైర్యం చేసి అడిగి తిట్లు తింటూ ఉంటారు. అయితే అదంతా పాతకాలం అయిపోయింది. వచ్చే అనుమానం ఏదైనా ఇప్పుడు ఎవరినో ఆడాల్సిన అవసరం లేకుండా నేరుగా పాకెట్ లో నుండి మొబైల్ బయటకు తీసి నెట్టింట్లోకి దూరి ఒకటికి నాలుగు సమాధానాలు వెతికేసుకుంటున్నారు. 

వచ్చే అనుమానాలకు సమాధానాలు వెతుక్కోవడం బానే ఉంది కానీ నెట్ లో అబ్బాయిలు వెతుకుతున్న విషయాలు, వారి అనుమానాల గురించి తెలిస్తే కాస్త నవ్వు వస్తుంది, మరికాస్త ఆశ్చర్యం వేస్తుంది. 

ప్రతి సంవత్సరం దాదాపు 68వేలమంది అబ్బాయిలు నెట్ లో వెతుకున్న విషయం ఏమిటంటే లైంగిక సామర్థ్యం గురించి. తమలో లైంగిక సామర్థ్యం ఎంత ఉంది?? లైంగిక సామర్థ్యము పెరగడానికి ఏమి చెయ్యాలి?? వంటి విషయాల గురించి నెట్ లో శోధించడం ఎక్కువ చేస్తున్నారట. గూగులమ్మను ఈ విషయంలో చాలా వాడేస్తున్నట్టు చెబుతున్నారు.

ఆడవాళ్లు జుట్టు గురించి, జుట్టు సంరక్షణ గురించి జాగ్రత్తలు, జుట్టు పెరుగుదలకు చిట్కాలు మొదలైన వాటికోసం ఎలాగైతే నెట్ లోనూ, యూట్యూబ్ లోనూ చాలా  వెతికేసి అన్ని ప్రయోగాలు చేస్తారో, మగవాళ్ళు కూడా తమ గడ్డం విషయంలో అంతే ఆసక్తిగా కేరింగ్ గా ఉంటారట. అందుకే షేవింగ్ చేయడం వల్ల గడ్డం పెరుగుతుందా లేదా?? గడ్డం బాగా గుబురుగా, మందంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి వంటి విషయాలు కూడా వెతికేస్తున్నారు.

మగవాళ్ళు చాలామంది ఎండలో వెళ్ళేటప్పుడు టోపీ వాడటం సహజం. అయితే టోపీ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని కొందరు చెబుతారు. అందుకేనేమో టోపీ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందా అనే విషయన్ని కూడా  గుగులమ్మను అడుగుతున్నారట.

ఇక మగవాళ్లకు అత్యంత ఇష్టమైన పని. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం. దానికోసం జిమ్ చేస్తారు, వర్కౌట్స్ చేస్తారు. బాడీ ఫిట్ గా ఉండటానికి ఎలాంటి వర్కౌట్స్ చెయ్యాలి అని తెగ వెతుకుతూ ఉంటారట.

ఈ మగవాళ్ళు కేవలం వాళ్ళ విషయాలే కాదు అమ్మాయిలకు సంబంధించిన విషయాల్లో కూడా వేలు పెట్టేస్తున్నారు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే ఏమి చెయ్యాలి?? అమ్మాయిలకు నచ్చేవి ఏంటి?? నచ్చనివి ఏంటి?? ఏమి చేస్తే అమ్మాయిలు ఎక్కువ సంతోషిస్తారు?? వంటి విషయాలకు సమాధానాలను కూడా నెట్టింట్లో వెతుకుతున్నారట.

ఇప్పటి దాకా చెప్పుకున్నవి ఒకటైతే ఇప్పుడు చెప్పుకోబోయేది ఇంకొక లెవల్ విషయంలా అనిపిస్తుంది.  అదే అబ్బాయిలు మగవాళ్లకు కూడా రొమ్ముక్యాన్సర్ వస్తుందా అనే విషయాన్ని చాలా సీరియస్ గా వెతుకుతుంటారట. 

ఇలా లైఫ్ సెటిల్ అవ్వడం గురించో, ప్రోబ్లేమ్స్ సొల్యూషన్స్ గురించో కాకుండా ఇలాంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన అబ్బాయిల స్వభావానికి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

                                  ◆వెంకటేష్ పువ్వాడ.