పిల్లలకు తల్లిదండ్రులు చేస్తున్న లోటు ఇదే!
posted on May 18, 2023 @ 9:30AM
తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకు ఇది అవసరం అని ఆలోచిస్తూ.. ఎన్నెన్నో ఇస్తుంటారు. కానీ వాళ్లకు లోటుగా ఉన్నదేంటి అని ఆలోచించరు. తత్త్వవేత్త ఖలీల్ జిబ్రాన్ అంటాడు... Children through you, But not to you.... పిల్లలు మీ ద్వారా ఈ ప్రపంచానికి పరిచయమయ్యారే కానీ, మీ నుంచి కాదు. వారి రాకకు మీరు వారధులు మాత్రమే. ఈ నిజాన్ని భరించాలంటే తల్లితండ్రులకు కఠినంగానే ఉంటుంది. అయితే ఈ సార్వత్రిక సత్యాన్ని విశ్వసిస్తే ఎలాంటి ఆందోళన, ఆవేదన లేకుండా పిల్లల్ని తీర్చిదిద్దగలరు. భగవంతుడు నిర్దేశించిన లక్ష్యానికి మీ పిల్లల్ని బాణాల్లా సంధించే ప్రయత్నంలో మీరు ధనుస్సులు మాత్రమే. ధనుస్సు నిఖార్సుగా ఉంటేనే బాణాన్ని పదునుగా వినరగలదు లక్ష్యానికి.
అందుకే మిమ్మల్ని మీరు ఉన్నతంగా, విశాలంగా తీర్చిదిద్దుకోవాలి.. ప్రశాంతంగా, పొదరిల్లుగా ఇంటిని తీర్చిదిద్దాల్సింది తల్లితండ్రులే. ఏడిపించే సీరియళ్లు చూస్తూ తల్లి... ఏ ఇంక్రిమెంట్ల గురించో మాట్లాడుకుంటూ తండ్రి... ఉంటే పిల్లలు అన్నం కోసం తప్ప ఆత్మీయత కోసం ఇంటికిరారు.
అర్ధరాత్రి పుట్టిన క్షణం నుంచి అష్టకష్టాలు పడ్డాడు శ్రీకృష్ణుడు... అయినా చెక్కిలిపై చిరునవ్వును చెదరనీయని స్థితప్రజ్ఞుడు. అందుకే భగవద్గీత బోధించిన భగవానుడాయన. ఆ సమత్వభావనే, ఆ ధీరోదాత్తతే ప్రతీ తండ్రీ పుణికిపుచ్చుకోవాలి. తలలు తెల్లపడటమో, ముఖం ముడతలు పడటమో పెద్దరికం కాదు. సుఖదుఃఖాల్ని, లాభాలాభాల్ని, జయాపజయాల్ని సమంగా స్వీకరించడమే ఎదుగుదల. పిల్లల ముందు మీరు నవ్వుతూ ప్రశాంతంగా కనిపిస్తూ.. నిశ్చల తటాకంలా నిలబడి చూస్తే.. పిల్లలు ఎంత సంతోషపడతారో అర్థమవుతుంది. ఇంట్లో తమ సమస్యల్ని అర్థం చేసుకోటానికి గురువుల్లాంటి స్నేహితులయిన తల్లితండ్రులు పక్కనుండాలని ప్రతీ బిడ్డా కోరుకుంటుంది.
బడి పాఠాలే కాదు, బ్రతుకు పాఠాలూ ముఖ్యమే... ఈనాటి పిల్లలకు బడి పాఠాలకేమి కొదవలేదు. వచ్చిన కొరతంతా బ్రతుకు పాఠాలకే. కుటుంబంలోనే ఆ పాఠాలు వల్లె వేయించాలి. వినయం లేని విద్య శోభించదని, విలువలు లేని ఎదుగుదలకు విలువే లేదని, ఇచ్చే బాధ్యత తెలియని చేతికి పుచ్చుకునే హక్కూ లేదని, మనం పైకి రావాలంటే పక్కవాడు పడిపోవాల్సిన అవసరం లేదని.. ఇలా అన్నీ చెప్పాల్సింది అమ్మానాన్నలే. పిడికెడు అటుకులు పెట్టినందుకే మిత్రుడికి పసిడివరాలు కురిపించిన కృష్ణుడు... పితృవాక్య పరిపాలన కోసం పడరాని కష్టాలు పడ్డ రాముడు... బిడ్డల బ్రతుకు పాఠాల్లో పరిచయమైతే వారు ఆణిముత్యాలై వెలుగుతారు. అందుకే కనీసం రాత్రి భోజనమైనా పిల్లలతో కలసి చేయాలని చెప్పేది... ఓ మంచి కథని గోరుముద్దలతో కలిపి తినిపించిన్నప్పుడు ఆ ఫలితం ఎంత మధురంగా, మహత్తరంగా ఉంటుందో స్వామి వివేకానంద మాతృమూర్తి భువనేశ్వరీ దేవికి తెలుసు, కలామ్ కన్నతల్లి ఆషియమ్మకు తెలుసు. ఇవి ప్రతి తల్లిదండ్రి తెలుసుకుని తీరాలి.
◆నిశ్శబ్ద.