అసలు మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారు... దీని వెనుక కథ ఏంటి!

ప్రపంచం యావత్తూ మే 14 వ తేదీన మదర్స్ డే ను జరుపుకుంటుంది. తల్లిప్రేమను చాటుతూ, తల్లి త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్నెన్నో దేశాలు గొప్పగా జరుపుకునే ఈ మాతృభాషాదినోత్సవం గురించి చరిత్రలో చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి.

16వ శతాబ్దపు ప్రారంభంలో ఇంగ్లాండ్‌లోని క్రైస్తవులు "మదరింగ్ సండే" అని ఒక రోజును జరుపుకునేవారు. ప్రజలు తమ ప్రాంతంలోని ప్రధాన చర్చికి కుటుంబాలతో కలసి వచ్చేవారు. ఆరోజు  పిల్లలు తమ తల్లులకు పువ్వులు లేదా చిన్న బహుమతులు ఇచ్చేవారు.

యునైటెడ్ స్టేట్స్‌లో, మదర్స్ డే యొక్క మూలాలు నిర్మూలనవాది మరియు ఓటు హక్కుదారు అయిన జూలియా వార్డ్ హోవ్ ప్రయత్నాల నుండి గుర్తించబడ్డాయి. 1870లో, ఆమె మదర్స్ డే ప్రకటన రాసింది, శాంతి, నిరాయుధీకరణ కోసం మహిళలు ఏకం కావాలని పిలుపునిచ్చింది.

మనకు తెలిసిన ఆధునిక మదర్స్ డే, అన్నా జార్విస్ అనే ఒక అమెరికన్ సామాజిక కార్యకర్త చేత నిర్వహించబడింది. 1905లో తన స్వంత తల్లి మరణించిన తరువాత, జార్విస్ తల్లులను గౌరవించటానికి జాతీయ సెలవుదినాన్ని ఏర్పాటు చేయాలని ప్రచారం చేసింది. ప్రతి ఒక్కరు వారి తల్లులపై ప్రేమను, కృతజ్ఞతలను వ్యక్తపరచడానికి ఒక రోజును రూపొందించాలని ఆమె కోరుకుంది.

1914లో, ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ యునైటెడ్ స్టేట్స్‌లో మే నెలలో రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా పేర్కొంటూ ఒక ప్రకటనపై సంతకం చేశారు. ఈ అధికారిక గుర్తింపు దేశంలో మదర్స్ డేని విస్తృతంగా జరుపుకోవడానికి దారితీసింది. అప్పటి నుండి, ప్రపంచంలోని వివిధ దేశాలు మదర్స్ డేని జరుపుకోవడం మొదలుపెట్టాయి., దీంతో అన్నా జార్విస్ మదర్స్ డే స్థాపకురాలిగా గుర్తింపు పొందింది, తరువాత ఆమె మదర్స్ డే మూలంగా జరుగుతున్న వ్యాపారాన్ని చూసి విస్తుపోయింది.

అన్నా జార్విస్ ప్రారంభంలో మదర్స్ డేని తల్లుల పట్ల ప్రేమను వ్యక్తం చేసే అద్భుతమైన దినంగా రూపొందించింది.  ఆమె ప్రచారంతో ఇది ఎంతో విస్తరించింది కూడా. కానీ జార్విస్ అదంతా వాణిజ్యీకరణంలో కలిసిపోవడంతో తను రూపొందించిన దానికి, అక్కడ జరుగుతున్నదానికి పొంతన లేదనే విషయం అర్ధం చేసుకుంది.  ఎక్కడ చూసినా గ్రీటింగ్ కార్డ్‌లు, పువ్వులు, ఇతర బహుమతుల విక్రయం ద్వారా మదర్స్ డే కాస్త కమర్షియల్ డే గా మారిపోయింది. చివరికి ఆమె మాటర్స్ డే ను రద్దు చేయాలని ప్రయత్నం  చేసినా అది జరగలేదు. కానీ ఆమె చేసిన ప్రయత్నం ఫలితంగా ఇప్పటికీ అందరూ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 

                                   ◆నిశ్శబ్ద.